సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌తో ఏపీ ప్రభుత్వం, డిస్కంల ఒప్పందం
యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు
పాతికేళ్ల పాటు వ్యవసాయ అవసరాల కోసం రైతులకు నిరంతర ఉచిత విద్యుత్తు
ఈ ఏడాది నుంచి 3 వేల మెగావాట్లు, వచ్చే ఏడాది నుంచి మరో 3 వేలు
ఆ తర్వాత ఏడాది నుంచి మరో వెయ్యి మెగావాట్లు సరఫరా
సెకీతో ఒప్పందం వల్ల ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా
టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పుల వల్ల ఏడాదికి రూ.3,500 కోట్ల భారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో చేసుకున్న త్రైపాక్షిక (ట్రై పార్టీ) ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి 3 వేల మెగావాట్లు, 2025 అక్టోబర్ నుంచి మరో 3 వేల మెగావాట్లు, 2026 అక్టోబర్ నుంచి మరో వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ నుంచి మూడు విడతల్లో మొత్తం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం, మూడు డిస్కంలు 2021 డిసెంబర్ 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి.
సోలార్ పవర్ డెవలపర్లు రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల నుంచి ఈ విద్యుత్ సేకరణ కోసం లెవలైజ్డ్ టారిఫ్ 25 సంవత్సరాలకు ట్రేడింగ్ మార్జిన్‌తో సహా యూనిట్‌కు రూ.2.49 చొప్పున చెల్లించేందుకు కూడా ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఈ సేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీంతో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం సెకీ ద్వారా సౌర విద్యుత్ కొనుగోలుకు చట్టబద్ధంగా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి.
ఒప్పందంతో ప్రయోజనాలు ఇలా
రాత్రనక, పగలనకా రైతులు పొలాల్లో విద్యుత్ కోసం పడిగాపులు కాస్తూ, ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. వ్యవసాయానికి విద్యుత్‌ను తమ హక్కుగా రైతులు భావించేలా చర్యలు చేపడుతూ, రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూరుస్తోంది.
ప్రైవేటు వ్యక్తుల నుంచి కాకుండా, వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని 2024 నుండి దాదాపు 19 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక డిస్కమ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ద్వారా ఈ విద్యుత్తు అందించాలని నిర్ణయించింది.
సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. అదే రాష్ట్రంలోని యూనిట్ల నుంచి విద్యుత్తు తీసుకొంటే సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు 25 సంవత్సరాలు చెల్లించాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టులు కడితే వాటికి విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు దానికి కావలసిన అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య తేడా ఉంటుంది.
ప్రాథమికంగా ఇప్పుడు ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్ధ్యాన్ని బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువ అవుతుంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ, ఆ ప్రతిపాదన విరమించుకొని సెకీ ప్రతిపాదనకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment