సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం | Gautam Adani Bribery Case: Fake Allegations On YSRCP Govt Over Power Purchase From Adani, More Details Inside | Sakshi
Sakshi News home page

సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం

Published Fri, Nov 22 2024 6:22 AM | Last Updated on Fri, Nov 22 2024 9:35 AM

Fake Allegations On YSRCP Govt On power purchase Adani

కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్రం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం  

అత్యంత తక్కువగా యూనిట్‌ రూ.2.49కే సరఫరా చేసేలా..

ఆ సమయంలో సగటు యూనిట్‌ కొనుగోలు ధర రూ.5.10 

దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న ఆర్ధిక భారం రూ.3,700 కోట్లు 

అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలేంటి? 

అదానీ సంస్థలతో ఎటువంటి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు 

ఈ లెక్కన 7,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలులో లంచమనే ప్రశ్న ఎక్కడ? 

వివిధ రాష్ట్రాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో అదానీ లంచాలు ఇచ్చారంటూ అమెరికా ఫెడరల్‌ కోర్టులో కేసు.. తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారన్న అదానీ సంస్థ

సాక్షి, అమరావతి:  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ)తో రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు చేతులు మారా­యని ఆరోపణలు చేస్తుండటాన్ని ఏమనుకోవాలి? అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలే అని అర్థం. 

ఇక అదానీ గ్రూప్‌తో విద్యుత్‌ కొనుగోలు చేస్తూ డిస్కమ్‌లు(విద్యుత్‌ పంపిణీ సంస్థలు) ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చేసుకోని ఒప్పందాలకు అదానీ గ్రూప్‌.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్‌ కోర్టులో యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ కేసు దాఖలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా చేసుకోని ఒప్పందాలకు లంచాలు ఇస్తారా? ఇవ్వరు కదా.. అంటే అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలన్నది స్పష్టమవుతోంది.  

కార్పొరేట్‌ ప్రపంచంలో పదే పదే అదానీ గ్రూపుపై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు.. తాజాగా అదానీ గ్రూపు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదానీ గ్రూపు అమెరికా మార్కెట్‌ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడుదారుల రక్షణ పేరిట అమెరికాబ్రూక్లిన్‌ ఫెడరల్‌ కోర్టులో అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీలతోపాటు ఏడుగురిపై అభియోగాలు నమో­దయ్యాయి. ఈ అభియోగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిషా, చత్తీస్‌ఘడ్, జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రాలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూపు భారీ ఎత్తున లంచాలు ఎర చూపిదంటూ ఆరోపించారు.  

ఆరోపణల వెనుక భారీ కుట్ర! 
రానున్న 25 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్‌ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూర్చేందుకు వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు కొనుగోలు చేసేలా గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందానికి అదానీ గ్రూపు లంచాలు ఇవ్వచూపిందంటూ ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్‌ కొనుగోలు వ్యయం యూనిట్‌ రూ.5.10 ఉంటే కేవలం రూ.2.49 (రూ.2.6 తక్కువగా)కే.. అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 

గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ధరలు యూనిట్‌కు రూ.4.63–రూ.6.76తో పోల్చినా చాలా చౌకగా విద్యుత్‌ లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.2.79 (ట్రేడింగ్‌ మార్జిన్‌ కలిపి) కన్నా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. కానీ ప్రస్తుత సగటు యూనిట్‌ ధర కంటే రూ.2.61 తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్‌ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.  

అసలు విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కొనుగోలు చేస్తుంటే.. అదానీ గ్రూపు లంచాలు ఎందుకు ఇవ్వజూపుతుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అమెరికా ఫెడరల్‌ కోర్టు అభియోగ పత్రంలో ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఎవరైనా చెబుతారు.  కాగా, అదానీ గ్రీన్‌ డైరెక్టర్లపై యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్, యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ సంస్థపై తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని చెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement