అడుగంటుతున్న జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు జలవిద్యుత్ ఉత్పత్తి ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరోవైపు సర్కార్ నిర్లక్ష్యంతో సోలార్ విద్యుత్ వ్యవహారం టెండర్లలోనే మగ్గుతోంది. దీంతో వచ్చే వేసవిలో తెలంగాణలో చీకట్లు కమ్ముకునే ప్రమాదం ముంచుకొస్తోంది. జలవిద్యుత్‌కు కీలకమైన నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు ఆందోళన కలిగించే స్థాయికి పడిపోయాయి. తెలంగాణ జెన్‌కో గత వారంలోనే నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పాదన ఆపేసింది. శ్రీశైలం ఎడమగట్టున మాత్రం కొనసాగిస్తోంది.
శనివారం 4.77 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్టు జెన్‌కో వెల్లడించింది. గతమూడు రోజుల్లో 20.55 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆదివారం నాటి గణాంకాల ప్రకారం శ్రీశైలంలో నీటిమట్టం 851.3 అడుగులుంది. 82.9 టీఎంసీల నీరుంది. గత ఏడాది ఇదేరోజున శ్రీశైలంలో 882 అడుగుల నీటిమట్టం నమోదుతో 198.8 టీఎంసీల నీరుంది. అప్పటితో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు మూడో వంతుకుపైగా పడిపోయాయి. ఇప్పుడున్న నీరు 296.5 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పాదనకే సరిపోతుంది.
నాగార్జునసాగర్‌లోనూ ఇదే విపత్కర పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం 558.4 అడుగుల నీటిమట్టం ఉండగా, నిరుడు ఇదే తేదీన 569.4 అడుగుల నీటిమట్టం ఉంది. గత ఏడాది 678.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడే నీరుంటే, ఇప్పుడు 533.5 మిలియన్ యూనిట్లకే సరిపోతుంది. దీంతో జలవిద్యుత్ అంచనాలు తలకిందులవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లు మే, జూన్ నెలలు మినహా పదినెలలపాటు ఈ జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇప్పుడున్న నిల్వల ప్రకారం రెండునెలలకు మించి ఉత్పత్తి చేయడం అసాధ్యమని నిపుణులంటున్నారు. ఈలోగా వర్షాలు కురిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదంటున్నారు.
రేట్లు ఖరారు ఎప్పుడు ?
దీనికి తోడు నిర్ణయాల విషయంలో సర్కార్ అతిజాప్యం అశనిపాతంగా మారనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలుకు పిలిచిన టెండర్లకు ఆశించిన స్పందన రాలేదు. గతనెలలో తెరిచిన సోలార్ విద్యుత్ టెండర్లు ఇంకా ఖరారు దశలోనే ఉన్నాయి. 500 మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు టెండర్లు పిలిస్తే, 1840 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 108 కంపెనీలు ముందుకువచ్చాయి.
రేట్లు ఖరారు చేసి, ఇండెంట్ లెటర్లు పంపిస్తే ఈ నెలలోనే కంపెనీలతో ఒప్పందం జరిగేది. 15 నెలల్లో కంపెనీలు విద్యుత్ సరఫరా చేసేవి. అంటే 2016 మార్చినాటికి విద్యుత్ అందుబాటులోకి వచ్చేది. కానీ, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుండటంతో, సౌర విద్యుత్ అందడం మరింత జాప్యమవుతోంది.
ముంచుకొస్తున్న విద్యుత్ కొరత
Published Mon, Dec 15 2014 2:11 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement