Solar Energy Corporation of India
-
సౌర విద్యుత్ కొనుగోలు పిల్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్‌ను ఓసారి పరిశీలించి అవసరమైతే అదనపు వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణను జనవరి చివరి వారంలో జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ.. అసలు వివాదం ఏమిటో చెప్పాలని కోరింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తారని.. దీని వల్ల పంపిణీ నష్టాలుంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. -
అదే ఉన్మాదం
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ హయాంలోనూ.. ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ.. ఎప్పుడూ, ఎవరూ చేయని గొప్ప ఆలోచనకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారు. రానున్న 30 ఏళ్లల్లో రైతులకు హక్కుగా వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అత్యంత పారదర్శకంగా గత ప్రభుత్వం కుదుర్చుకుంది. కానీ ఈనాడు మాత్రం ఈ ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఇప్పటికే అనేక విధాలుగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచినప్పటికీ, టీడీపీ, దాని కరపత్రిక ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలోనే అర్ధంలేని ఆరోపణలతో ఆదివారం మరో అబద్దపు కథనాన్ని ఈనాడు వండి వార్చింది. రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై సమగ్ర అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖకు చెందిన సాంకేతిక కమిటీ తప్పుడు లెక్కలతో అంకెల గారడీ చేసిందంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. 6,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపన ఖర్చులను అంచనా వేసేటప్పుడు ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) తప్పు చేసిందంటూ ఈనాడు నిరాధారంగా ఆరోపణ చేసింది. వాస్తవాలను ఉద్దేశ్యపూర్వకంగా ఆ పత్రిక దాచిపెట్టింది. ‘ఐఎస్టీఎస్’ చార్జీలపై అవే అబద్ధాలుసెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని సెకీ లేఖ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ (సీఈఆర్సీ), సెకీ ఒప్పందంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈనాడు మాత్రం కళ్లున్నా కబోదిలా నటిస్తూ పచ్చి అబద్దాలను ప్రచురిస్తోంది.లేఖలోనే ప్రతిపాదించిన సెకీరాష్ట్ర ప్రభుత్వానికి 2021 సెప్టెంబర్ 15న సెకీ ఓ లేఖలో..ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు(కమర్షియల్ ఆపరేషన్ డేట్– సీఓడీ)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చి0దని స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐఎస్టీఎస్ ఛార్జీలు వర్తించవని ఆ లేఖలో వివరంగా చెప్పింది.ప్రత్యేక ప్రోత్సాహకం కింద రాష్ట్రానికి ఐఎస్టీఎస్ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుందని తెలియజేస్తూ 2021 సెపె్టంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ రాసిన లేఖసెకీ ఒప్పందంలోనూ ఉందిసెకీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందం(పవర్ సేల్ అగ్రిమెంట్)లోనూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందనే అంశం ఉంది.ఒప్పందంలోని నిబంధన 3.2 ప్రకారం..ఐఎస్టీఎస్ ఛార్జీలు, ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, సీటీయూ (సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ) షెడ్యూలింగ్ ఛార్జీలే కాకుండా ఇంజెక్షన్/డెలివరీ పాయింట్ నుంచి సబ్‌స్టేషన్ వరకూ ఏ ఇతర చార్జీలు కూడా రాష్ట్ర డిస్కంలు చెల్లించనవసరం లేదని ఒప్పందంలో పొందుపరిచారు. దీనిని బట్టి చట్టపరంగానూ, ఒప్పందం పరంగానూ సెకీతో ఏపీ చేసుకున్న ఒప్పందానికి మాత్రమే ఐఎస్టీఎస్ చార్జీల మాఫీతో పాటు భవిష్యత్తులో జరిగే ఎలాంటి మార్పుల వల్లనైనా ఎలాంటి ఇతర చార్జీలు పడవని స్పష్టమవుతోంది.సీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం నిబంధనలపై నోటిఫికేషన్ ఇచ్చింది. ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌కు ఎక్స్‌ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పిఓ) ఉన్న సంస్థలకు ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు 25 ఏళ్ల పాటు లభిస్తుంది.రాష్ట్రంలో పెడితేనే భారంనిజానికి రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే స్టేట్ నెట్వర్క్ పెంపుదల అనివార్యమని, అందుకు వ్యయం రూ.2,600 కోట్లు అవుతుందని ఏపీపీసీ కమిటీ తేల్చి చెప్పింది. అంతేకాకుండా 6,400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, అంతర్ రాష్ట్ర గ్రిడ్‌తో అనుసంధానం చేయడం వల్ల రూ.1,021 కోట్ల అదనపు ఐఎస్టీఎస్ (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్) ఛార్జీలు ఏటా పడతాయని కమిటీ సూచించింది. అదే 6,400 మెగావాట్ల నుంచి ఉత్పత్తి 10,092 మిలియన్ యూనిట్లకు పెరిగితే అప్పుడు ఐఎస్టీఎస్ చార్జీలు యూనిట్‌కు దాదాపు రూ.1 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడం వల్ల ఇవేవీ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు, అంతిమంగా ప్రజలపైనా భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రసార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అయ్యే వ్యయాన్ని భరించాల్సిన అవసరం తప్పుతుంది.సెకీతోనే అనేక ప్రయోజనాలురాష్ట్రంలోనే సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసి, రైతులకు ఇవ్వాలని, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ద్వారా 6400 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం టెండర్లు సైతం పిలిచారు. కానీ దానిని రాజకీయ కారణాలతో కొందరు అడ్డుకున్నారు. అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీల భారం లేకుండా యూనిట్ రూ.2.49 చొప్పున అతి చవక ధరకు విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సెకీ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన లేఖ పంపింది. దానిపై కమిటీ వేసి మరీ అధ్యయనం చేసిన తరువాత, ఏపీఈఆర్సీ అనుమతితో అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. దీనివల్ల రాష్ట్రంలో పెట్టాలనుకున్న ప్రాజెక్టుకు అయ్యే రూ.2,600 కోట్ల వ్యయం ఆదా అయ్యింది. ఆ ప్రాజెక్టుకు కేటాయించాల్సిన భూమి కూడా మిగిలింది. అంతేకాకుండా అతి తక్కువ ధరకు లభిస్తుండటంతో రాష్ట్ర ఖజానాపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది. అదనంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు సైతం వచి్చంది. సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలుంటే టీడీపీ, దాని కరపత్రిక ఈనాడుకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదు. -
ఓ కరపత్రం ‘ఏడు’పు కథ!
సాక్షి, అమరావతి: వక్రీకరణలే పరమావధిగా పచ్చి అబద్ధాలను కుమ్మరిస్తున్న ఈనాడు.. గత సర్కారు ఏడు గంటల్లోనే సెకీతో ఒప్పందాన్ని క్యాబినెట్ భేటీలో ఆమోదించుకుందంటూ మరోసారి బుకాయించింది. రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా ప్రయోజనం జరుగుతోంటే రూ.లక్ష కోట్లకుపైగా భారం అంటూ అసత్య ఆరోపణలు చేసింది. ఈ ఒప్పందానికి ఐఎస్టీఎస్ చార్జీలు వర్తించవని తెలిసినా పదేపదే విషం చిమ్ముతూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. నిజానికి రెండున్నర నెలల పాటు సుదీర్ఘ కసరత్తు.. లాభనష్టాల బేరీజు.. నిపుణుల కమిటీ పరిశీలన.. మంత్రివర్గంలో చర్చ.. చివరిగా విద్యుత్తు నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్.. ఇన్ని దశలు దాటి ప్రక్రియలన్నీ పక్కాగా పాటించాకే సెకీతో ఒప్పందం కార్యరూపం దాల్చింది.వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా పాతికేళ్ల పాటు అత్యంత చౌకగా సౌర విద్యుత్‌ను అందిస్తామని, అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి సైతం మినహాయింపు కల్పిస్తామని 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ స్వయంగా ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సెకీ కోరడంతో 2021 సెప్టెంబర్ 16న (అప్పటికి వారం ముందే కేబినెట్ భేటీ తేదీని నిర్ణయించారు) కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెట్టారు. అంతేగానీ సెకీ లేఖపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవటం కోసంగానీ.. ఆమోదించడం గానీ జరగలేదు. ముఖ్యమైన విషయాలు అత్యవసరంగా క్యాబినెట్ దృష్టికి వచ్చినప్పుడు టేబుల్ ఐటమ్ కింద ప్రవేశపెట్టడం పరిపాటి, ఆనవాయితీ. అందులో ఏం తప్పు ఉంది? ఈ క్రమంలో దీనిపై లోతైన అధ్యయనానికి కమిటీని నియమించి క్యాబినెట్‌కు నివేదిక ఇవ్వాలని గత ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ దశలన్నీ పూర్తయ్యాకే 2021 అక్టోబర్ 28న క్యాబినెట్ సమావేశంలో ఒప్పందానికి ఆమోదం లభించింది. ఏపీఈఆర్సీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని డిస్కమ్‌లను నిర్దేశించారు. అంతేగానీ ఈనాడు చెబుతున్నట్లుగా హడావుడిగా ఒప్పందాన్ని ఆమోదించాలనుకుంటే అంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించి ఉండాలి కదా? నెలల తరబడి ఎందుకు ఆగుతారు? ఇలా సుదీర్ఘంగా చర్చలు, పలు ప్రక్రియలు ముగిశాకే 2021 డిసెంబర్ 1న సెకీతో ఒప్పందం జరిగింది. అర్థ రహిత ఆరోపణలు..2021 సెప్టెంబర్ 15న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పింది. నిజానికి ఈ ధర అప్పటి వరకు ఇతర మార్గాల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వస్తున్న విద్యుత్ ధరల కంటే చాలా తక్కువ. పైగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహం కింద ‘అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీల (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు’ కూడా ఈ ఒప్పందానికి వర్తింపజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ లేఖ రాసింది.అయితే సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 7 గంటల వ్యవధిలోనే అంగీకరించిందని, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలేమిటి? అంత విద్యుత్ వినియోగించగలమా? లాంటి అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేదని ఈనాడు మొదటి ఆరోపణ చేసింది. సెకీ ప్రతిపాదన వల్ల ప్రజలపై రూ.1,10,000 కోట్ల మేర ఆర్ధిక భారం పడుతుందని ఆలోచించలేదనేది రెండో ఆరోపణ. కానీ ఈ రెండూ పచ్చి అబద్ధాలే. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అల్లుకున్న కట్టుకథలు మినహా ఇందులో ఏ ఒక్కటీ వాస్తవం కాదు. రెండున్నర నెలలు.. విశ్లేషించాకే అనుమతి..సౌర విద్యుత్తుకు సంబంధించి పలు ప్రయోజనాలను కల్పిస్తూ 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య విద్యుత్ విక్రయ ఒప్పందం (పవర్ సేల్ అగ్రిమెంట్) 2021 డిసెంబర్ 1న జరిగింది. అంటే ప్రతిపాదనకు – ఒప్పందానికి మధ్య రెండున్నర నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉంది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరితోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ రెండున్నర నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సెకీ మధ్య పలు పర్యాయాలు సంప్రదింపులు జరిగాయి. సెకీ ప్రతిపాదనలో లోటుపాట్లను, ఒప్పందం వల్ల కలిగే లాభనష్టాలను లోతుగా విశ్లేషించారు. అంతేకాకుండా ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆమోదాన్ని 2021 నవంబర్ 8న కోరారు. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ నుంచి దీనికి ఆమోదం లభించింది. సెకీ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కసరత్తు, అందుకోసం తీసుకున్న సమయం రెండున్నర నెలలకంటే ఎక్కువ ఉన్నట్లు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఈనాడు మాత్రం 7 గంటల్లోనే ఆమోదం తెలిపేశారంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది.క్షుణ్నంగా సుదీర్ఘ కసరత్తు..సెకీ ఒప్పందాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మంత్రి మండలి సెప్టెంబర్ 16వ తేదీన తీసుకుందని ఈనాడు మరో ఆరోపణ చేసింది. వాస్తవం ఏమిటంటే మంత్రి మండలి సమావేశాన్ని అప్పటికప్పుడు నిర్ణయించలేదు. అంతకుముందు వారం రోజుల క్రితమే ఆ సమావేశం షెడ్యూల్ ఖరారైంది. అంటే.. కేబినెట్ సమావేశం తేదీపై నిర్ణయం తీసుకునే నాటికి సెకీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. సమావేశానికి ఒక రోజు ముందు మాత్రమే సెకీ లేఖ అందింది. తమ లేఖపై వీలైనంత త్వరగా స్పందన తెలియజేయాలని ఆ లేఖలో సెకీ కోరింది. అయితే మొత్తం ప్రక్రియకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందనే వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సెకీ కోరినట్లుగా ప్రక్రియను ఆలస్యం చేయకూడదని భావించి తగిన మార్గదర్శకాల కోసం 2021 సెప్టెంబర్ 16న మంత్రి మండలి సమావేశంలో ఈ అంశాన్ని టేబుల్ ఐటమ్‌గా ఉంచింది. ఈ ప్రతిపాదనపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర ఇంధన శాఖను నాటి సమావేశంలో మంత్రి మండలి ఆదేశించింది. సెకీ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(ఏపీపీసీసీ) చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు పలుదఫాలు సెకీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం 2021 అక్టోబర్ 25న సెకీ ప్రతిపాదనకు అనుకూలంగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది.దీంతో అక్టోబర్ 28న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ సిఫార్సులను మంత్రి మండలి ముందు ఉంచారు. ఏపీఈఆర్సీ అనుమతికి లోబడి సెకీతో పీఎస్ఏ అమలును ఆమోదించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 2021 నవంబర్ 8న ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు దరఖాస్తు చేశాయి. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదం పొందిన తర్వాతే 2021 డిసెంబర్ 1న ఒప్పందం జరిగింది. కాబట్టి టీడీపీ, ఈనాడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకంగా చేస్తున్నవని స్పష్టం అవుతోంది.కరపత్రమా... కళ్లు తెరువు⇒ ట్రాన్స్మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు ⇒పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ‘సెకీ’ ‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..⇒ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ⇒ ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.⇒ ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.3,750 కోట్లు చొప్పున 25 ఏళ్ల పాటు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది.⇒ ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది.⇒ రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ⇒ ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?⇒ టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది. -
మీకు చౌకగా విద్యుత్ ఇస్తాం
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ పాతికేళ్ల పాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానుగా తొలుత ప్రతిపాదించింది. అందుకు 2021 సెప్టెంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్‌ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. 6,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్‌కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది.కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆర్థికంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి.ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీతో ఒప్పందానికి అంగీకారం తెలిపారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. -
సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు చేతులు మారాయని ఆరోపణలు చేస్తుండటాన్ని ఏమనుకోవాలి? అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలే అని అర్థం. ఇక అదానీ గ్రూప్‌తో విద్యుత్ కొనుగోలు చేస్తూ డిస్కమ్‌లు(విద్యుత్ పంపిణీ సంస్థలు) ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చేసుకోని ఒప్పందాలకు అదానీ గ్రూప్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు దాఖలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా చేసుకోని ఒప్పందాలకు లంచాలు ఇస్తారా? ఇవ్వరు కదా.. అంటే అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలన్నది స్పష్టమవుతోంది. కార్పొరేట్ ప్రపంచంలో పదే పదే అదానీ గ్రూపుపై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు.. తాజాగా అదానీ గ్రూపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదానీ గ్రూపు అమెరికా మార్కెట్ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడుదారుల రక్షణ పేరిట అమెరికాబ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలతోపాటు ఏడుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిషా, చత్తీస్ఘడ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూపు భారీ ఎత్తున లంచాలు ఎర చూపిదంటూ ఆరోపించారు. ఆరోపణల వెనుక భారీ కుట్ర! రానున్న 25 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూర్చేందుకు వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు కొనుగోలు చేసేలా గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందానికి అదానీ గ్రూపు లంచాలు ఇవ్వచూపిందంటూ ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంటే కేవలం రూ.2.49 (రూ.2.6 తక్కువగా)కే.. అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధరలు యూనిట్‌కు రూ.4.63–రూ.6.76తో పోల్చినా చాలా చౌకగా విద్యుత్ లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) కన్నా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే రూ.2.61 తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కొనుగోలు చేస్తుంటే.. అదానీ గ్రూపు లంచాలు ఎందుకు ఇవ్వజూపుతుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అమెరికా ఫెడరల్ కోర్టు అభియోగ పత్రంలో ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఎవరైనా చెబుతారు. కాగా, అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ సంస్థపై తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని చెప్పింది. -
కరెంటుపై బాబు కథ తప్పే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్ అందించడంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం బయటపడింది. ఉచిత విద్యుత్‌ను ఆపాలన్న దురాలోచనతో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో వైఎస్ జగన్ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందంపై దుష్ప్రచారానికి తెరతీసింది. సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో సెకీ ఒప్పందాన్ని తప్పుబడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారు. సెకీ విద్యుత్ తీసుకుంటే జనరల్ నెట్వర్క్ యాక్సెస్ (జీఎన్ఏ) నిబంధనల ప్రకారం రూ.3 వేల కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకూ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు (ఐఎస్టీఎస్) చెల్లించాల్సి వస్తుందని నమ్మించాలనుకున్నారు. కానీ ఆయన చెప్పినదంతా అబద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా కంపెనీ ద్వారా అంతర్రాష్ట్ర చార్జీలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం స్పష్టంగా చెప్పింది.వంద శాతం మినహాయింపుసెకీతో ఒప్పందమే పెద్ద భారమైనట్టు, ఓ నేరమైనట్టు సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పుకొచ్చారు. ఐఎస్టీఎస్ చార్జీలపై అపోహల నేపథ్యంలో ఈ నెల 2న కర్నూలులో జరిగిన సదరన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఫోరం (ఎస్ఈఆర్ఎఫ్) సమావేశంలో, ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన వర్కింగ్ గ్రూప్ భేటీలోనూ ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జున రెడ్డి చర్చించారు. నిపుణుల అభిప్రాయాలు, చట్టాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం సెకీ విద్యుత్‌పై ఐఎస్టీఎస్ చార్జీల నుంచి వంద శాతం మినహాయింపు పొందవచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. తద్వారా 25 సంవత్సరాల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. దీని విలువ చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే దాదాపు రూ.3,500 కోట్లు.తక్కువ ధరతోనూ రూ.3,750 కోట్లు ఆదాసెకీ నుంచి 2024 సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉండగా, సెకీ విద్యుత్ యూనిట్ రూ.2.49 కే వస్తోంది. ఎన్టీపీసీ సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 కన్నా కూడా ఇది తక్కువ. దీనిద్వారా ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది.చీకటి రోజుల నుంచి రైతులకు విముక్తిగతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పంటలకు నీరు పెట్టుకోవడం కోసం మీటర్లు వేసుకొనేందుకు రైతులు అర్ధరాత్రివేళ పొలాలకు వెళ్లి, విద్యుత్ షాక్‌కు, పాము కాట్లకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం విముక్తి కలిగించింది. వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించింది. దాంతోపాటు రానున్న 30 ఏళ్లలో వ్యవసాయానికి ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా సౌర విద్యుత్ సమకూర్చే చర్యలు చేపట్టింది. అది కూడా ప్రైవేటు నుంచి కాకుండా, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని రైతులకు ఉచితంగా అందించాలని సంకల్పించింది. సెకీతో ఒప్పందం అనంతరం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం అన్ని రకాల విద్యుత్‌ను కొనేందుకు అనుమతి ఉన్న డిస్కంలు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు పొందలేవు. దీనిని ముందే గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా కంపెనీని ఏర్పాటు చేసింది.నష్టం తెచ్చిందే టీడీపీవాస్తవంగా విద్యుత్ రంగాన్ని నష్టాలపాలు చేసిందే గత చంద్రబాబు ప్రభుత్వం. అప్పట్లో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54), బాబు ప్రభుత్వం ఏకంగా యూనిట్ రూ.6.99కు కొనేలా ఒప్పందాలు చేసుకుంది. పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి ఒప్పందాలు చేసుకుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యం మేరకు పవన విద్యుత్ ఒప్పందాలు నామినేషన్ ప్రాతిపదికనే జరిగాయి. పోటీ బిడ్డింగ్ ద్వారా కాదు. దీనివల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో దుబారా, దోపిడీని అరికట్టి కరెంటు కొనుగోళ్లు, ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ.4,925 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. సెకీతో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. -
‘సెకీ’ విద్యుత్ చౌక
సాక్షి, అమరావతి: కరెంటు కోసం అర్ధరాత్రి వేళ పొలాల్లో పడిగాపులు కాస్తూ, రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూరుస్తోంది.ఇందుకోసం ప్రైవేటు రంగం నుంచి కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని వ్యవసాయానికి అందించాలని సంకల్పించింది. ఇలా సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ అత్యంత చౌకగా వస్తోందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదు2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీ ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం ఏడాదికి 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగస్వామిగా ఉండటం వల్ల చెల్లింపులకు ఎటువంటి ఆటంకం కలగదు. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంది. సెకీ విద్యుత్ అతి తక్కువకు యూనిట్ రూ.2.49 కు వస్తోంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) యూనిట్ రూ.2.79 కన్నా ఇది తక్కువ. ఈ లెక్కన సెకీ ఒప్పందంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 ఏళ్ల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌విుషన్ చార్జీల నుంచి కూడా రాష్ట్రానికి మినహాయింపు వస్తుంది.అదే రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌కు పాతికేళ్ల పాటు సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. దీనికి కూడా కేంద్రం మినహాయింపునిచ్చింది. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు కట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా తీసుకున్నప్పుడు అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది. టీడీపీ వల్లనే నష్టంచంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు అసలు పొంతనే లేదు. చంద్రబాబు హయాంలో సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44 కు లభిస్తుంటే (బాక్డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) చంద్రబాబు ఏకంగా యూనిట్‌కు రూ.8.90 వెచ్చించారు. పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు కుదుర్చుకున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం, ఇదే సెకీ నుంచి యూనిట్‌కు రూ.4.57తో గాలివీడులో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్‌కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లను కొనుగోలు చేసింది. ఇలా చంద్రబాబు హయాంలో మొత్తం దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే గత ఐదేళ్లుగా సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ‘సెకీ’తో ఒప్పందం కారణంగా బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12 కు కొనే బదులు గ్రీన్ పవర్‌ను యూనిట్ రూ.2.49 కొనవచ్చు. ఫలితంగా డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. -
‘సెకీ’ ఒప్పందానికి ‘ఏపీఈఆర్సీ’ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో చేసుకున్న త్రైపాక్షిక (ట్రై పార్టీ) ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 3 వేల మెగావాట్లు, 2025 అక్టోబర్ నుంచి మరో 3 వేల మెగావాట్లు, 2026 అక్టోబర్ నుంచి మరో వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ నుంచి మూడు విడతల్లో మొత్తం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం, మూడు డిస్కంలు 2021 డిసెంబర్ 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి. సోలార్ పవర్ డెవలపర్లు రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల నుంచి ఈ విద్యుత్ సేకరణ కోసం లెవలైజ్డ్ టారిఫ్ 25 సంవత్సరాలకు ట్రేడింగ్ మార్జిన్‌తో సహా యూనిట్‌కు రూ.2.49 చొప్పున చెల్లించేందుకు కూడా ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈ సేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీంతో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం సెకీ ద్వారా సౌర విద్యుత్ కొనుగోలుకు చట్టబద్ధంగా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. ఒప్పందంతో ప్రయోజనాలు ఇలా రాత్రనక, పగలనకా రైతులు పొలాల్లో విద్యుత్ కోసం పడిగాపులు కాస్తూ, ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. వ్యవసాయానికి విద్యుత్‌ను తమ హక్కుగా రైతులు భావించేలా చర్యలు చేపడుతూ, రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూరుస్తోంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కాకుండా, వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని 2024 నుండి దాదాపు 19 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక డిస్కమ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ద్వారా ఈ విద్యుత్తు అందించాలని నిర్ణయించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. అదే రాష్ట్రంలోని యూనిట్ల నుంచి విద్యుత్తు తీసుకొంటే సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు 25 సంవత్సరాలు చెల్లించాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టులు కడితే వాటికి విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు దానికి కావలసిన అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య తేడా ఉంటుంది. ప్రాథమికంగా ఇప్పుడు ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్ధ్యాన్ని బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువ అవుతుంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ, ఆ ప్రతిపాదన విరమించుకొని సెకీ ప్రతిపాదనకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. -
బహిరంగ విచారణ దేనికి.!
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి, రైతులకు ఉచిత విద్యుత్‌పై రానున్న 30 ఏళ్ల పాటు హక్కు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూనిట్ కేవలం రూ.2.49 పైసలకే 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఈ ఒప్పందం కుదిరింది. విద్యుత్ చట్టాలకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాయి. తక్కువ రేటుకే విద్యుత్ కొని 30 ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్నదాతలకు ఉచితంగా విద్యుత్ అందించే మంచి కార్యక్రమం ఈనాడుకు నచ్చలేదు. రామోజీ ఏకంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)నే తప్పుబడుతూ ఈనాడులో కథనాలు ఇస్తున్నారు. సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జరుగుతున్న కార్యకలాపాలపైనే అడ్డగోలుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. రెండు రోజులుగా ఈనాడు పత్రికలో వస్తున్న అసత్య కథనాలను ఏపీఈఆర్సీ తీవ్రంగా పరిగణించింది. కనీస అవగాహన లేకుండా, చట్టం గురించి తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయడంపై తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఏపీఈఆర్సీ ‘సాక్షి’కి శుక్రవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఈనాడు ఆరోపణ: సెకీతో 2021లో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ జరపకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వాస్తవం: విద్యుత్ నియంత్రణ మండలి స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర స్థాయి అత్యున్నత సంస్థ. మండలి తీసుకునే ప్రతి నిర్ణయం అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదు. మండలి నిర్ణయాలపై ఎలాంటి గోప్యతకు తావులేదు. బహిరంగ విచారణ విషయానికొస్తే మండలి అనుసరించే విచారణ ప్రక్రియ విద్యుత్ సరఫరా చట్టం, అందుకు అనుగుణంగా మండలి జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. సెక్షన్ 62 – 64 ప్రకారం పంపిణీ సంస్థల టారిఫ్‌ను నిర్దేశించే క్రమంలో డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలను పత్రికాముఖంగా తెలియజేయాలి. ఆ ప్రతిపాదనలపై వచ్చే అన్ని అభ్యంతరాలను పరిశీలించి, మండలి వాటిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సెకీతో ఒప్పందం కుదుర్చుకునే ముందు డిస్కంలు మండలి అనుమతి కోరాయి. ఐదో నియంత్రిత కాలం లోడ్ ఫోర్కాస్ట్ రిసోర్స్ ప్లాన్ ప్రకారం ఉన్న విద్యుత్ అవసరాల రీత్యా 7 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అని మండలి భావించింది. ఇందుకు సహేతుక కారణాలు తెలుపుతూ 2021 నవంబర్ 11న డిస్కంల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలకు మండలి షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. విద్యుత్ టారిఫ్ విషయానికి వస్తే సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి మాత్రమే టారిఫ్ని నిర్ధారిస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. 2022లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్సీ)లో దాఖలైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్ రూ.2.49 పైసలుగా టారిఫ్‌ను నిర్ధారించింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో అభ్యంతరదారులు పిల్ దాఖలు చేశారు. ఆ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆరోపణ: విద్యుత్ పంపిణీ సంస్థలు సెకీతో చేసుకున్న ఒప్పందం ఆమోదం కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను మండలి వెబ్సైట్లో ఉంచలేదు. వాస్తవం: ఈ విమర్శల్లో ఎటువంటి వాస్తవికత గాని, హేతుబద్ధత గాని లేదు. ఏదైనా ప్రతిపాదనపై విచారణ ప్రక్రియ చట్టానికి అనుగుణంగా జరుగుతుంది. వినియోగదారుల విద్యుత్ చార్జీల సవరణ, ట్రూఅప్ చార్జీలపై మాత్రమే కమిషన్ బహిరంగ విచారణ చేపడుతుంది. వాటికి సంబంధించిన అంశాలను మాత్రమే వెబ్సైట్లో ఉంచుతుంది. ఇతర ఏ ప్రతిపాదనలకు బహిరంగ విచారణ జరపాలని గానీ, వెబ్సైట్లో పెట్టాలని గానీ చట్టంలో నిబంధన లేదు. అందువల్ల పత్రికలో మండలిపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారాలు. ఇటువంటి వార్తలు ప్రచురించడం ద్వారా మండలి లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించడం వ్యవస్థకు ఎంత మాత్రం మేలు చేయదు. -
37,490 మెగావాట్ల సోలార్‌పార్క్‌లు.. ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే..
దేశవ్యాప్తంగా పరిశ్రమలు, గృహావసరాలకు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కానీ అందుకు సరిపడా కరెంట్ తయారవడం లేదు. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి బదులుగా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను తయారుచేయాలని చాలాకాలంగా అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ ఏడాది నవంబర్ 30 వరకు 37,490 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 50 సోలార్ పార్కులకు ఆమోదం తెలిపినట్లు మంగళవారం పార్లమెంటులో వెల్లడింకచారు. ప్రభుత్వం 40 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ పార్లమెంట్లో తెలిపారు. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ పథకం కింద నవంబర్ 30 నాటికి దేశంలోని 12 రాష్ట్రాల్లో 37,490 మెగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను మంజూరు చేసినట్లు సింగ్ చెప్పారు. ఇప్పటికే 10,401 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 19 సోలార్ పార్కులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? రాష్ట్రాల వారీగా గుజరాత్లో సుమారు 12,150 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (8,276 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్ (4,200 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (4,180 మెగావాట్లు), ఉత్తర్‌ప్రదేశ్ (3,730 మెగావాట్లు), కర్ణాటకలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌పార్క్‌లు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. జార్ఖండ్‌లో 1,089 మెగావాట్లు, మహారాష్ట్రలో 750 మెగావాట్లు, కేరళలో 155 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 100 మెగావాట్లు, మిజోరాంలో 20 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు కూడా మంజూరైనట్లు వివరించారు. -
AP: రైతులకు 25 ఏళ్లు ఉచిత విద్యుత్
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో రానున్న 25ఏళ్లపాటు రైతులకు నమ్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాపై అధికారులతో మంత్రి సోమవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.2.49 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో మొదటి విడత 3వేల మెగావాట్లు, 2025లో రెండవ విడత 3 వేల మెగావాట్లు, 2026లో మూడో విడత వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ విద్యుత్ సరఫరా చేస్తుందని వివరించారు. ఆక్వా కల్చర్‌కు సబ్సిడీ ధరపై విద్యుత్ సరఫరా చేయడంతోపాటు వారికి ఆర్థికంగా మరింత మేలు కలిగేలా రైతు భరోసా వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. చెల్లింపులు ఆలస్యమైనా సరఫరా ఆగదు: విజయానంద్ డిస్కంల పనితీరును మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలు చేస్తోందని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తెలిపారు. ప్రస్తుతానికి డిస్కంలు వ్యవసాయానికి సంవత్సరానికి 12 వేల మిలియన్ యూనిట్లను సరఫరా చేస్తున్నాయని, దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని భరిస్తోందని వివరించారు. డీబీటీ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నామని, 28,684 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను అమర్చామని చెప్పారు. అక్కడ వ్యవసాయ వినియోగానికి సంబంధించిన నెలవారీ బిల్లింగ్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోందని, ఒకవేళ చెల్లింపులు సకాలంలో అందకపోయినా డిస్కంలు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగిస్తాయని విజయానంద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీజెన్కో ఎండీ బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీ తేజ్, డిస్కంల సీఎండీలు జె.పద్మ జనార్దనరెడ్డి, కె.సంతోష్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎస్‌జేవీఎన్ భారీ పవన విద్యుత్ ప్రాజెక్టు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎస్‌జేవీఎన్ (గతంలో సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్) రూ. 700 కోట్ల భారీ పెట్టుబడితో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ–రివర్స్ వేలం ప్రక్రియ ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుండి ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు ఎస్‌జేవీఎన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్మాణానికి సంబంధించి యూనిట్‌కు రూ.2.90 (టారిఫ్), అలాగే స్వయం నిర్వహణ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పొందినట్లు పేర్కొంది. తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎస్జీఈఎల్ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా ప్రాజెక్ట్‌ను చేపట్టి, అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటనలో తెలిపింది. -
AP: దేశంలోనే తొలిసారి.. సెకీతో ఒప్పందం ఓ ట్రెండ్‌సెట్టర్
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం దేశ వ్యవసాయ రంగంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. సచివాలయంలోని ఇంధన శాఖ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యుత్ సంస్థల అధికారులతో ఆయన తొలి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానికి రానున్న 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని తెలిపారు. చదవండి: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. అందులో భాగంగానే తక్కువ ధరకు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను పాతికేళ్ల పాటు రాష్ట్రానికి సరఫరా చేసేలా సెకీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెన్కో, ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీలు.. పృథ్వీతేజ్, మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు.. హెచ్.హరనాథరావు, పద్మజనార్దనరెడ్డి, సంతోషరావు, నెడ్కాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి పాల్గొన్నారు. -
అదానీకి మెగా ‘సౌర’భం
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా ప్రపంచంలోనే అత్యంత భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకుంది. ఇందులో భాగంగా 8 గిగావాట్స్ ఫొటోవోల్టెయిక్ (పీవీ) విద్యుత్ ప్లాంటుతో పాటు దేశీయంగా సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ప్రభుత్వ రంగ ఎస్ఈసీఐ (గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి దక్కించుకున్న ఈ కాంట్రాక్టు కింద 2 గి.వా. (2,000 మె.వా) సామర్థ్యంతో దేశీయంగా సోలార్ పయానెల్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలి. అలాగే 8 గి.వా. విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు నిర్మించాలి. ‘ఎస్ఈసీఐతో తయారీ ఆధారిత సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది‘ అని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. ఈ ప్రాజెక్టుతో కలిపి అదానీ గ్రీన్ వద్ద ప్రస్తుతం 15 గి.వా. పునరుత్పాదక విద్యుదుత్పత్తి అసెట్స్ ఉన్నట్లవుతుంది. రూ. 2.92 టారిఫ్..: కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు యూనిట్‌కు స్థిరంగా రూ. 2.92 చొప్పున కంపెనీకి టారిఫ్ లభిస్తుంది. ఇంత భారీ సామర్థ్యం గల ప్రాజెక్టు కాంట్రాక్టు ఇదేనని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక విద్యుత్ కంపెనీగా ఎదగాలన్న లక్ష్యానికి మరింత చేరువయ్యేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. ఈ ఏడాదే మరో 10 గి.వా. సామర్థ్యంగల ప్రాజెక్టులను దక్కించుకోవడం ద్వారా 25 గి.వా. సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోగలం‘ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజస్తాన్, గుజరాత్లో ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజస్తాన్‌లోని జైసల్మేర్, బికనీర్, జోధ్‌పూర్‌లో అటు గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో నెలకొల్పవచ్చని వివరించాయి. సుమారు 4,00,000 దాకా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నాయి. 2025 నాటికి పూర్తి.. ముందుగా 2022 నాటికి తొలి 2 గి.వా. ఉత్పత్తి సామర్థ్యం ప్రాజెక్టు మొదలవుతుందని, మిగతాది 2 గి.వా. చొప్పున 2025 నాటికి పూర్తవుతుందని అదానీ తెలిపారు. ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్నట్లు, 2022 నాటికి సోలార్ తయారీ కేంద్రం సిద్ధం కానున్నట్లు చెప్పారు. ఏకంగా 25 ఏళ్ల పాటు స్థిరంగా రూ. 2.92 మాత్రమే టారిఫ్ ఉండనుండటంపై స్పందిస్తూ ‘మాకు తగినంత మార్జిన్ ఉంటుంది. అంతేగాక ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3–5 ఏళ్ల వ్యవధి ఉంటుంది. తగినంత మార్జిన్ ఉండటం వల్ల టారిఫ్ విషయంలో సమస్యేమీ లేదు‘ అని అదానీ తెలిపారు. ఇక, ఆగ్నేయాసియా దేశాలు.. ముఖ్యంగా చైనా నుంచి చౌకగా దిగుమతుల వల్ల దేశీ సంస్థలు నష్టపోకుండా తగు రక్షణాత్మక సుంకాలు అమలవుతుండటం కూడా ఊరటనిచ్చే అంశమని ఆయన వివరించారు. 900 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలను ఈ భారీ ప్రాజెక్టు తగ్గిస్తుందని, తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఉపయోగపడగలదని పేర్కొన్నారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో తమ సంస్థ రూ. 1,12,000 కోట్ల మేర (దాదాపు 15 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసేందుకు ఈ కాంట్రాక్టు ఊతమివ్వగలదని అదానీ చెప్పారు. -
సోలార్ ప్లాంట్లు ఇవి నీటిపై తేలుతాయి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్ముందు భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తిని మరింత మెరుగుపరచుకునే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పాదకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో నీటితో ఉండే రిజర్వాయర్ల పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవకాశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. నీటిపై తేలియాడే సోలార్ పానెళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే దేశంలో పేరొందిన పలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కాళేశ్వరం పరిధిలోని ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, అనంతగిరి, రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మ సాగర్ల పరిధిలో వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం పరిశీలన చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28, 29న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరులలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. కాళేశ్వరం బ్యారేజీలు, రిజర్వాయర్లే టార్గెట్.. రాష్ట్రంలో సోలార్ విద్యుదుత్పత్తి ప్రస్తుతం 3,700 మెగావాట్లకు చేరుకోగా, 2022 నాటికి 5వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. మరో అడుగు ముందుకేసి రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్‌ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 141 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మల్లన్నసాగర్ వంటి 50 టీఎంసీల రిజర్వాయర్‌తో పాటు 20 టీఎంసీల ఎల్లంపల్లి, 25 టీఎంసీల మిడ్‌మానేరు, 15 టీఎంసీల కొండపోచమ్మసాగర్ వంటి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. గంధమల 9, బస్వాపూర్ 11 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుల్లో వాటర్ స్ప్రెడ్ ఏరియా చాలా ఉంటోంది. ఈ ఏరియాను వినియోగించుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రిజర్వాయర్లపై తేలియాడే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి ఉంటుందని, ఇదే సమయంలో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలను నివారించవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. నీటిపై తేలియాడే సోలార్ ప్యానెళ్లతో ఉత్పత్తయ్యే విద్యుత్, నాణ్యతతో పాటు పలు అంశాల్లో లాభదాయకంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భూమిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ఖాళీ స్థలాలు అవసరమని, భారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఖాళీ స్థలాల లభ్యత ఆషామాషీ వ్యవహారం కానందున, రిజర్వాయర్ల పరిధిలో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ఆమోదయోగ్యమని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లుగా తెలిసింది. అయితే కాళేశ్వరం పరిధిలో నది పరీవాహకంపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో ప్యానెళ్ల నిర్మాణం కష్టసాధ్యమని, ఇక్కడ భారీ వరదలు వచ్చినప్పుడు సోలార్ ప్యానెళ్లు కొట్టుకొనిపోయే ప్రమాదం ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు పరిధిలోనూ ఇదే సమస్య ఉంటుందన్నారు. అయితే అనంతగిరి, రంగనాయక్‌సాగర్, బస్వాపూర్, గంధమల, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో మాత్రం వీటిని ఏర్పాటుచేసే వీలుంటుందని చెబుతున్నారు. అయితే వీటి నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలన్న దానిపై పూర్తి స్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. కాగా రిజర్వాయర్ల పరిధిలో సోలార్ పానెళ్ల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 28, 29 తేదీల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన ఉన్నతాధికారులు మిడ్‌మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లిలో పర్యటించి నీటిపై తేలియాడే విద్యుత్ ప్లాంట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. -
సౌర విద్యుత్‌పై భారీ ఆశలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధార పడడాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా మన జిల్లాలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. అయితే ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు విడుదల కావాల్సి ఉంది. వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన ఐదువేల ఎకరాలకు పైగా భూమి గట్టు మండలంలో ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెసి) ఈ యేడాది మార్చిలో ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ)తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆరు నెలల్లో ఎంపిక చేసిన స్థలంలో మౌలిక సౌకర్యాల కల్పన పూర్తి చేయాలని అంగీకారానికి వచ్చారు. కాంపిటీటీవ్ బిడ్డింగ్ పద్ధతిలో డెవలపర్స్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మౌలిక సౌకర్యాల కల్పనకు త్వరలో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ప్రభుత్వమే నెలకొల్పుతుందా లేక ప్రైవేటు పెట్టుబడుదారులకు అవకాశం కల్పిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఔత్సాహికులు ముందుకు వస్తే జపాన్ ఆర్థిక సంస్థ జికా సహకారంతో మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు రుణాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ధర నిర్ణయంపైనే ఆసక్తి సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నా యూనిట్ ధర నిర్ణయంపై స్పష్టత రావడం లేదు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో) సౌర విద్యుత్ యూనిట్ ధరను రూ.6.50 నుంచి రూ.7.50గా పేర్కొంటోంది. పెట్టుబడులతో పోలిస్తే ట్రాన్స్‌కో నిర్ణయిస్తున్న ధర అంత లాభదాయం కాదనే భావన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విధానంలో పారదర్శకత లేదంటూ గతంలో ఔత్సాహిక పెట్టుబడిదారులు ఆరోపించారు. సబ్సిడీలు, పన్ను రాయితీ, కనీసం 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం వంటి అంశాలపై స్పష్టత ఇస్తే ముందుకు వచ్చే యోచనలో పారిశ్రామికవేత్తలున్నారు. కాగా జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే స్పష్టత వస్తుందని నెడ్‌క్యాప్ డీఎం గోవిందరాజులు ‘సాక్షి’కి వెల్లడించారు. గట్టు మండలంలో గతంలో సెసి సర్వే చేసినా సరైన భూమి దొరకలేదన్నారు. విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక పూర్తి కావాల్సి ఉందన్నారు. జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో ఆధ్వర్యంలో తొలి సారిగా ధరూరు మండలం రేవులపల్లి వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రియదర్శిని జూరాల జల విద్యుత్ కేంద్రం ఆవరణలో రూ. 12.8 కోట్ల వ్యయంతో ప్లాంటు నిర్మించారు. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ఈ ప్లాంటు ఏర్పాటుకు సహకారం అందించింది. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పవర్ ప్లాం టును 2012లో ప్రారంభించారు. యేటా1.4 మిలియ న్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జెన్కోతో పాటు వాల్యూలాబ్స్ అనే ఐటీ సంస్థ 8 మెగావాట్లు, రేస్ ఇన్ఫ్రా 10 మెగావాట్లు. ఓ మీడియా సంస్థ 10 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను జిల్లాలో ఇప్పటికే నెలకొల్పాయి.