విద్యుత్ ప్లాంట్‌ను పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్న తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కేటీపీఎస్ ఏడవ దశలో శనివారం రాత్రి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శరవేగంగా నిర్మితమైన విద్యుత్ ప్రాజెక్టుగా దేశ విద్యుత్ రంగంలో ఈ ప్రాజెక్టు సరికొత్త రికార్డును సృష్టించింది. తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్‌ఈఎల్ ఈడీ ముఖోపాధ్యాయ, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జెన్‌కో డైరెక్టర్లు వెంకటరాజం, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్లాంట్‌లో అధికారులు, కార్మికులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల ప్లాంటు చరిత్రలో నిలువనుంది. 5,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన మొదటి విద్యుత్ ప్లాంటు కూడా ఇదే. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం ప్రారంభించిన 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి. అయితే ఈ ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే కేవలం 40 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని ప్లాంట్ల నిర్మాణంలో కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో మరెక్కడాకూడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్ ఏడవ దశ అందుబాటులో వచ్చిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 16వేల మెగావాట్లు దాటింది.
ఐడీసీ భారం తగ్గించేలా నిర్మాణం
దేశంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంటుగానే కాకుండా ఐడీసీ భారం అధికంగా పడకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుగా కూడా కేటీపీఎస్ చరిత్రలో నిలిచిపోనుంది. అగ్రిమెంటులో నిర్దేశించిన కాలవ్యవధిలోగా పని పూర్తి కాకపోతే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్‌స్ట్రక్షన్ రూపంలో అదనపు వ్యయం అవుతుంది. ఈ అదనపు వడ్డీ భారాన్ని కూడా విద్యుత్ సంస్థలు భరించి, కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంతిమంగా ఆ భారం ప్రజలపై పడుతోంది. అయితే నిర్ణీత సమయంకన్నా 8 నెలల ముందే నిర్మాణం పూర్తి కావడం వల్ల కేటీపీఎస్ 7నుంచి కొనుగోలు చేసే విద్యుత్తుకు ఐడీసీ భారం ఎక్కువగా పడదు. దీని వల్ల ఇక్కడి నుంచి వచ్చే విద్యుత్ కూడా చాలా తక్కువ ధరకు లభ్యమవుతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా మేలు కలుగుతుంది. కేటీపీఎస్7వ దశలో విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గునే వాడనున్నారు. దీనివల్ల సింగరేణికి లాభం జరగడంతో పాటు తెలంగాణ జెన్‌కోకు తక్కువ ధరకు బొగ్గు లభిస్తుంది. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.
ఇది సమష్టి కృషి: ప్రభాకర్‌రావు
సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, విద్యుత్ అధికారులు, సిబ్బంది చేసిన సమష్టి కృషి వల్లే రికార్డు సమయంలో ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించగలిగామని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్లాంటు నిర్మాణానికి కష్టపడిన అధికారులు, ఉద్యోగులకు, బీహెచ్‌ఈఎల్‌కు ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు.
జెన్‌కో పనితీరు ప్రశంసనీయం: సీఎం
రికార్డు సమయంలో విద్యుత్ ప్లాంటును నిర్మించి ఉత్పత్తి ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. జెన్‌కో కృషి ప్రశంసనీయం అన్నారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించారన్న లక్ష్యంతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్న జెన్‌కో సీఎండీ, అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment