ఇదీ విజన్‌ అంటే! | YS Jagan worked hard to make power sector in previous government | Sakshi
Sakshi News home page

ఇదీ విజన్‌ అంటే!

Published Wed, Feb 26 2025 5:51 AM | Last Updated on Wed, Feb 26 2025 5:53 AM

YS Jagan worked hard to make power sector in previous government

గత ప్రభుత్వంలో విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టేందుకు కృషి చేసిన వైఎస్‌ జగన్‌

5,230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుకు శ్రీకారం

ఏపీ విధానాలు నచ్చి రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,014 మెగావాట్లు ఉత్పత్తి చేస్తామన్న ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూపు 

2 వేల మెగావాట్ల ఉత్పత్తికి ఎకోరన్‌ ఎనర్జీ రూ.11 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం 

ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీజెన్‌కో రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. 1950 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌కు ఒప్పందం 

ఆ క్రమంలోనే రైతుల కోసం జగన్‌ పడుతున్న తపన చూసి యూనిట్‌ రూ.2.49కి ఇస్తామని ముందుకొచ్చిన సెకీ 

పాతికేళ్ల పాటు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను వ్యవసాయానికి ఇచ్చేందుకు ఒప్పందం

చంద్రబాబు గత పాలనలో అనవసర పీపీఏలతో దొరికినకాడికి దోపిడీ 

విద్యుత్‌ చార్జీలు పెంచమంటూ ఎన్నికల ముందు ప్రజల్ని నమ్మించి ఇప్పుడు చార్జీల బాదుడు 

పైగా ‘సెకీ’తో గత ప్రభుత్వ ఒప్పందంపై అవాకులు, చవాకులు, బురదజల్లుడు 

తుదకు ఆ ఒప్పందం సక్రమమేనని విద్యుత్‌ నియంత్రణ మండలి స్పష్టీకరణ 

జగన్‌ చేసిన మంచి వల్లే రాష్ట్రానికి తక్కువ ధరకే లభిస్తున్న సౌర విద్యుత్‌ 

సెకీ నుంచి ఈ ఏడాది 4 వేల మెగావాట్లు, వచ్చే ఏడాది మరో 3 వేల మెగావాట్లు 

ముందు చూపు అంటే ఇదీ అని విద్యుత్‌ రంగ నిపుణుల్లో చర్చ 

విజన్‌ అంటే కళ్లార్పకుండా పదే పదే మాయ మాటలు చెప్పడం కాదని, అబద్ధాలతో ప్రజలను గందరగోళానికి గురిచేసి.. పబ్బం గడుపుకోవడం అంతకంటే కాదని గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘విద్యుత్‌ ఒప్పందం’ సాక్షిగా నిరూపించారు. రాష్ట్రానికి అత్యంత చౌక ధరకే సౌర విద్యుత్‌ లభించేలా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 

ఈ దిశగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా మార్గ నిర్దేశం చేయడమే కాకుండా వాటికి ఊతమిచ్చారు. ప్రధానంగా రైతన్నలకు 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ తపన, తాపత్రయం, ముందు చూపును గమనించి యూనిట్‌ కేవలం రూ.2.49 చొప్పున విద్యుత్‌ ఇస్తామని సెకీ ముందుకొచ్చి.. ఒప్పందం చేసుకుంది. 

దీనిపై కొందరు కారుకూతలు కూసినా, ఎల్లో గ్యాంగ్‌ మసిపూసి బురద చల్లినా ఎట్టకేలకు ‘ఆ ఒప్పందం’ సక్రమమే అని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కుండబద్దలుకొట్టి స్పష్టం చేసింది. తద్వారా వైఎస్‌ జగన్‌ ముందు చూపు కొంత ఆలస్యంగానైనా ప్రశంసలందుకుంటోంది.

సాక్షి, అమరావతి    : గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు గత ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. భారీ పవర్‌ ప్రాజెక్టులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడంలో గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విజయవంతం అయిందని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్ల పాలనలో కనీ వినీ ఎరుగని రీతిలో పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించడంతో పాటు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. 

వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో పాటు సామాన్య ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల స్థాపనకూ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశాఖలో 2023లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌(జీఐఎస్‌)లో ఏకంగా రూ.8,19,815 కోట్లతో 25 ఇంధన రంగ ఒప్పందాలతో చరిత్ర సృష్టించింది. 

ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌(సెకీ)తో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం మేరకే ఇప్పుడు రాష్ట్రానికి తక్కువ ధరకే 4 వేల మెగావాట్ల విద్యుత్‌ వస్తోంది.

గత ప్రభుత్వంలో భారీ ప్రాజెక్టులు, ఒప్పందాలు
» గ్రీన్‌కో గ్రూప్‌ 5,230 మెగావాట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌(ఐఆర్‌ఈపీ)కు మన రాష్ట్రాన్ని ఎంచుకుంది. ఈ ప్రాజెక్టుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి శరవేగంగా పనులు సాగుతున్నాయి. త్వరలోనే ప్రారం¿ోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 23 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వాతావరణంలో ఏటా 15 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.

» రాయలసీమలోని నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు జగన్‌ భూమి పూజ చేశారు. మరో రెండు పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీజెన్‌కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) మధ్య ఒప్పందం జగన్‌ సమక్షంలో జరిగింది. 

» గ్రీన్‌కో దాదాపు 2,300 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఆర్సిలర్‌ మిట్టల్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ రూ.4,500 కోట్ల పెట్టుబడితో మరో 1014 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. దీని ద్వారా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 

» ఎకోరన్‌ ఎనర్టీ ప్రాజెక్టుకు సంబంధించి 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు కూడా వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. దాదాపు  రూ.11 వేల కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

» యాగంటిలో 1000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు మొత్తం దాదాపు 2 వేల మెగా>వాట్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌పీసీతో కలిసి నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు ఫీజుబులిటీ అధ్యయనం పూర్తయింది. ఈ ప్రాజెక్టు వల్ల 2 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్‌హెచ్‌పీసీతో మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులో కూడా కలిసి నడిచేందుకు గత ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది.

దేశంలోనే అత్యధిక పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు
దేశంలోనే అత్యధికంగా 42,270 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ (పీఎస్‌పీ) ప్రాజెక్టులకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకొని పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఫీజుబులిటీ అధ్యయనం జరిగింది. 

20,900 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన ప్రాజెక్టులకు సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)లు కూడా పూర్తి చేసింది. ఇందులో 16,180 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా, థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యం కూడా వైఎస్‌ జగన్‌ హయాంలో 1600 మెగావాట్లు అదనంగా పెరిగింది. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్లు, డాక్డర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్ల ఉత్పత్తి మొదలైంది.

బాబు పాలనంటేనే దోపిడీ  
ఓట్లేసి గెలిపిస్తే విద్యుత్‌ చార్జీలు పెంచమంటూ ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి అధికారంలోకి రాగానే రూ.15,485 కోట్ల చార్జీల భారాన్ని ప్రజలపై వేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అది చాలదన్నట్లు వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి చిరు వ్యాపారులపై ‘టైమ్‌ ఆఫ్‌ డే’ పేరుతో అదనపు చార్జీల బాదుడుకు సిద్ధమైంది. నిజానికి చంద్రబాబు పాలనలో ఎప్పుడూ అటు ప్రజలను, ఇటు విద్యుత్‌ సంస్థలను దోపిడీ చేయడం పరిపాటిగా మారింది.

చంద్రబాబు గత హయాంలో సౌర విద్యుత్‌ యూనిట్‌కు ఏకంగా రూ.6.99, పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.4.84 చెల్లించి కొనుగోలు చేశారు. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ సరఫరా ధర రూ.5.90, పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.63కు చేరింది. నిజానికి అప్పట్లో సోలార్‌ యూనిట్‌ రూ.2.44కు, పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.2.43తో ఇతర రాష్ట్రాల్లో ఒప్పందాలు జరిగాయి. 

చంద్రబాబు చేసిన పని వల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్లు చొప్పున దశాబ్దాల పాటు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత విలువ ఆధారంగా ఈ మొత్తం భారం రూ.35 వేల కోట్లకు పైనే. ఈ విషయాన్ని దాచి అప్పట్లో విద్యుత్‌ ఉత్పత్తి లోటు ఉందని టీడీపీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసింది.

‘సెకీ’ విద్యుత్‌పై ‘ఎల్లో’ కుట్రలు  
రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్‌ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయడానికి సెకీ నుంచి 17 వేల మిలియన్‌ యూ­నిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది. అది కూడా అత్యంత చవక ధరతో.. యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్‌ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్‌ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. 

అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన సెకీ నుంచే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యూనిట్‌ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ప్రధానంగా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టిఎస్‌) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు అండ్‌ గ్యాంగ్, ఎల్లో మీడియా కుట్రలకు పాల్పడ్డాయి. 

సెకీ ఒప్పందాన్ని ఓ అవినీతి భూతంగా చూపించాలని, వైఎస్‌ జగన్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి. అసత్య కథనాలు, అబద్ధ ప్రచారాలతో రైతులకు సైతం ఉచిత విద్యుత్‌ను దూరం చేయాలని ప్రయతి్నంచాయి. కానీ ఈ కుట్రలన్నిటినీ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని మండలి తేల్చి చెప్పింది.

బాబు ఒప్పందాలతో 24 శాతం అప్పుల వృద్ధి రేటు  
చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), నిర్లక్ష్యం కారణంగా 2014–19 మధ్య విద్యుత్‌ సంస్థలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాయి. డిస్కంలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. విద్యుత్‌ సంస్థల అప్పులు, బకాయిల భారం 2014 మార్చి నాటికి రూ.29,551 కోట్లు ఉంటే, చంద్రబాబు దిగిపోయే (2019 మార్చి 31)నాటికి రూ.86,215 కోట్లకు పెరిగింది. అంటే ఏకంగా రూ.56,663 కోట్లకు ఎగబాకింది. దీంతో 2014–19 మధ్య వార్షిక అప్పుల వృద్ధి రేటు(సీఏజీఆర్‌) 24 శాతం పెరిగింది. 

జగన్‌ హయాంలో పెరిగిన అప్పుల వృద్ధి రేటు 7.28 శాతం మాత్రమే. 2020–22 మధ్య కోవిడ్‌ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల అప్పులు భారీగా పెరిగినప్పటికీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సమర్థ నిర్వహణ వల్ల ఇంత తక్కువ శాతం నమోదయ్యింది. 

డిస్కంల వార్షిక ఖర్చులకు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా టీడీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించలేదు. దీంతో ఐదేళ్ల టీడీపీ హయాంలో డిస్కంల నష్టాలు రూ.6,625.88 కోట్ల నుంచి రూ.28,715 కోట్లకు పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement