Discom
-
హైడల్.. పవర్ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఈ ఏడాది జలవిద్యుత్ ఆదుకుంది. కృష్ణా పరీవాహకంలోని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నిరంతర వరద కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది (2024–25)లో 4,050 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుదుత్పత్తి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అంచనా వేసింది. ఇప్పటికే 3,828.52 ఎంయూల ఉత్పత్తి జరిగింది. కృష్ణా పరీవాహకానికితోడు గోదావరి పరిధిలోని సింగూరు, నిజాంసాగర్, పోచంపాడు జలాశయాల్లో ప్రస్తుతం గరిష్ట నీటిమట్టం మేరకు నిల్వలుండగా, ఎగువ నుంచి ఇంకా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా జలాశయాల్లో 584.1, గోదావరి జలాశయాల్లో 137.5 కలిపి మొత్తం 721.6 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నిల్వలతో మరో 2,206 ఎంయూల జలవిద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6,034 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశముంది. దిగివచ్చిన జలవిద్యుత్ ధరలుతెలంగాణ పరిధిలో 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాలుండగా, అందులో 2,324 మెగావాట్ల వాటాను మన రాష్ట్రం కలిగి ఉంది. వీటికి సంబంధించిన విద్యుత్ ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం 2024–25లో రూ.1,129 కోట్లు అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి. విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా జెన్కోకు ఈ మేరకు ఫిక్స్డ్ ధర వ్యయాన్ని డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో గతేడాది(2023–24) 830 ఎంయూల జలవిద్యుదుత్పత్తి మాత్రమే జరిగింది.జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్ ఫిక్స్డ్ ధర 2022–23లో యూనిట్‌కు రూ.2.32 ఉండగా, 2023–24లో ఉత్పత్తి తగ్గడంతో రూ.8.51కు పెరిగింది. దీంతో డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయి. డిస్కంల సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగి యూనిట్‌కు రూ.5.72కు చేరడానికి కారణమైంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 2.69 శాతం అధికం. ఈ ఏడాది 6000 ఎంయూలకు పైగా జలవిద్యుదుత్పత్తి జరిగే అవకాశాలుండడంతో మళ్లీ వాటి ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం గణనీయంగా తగ్గనుంది. యూనిట్‌కు కేవలం రూ.1.9 పైసల ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం అవుతుందని అంచనా. జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్‌కు ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. వెరియబుల్ కాస్ట్ ఉండదు. మొత్తంగా రూ.1129 కోట్ల వ్యయానికే 6,000 ఎంయూల జలవిద్యుత్ లభించనుంది. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఇది భారీ ఊరటతోపాటు వినియోగదారులకు భవిష్యత్‌లో విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీల వసూళ్ల నుంచి కొంత వరకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో అత్యధికంగా 2021–22లో 5,371 ఎంయూలు, ఆ తర్వాత 2022–23లో 5,741 ఎంయూల జలవిద్యుదుత్పత్తి అయ్యింది. మరమ్మతులు జరగక..459 ఎంయూల విద్యుదుత్పత్తికి గండి రాష్ట్రంలో మొత్తం 2,442 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాలుండగా, సుదీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో మొత్తంగా 301.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. మొత్తం జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో 12.35 శాతం నిరుపయోగంగా మారింది. ఒకవేళ వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించి ఉంటే పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేసుకోవడానికి ఈ ఏడాది అవకాశముండేది మరమ్మతులు జరపకపోవడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 459 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి గండిపడింది. యూనిట్‌కు అత్యల్పంగా రూ.2.5 ధరతో లెక్కించినా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిగి ఉంటే ఇప్పటి వరకు మొత్తం 4,287 ఎంయూలకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగి వార్షిక లక్ష్యాన్ని దాటిపోయేది. -
డిస్కంలను గాడిన పెట్టేందుకే జరిమానాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సకాలంలో వార్షిక ఆదాయ అవ సరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ పిటిషన్లు దాఖలు చేయడం లేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) చైర్మన్ టి.శ్రీరంగారావు విమర్శించారు. డిస్కంలను దారిలో పెట్టడానికే జరిమానాల విధానం అమ ల్లోకి తెచ్చామని చెప్పారు. శనివారం హైదరా బాద్‌లో జరిగిన ఈఆర్సీ సలహా మండలి సమా వేశంలో ఆయన మాట్లాడుతూ సుస్థిర ఆర్థిక, సామాజికాభివృద్ధికి ఇంధన రంగం పాత్ర కీలకమన్నారు. కేవలం టారిఫ్‌ను నిర్ణయించడమే ఈఆర్సీ బాధ్యత కాదని... వినియోగ దారులందరికీ సరసమైన ధరలో విద్యుత్‌ను అందించడం, నాణ్యమైన విద్యుత్ అందేలా చూడటం కూడా తమ బాధ్యతని పేర్కొన్నా రు. డిస్కంల పనితీరును మెరుగుపరచడంతో పాటు వాటిలో ఉన్న లోపాలను సరిచేస్తున్నా మన్నారు. విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన అన్ని పిటిషన్లపై సూచనలు, అభిప్రాయాలు తెలియజేయడానికి ఈనెల 11 దాకా గడువిచ్చా మని, పిటిషన్లపై అధ్యయనం చేసి అభిప్రా యాలు తెలియజేయాలని కోరారు. ఏఆర్ఆర్ తోపాటు పిటిషన్లపై ఈ నెల 21–25 దాకా బహిరంగ విచారణలు నిర్వహిస్తామన్నారు.టారిఫ్ అమలును వాయిదా వేయాలి: పరిశ్రమల ప్రతినిధులుడిస్కంలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను ఆలస్యంగా దాఖలు చేసినందున కొత్త టారిఫ్ అమలుకు ఐదు నెలలే గడువు ఉందని... వాటిని విచారణకు స్వీకరించరాదని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కోరారు. ఏఆర్ఆర్పై అభ్యంతరాలు తెలపడానికి గడువు పెంచాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి తగిన నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు సూచించగా స్థిర చార్జీలు పెంచాలనే నిర్ణయాన్ని అమలు చేయరాదని పరిశ్రమల ప్రతినిధులు కోరారు. -
సర్దుబాటు షాక్రూ. 8,113.60 కోట్లు
సాక్షి, అమరావతి: ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) మంగళవారం వెల్లడించాయి. ఏపీఈఆర్సీ అనుమతితో గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి రూ.1901 కోట్లు, పారిశ్రామిక సర్వీసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థ(ఇన్స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేయనున్నట్లు డిస్కంలు వెల్లడించాయి. ప్రతి నెలా ఒక్కో బిల్లుపై యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై యూనిట్‌కు రూ.1.65 వసూలు చేస్తున్నామని, వీటిని వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. వీటికి తాజా ఎఫ్‌పీపీసీఏ చార్జీలు అదనమని పేర్కొన్నాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 75 శాతం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. ‘బాబు’ గుదిబండ పీపీఏ కోసమే రుణాలుగత ప్రభుత్వంలో సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు మినహా ఎలాంటి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోలేదని డిస్కంలు తెలిపాయి. దీంతో స్పల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు 2022–23లో రూ.6,522 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నాయి. అయితే గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన పీపీఏలను సమీక్షించేందుకు 2019 జూలైలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల కమిటీని నియమించిందని, అయితే ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపాలని 2022 మార్చిలో హైకోర్టు సూచించిందని డిస్కంలు గుర్తు చేశాయి. దీనివల్ల సౌర, పవన విద్యుత్ సరఫరా దారులకు యూనిట్ రూ.2.44 చొప్పున బకాయిలు చెల్లించేందుకు రూ.9 వేల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చిందని డిస్కంలు వెల్లడించాయి. దీన్నిబట్టి చంద్రబాబు పాపాలు విద్యుత్ సంస్థలను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని విద్యుత్తు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
స్తంభాలు, లైన్ల మరమ్మతులకు రూ.45 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రజల నుంచి వచ్చే విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.15 కోట్లు చొప్పున రూ.45 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వెల్లడించింది. 2024–25 నుంచి 2024–29 మధ్య డిస్కంల ప్రసార (వీలింగ్)చార్జీలను నిర్ణయిస్తూ మండలి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 33కేవీ, 11కేవీ, ఎల్టీ లైన్లను ఉపయోగించుకున్న వారి నుంచి డిస్కంలు వసూలు చేసేలా రూ.0.32 నుంచి రూ.2.14 వరకూ ఐదేళ్లకు వేర్వేరు చార్జీలను ప్రకటించింది. ఇన్నాళ్లూ కిలోఓల్ట్అవర్ (కేవీఏ) ప్రాతిపదికన వసూలు చేస్తున్న వీలింగ్ చార్జీలను ఇకపై ప్రతి యూనిట్ ప్రాతిపదికన వసూలు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. అయితే ఈ చార్జీల్లో గృహాలు, పబ్లిక్, ప్రభుత్వ సంస్థలకు 50 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపింది. దానివల్ల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టంలు ఏర్పాటు చేసేవారి సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏపీ ట్రాన్స్‌కోతో పాటు డిస్కంలు కూడా ఓల్టేజ్ నిర్వహణపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్థంభాలను సరి చేయడానికి తాము కేటాయించిన నిధులను వినియోగించాలని సూచించింది. మార్చి 31 నాటికి అన్ని పెట్టుబడుల వివరాలను కమిషన్‌కు తెలియజేయాలని, తర్వాతి ఆరి్థక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీలోపు ఖర్చుల వివరాలను సమర్పించి, ఆమోదం పొందాలని కమిషన్ స్పష్టం చేసింది.రాష్ట్రంలో పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రూపొందించిన ‘విద్యుత్ పంపిణీ నెట్వర్క్ ప్లానింగ్ క్రైటీరియా 2023’ పత్రాన్ని అనుసరించాలని డిస్కంలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగుల ఖర్చుల్లో పెన్షన్, గ్రాట్యుటీ (పీఅండ్‌జీ) ట్రస్ట్‌లకు సంబంధించిన నిబంధనలను కమిషన్ అనుమతించింది. -
విద్యుత్ శాఖనూ వీడని సర్దు‘పోటు’!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వంద రోజల పాలనలో విద్యుత్ శాఖలో చెప్పుకోవడానికంటూ జరిగిన అభివృద్ధి ఒక్కటీ లేదు. కనీసం కొత్త సర్కిళ్లయినా ఇస్తే ప్రజలకు విద్యుత్ సేవలు చేరువవుతాయనే డిమాండ్ రావడంతో ఎట్టకేలకు వాటికి అనుమతినిచ్చింది. ఆ వెంటనే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు పదమూడు కొత్త జిల్లాలకు సర్కిళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి ఆర్థిక భారం ఉండకూడదని ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఆదేశాల్లోనే పేర్కొనడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త కార్యాలయాల్లో సర్దుబాటు చేశారు. దానివల్ల కొన్ని చోట్ల కొన్ని పోస్టులను తీసేయాల్సి వచ్చింది. మరి కొన్ని చోట్ల పోస్టులను ఒకదానితో మరొకటి కలిపేయాల్సి వచ్చింది. దీంతో పనిభారం పెంచేలా ప్రభుత్వం చర్యలున్నాయని విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. అదీగాక ఇన్నాళ్లూ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (డీఈఈ)లు ఉన్న డివిజన్ కార్యాలయాలనే జిల్లా స్థాయికి మార్చడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) కార్యాలయానికి తగ్గట్టు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ఉన్నవాటితోనే సర్ధుకోమనడంపై విద్యుత్ సంఘాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచినప్పుడు ప్రతి జిల్లాకు ఒకేలా పరిపాలనా సిబ్బందిని, కార్యాలయాలను కేటాయించారని, కానీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా విద్యుత్ సంస్థల్లో సిబ్బందిని వేధించేందుకే సర్కిళ్లకు షరతులు పెట్టిందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.కేటాయింపుల్లో తేడాలుసిబ్బందిపైనే భారంరాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో కొత్త సర్కిళ్లు (జిల్లా కార్యాలయాలు) ఏర్పాటు చేసిన విషయం విధితమే.13 పాత సర్కిళ్లకు అదనంగా మరో 13 కొత్త సర్కిళ్లను రూపొందించి, వాటికి అధికారులను, సిబ్బందిని కూడా కేటాయించారు. కార్పొరేట్ కార్యాలయాల్లో జనరల్ మేనేజర్లు(జీఎం)గా ఉన్నవారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)లుగా నియమించారు. అక్కడ మిగిలిన జీఎంల డిజిగ్నేషన్లు మార్చి, అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఒక్కొక్కరూ రెండు, మూడు విభాగాలను చూడాలి. ఉదాహరణకు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో క్యాలిటీ కంట్రోల్ జీఎంకు కమర్షియల్ విభాగాన్ని అదనంగా ఇచ్చారు. అదేవిధంగా అన్ని సర్కిళ్లలో చీఫ్జనరల్ మేనేజర్లకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే సర్కిళ్ల విభజన తరువాత ఒక్కో జిల్లాకూ ఒక్కో విధంగా విద్యుత్ సిబ్బంది పోస్టులను కేటాయించారు. ఏపీఎస్పీడీసీఎల్లో అనంతపురం సర్కిల్‌కు 58 మంది సిబ్బందిని కేటాయిస్తే, అదే డిస్కం పరిధిలోని సత్యసాయి జిల్లా, పుట్టపర్తి సర్కిల్‌కు 55 మందినే ఇచ్చారు. అలాగే ఏపీఈపీడీసీఎల్ లో విశాఖపట్నం సర్కిల్లో 61 మందితో సర్ధుబాటు చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సర్కిల్‌కు కేవలం 52 మందితోనే సరిపెట్టారు. ఏపీసీపీడీసీఎల్‌లో ఒంగోలు సర్కిళ్లలో 49 మందిని ఇస్తే సీఆర్డీఏ సర్కిల్‌కు 41 మందినే కేటాయించారు. పోనీ ఈ కేటాయింపుల మేరకైనా సిబ్బందిని బదిలీ చేశారా అంటే అదీ లేదు. కొత్త సర్కిళ్ల పేరు చెప్పి సగం సర్వీసులు తగ్గించేశారు. ఉదాహరణకు కొన్ని సర్కిళ్లలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్ఏఓ) పోస్టులను తీసేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులను తగ్గించేశారు. అలాగే టెక్నికల్ పోస్టులను కుదించేశారు. ఒక్కో ఉద్యోగి రెండు మూడు విభాగాల పని చేసే విధంగా పనిభారం మోపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అసలే పని భారంతో సతమతమవుతున్న ఉద్యోగులు ఈ కేటాయింపుపై ఆందోళనకు గురవుతున్నారు. -
విద్యుత్ సంస్థల్లో కొత్త సర్కిళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల్లో కొత్తగా 13 సర్కిళ్లు(జిల్లా కార్యాలయాలు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. కొత్తగా వచ్చిన జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతోపాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించలేదు. దీంతో దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు మూడు డిస్కంలు పాత పద్ధతిలోనే విద్యుత్ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు కొనసాగిçÜ్తున్నాయి.చివరికి సర్కిళ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లు ఆగస్టు 21వ తేదీన, ఏపీసీపీడీసీల్ అదే నెల 27న ప్రభుత్వాన్ని కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.‘సాక్షి’ కథనంతో కదలికఈ నేపథ్యంలో ‘కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం?’ శీర్షికతో గత నెల 30న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇంధన శాఖ అధికారులతో నివేదికలు తెప్పించుకుని చర్చించింది. తాజాగా 13 కొత్త సర్కిల్స్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు. ఎటువంటి ఆర్థక భారం పడకుండా ఇప్పుడు ఉన్నవారినే పాత, కొత్త సర్కిళ్లకు సర్దుబాటు చేయాల్సిందిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలను పంపాలని సీఎండీలకు సూచించారు. కొత్త సర్కిళ్లు ఏర్పడితే ప్రజలకు విద్యుత్ సేవలు మరింత చేరువవుతాయి. అదేవిధంగా ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. దూరం(కిలో మీటర్లు), హెచ్‌టీ సర్వీసులు, ఎల్టీ సర్వీసులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, వాటి సామర్థ్యం, సబ్ స్టేషన్ల సంఖ్య, నెలకు వచ్చే సగటు ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సర్కిళ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి. -
డిస్కంలు చెప్పాయి.. ఈఆర్సీ నిర్ణయించింది
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలానికి టారిఫ్ నిర్ణయంలో పునరుత్పాదక ఇంధన రంగంలోని పరిశ్రమలకు ఊరట లభించలేదు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెప్పిన దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆ టారిఫ్ని నిర్ణయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరం వరకు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాలు, బగాస్సే(చెరకు పిప్పి) విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల ఖర్చుల ఆధారంగా ఏపీఈఆర్సీ ధరలను సమీక్షించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు 26 ఉన్నాయి. వీటిలో పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.965 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. బయోమాస్ బేస్డ్ పరిశ్రమల నుంచి 171.25 మెగావాట్లు, బగాస్సే పరిశ్రమల నుంచి 206.95 మెగావాట్లు చొప్పున విద్యుత్ వస్తోంది. వీటికి గతంతో 2019–20 నుంచి 2023–24 వరకు నిర్ణయించిన టారిఫ్ ప్రస్తుతం అమలులో ఉంది. టారిఫ్‌ను నిర్ణయించినప్పుడే వార్షిక ఇంధన ధర 5 శాతం పెరుగుదలతో లెక్కిస్తారు. ఈ లెక్కన 2023–24కి ఇంధన ధరలు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల యూనిట్‌కు రూ. 5.80, బగాస్సేకి యూనిట్ రూ. 3.82 చొప్పున అమలు చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన ధరలను ఆమోదించాలని లేదా 2023–24కి ఆమోదించిన అదే ధరలను కొనసాగించాలని డిస్కంలు మండలిని కోరాయి. పరిశ్రమల నిర్వాహకులు ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వెల్లడించాలనుకుంటే దానికి కూడా కమిషన్ అవకాశం కల్పించింది. కరోనా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, దానికి తోడు డీజిల్ ధరలు భారీగా పెరిగినందున ఖర్చులు విపరీతంగా ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు ఏపీఈఆర్సీకి మొరపెట్టుకున్నారు. తాము కోలుకోవాలంటే యూనిట్ విద్యుత్‌ను కనీసం రూ. 8 నుంచి రూ. 15కు విక్రయించేలా అనుమతించాలని కోరారు. కానీ దానికి డిస్కంలు అంగీకరించలేదు. దీంతో దాదాపుగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలకే 2024–29 నియంత్రణ కాలానికి ఏపీఈఆర్సీ అంగీకారం తెలిపింది. -
ఆ పోస్టులకు 65 ఏళ్ల వారూ అర్హులే!
సాక్షి, అమరావతి: రాజు తలచుకుంటే ‘దెబ్బల’కు కొదవా అన్న నానుడికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల కోసం క్యూ కట్టేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో.. తమకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించేందుకు.. గతంలో ఉన్న నిబంధనలను సైతం అడ్డగోలుగా మార్చేస్తున్నది. తాజాగా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సంబంధించి, ఇన్నాళ్లూ గరిష్ట వయసు పరిమితి 62 ఏళ్లుగా ఉండేది. అయితే ఇకపై 65 ఏళ్ల వయసు వారు కూడా ఆ పదవులకు అర్హులేనంటూ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలకు కూడా తాజా నిబంధన వర్తిస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైనవారు.. రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్చరించింది. వారి స్థానంలో తమ వారిని, భారీగా ముడుపులు ఇచ్చే వారిని నియమించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో కీలక పోస్టుల్లో ఉన్న కొందరిని బలవంతంగా బయటకు పంపించారు. వారిలో ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోనిరాజు ఉన్నారు. వీరి తరువాత పదిమంది డైరెక్టర్ల చేత గత జూలైలో రాజీనామాలు చేయించారు. కూటమి నేతలు ఆ పోస్టులకు ఇప్పటికే రూ.కోట్లలో బేరాలు మొదలు పెట్టారు. అయితే తామనుకున్నది చేసేందుకు, తాము కోరుకున్నవారిని నియమించేందుకు వయసు అడ్డు రావడంతో దానిని సవరించారు. మూడేళ్లు పెంచేసుకుని, అరవై ఐదేళ్లు ఉన్నవారికీ అవకాశం కల్పించేలా కొత్త జీవో రూపొందించారు. గతంలో విద్యుత్ సంస్థల్లో చీఫ్ జనరల్ మేనేజర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ల పోస్టులకు పోటీ పడుతున్నారు. ఎలాగైనా కూటమి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి కోసమే కొత్తగా ఈ వయసు పెంపుదల అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కరెంటుపై బాబు కథ తప్పే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్ అందించడంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం బయటపడింది. ఉచిత విద్యుత్‌ను ఆపాలన్న దురాలోచనతో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో వైఎస్ జగన్ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందంపై దుష్ప్రచారానికి తెరతీసింది. సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో సెకీ ఒప్పందాన్ని తప్పుబడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారు. సెకీ విద్యుత్ తీసుకుంటే జనరల్ నెట్వర్క్ యాక్సెస్ (జీఎన్ఏ) నిబంధనల ప్రకారం రూ.3 వేల కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకూ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు (ఐఎస్టీఎస్) చెల్లించాల్సి వస్తుందని నమ్మించాలనుకున్నారు. కానీ ఆయన చెప్పినదంతా అబద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా కంపెనీ ద్వారా అంతర్రాష్ట్ర చార్జీలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం స్పష్టంగా చెప్పింది.వంద శాతం మినహాయింపుసెకీతో ఒప్పందమే పెద్ద భారమైనట్టు, ఓ నేరమైనట్టు సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పుకొచ్చారు. ఐఎస్టీఎస్ చార్జీలపై అపోహల నేపథ్యంలో ఈ నెల 2న కర్నూలులో జరిగిన సదరన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఫోరం (ఎస్ఈఆర్ఎఫ్) సమావేశంలో, ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన వర్కింగ్ గ్రూప్ భేటీలోనూ ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జున రెడ్డి చర్చించారు. నిపుణుల అభిప్రాయాలు, చట్టాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం సెకీ విద్యుత్‌పై ఐఎస్టీఎస్ చార్జీల నుంచి వంద శాతం మినహాయింపు పొందవచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. తద్వారా 25 సంవత్సరాల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. దీని విలువ చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే దాదాపు రూ.3,500 కోట్లు.తక్కువ ధరతోనూ రూ.3,750 కోట్లు ఆదాసెకీ నుంచి 2024 సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉండగా, సెకీ విద్యుత్ యూనిట్ రూ.2.49 కే వస్తోంది. ఎన్టీపీసీ సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 కన్నా కూడా ఇది తక్కువ. దీనిద్వారా ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది.చీకటి రోజుల నుంచి రైతులకు విముక్తిగతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పంటలకు నీరు పెట్టుకోవడం కోసం మీటర్లు వేసుకొనేందుకు రైతులు అర్ధరాత్రివేళ పొలాలకు వెళ్లి, విద్యుత్ షాక్‌కు, పాము కాట్లకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం విముక్తి కలిగించింది. వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించింది. దాంతోపాటు రానున్న 30 ఏళ్లలో వ్యవసాయానికి ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా సౌర విద్యుత్ సమకూర్చే చర్యలు చేపట్టింది. అది కూడా ప్రైవేటు నుంచి కాకుండా, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని రైతులకు ఉచితంగా అందించాలని సంకల్పించింది. సెకీతో ఒప్పందం అనంతరం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం అన్ని రకాల విద్యుత్‌ను కొనేందుకు అనుమతి ఉన్న డిస్కంలు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు పొందలేవు. దీనిని ముందే గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా కంపెనీని ఏర్పాటు చేసింది.నష్టం తెచ్చిందే టీడీపీవాస్తవంగా విద్యుత్ రంగాన్ని నష్టాలపాలు చేసిందే గత చంద్రబాబు ప్రభుత్వం. అప్పట్లో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54), బాబు ప్రభుత్వం ఏకంగా యూనిట్ రూ.6.99కు కొనేలా ఒప్పందాలు చేసుకుంది. పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి ఒప్పందాలు చేసుకుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యం మేరకు పవన విద్యుత్ ఒప్పందాలు నామినేషన్ ప్రాతిపదికనే జరిగాయి. పోటీ బిడ్డింగ్ ద్వారా కాదు. దీనివల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో దుబారా, దోపిడీని అరికట్టి కరెంటు కొనుగోళ్లు, ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ.4,925 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. సెకీతో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. -
ఇంధన సర్దు‘బాదుడు’కు బ్రేక్ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) వసూలు చేసేందుకు ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎన్పిఈసీఎల్/టీజీఎస్పీడీసీఎల్) చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తోసిపుచ్చింది. ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ 2023 జనవరి 18న ఈఆర్సీ జారీ చేసిన మూడో సవరణ నిబంధనలు–2023ను డిస్కంలు అమలుపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2023– 2024 ఆర్థిక సంవత్సరంలోని నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు అనుమతి కోరుతూ డిస్కంలు దాఖలు చేసిన పటిషన్లకు విచారణ అర్హత లేదని తిరస్కరిస్తూ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.2023 ఏప్రిల్–జూన్, 2023 జూలై–సెప్టెంబర్, 2023 అక్టోబర్–డిసెంబర్, 2024 జనవరి–మార్చి త్రైమాసికాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు రెండు డిస్కంలు చెరో నాలుగు పిటిషన్లు దాఖలు చేయగా, అన్నింటినీ ఈఆర్సీ కొట్టి వేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగదారుల నుంచి ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరడం ఇదే తొలిసారి. ఎందుకు తిరస్కరించిందంటే..? నిబంధనల ప్రకారం.. N నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను N+2 వ నెలకు సంబంధించిన బిల్లుతో కలిసి N+3వ నెలలో డిస్కంలు జారీ చేయాలి. N+2 నెల 15వ తేదీలోగా ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను డిస్కంలు తమ వైబ్సైట్లో ప్రకటించాలి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు ఆ తర్వాతి మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. డిస్కంలు ఒక నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించి సంబంధిత నెల ముగిశాక 45 రోజుల్లోగా దిన పత్రికల్లో యాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను అనుమతించరు. విద్యుత్ బిల్లుల్లో ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతోపాటు వసూలైన ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదిస్తుంది. యూనిట్ విద్యుత్‌కు గరిష్టంగా 30పైసల వరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒకవేళ ఎఫ్ఎస్ఏ చార్జీలు యూనిట్‌కి 30పైసలకు మించితే ముందస్తు అనుమతి లేకుండా ఆపైన ఉండే అదనపు చార్జీలు విధించడానికి వీలులేదు. 30 పైసల సీలింగ్‌కు మించి ఎఫ్ఎస్ఏ చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఈఆర్సీ నుంచి ముందస్తు అనుమతి పొందాలి. ఈ నిబంధనలను పాటించకపోవడంతో ఎఫ్ఎస్ఏ చార్జీల వసూలు చేసేందుకు ఉత్తర/దక్షిణ తెలంగాణ డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తాజాగా తిరస్కరించింది. కేంద్రం నిబంధనల ఆధారంగా ఇంధన/ విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమెటిక్‌గా విద్యుత్ బిల్లుల్లో బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్లా) రూల్స్ 2021ను అమల్లోకి తెచ్చింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా ఎక్కువ కావడంతో ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలు తీసుకొచ్చింది. దీని ఆధారంగానే గతేడాది ఈఆర్సీ ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఆధునీకరణవైపు వేగంగా డిస్కంల అడుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల ఆధునీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్)ల్లో పనుల వేగవంతానికి రాష్ట్ర ఇంధన శాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్ పంపిణీ, సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, ప్రస్తుత వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రీవాంప్డ్ డి్రస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఉపయోగపడుతుంది. పాత నెట్‌వర్క్‌ను పునర్వ్యవస్థీకరించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. ఈ పథకంలో ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థను బాగుచేసి, కొత్త పరికరాలతో ఆధునీకరించేందుకు ప్రణాళికలను ఇప్పటికే అధికారులు రూపొందించారు. దీనివల్ల వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త కొత్తగా కరెంట్ వ్యవస్థ విద్యుత్ ప్రమాదాలు జరగడానికి, విద్యుత్ సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కావడమే ప్రధాన కారణమవుతుంది. ఆర్డీఎస్ఎస్లో భాగంగా వాటిని గుర్తించి లోడ్ సరిచేస్తారు. ఒకే ఫీడర్పై వ్యవసాయ, ఇతర సర్వీసులు ఉన్న చోట వాటిని వేరు చేసి, వ్యవసాయానికి ప్రత్యేక లైన్లు అందుబాటులోకి తెస్తారు. తద్వారా వ్యవసాయ బోర్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. గృహాలకు నిరంతర సరఫరాకు విఘాతం రాకుండా ఉంటుంది. అదే విధంగా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను బాగుచేయడానికి కూడా ఇందులో నిధులు కేటాయించారు. మొదటి దశలో రాష్ట్రంలో 30 శాతం ఓవర్ లోడ్ అయిన ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను సరిచేసి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం, 33కేవీ, 11కేవీ, ఎల్టీ లైన్లలో 200 కిలోమీటర్ల మేర పాత కండక్టర్లు మార్చడం, సాంకేతిక సంబంధిత (ఐటీ) పనులు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం వంటి పనులను డిస్కంలు చేపడుతున్నాయి. ఏడాదిన్నరలోపే పెట్టుబడి వెనక్కి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల జీవితకాలం 25 ఏళ్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వినియోగ సమయం పెరిగేకొద్దీ కోర్ సాచురేషన్, వైండింగ్ ఇన్సులేషన్ డ్యామేజ్, ఆయిల్ నాణ్యత లోపించడం కారణంగా ట్రాన్స్ఫార్మర్లలో నష్టాలు పెరుగుతాయి. పాత ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయటం వల్ల సమస్యలు తగ్గుతాయి. స్టార్‌రేటెడ్ ట్రాన్స్ఫార్మర్ల వినియోగం ద్వారా సుమారు 20 నుంచి 25 శాతం మేరకు సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి ఏడాదిన్నరలోపే వెనక్కి వస్తుంది. నాణ్యమైనవి కొనడం వల్ల ఇతర డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లతో పోల్చితే ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. వచ్చే ఏడాదికల్లా మొదటిదశ పూర్తి ఆర్డీఎస్ఎస్ పథకం తొలి దశలో పాతవైపోయిన పవర్ ట్రాన్స్ఫార్మర్లు,డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, బ్రేకర్లు మార్చడం ద్వారా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లు విభజన, తుపాను ప్రభావిత ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు, స్మార్ట్ మీటర్లు టెండర్ల ప్రక్రియను దశల వారీగా చేపట్టి, పనులను సంబంధిత గుత్తే దారులకు అప్పగించారు. రెండవ దశ విద్యుత్ వ్యవస్థ ఆధునికరణకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తనిఖీ కోసం డిస్కంలు పంపించాయి. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారు చేసి డిపార్ట్మెంటల్ రివ్యూ కమిటీ (డీఆర్సీ), రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం కోసం ఇంధన శాఖకు పంపుతాయి. ఆర్డీఎస్ఎస్ పనులను డిస్కంలు నిరీ్ణత సమయంలో పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వ గ్రాంటు లభిస్తుంది. మొదటి దశ పనులు ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేయడానికి 2025 వరకూ గడువు ఉంది. -
‘సెకీ’ ఒప్పందానికి ‘ఏపీఈఆర్సీ’ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో చేసుకున్న త్రైపాక్షిక (ట్రై పార్టీ) ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 3 వేల మెగావాట్లు, 2025 అక్టోబర్ నుంచి మరో 3 వేల మెగావాట్లు, 2026 అక్టోబర్ నుంచి మరో వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ నుంచి మూడు విడతల్లో మొత్తం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం, మూడు డిస్కంలు 2021 డిసెంబర్ 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి. సోలార్ పవర్ డెవలపర్లు రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల నుంచి ఈ విద్యుత్ సేకరణ కోసం లెవలైజ్డ్ టారిఫ్ 25 సంవత్సరాలకు ట్రేడింగ్ మార్జిన్‌తో సహా యూనిట్‌కు రూ.2.49 చొప్పున చెల్లించేందుకు కూడా ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈ సేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీంతో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం సెకీ ద్వారా సౌర విద్యుత్ కొనుగోలుకు చట్టబద్ధంగా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. ఒప్పందంతో ప్రయోజనాలు ఇలా రాత్రనక, పగలనకా రైతులు పొలాల్లో విద్యుత్ కోసం పడిగాపులు కాస్తూ, ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. వ్యవసాయానికి విద్యుత్‌ను తమ హక్కుగా రైతులు భావించేలా చర్యలు చేపడుతూ, రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూరుస్తోంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కాకుండా, వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని 2024 నుండి దాదాపు 19 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక డిస్కమ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ద్వారా ఈ విద్యుత్తు అందించాలని నిర్ణయించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. అదే రాష్ట్రంలోని యూనిట్ల నుంచి విద్యుత్తు తీసుకొంటే సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు 25 సంవత్సరాలు చెల్లించాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టులు కడితే వాటికి విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు దానికి కావలసిన అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య తేడా ఉంటుంది. ప్రాథమికంగా ఇప్పుడు ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్ధ్యాన్ని బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువ అవుతుంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ, ఆ ప్రతిపాదన విరమించుకొని సెకీ ప్రతిపాదనకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. -
కరెంట్ కొంటారా .. లేదా ?
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్‌కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది. రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్‌కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది. శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. -
అర్హతగల ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అప్సడా కో వైస్ చైర్మన్ వడ్డి రఘురాం స్పష్టంచేశారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆక్వా సాధికారికత కమిటీ సమావేశం జరిగింది. ఇటీవల ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్ కన్‌క్షన్లకు మార్చి ఒకటో తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో 4,68,458 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దానిలో 3,33,593.87 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్నట్టుగా ఈ–ఫిష్ సర్వే ద్వారా నిర్ధారించినట్లు మంత్రులు తెలిపారు. మొత్తం 66,993 విద్యుత్ కనెక్షన్లలో ఇప్పటికే ఆక్వా జోన్ పరిధిలో అర్హత పొందిన 50,605 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తుండగా, తాజాగా కమిటీ ఆమోదంతో ఆ సంఖ్య 54,072కు పెరిగిందన్నారు. ఆక్వా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా రూ.3,306.5 కోట్లు విద్యుత్ సబ్సిడీని డిస్కమ్‌లకు చెల్లించిందన్నారు. తాజాగా అర్హత పొందిన కనెక్షన్లకు ఏటా రూ.55 కోట్లు అదనపు భారం పడనుందన్నారు. ఆక్వా రైతాంగానికి అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నాణ్యమైన సీడ్ సరఫరా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వడ్డీ రఘురాం చెప్పారు. ఇక నుంచి అప్సడా అనుమతి పొందిన తర్వాతే విదేశాల నుంచి బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకోవాలని, అలా చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందేవారిలో అర్హులను గుర్తించి సబ్సిడీ వర్తింపజేసేందుకు మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. ఏపీలోనే వంద కౌంట్ రూ.245 ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల ద్వారా ప్రకటిస్తూ, దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు వివరించారు. వంద కౌంట్ రొయ్యలకు కేజీకి రూ.245 ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోందన్నారు. గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటు రైతుకు దక్కుతోందన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు గోపాలకృష్ణ ద్వివేది, నీరబ్‌కుమార్ ప్రసాద్, కె.విజయానంద్ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్
సాక్షి, అమరావతి:విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా దేశవ్యాప్తంగా 19.79 కోట్ల విద్యుత్ సర్వీసులు, 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్), 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్ లేదా స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది. ఈ మేరకు మీటర్ల బిగింపు, అమలు ప్రక్రియపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) జారీ చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంతమేర విద్యుత్ వాడుతున్నారో ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ముందుగా చెల్లించి రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ మొత్తం అయిపోగానే వినియోగదారుల మొబైల్‌కు మూడుసార్లు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలి. ప్రతి కస్టమర్‌కు రూ.300 అరువు ఇచ్చేలా.. ప్రతి వినియోగదారునికీ గరిష్టంగా రూ.300 క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్‌ను వాడుకునే వెసులుబాటు కల్పించాలి. ముందుగా చెల్లించిన రూ.1,000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్ చేసుకునేలా తొలి సందేశం పంపాలి. రీచార్జ్ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్‌గా ఇచ్చిన రూ.300 కరెంట్‌ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి ఆ తరువాత విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (డిస్కనెక్ట్) కేంద్రం సూచించింది. వినియోగదారులు మళ్లీ రీచార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించాక మొబైల్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేయాలని, వినియోగదారులు ఈ యాప్ ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొంది. అంటే విద్యుత్ అవసరం లేనప్పుడు మీటర్‌ను ఆఫ్ చేసుకోవడం ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొదలైన ప్రక్రియ విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని మూడు డిస్కంలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ సర్వీసులకు, వాణిజ్య, పరిశ్రమలు, గృహæ విద్యుత్ సర్వీసులకు ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. మొదటి విడతలో దక్షిణ డిస్కం పరిధిలో 6.19 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 2.56 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను ఏర్పాటు చేయనుండగా.. మధ్య డిస్కం పరిధిలో 7.23 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.09 లక్షల త్రీ ఫేజ్ మీటర్లు అమర్చనున్నారు. తూర్పు డిస్కం పరిధిలో 6.09 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.15 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను అమర్చనున్నారు. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదే. ఈ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార (టైం అప్డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్ పీక్ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకునే అవకాశం ఉంది. -
దేశంలో టాప్–10లో ఏపీ డిస్కంలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నాయి. తాజాగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) ప్రకటించిన టాప్ 62 డిస్కంల జాబితాలో ఏపీ డిస్కంలు జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచి ‘ఏ’ గ్రేడ్ సాధించాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, కె.సంతోషరావులు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టు రోజువారీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతల్లేకుండా అందిస్తూ ఏపీ రికార్డులు సృష్టిస్తోంది. దేశ సగటు విద్యుత్ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్‌ను అందిస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన వినియోగదారుల సేవా రేటింగ్ 2022–23 నివేదిక ప్రకారం.. జాతీయ సగటు విద్యుత్ సరఫరా పట్టణ ప్రాంతాల్లో 23.59 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 21.26 గంటలుగా ఉంది. కానీ మన రాష్ట్రంలో పట్టణాల్లో 23.85 గంటలు, గ్రామాల్లో 23.49 గంటల పాటు సరఫరా అందిస్తున్నారు. జాతీయ సగటు అంతరాయ సూచికతో పోల్చితే మన డిస్కంలలో సగానికంటే తక్కువగా ఫీడర్ అంతరాయాలు నమోదవుతున్నాయి. సేవలకు దక్కిన గుర్తింపు ఏడాదిలో ఈ జాతీయ సగటు అంతరాయ సూచిక 200.15 కాగా, ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఎస్పీడీసీఎల్)లో 42, ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్)లో 79.68, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీసీపీడీసీఎల్)లో 103.86 చొప్పున పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఫీడర్‌కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీ) వైఫల్యం రేటు 2.01 శాతం మాత్రమే ఉంది. దీని జాతీయ సగటు 5.81 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంతే కాకుండా 2017–18లో డిస్కంల పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉంటే అవి 2022–23లో 5.31 శాతానికి తగ్గాయి. కొత్త సర్వీసులకు వంద శాతం మీటరింగ్ పూర్తి చేయడంతో పాటు రిపేర్ వచ్చిన వాటి స్థానంలో త్వరితగతిన కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మాన్యువల్ జోక్యం లేకుండా ఇన్ఫ్రారెడ్(ఐఆర్) పోర్ట్ ద్వారా విద్యుత్ బిల్లులు రీడింగ్ తీస్తున్నారు. అలాగే వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు బిల్లింగ్ హెచ్చరికలు పంపిస్తూ ఆలస్య చెల్లింపుల జరిమానాలు పడకుండా వారిని అప్రమత్తం చేయడం వంటి చర్యలను కేంద్రం తన అధ్యయనంలో పరిగణనలోకి తీసుకుంది. ఆపరేషన్, విశ్వసనీయత, రెవెన్యూ కనెక్షన్లలో చేసిన కృషి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి తీసుకున్న చర్యలు, మీటరింగ్, బిల్లింగ్, తప్పులను సరిదిద్దడం, ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఈ క్రమంలో సాధించిన విజయాల ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏపీ డిస్కంలకు టాప్ టెన్‌లో స్థానం కల్పించింది. -
గిరిజన గృహాల్లో విద్యుత్ వెలుగులు
సాక్షి, అమరావతి: అడవులు, కొండల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి గిరిజన గృహానికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ.140 కోట్లను వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెలలో రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని గిరిజన గ్రామాలపై అధ్యయనం చేశాయి. అడవులు, కొండ ప్రాంతాల్లోని గిరిజనుల గృహాలకు విద్యుత్ లైన్లు వేయడానికి సాంకేతికంగా, ఆర్థికంగా ఉన్న సాధ్యాసాధ్యాలను వీరు అధ్యయనం చేశారు. గిరిజనుల నుంచి ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నంద్యాల జిల్లాలో 213 గిరిజన ఆవాసాల విద్యుదీకరణకు రూ.5 కోట్లు కేటాయించింది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.24 కోట్లతో 1982 గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సర్విసులు అందిస్తోంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ.33.49 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. ఇంకా ఏవైనా విద్యుత్ అందని గిరిజన గృహాలను కూడా డిస్కంలు గుర్తిస్తున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల విద్యుదీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎంజేఏఎన్ఎంఏఎన్) పథకానికి కూడా మన రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం ద్వారా విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం కాని ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అర్హులైన గిరిజన లబ్దిదారులందరికీ ప్రభుత్వం సబ్సిడీతో నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలు, ట్రూ–అప్, ఎఫ్‌ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్టీ వినియోగదారుల రాయితీ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి ఉండేది. 100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల సర్విసులకు విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 200కు పెంచింది. ఎస్టీల విద్యుత్ సబ్సిడీ గత ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగింది. దీంతో సర్వీసులూ పెరిగాయి. 5 లక్షలకు పైగా ఎస్టీ కుటుంబాలకు ఇప్పుడు ఉచిత విద్యుత్ అందుతోంది. ప్రతి ఆవాసానికీ విద్యుత్ ఈపీడీసీఎల్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ సదుపాయం లేని 271 గిరిజన మారుమూల హాబిటేషన్స్ను గుర్తించాం. 4944 గిరిజన కుటుంబాలకు విద్ద్యుదీకరణ చేయడానికి రూ.29.96 కోట్లతో గతంలో ప్రతిపాదనలు రూపొందించాం. తాజాగా 1,474 గిరిజన ఆవాసాల్లో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ. 33.49 కోట్లతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఇంకా విద్యుదీకరణ చేయని 245 హాబిటేషన్స్లో 1,544 గృహాల విద్యుదీకరణకు పాడేరు డివిజన్లోని గిరిజన ప్రాంతాల్లో సర్వే చేశాం. ప్రతిపాదనలు కూడా రూపొందించాం. –ఎల్ మహేంద్రనాథ్, ఎస్ఈ, విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ -
డిస్కమ్‌ల డైరెక్టర్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లోని డైరెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. వారి తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ రిజ్వీ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు 2012లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌ల సీఎండీలను ఆయన ఆదేశించారు. దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 11 డైరెక్టర్లు కొనసాగుతున్నారు. ఈ 11 మందిలో కేవలం ఇద్దరు డైరెక్టర్లు టి.శ్రీనివాస్ (డైరెక్టర్, ప్రాజెక్ట్స్), టీఎస్ఎన్పీడీసీఎల్ వెంకటేశ్వరరావు (డైరెక్టర్ హెచ్ఆర్) మాత్రమే 2013లో నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్లుగా నియామకమయ్యారని పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిదిమంది డైరెక్టర్లు ఆరేళ్ల క్రితం ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియామకమయ్యారని ఆ ఉత్తర్వుల్లో రిజ్వీ స్పష్టం చేశారు. తొలగించిన ఆ 11మంది ఎవరెవరంటే.. సోమవారం తొలగించిన 11 మంది డైరెక్టర్లలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలోని జె, శ్రీనివాస్‌రెడ్డి(ఆపరేషన్స్), శ్రీనివాస్(ప్రాజెక్ట్స్), కె.రాములు(కమర్షియల్, ఎనర్జీ ఆడిట్), జీ. పార్వతం(హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు(ప్రణాళిక, నిర్వహణ), ఎస్,స్వామిరెడ్డి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ), గంపా గోపాల్(ఎనర్జీ ఆడిట్).. కాగా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో బి. వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), పి. సంధ్యారాణి (కమర్షియల్), పి. గణపతి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ) ఉన్నారు. కొత్త డైరెక్టర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ.. ఇంటర్వ్యూలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త డైరెక్టర్లను నియమించనున్నట్లు సమాచారం, ఇప్పటికే జెన్కో, ట్రాన్స్‌కోలో డైరెక్టర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం విదితమే. ఇప్పుడు పంపిణీ సంస్థల డైరెక్టర్లకు కూడా ఉద్వాసన పలకడం ద్వారా విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లయింది. ఏళ్ల తరబడి డైరెక్టర్లుగా వాళ్లే కొనసాగడం వల్ల విద్యుత్ సంస్థల్లో పురోగతి లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నప్పటికీ.. నష్టాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వాళ్లు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా రూ.వేల కోట్లలో నష్టాలు పేరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలున్నాయి, కాగా, వచ్చేనెలలో ఈ డైరెక్టర్ల పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
డిస్కంలకు రూ.58,981 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.17,102 కోట్ల విద్యుత్ సబ్సిడీల తోపాటు మరో రూ.40,981 కోట్ల ప్రభుత్వ విద్యుత్ బిల్లుల బకాయిలు (హెచ్టీసీసీ) కలిపి మొత్తం రూ.58,684.17 కోట్లను 2024–25 బడ్జెట్లో కేటా యించాలని ఇంధనశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదించింది. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023– 24లో డిస్కంలకు రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సి డీని మంజూరు చేయగా దాన్ని రూ.17,120 కోట్లకు పెంచాలని ఇంధన శాఖ కోరింది. అందులో టీఎస్ ఎస్పీడీసీఎల్కు రూ.3,654.51 కోట్లు, టీఎస్ఎన్పీ డీసీఎల్‌కు రూ.14,048 కోట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ఇప్ప టికే అందిస్తున్న రాయితీలను కొనసాగించడంతో పాటు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను 2024–25లో ప్రారంభించడానికి రూ. 17,120 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. ప్రతి పాదిత సబ్సిడీలో రూ. 4 వేల కోట్లు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించినవేనని అధికార వర్గాలు తెలిపాయి. రూ. 17,120 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా వచ్చే ఏడాది కొంత మొత్తంలో విద్యుత్ చార్జీలను పెంచకుంటే డిస్కంల నష్టాలు మరింతగా పెరిగి పోతాయని అధికారులు తెలిపారు. సర్కారీ బకాయిలు రూ.40 వేల కోట్లు ఇవ్వండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి వివిధ శాఖలు, విభాగాల నుంచి డిస్కంలకు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.28,842.72 కోట్లకు పెరిగాయని పేర్కొంటూ ఇటీవల విద్యుత్‌పై ప్రవేశ పెట్టిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి న ఇతర విద్యుత్ బిల్లుల బకాయిలు కలిపి మొత్తం రూ.40,981 కోట్లను డిస్కంలకు 2024–25లో చెల్లించాలని ఇంధన శాఖ ప్రభుత్వాన్ని కోరింది. రూ.17,120 కోట్ల సబ్సిడీ, రూ.40,981 కోట్ల పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ.58,684.17 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని కోరడం గమనార్హం. -
మన డిస్కంలు ‘ఏ’ గ్రేడ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో ఏపీలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్రానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. డిస్కంల పనితీరును అంచనా వేసి, వినియోగదారులకు తమ డిస్కం అందిస్తున్న సేవల నాణ్యత గురించి తెలియజేసేందుకు ఆర్ఈసీ అధ్యయనం చేపట్టింది. ‘కన్స్యూమర్ సర్విస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ 2022–23’ పేరుతో ఆ నివేదికను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఏపీలో 1.92 కోట్ల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలకు ఏ–గ్రేడ్ లభించింది. దేశంలోని 62 డిస్కంలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేసినట్లు ఆర్ఈసీ పేర్కొంది. అధ్యయనంలో భాగంగా డిస్కంలను జనరల్, అర్బన్, ప్రత్యేక వర్గంగా విభజించారు. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి, వారు చెప్పిన దాని ప్రకారం స్కోర్ ఇచ్చారు. ఆ స్కోర్ ఆధారంగా ‘ఏ+, ఏ, బి+, బి, సి+, సి, డి+, డి’ అంటూ 7 విభాగాల్లో వినియోగదారుల సేవా రేటింగ్లను కేటాయించారు. ఈ 3వ ఎడిషన్‌లో కేవలం 4 డిస్కంలు మాత్రమే ‘ఏ+’ గ్రేడ్ సాధించాయి. ‘ఏ’ గ్రేడ్‌లో ఏపీతోపాటు 8 రాష్ట్రాల డిస్కంలకు స్థానం లభించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. ‘రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ దేశంలో అత్యుత్తమంగా నిలవగలుగుతున్నాం. ప్రభుత్వ ఆర్థక సాయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. వాటి ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచుకుని నష్టాలు తగ్గించుకుంటున్నాం’. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ ఆదర్శంగా నిలుస్తున్నాం ‘డిస్కంలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటోంది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించడంలో రాజీపడకుండా దేశంలో మరెక్కడా లేనంతగా రైతులకు విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. దీనికి రా>నున్న 30 ఏళ్ల వరకూ ఎలాంటి అవాంతరాలు రాకుండా సెకీతో 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.’ – ఐ.పృథ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ఫామ్‌హౌస్‌లపై విజిలెన్స్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఫామ్‌హౌస్‌ల ముసుగులో కరెంట్ చౌర్యానికి పాల్పడుతున్న అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలు, వాటిలోని విద్యుత్ బోర్లు, భారీ నిర్మాణాలు, రిసార్టులు, క్రీడా మైదానాలు, క్లబ్ హౌస్‌ల్లో విద్యుత్ విజిలెన్స్ బృందాలు తనిఖీలు ప్రారంభించాయి. వాటికి సరఫరా అవుతున్న కరెంట్‌పై ఆరా తీయడంతోపాటు వ్యవసాయం ముసుగులో కరెంట్ దోపిడీకి పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు సంస్థకు వాటిల్లిన నష్టాలను జరిమానా రూపంలో తిరిగి రాబట్టడమే కాకుండా ఆయా వినియోగదారులకు లోడును బట్టి మీటర్లు కూడా జారీ చేస్తున్నారు. సాగు ముసుగులో వ్యాపారాలు హైదరాబాద్ శివార్లలో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు పెద్దఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. వాటి చుట్టూ భారీ ప్రహరీలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది వాటిలో పండ్లు, కూరగాయలు, పూలతోటలు సాగు చేస్తుండగా, మరికొంత మంది ఫామ్‌హౌస్ పేరుతో విలాసవంతమైన భవనాలు నిర్మించి సినిమా షూటింగ్‌లు, బర్త్‌డే పార్టీలు, వీకెండ్ పార్టీలకు అద్దెకు ఇస్తున్నారు. మరికొంతమంది ఏకంగా రిసార్ట్లు, క్లబ్ హౌస్ లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు కల్పించిన ఉచిత విద్యుత్ సదుపాయా న్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కొంతమందైతే ఏకంగా బోర్ల నుంచి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా హోటళ్లు, వసతి గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు సరఫరా చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పంటసా గు ముసుగులో కరెంట్ చౌర్యానికీ పాల్పడుతున్నారు. ఫలి తంగా డిస్కం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతోంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే.. గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో మొత్తం 61,40,795 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 50,99,190 గృహ, 8,22,821 వాణిజ్య, 36,440 పారిశ్రామిక, 1,82,344 ఇతర (వ్యవసాయ కనెక్షన్లు రంగారెడ్డి జిల్లాలో 1,17,417 ఉండగా, మేడ్చల్‌లో 21,491 వరకు) కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2,500 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. వేసవిలో ఈ డిమాండ్ 3800 నుంచి 4000 మెగావాట్లు దాటుతోంది. అయితే డిస్కం సరఫరా చేస్తున్న విద్యుత్‌కు, మీటర్ రీడింగ్ నమోదు ద్వారా నెలవారీగా సంస్థకు వస్తున్న బిల్లులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇప్పటికే గృహ, వాణిజ్య కనెక్షన్లపై అంతర్గత తనిఖీలు చేపట్టిన డిస్కం తాజాగా వ్యవసాయ కనెక్షన్లపైనా ఆరా తీస్తోంది. దీంతో అధికారులు సర్కిళ్ల వారీగా విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేయిస్తున్నారు. డీఈకి షోకాజ్ నోటీసులు ఇటీవల డిస్కం సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫరూఖీ నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు అంతర్గత నష్టాలపై ప్రధానంగా దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లను పరుగెత్తించడంతో పాటు ఆయ న కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులకు స్పందించని ఇంజనీర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గచ్చిబౌలి డీఈ సహా పలువురు ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల ముసుగులో ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా పెద్ద మొత్తంలో బిల్లుల ఎగవేతకు పాల్పడిన యూనియన్లపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. డిస్కం సరఫరా చేస్తున్న ప్రతీ యూనిట్‌ను పక్కాగా లెక్కించేందుకు ఫీడర్లకు సెన్సర్లను ఏర్పాటు చేసే యోచనలో సీఎండీ ఉన్నట్లు సమాచారం. -
‘కరెంట్’ వడ్డన ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించడానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇచ్చిన గడువు జనవరి 2తో ముగియనుంది. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) అంచనాలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడువు పెంచాలని డిస్కంలు విజ్ఞప్తి చేయగా.. ఈఆర్సీ జనవరి 2 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించేందుకు కొత్త ప్రభుత్వం నుంచి డిస్కంలు ఇంకా అనుమతి పొందలేదు. దీంతో జనవరి 30వరకు మరోసారి గడువు పొడిగించాలని ఈఆర్సీని కోరేందుకు డిస్కంల యాజమాన్యాలు సిద్ధమైనట్టు తెలిసింది. టారిఫ్ ప్రతిపాదనల్లో ఏం ఉంటాయంటే..? 2024–25లో రాష్ట్రంలో మొత్తం ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది? అందుకు ఎన్ని రూ.వేల కోట్ల ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2024–25లో కొనసాగిస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ నిధులు ఎంత, ఇంకా ఎంత లోటు ఉంటుంది? ఆ లోటును పూడ్చుకోవడానికి 2024–25లో ఏయే కేటగిరీల వినియోగదారుల చార్జీలను ఎంతమేర పెంచాలన్న అంశాలు డిస్కంల ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా అభ్యంతరాలను సేకరించి, బహిరంగ విచారణ నిర్వహించి.. కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. రూ.30వేల కోట్లకు చేరిన ఆర్థిక లోటు 2022–23 నాటికి రాష్ట్రంలో డిస్కంల నష్టాలు రూ.62,461 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సగటున ప్రతి నెలా రూ. 1,386 కోట్లు లెక్కన మరో రూ.11,088 కోట్ల నష్టాలు వచ్చినట్టు ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో డిస్కంల నష్టాలు రూ. 73,549 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సిడీనే కొనసాగిస్తే.. 2024–25లో డిస్కంలకు కొత్తగా మరో రూ.16,632 కోట్ల నష్టాలు వస్తాయని అంచనా. నష్టాలను అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.31,632 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉండనుంది. లేకుంటే లోటును భర్తీ చేసుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తుంది. కొత్త సర్కారు ముందు సవాళ్లు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థల నిర్వహణ సవాలుగా మారింది. విద్యుత్ సబ్సిడీలను ఏటా రూ.30వేల కోట్లకు పెంచడం లేదా ఏ ఏడాదికా ఏడాది లోటు భర్తీ చేసుకోవడానికి చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదే విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతిస్తే విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన ఉంది. దీంతో టారిఫ్ ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉచితంగా 200 యూనిట్లపైప్రతిపాదనలు సిద్ధం కాంగ్రెస్ సర్కారు హామీ మేరకు ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసే అంశాన్ని 2024–25 టారిఫ్ ప్రతిపాదనల్లో చేర్చడంపై డిస్కంలు కసరత్తు పూర్తిచేశాయి. 200యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులు ఎందరు? వారికి ఉచిత విద్యుత్ కో సం అయ్యే వ్యయం ఎంత? అన్న గణాంకాలతో ప్రతి పాదనలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. ఈ పథకాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈఆర్సీ అనుమతిని కోరనున్నాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే.. ప్రభుత్వం అదనంగా రూ.3,500 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
విద్యుత్ రంగ అభివృద్ధికి రూ.13వేల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పరిధిలో దాదాపు రూ.13 వేల కోట్లను ‘ఆర్డీఎస్ఎస్’ ద్వారా వెచ్చిస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. విద్యుత్ సంస్థ (ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఎస్పీసీఎల్, డిస్కం)ల డైరీల ఆవిష్కరణ, ‘ఏపీసీపీడీసీఎల్’ 4వ వార్షికోత్సవం గురువారం నిర్వహించారు. విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో కొత్తగా దాదాపు 484 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని, 10 శాతానికి తీసుకుచ్చామని వివరించారు. ఇటీవల సీఎం జగన్ పలు సబ్స్టేషన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కృష్ణపట్నం 800 మెగావాట్ల యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్టీటీటీపీఎస్‌లో మరో 800 మెగావాట్లు ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 99.7 శాతం ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యతతో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీఎస్పీడీడీఎల్ సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ ఇన్చార్జ్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ మాజీ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్ బాబు, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
AP: బడుగుల భూముల్లో వెలుగుల పంట
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బలగం అప్పలనరసయ్య. ఊరు విజయనగరం జిల్లా కొండకరకం. బీసీ వర్గానికి చెందిన ఈయన తన రెండున్నరెకరాల పొలంలో సాగుకోసం పక్క రైతు నుంచి గంటల లెక్కన నీటిని అడిగి తెచ్చుకుని అందుకు తగ్గట్లుగా డబ్బులిచ్చేవాడు. ఆ భారాన్ని తట్టుకోలేక గతంలో విద్యుత్ సర్వీసు కోసం ఏళ్ల తరబడి ప్రయత్నించినా ఫలితంలేదు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసిన నెలన్నరలోనే కొత్త సర్వీసు మంజూరైంది. ఇప్పుడా రైతు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పగటిపూట నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్ వస్తోంది. దీంతో ఏడాది పొడవునా వరి, కాయగూరలు పండిస్తున్నాడు. ‘‘నీటికి లోటు లేకపోవడంతో గతం కంటే పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగాయి’’ అని ఆ రైతు కంటి నిండా ఆనందంతో చెబుతున్నాడు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్ : కొండా కోనల్లో ప్రకృతినే నమ్ముకుని జీవించే అడవి బిడ్డలు.. రాళ్లు, రప్పల్లో వర్షాలపై ఆధారపడి సాగు చేసుకునే బడుగు జీవులు తరతరాలుగా వెనుకబాటుతనంలోనే బతుకులీడుస్తున్నారు. ఇన్నేళ్లుగా వారిని పట్టించుకున్న వారే లేరు. ఇప్పుడు వీరి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతోంది. రోజు గడిస్తే చాలనుకున్న వారి కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చి ఉచిత విద్యుత్‌తో వారి ఇంట వెలుగులు నింపుతున్నారు. నిరాదరణకు గురైన వారిని తలెత్తుకుని జీవించేలా చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పగటి పూట ఉచితంగా తొమ్మిది గంటలు విద్యుత్‌ను అందిస్తుండటంతో కూలీలుగా ఉన్న వారు సైతం రైతులుగా మారుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 19.29 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వెనుకబడ్డ సామాజికవర్గాలకు వ్యవసాయ సర్వీసులు ఇవ్వడంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. దీంతో 2019 నుంచి ఇప్పటివరకూ 1.74 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు కొత్తగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశారు. పాత వాటితో కలిపి ఆయా వర్గాలకు చెందిన మొత్తం 5.02 లక్షల సర్వీసులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీంతో ఒకప్పుడు రాళ్లు, రప్పలకు నిలయమైన కొండలు నేడు పంట పొలాలతో పచ్చగా కళకళలాడుతున్నాయి. కూలీలుగా ఉన్న మేం రైతులుగా మారాం.. గతంలో నాకున్న ఐదున్నరెకరాల్లో వర్షాధారంగానే పంటలు పండించే వాళ్లం. మా గ్రామంలో అసలు బోర్లే ఉండేవి కావు. ఎక్కడైనా ఉన్నా అర్థరాత్రి బోర్ల దగ్గర జాగారం.. అయినా చేలు తడవక పంట చేతికొచ్చేది కాదు. జగనన్న ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే ఉచిత విద్యుత్ సర్వీసు ఇచ్చారు. ఇప్పుడు నాతో సహా అందరికీ విద్యుత్ సర్వీసులు రావడంతో కూలీలుగా ఉన్న మేమంతా రైతులుగా మారాం. గతంలో పంటకు పెట్టుబడి పెట్టిన తరువాత వానలు పడక నష్టపోయే వాళ్లం. ఇప్పుడు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తుండటంతో నీటికి కొదవేలేదు. దిగుబడులు బాగున్నాయి. – ఇజ్జిరోతు సూరప్పలనాయుడు, ఎస్సీ రైతు, రామతీర్ధం, విజయనగరం జిల్లా బాగుపడుతున్న బలహీన వర్గాలు.. వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగలా మార్చాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచే అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధికారులూ చర్యలు చేపడుతున్నారు. రానున్న 30 ఏళ్ల వరకూ ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ సర్వీసులకు నాణ్యమై విద్యుత్ సరఫరా అందించేందుకు, అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. దీంతో ముఖ్యంగా బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్‌వల్ల ప్రయోజనం చేకూరుతోంది. – ఐ.పృథ్వీతేజ్, జే పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, డిస్కంల సీఎండీలు ఒక్కో సర్వీసుపై సర్కారుకు రూ.1.20లక్షల ఖర్చు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు విద్యుత్ సర్వీసులతో పాటు ట్రాన్స్ఫార్మర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే సీఎం ఆదేశాల మేరకు 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇస్తున్నాం. బోరు దగ్గర విద్యుత్ సర్వీసుకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటుచేస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్వీసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. – మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, విజయనగరం సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ ఉచిత విద్యుత్ మా బతుకుల్ని మార్చేసింది.. భూమి ఉన్నా పండించుకునేందుకు నీరులేక నిరుపయోగంగా వదిలేయాల్సి వచ్చేది. కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. మా పరిస్థితిని ఉచిత విద్యుత్ మార్చేసింది. వ్యవసాయానికి విద్యుత్ కావాలని అడిగిన నెలరోజుల్లోనే అధికారులు సర్వీసును మంజూరు చేశారు. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నుంచి మా పొలంలో మేం వ్యవసాయం చేసుకుంటూ ఇంకొందరికి పని కల్పించే స్థాయికి వచ్చాం. – వోళ్ల పైడిరాజు, బీసీ రైతు, కొండకరకం గ్రామం, విజయనగరం జిల్లా దరఖాస్తు చేసుకున్న వెంటనే కనెక్షన్ ఇచ్చారు.. నాకు రెండెకరాల పొలం ఉంది. వరి, మొక్కజొన్న, కాయగూరల పంటలు సాగుచేస్తున్నాం. గతంలో వానొస్తేనే పంట పండేది. లేదంటే మా కుటుంబం మొత్తం పస్తులుండేది. మా లైన్‌మెన్‌ని అడిగితే ఉచిత విద్యుత్ సర్వీసు గురించి చెప్పాడు. దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్వీసు ఇచ్చారు. ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా, చేయూత వంటి సంక్షేమ పథకాలూ అందుతున్నాయి. ఈ ప్రభుత్వంవల్ల మా బతుకులు బాగుపడ్డాయి. – జమ్మాల తవిటిదొర, ఎస్టీ రైతు, కొరిసీల గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా -
ఆంధ్రప్రదేశ్: విద్యుత్ చార్జీలు పెంచం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) భారీ ఊరటనిచ్చాయి. వచ్చే ఏడాది ఏ వర్గం వినియోగదారులపైనా విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించాయి. రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ చార్జీల భారం వేయబోమని స్పష్టం చేశాయి. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యుత్ ప్రసార (ఏపీ ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2024–25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), 2024–2029 నియంత్రణ కాలానికి సంబంధించి నెట్వర్క్ ఆదాయ అవసరాల నివేదికలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ఇంధన శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తక్కువ ధరలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దానికి తగ్గట్టుగానే ఏఆర్‌ఆర్‌లలో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపుదలను ప్రతిపాదించలేదని వివరించింది. లోటు ఉన్నప్పటికీ భారం మోపబోం.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 74,522.67 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని డిస్కంలు అంచనా వేశాయి. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 12,321.58 మిలియన్ యూనిట్లు అవసరమని నివేదించాయి. మొత్తం మీద 83,118.13 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టాయి. విద్యుత్ ప్రసార నష్టాలు 2.6 శాతం, ఇంటర్ స్టేట్ నష్టాలు 0.9 శాతం, పంపిణీ నష్టాలు 6.84 శాతం, మొత్తం ట్రాన్స్మిషన్ అండ్ డి్రస్టిబ్యూషన్ నష్టాలు 10.34 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశాయి. ఈ లెక్కన విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.39,017.60 కోట్లు అవుతుందని భావిస్తున్నాయి. అది కాకుండా ట్రాన్స్మిషన్ అండ్ లోడ్ డిస్పాచ్ ఖర్చు రూ.5,722.88 కోట్లు, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ధర రూ.9,514.42 కోట్లు, ఇతర ఖర్చులు రూ.2,321.13 కోట్లుగా పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. దీని ప్రకారం మొత్తంగా రూ.56,576.03 కోట్ల రాబడి అవసరమని నివేదించాయి. అయితే అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.42,697.92 కోట్లు మాత్రమే వస్తున్నాయని.. దీంతో రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని వివరించాయి. అయినప్పటికీ ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం ప్రజలపై చార్జీల భారం మోపాలనుకోవడం లేదని ఏపీఈఆర్సీకి డిస్కంలు నివేదించాయి. యధావిధిగా ఉచిత, రాయితీలు రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డిస్కంలకు తిరిగి చెల్లిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా డిస్కంలు దాదాపు రూ.11,800 కోట్ల రెవెన్యూ లోటుతో వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో డిస్కంలను ఆదుకోవడానికి రూ.10,135.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అలాగే ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా, తక్కువ స్లాబ్ గృహవినియోగదారులకు సబ్సిడీ, ఆక్వాకల్చర్ రైతులు, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు, పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్స్, సెలూన్లు, గోల్డ్ ప్లేటింగ్, రజక సంఘాలు మొదలైన వాటికి రాయితీలు వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నాయి. దీంతో డిస్కంలు వినియోగదారుల టారిఫ్‌లలో ఎలాంటి మార్పును ప్రతిపాదించలేదు. -
తక్కువ ధరకు వస్తుంటే ఎక్కువకు కొంటారా?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లపై కనీస అవగాహన లేకుండా ‘డిస్కంల మిగులు ఆట’ అంటూ ఈనాడు ఓ తప్పుడు కథనాన్ని ప్రజలపై రుద్దింది. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే.. ఖరీదు ఎక్కువ ఉన్న స్వల్పకాలిక కొనుగోలు ఒప్పందాల నుంచి తగ్గిస్తున్నారంటూ ఓ వింత కథ అల్లింది. డిస్కంలకు.. తద్వారా ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరే నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు వెల్లడించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ♦ రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యుత్ డిమాండ్ తగ్గింది. దానివల్ల స్వల్పకాలిక కొనుగోలు ఒప్పందాల నుంచి ఈ నెలలో రావాల్సిన విద్యుత్‌ను నిబంధనలకు అనుగుణంగా డిస్కంలు తగ్గించుకున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా వారం ముందు ప్రణాళికలో భాగంగా విద్యుత్ సేకరణ తగ్గించాయి. రోజువారీ, రియల్ టైం గ్రిడ్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి తగ్గితే రియల్ టైం మార్కెట్ నుంచి కొని లోడ్ షెడ్డింగ్ రాకుండా, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నాయి. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తిని ప్రతి నిమిషానికీ సర్దుబాటు చేస్తూ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ సూచనల ప్రకారం అవసరమైన సమయంలో మార్కెట్ నుండి విద్యుత్ సేకరిస్తున్నాయి. ♦దేశం మొత్తం డిమాండ్ తగ్గడంతో ప్రస్తుతం మార్కెట్లో విద్యుత్ ధరలు తగ్గాయి. యూనిట్ రూ.3 నుంచి రూ.4.50కే లభిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డిస్కంలు స్వల్పకాలిక ఒప్పందాల కొనుగోలు తగ్గించి, మార్కెట్ నుంచి అవసరానికి తగ్గట్టు కొంటున్నాయి. దీనివల్ల డిస్కంలకు ఆర్థిక లాభం చేకూరుతుంది. అంతేగానీ చేతిలో ఉన్న విద్యుత్‌ను వదిలేసి మార్కెట్ నుంచి కొనేందుకు డిస్కంలు పరుగులు పెట్టడం లేదు. చంద్రబాబు హయాంలోనే అనవసర ఒప్పందాలు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ బ్యాక్ డౌన్ చేసి అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. రాష్ట్రంలో 2015–16 మధ్య 642 మిలియన్ యూనిట్లు, 2016–17లో 12 వేల మిలియన్ యూనిట్లు, 2018–19లో 7,600 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండేది. రూ.2.40కు లభిస్తున్న బొగ్గు ఆధారిత ఈ మిగులు విద్యుత్‌ను బ్యాక్ డౌన్ (వృథా) చేసి ప్రైవేటు విద్యుత్ కొనుగోలును చంద్రబాబు ప్రోత్సహించారు. పవన విద్యుత్‌ను యూనిట్‌కు ఏకంగా రూ.4.84కు తీసుకున్నారు. ఫిక్స్డ్ చార్జీతో కలిపి ఈ ధర రూ.5.94 అయ్యేది. సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 కు బదులు రూ.8.90 వెచ్చించారు. ఇలా దాదాపు 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల ఏటా రూ.3,500 కోట్లు భారం ఇప్పటికీ పడుతోంది. -
డిస్కంల ప్రతిపాదనలపై రోత రాతలా?
గడచిన నాలుగేళ్లుగా విద్యుత్ కొనుగోళ్ల కోసం చేస్తున్న రుణాలకు ఏటా రూ. 420 కోట్ల నుంచి రూ. 650 కోట్ల వరకూ డిస్కం అదనంగా చెల్లిస్తోంది. ఇదేమీ కొత్తగా తీసుకున్నది కాదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. రూ. 1,468.98 కోట్లు ఆ ఐదేళ్లలో తీసుకున్నవే. సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి ఓ అబద్ధపు కథనాన్ని అచ్చేసింది. ‘విద్యుత్ వినియోగదారులపై వడ్డీ బాదుడు’ శీర్షికన మంగళవారం అభాండాలను రాష్ట్ర ప్రభుత్వంపై వేయాలని ప్రయత్నించింది. కానీ ఎప్పటిలాగే రామోజీ రాతల్లో వాస్తవాలు లేవని తేటతెల్లమైంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలకు, ఈనాడు కథనంలో అంశాలకు పొంతన లేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఐ.పృథ్వీతేజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ప్రజలపై భారం వేయడానికి కాదు సంప్రదాయ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా విద్యుత్ కొంటే పంపిణీ సంస్థకు దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విద్యుత్ వ్యయ చెల్లింపునకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం విద్యుత్ ఒప్పందాలు(పీపీఏ)కు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తోంది. దానికి బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఆ ఖర్చు డిస్కంలు భరిస్తున్నాయి. అదే బహిరంగ మార్కెట్లో రోజు వారీ లోటు విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు చెల్లింపు చేయాలి. దానికి డిస్కంల వద్ద తగినంత నగదు లేక పోవడం వల్ల బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకోవలసివస్తోంది. ఆ రుణాలపై వడ్డీలు కట్టవలసిన బాధ్యత కూడా డిస్కంలపై ఉంది. ఆ స్వల్పకాలిక రుణాలపై అయ్యే వడ్డీ మాత్రమే సంస్థ వార్షిక ఆదాయ వ్యయ (ఏఆర్ఆర్) నివేదికలో పొందుపరచాల్సిందిగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని ఏపీఈపీడీసీఎల్ కోరింది. అంతేకానీ ఈనాడు చెప్పినట్లు గత నాలుగేళ్లలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు చేసిన ఖర్చుపై వడ్డీ లెక్కించి, ఆ మొత్తాన్ని ప్రతి నెలా విద్యుత్ బిల్లుతో కలిపి వసూలు చేయడానికి కాదు. ఏపీఈఆర్సీకి చెప్పాల్సిందే విద్యుత్ పంపిణీ సంస్థల నిర్వహణకు సహేతుకంగా అయ్యే ఖర్చు మొత్తం నిబంధనల ప్రకారం ఈఆర్సీకి నివేదించాల్సిందే. వాటిపై కమిషన్ బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడిస్తుంది. అదేవిధంగా ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను వాడుకుంటున్నందుకు వీలింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అప్పులపై వడ్డీ, వీలింగ్ చార్జీలు వర్కింగ్ కేపిటల్ పరిధిలోకి వస్తాయి. అందువల్ల వీటిని కూడా వాస్తవ ఆదాయ వ్యయాల పద్దులో చేర్చాలని నివేదికలో డిస్కం పొందుపరిచింది. ప్రభుత్వం సక్రమంగానే ఇస్తోంది వివిధ సంక్షేమ పథకాలకు, వ్యవసాయ వినియోగానికి ప్రభుత్వం నుంచి డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ ప్రతినెల సకాలంలోనే వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిలకు ప్రతినెల సర్ చార్జీలు విధిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సరిపోవటం లేదనే వాదన వాస్తవం కాదు. అంతే కాకుండా విద్యుత్తు వినియోగదారుల నుంచి వసూలు చేసే సెక్యూరిటీ డిపాజిట్‌పై ప్రతి ఏటా మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రేట్ల ప్రకారం వడ్డీ మొత్తాన్ని వినియోగదారులకు డిస్కంలు చెల్లిస్తున్నాయి. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బు విద్యుత్తు కొనుగోలు అవసరాలకు సరిపోదు. -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్‌ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్‌ను ఐఈఎక్స్‌లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్‌లోనే విద్యుత్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్‌లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్‌లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్‌కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 99.6 శాతం సరఫరా
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏపీలోనే అధికంగా ఉందనడంలో వాస్తవం లేదని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ), డిస్కంలు స్పష్టం చేశాయి. ‘దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ కొరత అధికం’ శీర్షికతో ఆదివారం ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఎస్ఎల్డీసీ, డిస్కంలు ఖండించాయి. 20 సూత్రాల అమలు కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2022–23 ఆ ర్థిక సంవత్సరం విద్యుత్ సరఫరా గణాంకాలను ఉటంకిస్తూ ఈనాడు వార్తా కథనం ప్రచురించింది. అయితే గత ఆ ర్థిక సంవత్సరం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, 0.04 శాతం మాత్రమే సరఫరాలో లోటు ఉందని, ఇది కూడా స్థానికంగా ఏర్పడిన సాంకేతిక ఇబ్బందుల వల్లేనని డిస్కంలు పేర్కొన్నాయి. ఎస్ఎల్డీసీ, డిస్కంలు ఏం చెప్పాయంటే.. ఏపీలో వాస్తవ కొరత 0.4 శాతమే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం విద్యుత్ సరఫరాలో ఝార్ఖండ్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరంలో 20 సూత్రాల అమలు పథకంపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ డిమాండ్–సరఫరా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 93 శాతం మాత్రమే విద్యుత్ సరఫరా చేయగలిగింది. నాగాలాండ్ డిమాండ్‌లో 94 శాతం సరఫరా చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో మొత్తం ఏడాదిలో 915 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. 892 మిలియన్ యూనిట్లు సరఫరా చేసింది. 24 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. దీంతో ఆ రాష్ట్రం 98 శాతం విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వార్షిక నివేదికలో పేర్కొంది. రాజస్థాన్‌లో గత ఆ ర్థిక సంవత్సరం 1,01,801 మిలియన్ యూనిట్ల డిమాండ్‌కు గాను.. 1,00,057 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసింది. అంటే 1,745 మిలియన్ యూనిట్ల సరఫరా లోటు ఏర్పడింది. మొత్తమ్మీద చూస్తే రాజస్థాన్ డిమాండ్‌లో 98 శాతం విద్యుత్ సరఫరా చేసింది. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్‌లో 98 శాతం మేరకు సరఫరా చేశాయి. కేంద్ర గణాంకాల ప్రకారం తెలంగాణలో 0.04 శాతం, కర్ణాటకలో 0.03 శాతం విద్యుత్ కొరత ఉంది. ఏపీలో కూడా వాస్తవ కొరత 0.4 శాతం మాత్రమే. విద్యుత్ డిమాండ్‌లో తెలంగాణ 99.96 శాతం, కర్ణాటక 99.97 శాతం, తమిళనాడు 99.93 శాతం, ఆంధ్రప్రదేశ్ 99.56 శాతం విద్యుత్ సరఫరా చేశాయి. -
భవిష్యత్ వెలుగులకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగినట్లుగా భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేయకపోతే అకస్మాత్తుగా తలెత్తే దుష్పరిణామాలు అంధకారంలో ముంచేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)ను రూపొందించాయి. రానున్న పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేశాయి. పెట్టుబడులు ఎంత పెట్టాలనే దానిపై లెక్కలుగట్టాయి. దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి నివేదికలు సమర్పించాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో), ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇచ్చిన ఈ నివేదికలపై శనివారం ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టనుంది. నిజానికి.. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యలయంలో జరిగే ఈ విచారణ ఈసారి విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరగనుంది. కొత్త కార్యాలయం ఏర్పాటైన మరుసటిరోజే తొలి బహిరంగ విచారణ జరుగుతుండటం విశేషం. ఈ విచారణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికపై ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎంత అవసరం.. ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు 2024–25 నుంచి 2028–29 వరకూ 5వ కంట్రోల్ పీరియడ్‌కు, 2029–30 నుంచి 2033–34 వరకూ 6వ కంట్రోల్ పీరియడ్‌కు వివిధ అంశాలపై సమగ్ర అంచనా నివేదికలను రూపొందించాయి. వీటి ప్రకారం.. ప్రస్తుతం సోలార్ రూఫ్‌టాప్ సిస్టం సామర్థ్యం రాష్ట్రంలో 150.152 మెగావాట్లుగా ఉంది. ఇది 2034 నాటికి 661.88 మెగావాట్లకు పెరుగుతుంది. అలాగే, విద్యుత్ వాహనాలు ప్రస్తుతం 68,975 ఉన్నాయి. వీటి సంఖ్య 2034 నాటికి 10,56,617కు చేరుతుంది. ఇవి ప్రస్తుతం 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుతుండగా, పదేళ్లకు 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇక గృహ విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఏడాదికి 17,330 మిలియన్ యూనిట్లు ఉంది. 2034 నాటికి ఇది 31,374 మిలియన్ యూనిట్లకు పెరగనుంది. అన్ని కేటగిరీలకూ కలిపి ప్రస్తుతం 65,228 మిలియన్ యూనిట్లు ఉండగా, 2034కు 1,30,899 మిలియన్ యూనిట్లు అవసరమవుతుంది. సాంకేతిక, పంపిణీ నష్టాలు పోనూ 1,45,331 మిలియన్ యూనిట్లు ఉంటే తప్ప అందరి అవసరాలు తీరవు. విద్యుత్ ఎలా వస్తుందంటే.. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో)కు 3,410 మెగావాట్ల థర్మల్, 1,774 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవికాక.. ♦ విజయవాడ వీటీపీఎస్‌లో 5వ యూనిట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ♦ లోయర్ సీలేరులో 230 మెగావాట్లు, పోలవరంలో 560 మెగావాట్ల 1 నుంచి 7 యూనిట్లు 2024–25లో, 8 నుంచి 12 యూనిట్లలో 400 మెగావాట్లు 2025–26లో, అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ 1 నుంచి 8 యూనిట్లలో 1,200 మెగావాట్లు 2027–28లో, ఇక్కడే 150 మెగావాట్ల 9వ యూనిట్ 2028–29లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంది. ♦ మొత్తంగా ఇప్పుడున్న ఉత్పత్తి సామర్థ్యం 5,184 మెగావాట్లుకు అదనంగా 3,340 మెగావాట్ల సామర్థ్యం ఏపీ జెన్కో ద్వారా తోడవ్వనుంది. ♦ ఇవికాక.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్, ఇండిపెండెంట్ పవర్ జనరేటర్లు, సౌర, పవన విద్యుత్ వస్తుంది. ♦ వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 3 వేల మెగావాట్లు, 2027లో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లు రానుంది. ♦ ఈ విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. ♦ ఏపీ ట్రాన్స్‌కో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు 10 నుంచి 2029 నాటికి 71కి పెరగనున్నాయి. లైన్లు కూడా 969.15 సర్క్యూట్ కిలోమీటర్లు నుంచి 4,837.16 సీకేఎంకు విస్తరించనున్నాయి. ♦ ఈ మొత్తం ట్రాన్స్మిషన్ కోసం రూ.15,729.41 కోట్లు వ్యయం కానుంది. ♦ ఇదికాక మౌలిక సదుపాయాల కల్పన, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటికి మరింతగా ఖర్చుచేయనున్నారు. -
Fact Check: సత్వరమే కొత్త వ్యవసాయ కనెక్షన్లు
సాక్షి, అమరావతి: ఇది రైతు ప్రభుత్వం.. రైతే రాజనే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు రైతుల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే దీన్ని తట్టుకోలేని పచ్చ పత్రిక ఈనాడు కట్టుకథ అల్లింది. వైఎస్సార్సీపీ 2019లో అధికారంలోకి రాగానే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై పరిమితిని ఎత్తివేసింది. ఈ నిజాన్ని దాని పెట్టి ‘కొత్త కనెక్షన్లు గగనమే’ శీర్షికతో ఈనాడు దినపత్రిక బుధవారం తప్పుడు వార్తను ప్రచురించింది. ఈ వార్తలో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ మద్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీ ఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి స్పష్టం చేశారు. సీఎండీ వెల్లడించిన వాస్తవాలిలా ఉన్నాయి.. ఆరోపణ: మైలవరం పంచాయతీకి చెందిన రైతు వెంకటరెడ్డి తన చేనుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం మూడేళ్ల క్రితం ఒకసారి, ఆరేడు నెలల క్రితం మరోసారి దరఖాస్తు చేశాడు. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నా చేయలేదు. ఆరు నెలలుగా ఆన్లైన్ సేవలను నిలిపివేశారు. వాస్తవం: ప్రతిపాదనలు రూపొందించడంలో జాప్యం వల్ల విద్యుత్ సర్వీసు మంజూరు కాలేదన్నది పచ్చి అబద్ధం. ప్రాధాన్యతా క్రమంలో అంచనా వ్యయాన్ని రూపొందిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు ప్రక్రియను కొద్ది రోజులు నిలిపేయడం సర్వసాధారణం. నిజానికి ఫిబ్రవరి వరకూ అంచనా వ్యయం చెల్లించిన వాటన్నిటికీ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశారు. మరో వారంలో కొత్తగా ఆన్లైన్ నమోదు మళ్లీ మొదలవుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఆరోపణ: దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ లైను, ట్రాన్స్ఫార్మర్లు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు గతేడాది ప్రకటించారు. చాలావరకు గత అర్జీలను పరిష్కరించి అంతకుముందు వరకూ ఆమోదంలో ఉన్న వారికి సర్వీసులు మంజూరు చేశారు. కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవచ్చని పేర్కొన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవం: చెప్పినట్లుగానే దరఖాస్తుదారులకు సర్వీసులు మంజూరు చేశారని ఈనాడే రాసింది. 2019 వరకు ప్రతి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పరిమితికి మించి మంజూరు చేసుకునే అవకాశం ఉండేది కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ పరిమితిని సవరించి దరఖాస్తుదారులందరికీ సత్వరమే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించింది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని తదనుగుణంగా అంచనా వ్యయం చెల్లించే అవకాశం ఉంది. విద్యుత్ నియంత్రికలు, స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసి ఎప్పటి కనెక్షన్లను అప్పుడే మంజూరు చేసి విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. ఆరోపణ: ఏడాది వయసున్న మామిడి మొక్కలను కాపాడుకోవడానికి మోటారు తప్పనిసరి కావడంతో ప్రభుత్వ దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఆ ఒక్క రైతు పరిస్థితే కాదు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది కర్షకుల దుస్థితి. వాస్తవం: ఏపీసీపీడీసీఎల్ 2019లో ఏర్పాటై నప్పటికీ.. 2014 నుంచి ఇప్పటివరకు అంచనా వ్యయం చెల్లించినవారందరికీ పరిమితి లేకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసింది. ఇలా పెండింగ్‌లో ఉన్న 84,085 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఇచ్చింది. కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు, విద్యుత్ నియంత్రికలను కూడా ఏర్పాటు చేసి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు పగటిపూటే తొమ్మిది గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. దీనికి అనుగుణంగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్) పథకం కింద 16 కేవీఏ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 25 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది. 101 కొత్త 33/11 కేవీఏ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగదా రులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయడంతో వ్యవసాయ మోటార్లు కాలిపోవడం, రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడటం వంటివి తగ్గిపోయాయి. -
రాష్ట్ర డిస్కంలకు అప్పుల షాక్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అప్పులు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఆర్థిక లోటు, నిర్వహణ మూలధన వ్యయం కొరత కారణంగా ఏటా మరింతగా అప్పులు చేస్తున్నాయి. దీంతో 2019–20లో రూ.5.01 లక్షల కోట్లుగా డిస్కంల అప్పులు.. 2021–22 నాటికి రూ.6.2లక్షల కోట్లకు (24%వృద్ధి) ఎగబాకాయి. చాలా రాష్ట్రాల్లో డిస్కంల ఆస్తులతో పోల్చితే వాటి అప్పులు 100 శాతానికి మించిపోయి దివాలా బాటపట్టాయి. అందులో తెలంగాణ సహా మరో మూడు రాష్ట్రాల్లోని డిస్కంల అప్పులు ఆస్తుల కంటే 150శాతానికి మించిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ప్రకటించిన డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదిక ఈ అంశాలను బహిర్గతం చేసింది. విద్యుత్ సబ్సిడీల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం, బిల్లుల వసూళ్లలో ఆలస్యంతో డిస్కంలు అప్పులు చేయకతప్పడం లేదని ఈ నివేదిక పేర్కొంది. డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) పథకం కింద డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు టేకోవర్ చేసుకోవడంతో కొంత భారం తగ్గిందని తెలిపింది. రెండింటి పనితీరు మెరుగుపడాలి రాష్ట్రంలోని ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్ఎన్పీడీసీఎల్/ టీఎస్ఎస్పీడీ సీఎల్)ల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై ఈ నివేదికలో కేంద్ర విద్యుత్ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు డిస్కంలు కూడా ఇంధన వ్యయం పెరుగుదల భారాన్ని వినియోగదారులపై ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా బదిలీ చేయాలని.. డిస్కంల నష్టాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ఈఆర్సీ ట్రూఅప్ ఆర్డర్ 2020–21ను జారీ చేయాలని, ఉద్యోగుల వ్యయ భారాన్ని సంస్థ తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. నష్టాల్లో కూరుకుపోయిన ఉత్తర డిస్కం ♦ ఉత్తర తెలంగాణలోని 17 జిల్లాల పరిధిలో 63,48,874 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఎన్పీడీసీఎల్.. దేశంలోని 51 డిస్కంలలో 47వ స్థానంలో నిలిచింది. దీనికి 2020–21లో రూ.204 కోట్ల నష్టాలు వచ్చాయి. ♦ఒక్కో యూనిట్ విద్యుత్ సరఫరా అంచనా వ్యయం, వాస్తవ వ్యయం మధ్య తేడా 2020–21లో 0.68 పైసలుకాగా.. 2021–22లో రూ.1.52కి పెరిగింది. అంటే సరఫరా చేసిన ప్రతి యూనిట్ విద్యుత్‌పై నష్టాలు గణనీయంగా పెరిగాయి. ♦సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 2020–21లో 9శాతం ఉండగా.. 2021–22లో ఏకంగా 14.1 శాతానికి ఎగబాకాయి. ♦ వినియోగదారుల నుంచి కరెంట్ బిల్లులను 60 రోజుల్లోగా వసూలు చేసుకోవాల్సి ఉండగా.. ఈ డిస్కం పరిధిలో సగటున 267 రోజులు పడుతోంది. ♦ గత మూడేళ్లలో ప్రభుత్వానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి ఏకంగా 40శాతం బిల్లులు వసూలు కాలేదు. దక్షిణ డిస్కంపై బకాయిల బండ ♦ దక్షిణ తెలంగాణలోని 1,04,36,589 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఎస్పీడీసీఎల్.. దేశంలోని 51 డిస్కంలలో 43వ ర్యాంకు సాధించింది. 2020–21లో రూ.627 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ♦ సరఫరా చేసిన ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ.1.40 నష్టం వస్తోంది. ♦ జెన్కోలకు సంస్థ బిల్లుల చెల్లింపులకు 375 రోజులను తీసుకుంటోందని.. దీనిని 45 రోజులకు తగ్గించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ♦ వినియోగదారుల నుంచి కరెంట్ బిల్లుల వసూళ్లకు 130 రోజులు తీసుకుంటోంది. ♦ గత మూడేళ్లలో ప్రభుత్వానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి 25శాతం బిల్లులు వసూలు కాలేదు. -
దేశంలోనే అట్టడుగున మన డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి రేటింగ్, ర్యాంకింగ్స్‌లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మరోసారి దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచాయి. దేశంలోని 51 డిస్కంలలో టీఎస్ఎన్పి డీసీఎల్ 47వ ర్యాంకు, టీఎస్ఎస్పీడీసీఎల్ 43వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాయి. ఈ మేరకు డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదికను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెరుగైన రేటింగ్, ర్యాంకింగ్ కలిగి ఉంటేనే డిస్కంలకు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించనున్నాయి. ఈ మేరకు కేంద్రం లంకె పెట్టడంతో ఈ రేటింగ్స్ కీలకంగా మారాయి. రాష్ట్ర డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. డీ–గ్రేడ్‌కి అడుగు దూరంలో ... డిస్కంల ఆర్థిక సుస్థిరతకు 75, పనితీరు సమర్థతకు 13, బయటి నుంచి ప్రభుత్వం/ఈఆర్సీల మద్దతుకు 12 కలిపి మొత్తం 100 స్కోరుకిగాను ఆయా డిస్కంలు సాధించిన స్కోరు ఆధారంగా వాటికి.. ఏ+, ఏ, బీ, బీ–, సీ, సీ–, డీ అనే గ్రేడులను కేటాయించింది. కీలక అంశాల్లో డిస్కంల వైఫల్యాలకు నెగెటివ్ స్కోర్‌ను సైతం కేటాయించింది. ఎస్పీడీసీఎల్ 10.8 స్కోరు సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను, ఎన్‌పి డీసీఎల్ 6.6 స్కోరును సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను పొందింది. చిట్టచివరి స్థానమైన ‘డీ గ్రేడ్’లో మేఘాలయ డిస్కం మాత్రమే నిలిచింది. దేశం మొత్తం బకాయిల్లో 15% మనవే... జెన్కో, ట్రాన్స్‌కోలకు దేశంలోని అన్ని డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు 2021–22 నాటికి రూ.2.81 లక్షల కోట్లకు ఎగబాకినట్టు కేంద్రం పేర్కొంది. అందులో ఎస్పీడీసీఎల్ వాటా ఏకంగా 10.3 శాతం కాగా, ఎన్పీడీసీఎల్ వాటా 4.3 శాతం కావడం గమనార్హం. జెన్కోల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉండగా ఎస్పీడీసీఎల్ 375 రోజులు, ఎన్పీడీసీఎల్ 356 రోజుల కిందటి నాటి బిల్లులను బకాయిపడ్డాయి. అంటే మన డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిల చెల్లింపులకు కనీసం ఏడాది సమయాన్ని తీసుకుంటున్నాయి. -
కరెంట్‌కు ‘సెంట్రల్’ ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్‌ను రాష్ట్రాలకు కేటాయించే విషయంలో కేంద్ర విద్యుత్ శాఖ కొత్త ఆంక్షలు తెచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సబ్సిడీ బకాయిలను చెల్లించకపోయినా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పన్నులు విధించినా, అంతర్రాష్ట్ర విద్యుత్ క్రయవిక్రయాలకు అడ్డంకిగా మారినా ఆయా రాష్ట్రాలకు ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్ కేటాయించబోమని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులేటరీ ఆస్తులు కలిగిన రాష్ట్రాలకు సైతం సెంట్రల్ పూల్ నుంచి కరెంట్ కేటాయించబోమని తేల్చి చెప్పింది. ఓ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని వారి నుంచి బిల్లుల రూపంలో వసూలు చేసుకునేందుకు వీలుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు టారీఫ్‌ను నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈఆర్సీలు తక్కువ టారీఫ్‌ను నిర్ణయిస్తే డిస్కంలకు మిగిలే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో రెగ్యులేటరీ అసెట్స్‌గా పేర్కొంటారు. ఏటేటా రెగ్యులేటరీ అసెట్స్ రూపంలో డిస్కంల నష్టాలు రూ.వేల కోట్లకు పేరుకుపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. డిస్కంలకు నష్టాలు మిగలకుండా పెరిగే వ్యయానికి తగ్గట్టూ ఏటేటా విద్యుత్ చార్జీలను పెంచాలని ఈ నిబంధన ద్వారా కేంద్రం స్పష్టం చేస్తోంది. జల, సౌర విద్యుత్ వంటి గ్రీన్ఎనర్జీ, అంతర్రాష్ట్ర క్రయవిక్రయాలపై పన్నులు, సెస్‌లను విధించే రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి కరెంట్‌ను కేంద్రం కేటాయించదు. ఇకపై షరతులు పాటిస్తేనే కరెంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 80 శాతం మేర దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం విక్రయిస్తోంది. మిగిలిన 20 శాతాన్ని ఎవరికీ కేటాయించని విద్యుత్ పేరుతో ‘సెంట్రల్ పూల్’కింద తమ వద్దే ఉంచుకుంటుంది. ఉదాహరణకి రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విద్యుత్‌లో రాష్ట్రానికి 1,280 మెగావాట్ల(80 శాతం) విద్యుత్‌ను మాత్రమే రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. మిగిలిన 320 మెగావాట్ల(20 శాతం) విద్యుత్‌ను సెంట్రల్ పూల్ కింద తన వద్దే ఉంచుకుంది. రాష్ట్రాల నుంచి విజ్ఞప్తుల ఆధారంగా ఈ విద్యుత్‌ను తాత్కాలిక కేటాయింపులు చేస్తుంది. ఇకపై ఏదైనా రాష్ట్రం సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేస్తే ఆ రాష్ట్రం సంబంధిత అంశాలను పాటిస్తుందా? లేదా ? అని కేంద్రం పరిశీలిస్తుంది. ఒక వేళ పాటించడం లేదని గుర్తిస్తే సెంట్రల్ పూల్ నుంచి ఆయా రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు జరపదు. -
డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) కాస్త ఊరట కలిగించింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ అమ్మకం ధరల సీలింగ్‌ను మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. వేసవిలో విద్యుత్ డిమాండ్, కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఆర్సీ వెల్లడించింది. తాజా నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ ధరలు యూనిట్‌కు రూ.50 నుంచి రూ.30కు తగ్గాయి. సాధారణ సమయాలకు సంబంధించి యూనిట్ ధర రూ.12 నుంచి రూ.10కు తగ్గింది. అప్పట్లో అంతా వాళ్లిష్టమే.. దేశంలోని అన్ని రాష్ట్రాలూ తమ రోజువారీ అవస రాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోలేవు. కొన్ని రాష్ట్రాలు తమ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా అవసరం మేరకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. అయి తే అది దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం జరుగుతుంది. కానీ ఇతర సమయా ల్లో నూ ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సి రావడంతో డిస్కంలు ఆర్థికంగా బాగా నష్టపోతుండేవి. ఈ నేపథ్యంలో లాంగ్ టర్మ్ పీపీఏలకు బదులు షార్ట్ టర్మ్ పీపీఏలు చేసుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఆ ఒప్పందాల వల్ల కూడా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. 2021 వరకు బహిరంగ మార్కెట్లో ని ధరలు విద్యుత్ ఉత్పత్తిదారుల ఇష్టానుసారం ఉండేవి. అదే ఏడాది అక్టోబర్‌లో బొగ్గు సంక్షోభం ఏర్పడటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడటం.. ఉత్పత్తిని తగ్గించడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో మార్కెట్లో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా ఉత్పత్తి సంస్థలు భారీ ధరలు వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో సీఈఆర్సీ గతేడాది మార్చి 5న సీలింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇవీ కొత్త ధరలు సీఈఆర్సీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించి యూనిట్ ధరను రూ.50 నుంచి రూ.20కు తగ్గించింది. అలాగే ఏడాదిగా అమలులో ఉన్న సాధా రణ సమయాల్లో సీలింగ్ ధరను రూ.12 నుంచి రూ.10కు మార్చింది. పవర్ మార్కెట్ రెగ్యులేషన్స్–2021 ప్రకారం రిజిస్టర్ అయిన అన్ని పవర్ ఎక్సే్చంజ్‌లలో ఏప్రిల్ 4 నుంచి ఈ సవరించిన ధరలతోనే విద్యుత్ ట్రేడింగ్ జరగాలని ఆదేశించింది. దిగుమతి చేసుకున్న గ్యాస్, బొగ్గు అధిక ధరను పరిగణనలోకి తీసుకుని గతంలో సీలింగ్ పెంచామని.. ఇప్పుడు వాటి ధరలు తగ్గడంతో సీలింగ్ కూడా తగ్గించామని కమిషన్ తెలిపింది. ఇప్పుడు కొనేవాళ్లు కరువై.. సీఈఆర్సీ సీలింగ్ ప్రకారం యూనిట్ విద్యుత్‌ను రూ.12కు మించి అమ్మడానికి అవకాశం ఉండేది కాదు. అంటే ఆ రేటుకు, లేదా అంతకంటే తక్కువకే డిస్కంలకు విద్యుత్ లభించేది. ఈ విధానం బాగున్నప్పటికీ కొందరు ప్రైవేటు జెన్కోల నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగినందున విద్యుత్ అమ్మకం ధర సీలింగ్ పెంచాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనిట్ ధరను రూ.50 గా సీఈఆర్సీ సీలింగ్ ప్రకటించింది. దీనిపై డిస్కంలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. వేసవిలో అత్యధిక విద్యుత్ అవసరం అవుతున్నందున అంత ఎక్కువ రేటుకు కొనడం ఆర్థికంగా ఇబ్బంది అని కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. మరోవైపు ధరలు పెంచినప్పటి నుంచి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. దీంతో సీఈఆర్సీ ధరలను భారీగా తగ్గించింది. (చదవండి: పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుంది) -
సౌర కాంతుల సిటీ
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం సౌరకాంతులు వెదజల్లుతోంది. నగరంలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ..ప్రైవేటు సంస్థల కార్యాలయాలు, ఇళ్లపై సౌర ఫలకాలు (సోలార్ ప్యానెళ్లు) ఏర్పాటవుతున్నాయి. ఇవి సొంతింటి విద్యుత్ అవసరాలను తీర్చడమే గాకుండా ఇతరత్రా అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అదనపు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. సాధారణ విద్యుత్ బిల్లుల మోత మోగుతుండడంతో ‘సిటీ’జనులు సౌర విద్యుత్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొదట్లో దీనిపై అంతగా అవగాహన లేకున్నా.. క్రమేణా సౌర విద్యుత్‌పై ప్రజలకు ఆదరణ పెరుగుతోంది. ♦ నగరంలోని 34 బల్దియా కార్యాలయాలపై రూ.4.5 కోట్ల వ్యయంతో 941 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్యానెల్ ఏడాదికి సగటున 1,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈవిధంగా జీహెచ్ఎంసీ సోలార్ విద్యుత్ ఉత్పత్తితో తన కరెంటు బిల్లుల వ్యయాన్ని ఏడాదికి రూ.1.50 కోట్ల మేర తగ్గించుకుంది. ♦ బండ్లగూడ నగరపాలిక పరిధి గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్‌లోని పది బహుళ అంతస్తుల్లో 518కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యక్తిగత, ఉమ్మ డి అవసరాలకు నెలకు రూ.12 లక్షల విలువ చేసే కరెంట్ వినియోగించేవారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిద్వారా నెలకు 85వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా వారి నెలవారీ విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గిపోయింది. ♦ఈయన పీవీ రంగనాయకులు. కాప్రాలోని వెస్ట్రన్ బ్లీస్ విల్లాస్‌లో నివసిస్తున్నారు. 2022 నవంబర్‌లో రూ.3 లక్షలు ఖర్చు చేసి ఇంటిపై ఐదు కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు సగటున 25 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో అప్పటివరకు నెలకు రూ.5,000 వచ్చే కరెంటు బిల్లు రూ.150 నుంచి రూ.200కు పడిపోయింది. పాఠశాలలకూ సోలార్ హంగులు సర్కారీ పాఠశాలలను కరెంట్ బిల్లుల భారం నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మన ఊరు– మన బడి’లో భాగంగా 11 జిల్లాల పరిధిలో తొలి విడతగా 1,521 ప్రభుత్వ పాఠశాలలపై రూ.32.02 కోట్లతో 3,072 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా పాఠశాలల భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. మరికొన్ని ప్రాజెక్టులు ♦ శంషాబాద్ విమానాశ్రయంలో 2015లో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2021 జూలైలో అదనంగా మరో ఐదు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటును అమర్చారు. ప్రస్తుతం విమానాశ్రయం విద్యుత్ అవసరాలు 50% సౌరశక్తి ద్వారానే తీరుతుండటం గమనార్హం. కాచిగూడ రైల్వేస్టేషన్ సైతం సోలార్ ఎనర్జీతో నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి గట్టెక్కింది. ♦ రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలోవార్షిక విద్యుత్ బిల్లు రూ.కోటికి పైగా వచ్చేది. భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు తర్వాత ఈ బిల్లు రూ.40 లక్షలకు తగ్గింది. ♦ శామీర్‌పేట జినోమ్ వ్యాలీలో 952, జవహర్‌నగర్‌లో 947, కోకాపేట్ ఓపెన్ స్పేస్‌లో 100, కిమ్స్ రెసిడెన్సీలో 275, హిమాయత్‌సాగర్ ఓనర్స్ అసోసియేషన్ పరిధిలో 710 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. విద్యుత్ బిల్లులు తగ్గిపోయాయి. నిథమ్ క్యాంపస్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెళ్ల ద్వారా నెలకు 2.50 లక్షల బిల్లు ఆదా చేస్తున్నారు. అదనపు విద్యుత్ డిస్కంకు.. ♦ గ్రేటర్ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 220 మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన మినీ సోలార్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున 170 నుంచి 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వేసవిలో మరో 30% అదనంగా ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. నగరంలో రోజుకు సగ టున 2,500 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉండగా, ఇందులో థర్మల్, జల విద్యుత్ 2,300 మెగావాట్లు, సోలార్ ద్వారా 220 మెగావాట్ల వరకు రికార్డవుతోంది. నగరంలో సౌర విద్యుత్‌కు సంబంధించి మొత్తం 11,968 రూఫ్ టాప్ నెట్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయి. మిద్దెలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు వీటి ద్వారా తమ రోజువారీ అవసరాలు తీర్చుకుంటూ, మిగిలిన విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు సరఫరా చేస్తున్నారు. తద్వారా ఇంటి విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వెలుస్తున్న విల్లా ప్రాజెక్టుల్లో అధికశాతం గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తున్నాయి. సోలార్ విద్యుత్‌ను అదనపు ఫెసిలిటీగా కస్టమర్లకు చూపుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ♦ మల్కాజ్‌గిరికి చెందిన శ్యామ్‌సుందర్ సింగ్ తన ఇంటిపై 6 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున 30 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలు పోను మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయిస్తున్నారు. ఒక్కసారి బిగిస్తే.. 25 ఏళ్ల పాటు ఉత్పత్తి గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు, ఇతర రెసిడెన్షియల్ కాలనీలకు డిస్కం వ్యక్తిగతంగా కాకుండా అందరికీ కలిపి ఒకే కనెక్షన్ (హెచ్‌టీ) జారీ చేస్తుంది. ఆ తర్వాత వ్యక్తిగత మీటర్లు అమర్చుకుని ఎవరికి వారు బిల్లులు చెల్లిస్తుంటారు. ఇందుకు ఆయా వినియోగదారుల నుంచి డిస్కం యూనిట్‌కు రూ.6.30 పైసల చొప్పున వసూలు చేస్తుంది. అదే వారి ఇంటిపై ఉత్పత్తి అయిన విద్యుత్‌కు రూ.4.09 పైసలు చెల్లిస్తుంది. ఒకసారి ఇంటిపై ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తికి ఢోకా ఉండదు. అంతేకాదు ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 25 నుంచి 50 శాతం రాయితీ కూడా ఇస్తుంది. – బి.అశోక్, అధ్యక్షుడు, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ -
10,783 కనెక్షన్లకు ‘జీరో’ బిల్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను కొందరు అధికారులు, సిబ్బంది మరింతగా ముంచుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు జీరో యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది. అయితే ఆయా బిల్లుల వాస్తవ మొత్తాలను వినియోగదారుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది వసూలు చేసుకొని జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు జి.సత్యనారాయణ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు ఒక మీటర్, ఆ మీటర్‌కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. కానీ ఒకే మీటర్ నంబర్‌తో 10,783 సర్విసు కనెక్షన్లు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. 2,788 కనెక్షన్లపైనే విచారణ.. ఈఆర్సీ సూచనలతో టీఎస్ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. 10,783 సర్వీసు కనెక్షన్లలో 2,788 కనెక్షన్లను మాత్రమే విజిలెన్స్ విభాగం తనఖీ చేయగలిగింది. సిబ్బంది కొరతతో మిగిలిన కనెక్షన్లను తనిఖీ చేయలేకపోయింది. తనఖీ చేసిన 2,788 కనెక్షన్లలో కేవలం 687 కనెక్షన్లకే మీటర్లున్నాయని, మిగిలిన 2101 కనెక్షన్లకు మీటర్లు లేవని గుర్తించింది. తనిఖీ చేసిన కనెక్షన్లకు సంబంధించి తప్పుడు మీటర్ రీడింగ్‌ను నమోదు చేసి బిల్లులు జారీ చేయడంతో సంస్థ రూ. 9.32 లక్షల ఆదాయాన్ని నష్టపోయినట్టు నిర్ధారించింది. 10,783 కనెక్షన్లలో ఏకంగా 4,842 కనెక్షన్లకు మీటర్లే లేవని నాగర్‌కర్నూల్ డీఈ మరో నివేదికలో టీఎస్ఎస్పీడీసీఎల్కు తెలియజేశారు. ఒక్క నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలోనే ఈ పరిస్థితి బయటపడగా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా అవకతవకతలతో డిస్కంలు రూ. వందల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోతున్నాయని ఆరోపణలున్నాయి. 41 మందిపై చర్యలకు ఆదేశం.. నాగర్‌కర్నూల్ డివిజన్లో వెలుగు చూసిన భారీ అక్రమాల్లో స్థానికంగా పనిచేసే 41 మంది ఓఅండ్ఎం విభాగం అధికారులు, సిబ్బంది, మరో ముగ్గురు అకౌంట్స్ విభాగం అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, మరొక డీఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు. వారి బాధ్యతారాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యంతోనే మీటర్ రీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారితోపాటు ప్రైవేటు మీటర్ రీడింగ్ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరినీ సస్పెండ్ చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. -
తప్పిన ‘ట్రూ అప్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. రూ.12,718.4 కోట్ల ట్రూఅప్ చార్జీల భారం తప్పింది. ఇదే సమయంలో సాధారణ విద్యుత్ చార్జీల పెంపు కూడా ఉండబోదని స్పష్టమైంది. ట్రూఅప్ చార్జీల మొత్తంతోపాటు రూ.9,124.82 కోట్ల సబ్సిడీ సొమ్మును రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనితో వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే 2023–24 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు ఉండదని, ప్రస్తుత చార్జీలు (టారిఫ్) యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) శుక్రవారం ప్రకటించింది. ఐదేళ్లలో చెల్లిస్తామనడంతో.. 2023–24లో ప్రస్తుత విద్యుత్ రిటైల్ సప్లై టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలని.. గత కొన్నేళ్లకు సంబంధించి వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ డిస్కంలు ఇంతకుముందే ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఇలా వసూలు చేయాల్సిన చార్జీల మొత్తాన్ని రూ.12, 718.4 కోట్లుగా ఈఆర్సీ తే ల్చింది. ఈ మొత్తాన్ని విద్యుత్ వినియోగదారుల నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని వచ్చే ఐదేళ్లలో వడ్డీతో కలిపి చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీనితో విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మేరకు టీఎస్ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణ య్య శుక్రవారం తమ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రార్థనా స్థలాలకు చార్జీల తగ్గింపు డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈఆర్సీ ప్రార్థన స్థలాలకు విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.5కి తగ్గించింది. ప్రస్తుతం ఎల్టీ –7(బీ) కేటగిరీలో 2 కిలోవాట్లలోపు లోడ్ కలిగిన ప్రార్థన స్థలాలకు యూనిట్‌కు రూ.6.4.. ఆపై లోడ్ కలిగిన ప్రార్థన స్థలాలకు యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని ప్రార్థన స్థలాలకు యూనిట్ రూ.5కి తగ్గనుంది. హెచ్‌టీ–2 (బీ) కేటగి రీలోని ప్రార్థన స్థలాలకు అదనంగా రూ. 260 ఫిక్స్డ్ చార్జీలను వసూలు చేస్తారు. సంప్రదింపులతో తప్పిన భారం! ఏదైనా నిర్దిష్ట కాలానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ కోసం ఈఆర్సీ ఆమోదించిన అంచనా వ్యయం కంటే.. జరిగిన వాస్తవ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేస్తారు. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూ అప్ వ్యయం, 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూ షన్ ట్రూఅప్ వ్యయం కలిపి.. మొత్తం రూ. 16,107 కోట్లను ట్రూఅప్ చార్జీలుగా వసూ లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ఇటీవల ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. ఈ లెక్కలపై పరిశీలన జరిపిన ఈఆర్సీ రూ.12,718.4 కోట్ల ట్రూఅప్ చార్జీలకు ఆమోదం తెలపగా.. ఈ మేరకు బిల్లుల్లో వసూలుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరాయి. కానీ ఈఆర్సీ ఈ స్థాయిలో భారం వేస్తే వినియోగదారులు ఇబ్బందిపడతారంటూ సీఎం కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. దీంతో ఈ భారాన్ని భరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించడంతో వినియోగదారులకు ఉపశమనం లభించింది. -
‘ట్రూఅప్’పై తేలేది నేడే..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల నుంచి మొత్తం రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూళ్లకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూఅప్ చార్జీలతో పాటు 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి సంబంధించి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల వసూళ్లు ఆ ప్రతిపాదనల్లో ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003, విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 తేదీ నుంచి కొత్త టారిఫ్ ఉత్తర్వులను అమలు చేయాల్సి ఉంది. దీనికి కనీసం వారం రోజుల ముందు టారిఫ్ ఉత్తర్వులను ఈఆర్సీ ప్రకటించాలి. ఈ నేపథ్యంలో గురువారం 2023–24కి సంబంధించిన వార్షిక టారిఫ్ ఉత్తర్వులతో పాటు ట్రూఅప్ చార్జీలపై ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయనుందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ట్రూఅప్ చార్జీలపైనే ఉత్కంఠ ప్రస్తుత విద్యుత్ టారిఫ్ 2023–24లోనూ యధాతథంగా కొనసాగించాలని వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికలో డిస్కంలు ప్రతిపాదించిన నేపథ్యంలో విద్యుత్ టారిఫ్‌లో మార్పులు ఉండే అవకాశాలు లేవు. అయితే రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై ఈఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.5,986 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినియోగదారులపై పడే భారాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల్లో ఎంత మేరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలి? ఎంత కాల వ్యవధిలో వసూలు చేయాలి? అన్న అంశాలపై ఈఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. పారిశ్రామిక, వినియోగదారుల సంఘాల వ్యతిరేకత ఏఆర్‌ఆర్‌తో పాటు ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై గత నెలలో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి అన్ని వర్గాల వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. డిస్కంలు 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించలేదని, నిబంధనల మేరకు ఈ సంవత్సరాలకు సంబంధించిన ట్రూఅప్ చార్జీల వసూళ్లకు అనుమతి ఉండదని బహిరంగ విచారణలో విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక సంఘాలు వాదనలు వినిపించాయి. ట్రూఅప్ చార్జీలు అంటే..? ఒక ఆర్థిక సంవత్సరంలో అయ్యే విద్యుత్ పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) వ్యయం, విద్యుత్ కొనుగోలు వ్యయ అంచనాలను ఈఆర్సీ ముందస్తుగా ఆమోదిస్తుంది. దీనికి తగినట్టుగా కరెంట్ బిల్లుల వసూళ్లకు అనుమతిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత లెక్క తేల్చిన వాస్తవ వ్యయంలో ఉండే హెచ్చుతగ్గులను ట్రూఅప్/ ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందస్తుగా అనుమతించిన వ్యయం కన్నా అధిక వ్యయం జరిగితే, ఆ మేరకు వ్యత్యాసాన్ని ఆ తర్వాత కాలంలో ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఒక వేళ తక్కువ వ్యయం జరిగితే ఆ తర్వాత కాలంలో విద్యుత్ చార్జీలను తగ్గించి ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది. -
ఆర్డీఎస్ఎస్తో డిస్కంల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలు అందించేలా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను పునరుద్ధరణ పంపిణీరంగ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఈ మొత్తం పెట్టుబడిలో 60 శాతం కేంద్రం నుంచి గ్రాంట్‌గా పొందవచ్చని చెప్పారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ ఆధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ ద్వారా డిస్కంలు బలోపేతం కావడం వల్ల అన్నివర్గాల వినియోగదారులకు అధిక నాణ్యత గల విద్యుత్‌ను అందించవచ్చనితెలిపారు. విద్యుత్ సంస్థ (పవర్ యుటిలిటీస్)ల ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల తగ్గింపు, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్డ్ హైడ్రోస్టోరేజి ప్రాజెక్టులు మొదలైన వాటితోసహా అనేక రాష్ట్ర ప్రభుత్వం పథకాలను నవరత్నాల కింద విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా గత మూడునెలల స్వల్ప వ్యవధిలో విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో ఆరు అవార్డులు సాధించాయని చెప్పారు. 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు వ్యవసాయానికి సబ్సిడీ రూపంలో రూ.8,400 కోట్లు ఏటా కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లను అమర్చడం వల్ల డిస్కంలకు, రైతులకు ప్రయోజనమని చెప్పారు. ఏ రైతు తమ జేబులోంచి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే బిల్లు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. 16,66,282 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని నిర్ణయించగా.. 16,55,988 కనెక్షన్లకు సంబంధించిన రైతులు అంగీకారం తెలిపారని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
డిస్కంలకు సీఈఆర్సీ షాక్!
సాక్షి, అమరావతి : విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నిజంగా ఇది పిడుగులాంటి వార్తే. ఖర్చుకు వెనుకాడకుండా అవసరమై నప్పుడు బహిరంగ మార్కెట్ (పవర్ ఎక్సేంజ్)లో అధిక ధర వెచ్చించైనా సరే విద్యుత్‌ను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే డిస్కంలపై ఆర్థిక భారం పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. పవర్ ఎక్స్చేంజి లో ప్రస్తుతం యూనిట్ విద్యుత్ గరిష్ట ధర రూ.12గా ఉన్న సీలింగ్‌లో మార్పులు చేస్తూ కొన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరేలా యూనిట్ ధరను రూ.50గా నిర్ణయిస్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) తాజాగా ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతానికి దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్‌లకు మాత్రమే ఈ రేటు వర్తిస్తుందని చెబుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో బొగ్గు కొరత, విద్యుత్ డిమాండ్వల్ల అన్ని జెన్కోలు ఇదే ధరకు విద్యుత్ అమ్ముతామని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఇంధనరంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు అనేది డిస్కంలకు పెనుభారంగా మారుతుంది. ట్రూ అప్ ఛార్జీలుగా అంతిమంగా ఈ భారం ప్రజలపైనే పడుతుంది. అప్పుడే భారమనుకుంటే.. 2021 అక్టోబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు కొరతతో భారత్‌లోనూ తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చింది. ఆ సమయంలో బొగ్గు నిల్వలు కూడా నిండుకోవడంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయి లో నడపలేక బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్‌ను గరిష్టంగా రూ.20 పెట్టి కొని వినియోగదారులకు అందించారు. గతేడాది వేసవిలోనూ ఇదే పరిస్థితి రావడంతో యూని ట్ ధర రూ.20 దాటింది. దీంతో దేశ వ్యాప్తంగా డిస్కంలు ఆందోళన వ్యక్తంచేయడంతో సీఈఆర్సీ రంగంలోకి దిగి విద్యుత్ అమ్మకం గరిష్ట ధర రూ.12 మించకూడదని ఆదేశాలు (సీలింగ్) జారీచేసింది. తాజాగా.. ఆ ఆదేశాలను సవరించి యూనిట్ రూ.50 రూపాయల వరకు విక్రయించుకోవడానికి అనుమతిచ్చింది. రాష్ట్రంలో రోజుకు 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటే ఇందులో దాదాపు 30 మిలియన్ యూనిట్లు బయటి నుంచే కొంటున్నారు. ఇందుకోసం రోజూ రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఖర్చుచేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ అమ్మకం ధర యూనిట్ రూ.9 వరకూ ఉంది. ఈ నెలలో డిమాండ్ 240 మిలియన్ యూనిట్లు, వచ్చే నెలలో 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఇంధన శాఖ ఇప్పటికే అంచనాకు వచ్చింది. ఈ లెక్కన బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను అధిక ధరకు అదనంగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలా అయితే కష్టమే.. కొన్నేళ్లుగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆధునిక సాంకేతికత(ఎనర్జీ ఫోర్కాస్ట్)ను ఉపయోగించుకుని బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభించే సమయాన్ని ముందుగానే అంచనా వేసి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ విధంగా 2021లో రూ.4,925 కోట్లు ఆదా చేశాయి. ఈ మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు వీలుగా 2021–22లో రూ.3,373 కోట్లను ట్రూ డౌన్ చేస్తూ ఆంధ్ర్ర పదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. కానీ, బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల కారణంగా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత వి ద్యుత్ పంపిణీ సంస్థలు 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనుకున్న దానికి మించి మూడు డిస్కంలు కలిపి రూ.9,029 కోట్లను విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేశాయి. నిజానికి అప్పుడు కొన్న విద్యుత్ యూనిట్ ధర సరాసరిన రూ.5.22–రూ.5.35 మాత్రమే. దానికే రూ.1,048 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాంటిది రూ.20ని దాటి రూ.50కు కొనాల్సి వస్తే డిస్కంలు ఆర్థికంగా కుదేలవుతాయి. -
ట్రూఅప్ చార్జీలను అనుమతించొద్దు
వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలు వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను అనుమతించరాదని విద్యుత్‌రంగ నిపుణులు, పారిశ్రామిక, రైతు, వినియోగదారుల సంఘాలు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. డిస్కంలు 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించలేదని, అందువల్ల వాటికి సంబంధించిన ట్రూఅప్ చార్జీల వసూళ్లకు నిబంధనలు అనుమతించబోవని స్పష్టం చేశాయి. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి రూ. 12,015 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీలు, 2006–21 కాలానికి రూ. 4,092 కోట్ల డి్రస్టిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు కలిపి మొత్తం రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల భారాన్ని మోపాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనలను అనుమతించరా దని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. డిస్కంల ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు 2023–24తోపాటు ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ. మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య బహిరంగ విచారణ నిర్వహించగా టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి పాల్గొని వక్తలు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. ఎవరేమన్నారంటే... అసమర్థ విధానాలతోనే నష్టాలు... అసమర్థ ఆర్థిక నిర్వహణ, తొందరపాటు నిర్ణయాలతోనే డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఆ భారాన్ని ప్రజలు భరించాల్సి వస్తోంది. ఛత్తీస్‌గఢ్, సెమ్‌కాబ్ విద్యుత్ ఒప్పందాలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ధరల వివాదంతో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా బంద్ కాగా, సెమ్‌కాబ్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 8.33కి పెరిగింది. విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని పెంచుకొనేందుకు వీలు కల్పిస్తూ ఈఆర్సీ జారీ చేసిన ‘రెగ్యులేషన్ 1 ఆఫ్ 2019’ను ఉపసంహరించుకోవాలి. విద్యుత్‌రంగం ప్రైవేటీకరణ కోసమే ప్రీపెయిడ్ మీటర్లను, ఆదానీ కోసమే ఎగుమతి చేసిన బొగ్గు వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. – సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు అందరికీ విద్యుత్ చార్జీలు పెంచాలి ప్రతి ఇంట్లో ఒక్కో వ్యక్తి నెలకు రూ. 300 చొప్పున సెల్‌ఫోన్ బిల్లుకు, లీటర్ పెట్రోల్‌కు రూ.100 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచకూడదు? డిస్కంల నష్టాల నేపథ్యంలో రాష్ట్రంలో అందరికీ విద్యుత్ బిల్లులు పెంచాలి. కార్పొరేట్ బడులు, ఆస్పత్రులకు మరింత ఎక్కువగా పెంచాలి. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అవసరం లేదు. విద్యుత్ టవర్ల కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించట్లేదు. క్షేత్రస్థాయిలో లైన్మెన్ నుంచి ఏడీఈ వరకు అధికారులు రైతులపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – బీజేపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి సబ్సిడీ సొమ్ము తీసుకున్నాకే డిస్కంలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కంలు ముందుగా సబ్సిడీ నిధులు తీసుకున్న తర్వాతే వ్యవసాయం, సెలూన్లు, లాండ్రీలు, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించాలి. నేను బతికుండగానే కొడంగల్ డివిజన్లోని మా హస్నాబాద్‌లో సబ్‌స్టేషన్ వస్తే సంతోషంగా చనిపోతా. లో వోల్టేజీ సమస్యతో ఆరేళ్ల నుంచి అడుగుతున్నా స్పందన లేదు. – స్వామి జగన్మాయనంద ప్రైవేటు ఆస్పత్రులను ఎల్టీ–2 కమర్షియల్ కేటగిరీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులుండే ఎల్టీ–7 జనరల్ కేటగిరీకి మార్చాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ సంపత్ రావు విజ్ఞప్తి చేశారు. ఐఐటీ హైదారాబాద్‌కు ప్రతి నెలా రూ.1.1 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, హెచ్‌టీ–2 కేటగిరీ నుంచి కొత్త కేటగిరీకి మార్చాలని సంస్థ తరఫున సూపరింటెండింగ్ ఇంజనీర్ రవీంద్ర బాబు విజ్ఞప్తి చేశారు. అదనంగా యూనిట్‌కు 66 పైసలు చెల్లించి కొనుగోలు చేస్తున్న గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన సర్టిఫికెట్లను ప్రతినెలా జారీ చేయాలని ఇన్ఫోసిస్ విజ్ఞప్తి చేసింది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుండానే ట్రూఅప్ చార్జీల వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరడంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అభ్యంతరం తెలిపింది. కరెంట్ ఫెన్సింగ్ పెట్టుకొనే వారిపై హత్యానేరం కేసులు: ఈఆర్సీ చైర్మన్ పంట పొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్‌తో ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్‌తో ఫెన్సింగ్ వేసే వారిపై గతంలో అక్రమ కనెక్షన్ ఆరోపణలపై రెండేళ్లలోపు జైలుశిక్ష వర్తించే సెక్షన్ 304ఏ కింద కేసు పెట్టేవారు. కానీ ఇకపై హత్యానేరం కింద (సెక్షన్304) కేసులు నమోదు చేయాలని ఆదేశించాం. – ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు -
షాకింగ్ ఘటన: చనిపోయిన ఉద్యోగికి పదోన్నత కల్పిస్తూ పోస్టింగ్!
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఓ ఇంజనీర్‌కు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు డబుల్ శాలరీ ఇచ్చిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే...తాజాగా చనిపోయిన మరో ఇంజనీర్‌కు ఏకంగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్ కూడా ఇచ్చిన ఉదంతం వెలుగు చూసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హెచ్ఆర్ విభాగంలోని అధికారుల తప్పిదాలకు సంస్థ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో అభాసుపాలవుతోంది. రెండేళ్ల క్రితమే చనిపోయిన మల్లయ్య.. పి.మల్లయ్య (ఐడీ నంబర్ 1077222) మొదట్లో మెట్రోజోన్ పరిధిలోని డీఈ కేబుల్ ఆఫీసులో సబ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అటు నుంచి బంజారాహిల్స్‌కు సబ్‌ఇంజనీర్‌గా బదిలీపై వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సుమారు రెండేళ్ల క్రితమే మృతి చెందారు. డిస్కం ఉన్నతాధికారులు చనిపోయిన మల్లయ్య స్థానంలో కారుణ్య నియామకం కింద ఆయన కుమార్తెకు సబ్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఆమె సైబర్‌సిటీ సర్కిల్ ఆఫీసులోని కమర్షియల్ సబ్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. రెండు రోజుల క్రితం పదోన్నతి రెండు రోజుల క్రితం 49 మంది సబ్ ఇంజనీర్లకు డిస్కం ఏఈలుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో ఆ మేరకు పదోన్నతులు పొందిన వారి పేర్లతో సహా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిస్కం జారీ చేసిన ఈ జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటమే కాకుండా ఆయనకు సబ్ ఇంజనీర్ నుంచి ఏఈగా పదోన్నతి కల్పించారు. ఏకంగా ఆయనకు వికారాబాద్‌లో పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఏఈల జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటాన్ని చూసి తోటి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. అదేమిటని సంబంధిత సెక్షన్ అధికారులను, హెచ్ఆర్ డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో చేసిన తప్పిదాన్ని ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. (చదవండి: ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!) -
ఒక ప్రాంతం.. అనేక కరెంటు కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగ ప్రైవేటీకరణదిశగా కేంద్రం దూకుడు పెంచింది. యావత్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాల మొత్తం ప్రాంతం పరిధిని విద్యుత్ సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంతం(మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లై)గా పరిగణిస్తూ కొత్త విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కం)లకు లైసెన్సులు జారీచేయాలని ఆదేశించింది. లేకుంటే ప్రభుత్వం ప్రకటించిన మరేతర చిన్న ప్రాంతాన్ని కూడా మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లైగా పరిగణిస్తూ కొత్త డిస్కంలకు లైసెన్సులు జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైసెన్స్ రూల్స్(రెండో సవరణ)–2022ను ప్రకటిస్తూ ఈ నెల 28న కేంద్ర విద్యుత్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత సెప్టెంబర్ 8న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి తెచ్చిన సవరణలకు మరింత స్పష్టతనిస్తూ తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ప్రభుత్వాలు నిర్దేశించనున్న ఎంత చిన్న ప్రాంతంలోనైనా ఒకటికి మించిన సంఖ్యలో సమాంతర విద్యుత్ కంపెనీల ఏర్పాటుకు కొత్త సవరణలు వీలు కల్పించనున్నాయి. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్/ రెవెన్యూ జిల్లాను కనీస ప్రాంతంగా పరిగణిస్తూ విద్యుత్ కంపెనీలకు లైసెన్సులు జారీ చేయాలని పాత నిబంధనలు పేర్కొంటున్నాయి. విద్యుత్ బిల్లు అమలు కోసమే.. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా, రాష్ట్రాల ఈఆర్సీలు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని, ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్టసవరణ ముసాయిదా బిల్లు–2022లో కేంద్రం ప్రతిపాదించింది. తమ సొంత పంపిణీ వ్యవస్థ ద్వారానే వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ సరఫరా చేయాలని ప్రస్తుత నిబంధనలు పేర్కొంటున్నాయి. అంటే డిస్కంలు విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లతో సొంత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే లైసెన్స్ ఇస్తారు. ‘సొంత వ్యవస్థ ఉండాల’నే నిబంధనను సైతం తొలిగిస్తున్నట్టు విద్యుత్ బిల్లులో కేంద్రం మరో ప్రతిపాదన చేసింది. ఒకే ప్రాంతంలో ఒకటికి మించిన సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు తప్పనిసరిగా ఓపెన్ యాక్సెస్ సదుపాయం కల్పించాలని ఇంకో కీలక ప్రతిపాదన చేసింది. తాజాగా విద్యుత్ సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంత పరిధిపై పరిమితులను ఎత్తివేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తేవడంతో భవిష్యత్తులో విద్యుత్‌బిల్లు అమలుకు మార్గం సుగమమైంది. విద్యుత్ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే ప్రైవేటు డిస్కంలకు తలుపులు బార్లా తెరిచినట్టు కానుంది. -
గల్లీకో కరెంట్ కంపెనీ!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్కరణల అమల్లో కేంద్రం దూకుడు పెంచింది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా గల్లీకో కరెంట్ పంపిణీ కంపెనీ (డిస్కం) ఏర్పాటుకు వీలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత చిన్న ప్రాంతమైనా సరే.. విద్యుత్ సరఫరా కోసం ఉండాల్సిన కనీస ప్రాంతం (మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లై)గా ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టింది. ఆ చిన్న ప్రాంతం పరిధిలో ఒకటి మించి విద్యుత్ పంపిణీ కంపెనీల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీలు) లైసెన్స్ జారీ చేయడానికి వీలుకలగనుంది. ఈ మేరకు ‘డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైసెన్స్ సవరణ నిబంధనలు–2022’ను కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా అమల్లోకి తెచ్చింది. ‘ఏదైనా చిన్న ప్రాంతం’ నిబంధనతో.. ఇటీవల ప్రకటించిన నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్/ రెవెన్యూ జిల్లాను కనీస ప్రాంతంగా పరిగణిస్తూ డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక మున్సిపల్ కార్పొరేషన్/ పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలు/ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినా ఏదైనా చిన్న ప్రాంతంలో ఒకటికి మించి డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేసుకోవచ్చు. ఇందులో ‘ఏదైనా చిన్న ప్రాంతం’ అనే వెసులుబాటు కారణంగా కనీస ప్రాంతం విషయంలో పరిమితిని దాదాపుగా ఎత్తివేసినట్టు అయిందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. ‘విద్యుత్ బిల్లు’ అమల్లో భాగమే! ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోసం ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా.. రాష్ట్రాల ఈఆర్సీలు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2022లో కేంద్రం ప్రతిపాదించింది. ఇక డిస్కంలకు విద్యుత్ పంపిణీ కోసం సొంత ట్రాన్స్మిషన్ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి) వ్యవస్థ ఉండాలన్న నిబంధననూ తొలగిస్తున్నట్టు ఆ బిల్లులో పేర్కొంది. తాజాగా కనీస ప్రాంత పరిధిపై పరిమితిని ఎత్తివేసింది. ఇది ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు’ను పరోక్షంగా అమల్లోకి తెచ్చినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటుకు పూర్తిగా లైన్ క్లియర్! ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్/టీఎస్ఎస్పీడీసీఎల్)లు ఉన్నాయి. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే. తమ ప్రాంతాల పరిధిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను స్వయంగా అభివృద్ధి చేసుకున్నాయి. కొత్త నిబంధనల కారణంగా ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తెరపైకి రానున్నాయి. బాగా లాభాలు వచ్చే పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం అవి పోటీపడే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వ సంస్థలకు ఇబ్బంది ఎదురవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
దక్షిణ డిస్కంలో తొలి లైన్‌ఉమెన్‌గా శిరీష
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చరిత్రలోనే తొలి జూనియర్ లైన్‌ఉమెన్‌గా సిద్దిపేట వాసి బబ్బూరి శిరీష ఘనత సాధించారు. హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నుంచి బుధవారం ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆమెను మేడ్చల్ సర్కిల్ పరిధిలో జేఎల్ఎంగా నియమించారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా మహిళలను జూనియర్ లైన్ఉమెన్లుగా నియమించినట్టు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళలను ఈ పోస్టుల్లో నియమించిన ఘనత రాష్ట్రానికే దక్కుతుందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని శిరీష ఈ సందర్భంగా పేర్కొన్నారు. లైన్ ఉమెన్ పోస్టుకు ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: Hyderabad: రూ.45 లక్షల మోసం.. ప్రేమగా మాట్లాడే ఇందుష ఎన్నిసార్లు కోరినా రాదే! -
నెల తక్కువ.. మోత ఎక్కువ!
హైదరాబాద్‌లోని నవీన్‌నగర్‌కు చెందిన ప్రసాదరావు ఫిబ్రవరిలో 219 యూనిట్ల విద్యుత్ వాడితే రూ.894 బిల్లు వచ్చింది. మార్చిలో 178 యూనిట్లనే వాడినా బిల్లు ఏకంగా రూ.969 వచ్చింది. తక్కువ విద్యుత్ వాడితే బిల్లు తక్కువ రావాలి కానీ ఎందుకు పెరిగిందని అనుకుంటున్నారా? ఫిబ్రవరిలో 31 రోజులకు మీటర్ రీడింగ్ తీసి బిల్లేశారు. మార్చిలో నెల పూర్తవకముందే 27 రోజులకే రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు. 27 రోజుల్లో 178 యూనిట్లు వాడగా 31 రోజులకు 204 యూనిట్లు వాడతారని అంచనా వేసి 200 యూనిట్లకు పైగా వినియోగానికి సంబంధించిన శ్లాబును వర్తింపజేశారు. ఈ శ్లాబు కింద.. తొలి 200 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.5 చొప్పున, తర్వాత 201 నుంచి 300 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీలు వర్తిస్తాయి. 204 యూనిట్లు వాడినట్టు అంచనా వేసినందున తొలి 200 యూనిట్లకు ఓ రేటు.. మిగిన 4 యూనిట్లకు మరో రేటు వర్తించనుంది. ఈ లెక్కన అసలు వాడిన 178 యూనిట్లలో 174 యూనిట్లకు యూనిట్‌కు రూ.5 చొప్పున, మిగిలిన 4 యూనిట్లకు యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీ విధించారు. ఈ దెబ్బకు చార్జీ రూ.898 (174్ఠ5 + 4్ఠ7.20) కు పెరిగింది. రూ.60 కస్టమర్ చార్జీలు, రూ.10 ఈడీ కలిపి బిల్లు రూ.969కు పెరిగింది. నెల కాకముందే బిల్లులు జారీ చేసి వినియోగదారులకు డిస్కంలు ఎలా టోపీ పెడుతున్నాయో ఈ కేసుతో అర్థమవుతుంది. సాక్షి, హైదరాబాద్: డిస్కంల తప్పు వల్ల వినియోగదారులకు విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. కొందరికి నెల పూర్తికాకముందే బిల్లులు జారీ చేస్తూ సగటున నెల వినియోగాన్ని అంచనా వేసి శ్లాబును మారుస్తుండటంతో బిల్లులు పెరిగి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. తప్పు డిస్కంలదైనా మూల్యం మాత్రం వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఇలా ఈఆర్సీ టారిఫ్ ఆర్డర్‌కు విరుద్ధంగా శ్లాబుల మార్పు అక్రమమని నిపుణులు తప్పుబడుతున్నారు. ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని.. నిబంధనల ప్రకారం నెల రోజులకు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేయాలి. కానీ ఆచరణలో ఇది సాధ్యమవట్లేదు. నెల దాటాక కానీ, లేదా నెల పూర్తికాక ముందే బిల్లులు జారీ చేస్తున్నారు. నెల గడిచాక బిల్లులు జారీ చేస్తే వినియోగం పెరిగి బిల్లు శ్లాబులు మారిపోతున్నాయి. దీంతో బిల్లులు బాగా పెరుగుతున్నాయని గతంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెల సగటు వినియోగాన్ని అంచనా వేసి సంబంధిత శ్లాబు కిందే బిల్లులు జారీ చేయాలని డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది. దీన్ని అడ్డుగా పెట్టుకుని రివర్స్‌లో సైతం డిస్కంలు అమలు చేస్తున్నాయి. నెల పూర్తికాకుండానే జారీ చేసే బిల్లుల శ్లాబులను మార్చి అధిక బిల్లులు జారీ చేస్తున్నాయి. సకాలంలో మీటర్ రీడింగ్ తీయకపోవడం డిస్కంల పొరపాటైనా వినియోగదారులు భారీగా బిల్లు కట్టాల్సి వస్తోంది. ఎంత వాడితే ఆ స్థాయి శ్లాబే ఉండాలి విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్‌కు కట్టుబడి డిస్కంలు బిల్లులు జారీ చేయాలి. నెల గడవక ముందే జారీ చేసే బిల్లుల విషయంలో దీన్ని ఉల్లంఘిస్తున్నాయని విద్యుత్ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. టారిఫ్ ఆర్డర్ ప్రకారం ఎంత విద్యుత్ వాడితే అందుకు సంబంధించిన శ్లాబునే వర్తింపజేయాలి. నెల కాకముందే రీడింగ్ తీసి వినియోగాన్ని ఊహాజనితంగా అంచనా వేసి ఎక్కువ చార్జీలున్న శ్లాబును వర్తింపజేయడం అక్రమమని నిపుణులు అంటున్నారు. ఆటోమెటిక్‌గా శ్లాబులు మార్చి అధిక బిల్లులు జారీ చేసేలా మీటర్ రీడింగ్ యంత్రాల్లోని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం గమనార్హం. దీనిపై ఈఆర్సీ పరిశీలన జరపాలని నిపుణులు కోరుతున్నారు. శ్లాబులు మార్చడం అక్రమమే నెల దాటాక రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తే శ్లాబులు మారి బిల్లులు పెరుగుతున్నాయని గతంలో ఈఆర్సీని ఆశ్రయించాం. నెల దాటాక మీటర్ రీడింగ్ తీస్తే నెల రోజుల వినియోగాన్ని అంచనా వేసి శ్లాబును వర్తింపజేయాలని నాడు డిస్కంలకు ఈఆర్సీ ఆదేశించింది. నెల నిండక ముందే జారీ చేసే బిల్లులకూ డిస్కంలు ఈ ఉత్తర్వులను అక్రమంగా వర్తింపజేసి దోచుకుంటున్నాయి. వాడకాన్ని తగ్గించుకున్నా ఈ విధానం వల్ల ప్రయోజనం ఉండట్లేదు. దీన్ని డిస్కంలు ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటివరకు అధికంగా వసూలు చేసిన రూ. వందల కోట్ల బిల్లులను వినియోగదారులకు తిరిగివ్వాలి. –డి.నర్సింహారెడ్డి, విద్యుత్ రంగం నిపుణుడు వచ్చే నెల బిల్లుల్లో డబుల్ మోత ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి రానుండటంతో ఏప్రిల్ వినియోగానికి సంబంధించి వచ్చే మే నెలలో జారీ చేసే బిల్లులు భగ్గుమని మండబోతున్నాయి. ఈ పరిస్థితిలో నెల తిరగకుండానే మీటర్ రీడింగ్ తీసి తర్వాత శ్లాబునులను మార్చి బిల్లులు జారీ చేస్తే వినియోగదా రులపై డబుల్ భారం పడనుంది. -
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం
-
తెలంగాణలో ‘విద్యుత్’ షాక్.. ఛార్జీల పెంపు!
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై., వాణిజ్య వినియోగదారులకు 1రూ. పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఈఆర్సీElectricity Regulatory Commissionకి సమర్పించాయి డిస్కంలు. ఇక డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు అందించింది. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా.. ఈ భారమంతా వినియోగదారులైన ప్రజలపై పడనుంది. ఎల్.టీ (డొమెస్టిక్)కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా...రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్‌తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉంది. రైల్వే చార్జీలు,బొగ్గు,బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని టీఎస్ ఎస్పీడిఎసిఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్తున్నారు. -
విద్యుత్ ఉద్యోగులూ.. ఆందోళనొద్దు
సాక్షి, అమరావతి: ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయనే ప్రచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కొట్టిపడేశారు. విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) వేశాక జీతాలు తగ్గిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీథర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను సీఎండీలు, జేఏసీ నేతలు ‘సాక్షి’కి వివరించారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు.. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు అనవసర భయాలతో వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎండీలు తెలిపారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు కొనసాగుతాయని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు జీతాలుంటాయని వారు వెల్లడించారు. అలాగే కొత్తగా తీసుకొస్తున్న సర్వీస్ రెగ్యులేషన్స్ వల్ల కూడా జీతాలు తగ్గుతాయనే అనుమానాలున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. రెగ్యులేషన్స్ ఎప్పుడు అమల్లోకొస్తే ఆ రోజు నుంచి నియమితులైన ఉద్యోగులకే ఆ నిబంధనలు వర్తిస్తాయని, అవి రావడానికి ముందు ఉన్న ఉద్యోగులెవరికీ వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. సెక్షన్ 79సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్ 1948 ప్రకా>రం 1967లో రెగ్యులేషన్స్ రూపొందించారని, ఆపై దాని స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చిందన్నారు. దీనివల్ల పాతది వాడుకునేందుకు వీల్లేదని, ఒక బోర్డు రెగ్యులేషన్లను మరో బోర్డు మార్చేందుకూ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నారని వివరించారు. కేసులను ఎత్తివేస్తామన్నారు.. ఉద్యోగుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని బాలినేని, సజ్జల స్పష్టం చేసినట్టు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై ఉన్న దాదాపు 32 కేసులను తక్షణమే ఎత్తివేస్తామని వారు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర అంశాలపై చర్చించేందుకు వారంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారని చంద్రశేఖర్ వివరించారు. మీటర్ రీడర్లకు పీస్ రేటు(విద్యుత్ బిల్లులపై ఇచ్చే కమీషన్)ను త్వరలో పెంచేందుకు చర్యలు చేపడతామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు బాలకాశి, యూనియన్ నేతలు తెలిపారు. సచివాలయంలో వారిని కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మూడు కంపెనీల సీఎండీలు చర్చించి రేటుపై నిర్ణయం తీసుకోవాలని బాలినేని, సజ్జల ఆదేశించినట్టు జేఏసీ నేతలు చెప్పారు. డిస్కంల పరిధిలో ఉన్న దాదాపు 4,600 మంది రీడర్లకు డిస్కం పరిధిలోనే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సీఎండీలకు వారు సూచించినట్టు వివరించారు. -
ఏపీలో భళా.. దేశంలో డీలా!
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ బకాయిలను రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన బకాయిలను కఠిన నిబంధనల ద్వారానైనా వసూలయ్యేలా చూడాలని కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ కొనుగోళ్ల కోసం 2019–21 మధ్య విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దేశవ్యాప్తంగా రూ.95,104.9 కోట్లు దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు డిస్కంల మొత్తం బకాయిలు ఇప్పటివరకు రూ.95,104.9 కోట్లుగా ఉన్నాయి. డిస్కంలు ఆలస్యంగా చెల్లించడం వల్ల ఉత్పత్తి సంస్థలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి సంస్థలు బొగ్గు కోసం ముందస్తు చెల్లింపులు చేస్తాయి. నిర్వహణ కోసం ఉంచిన నిధులను బొగ్గు కొనుగోలుకు ఉపయోగించేయడం వల్ల క్రెడిట్ రేటింగ్ పడిపోతోంది. తర్వాత అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం (ఏపీపీ) ఆవేదన వ్యక్తం చేస్తోంది. బకాయిలు ఉన్నవారికి ప్లాంట్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పుడు వారు ఇతర వనరుల నుంచి విద్యుత్‌ను సేకరించుకుంటున్నారు. ఇది కష్టతరమయ్యేలా కఠిన నిబంధనలను విధించాలని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు (ఐపీపీ) కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పరిస్థితి వేరు ఏపీ డిస్కంలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం, సబ్సిడీలు సకాలంలో అందడం వల్లే ఇది సాధ్యమైంది. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.33,639.11 కోట్ల ఆర్థిక సాయం అందించి డిస్కంలను ఆదుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం వడ్డీలతో కలిపి సుమారు రూ.15 వేల కోట్లు ఏపీ జెన్కోకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.6,283.88 కోట్లు తెలంగాణ డిస్కంల నుంచే రావాల్సి ఉందని ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన వాయిదా
సాక్షి, హైదరాబాద్: వార్షిక ఆదాయ అవసరాలను (ఏఆర్ఆర్) తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో దాఖలు చేయకపోవడంతో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతానికి వాయిదా పడింది. ఏఆర్‌ఆర్‌ను దాఖలు చేయడానికి ముందే విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) భావించి, సీఎం ఆమోదం పొందేందుకు ప్రయత్నించాయి. అయితే సీఎం అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఏఆర్ఆర్ సమర్పణకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావును కోరగా, అందుకు అనుమతిచ్చినట్లు తెలిసింది. 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను ఏఆర్ ఆర్‌ను డిస్కమ్‌లు శనివారం ఈఆర్సీకి సమర్పిస్తాయనే ప్రచారం జరిగింది. 2019–20లో రూ.11వేల కోట్లు, 2020–21లో రూ.12వేల కోట్లు ఆదాయ లోటు ఉంటుందని డిస్కమ్‌లు అంచనా వేస్తున్నాయి. మరోవైపు వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ.13వేల కోట్ల బకాయిలను డిస్కమ్‌లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలను సవరించాలని ఈఆర్సీ స్టేట్ అడ్వైజరీ కమిటీలో కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వ శాఖల బకాయిలు విడుదల కాకపోవడం, చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతివ్వక పోవడాన్ని సంఘాలు తప్పు పట్టాయి. ఇదిలా ఉంటే ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మార్చి 1 వరకు సెలవులో ఉండటంతో, ఆయన విధుల్లో చేరిన తర్వాత డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేస్తాయని సమాచారం. -
బకాయిల ‘ఎత్తిపోత’
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(డిస్కం)కి బకాయిల షాక్. రాష్ట్రంలోని ప్రధాన ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,500 కోట్ల మేర బకాయిలను డిస్కంకు చెల్లించాలి. ఇందులో ఆగస్టు వరకు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద రూ.3,181.38 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తయినా, కొనసాగుతున్న 22 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 61.65 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 27.87 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రభుత్వ లక్ష్యం. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే 12,084 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం. ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు నిర్దేశిత ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. ఆయా ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 357 మోటార్లు ఉండగా, 217 పంపులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఏఎమ్మార్పీ కింద రూ.రూ.638 కోట్లు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎలిమి నేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ) నుంచి ఏటా 16.50 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నా రు. ఒక్క టీఎంసీకి రూ.8 కోట్ల మేర ఖర్చవుతోంది. ఈ మూడేళ్లలో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా ఇప్పటివరకు ఒక్క రూపా యి కూడా చెల్లించలేదు. ఈ ప్రాజెక్టుపైనే రూ.638 కోట్ల బకాయిలున్నాయి. ప్రతిసారి విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. అప్పుడప్పుడూ క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తోంది. అయితే, ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వస్థాయిలో మాట్లాడి బయటపడుతున్నారు. ఇతర ప్రాజెక్టులపై... గత ఏడాది నెట్టెంపాడు కింద 6.7 టీఎంసీ, బీమా 12 టీఎంసీ, కోయిల్‌సాగర్ 5 టీఎంసీ, కల్వకుర్తి 31 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. వీటి బిల్లులే రూ.957 కోట్ల మేర ఉండగా, ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో అన్ని ప్రాజెక్టుల కింద 30 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. దీంతో బకాయిలు రూ.1,650 కోట్లకు చేరాయి. మొత్తంగా మేజర్ ఇరిగేషన్ పథకాల కిందే రూ.3,181 కోట్లు, మైనర్ ఇరిగేషన్, ఐడీసీ పథకాల కింద మరో రూ.123 కోట్ల బకాయిలున్నాయి. వీటికి ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం ఎత్తిపోతలకు అయిన చార్జీలను కలిపితే మొత్తంగా రూ.3,500 కోట్ల మేర బకాయిలున్నట్లు లెక్క తేలుతోంది. -
‘విద్యుత్’పై ఎల్సీ వద్దు
సాక్షి, హైదరాబాద్: నిరంతర విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగేలా, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసేలా ఏకపక్ష నిబంధనలను తమపై రుద్దొద్దని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సమన్వయ కమిటీ (ఎస్సార్పీసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) జారీ చేశాకే డిస్కంలు కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు(సీజీఎస్), ఇతర ప్రైవేటు విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆం దోళన వ్యక్తం చేసింది. ఎస్సార్పీసీ చైర్మన్, కర్ణాటక ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.సెల్వ కుమార్ నేతృత్వంలో మంగళవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆరు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారులు పాల్గొని కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరఫున ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ. గోపాల్‌రావుతోపాటు పలువురు విద్యుత్ సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను తెలుపుతూ ఎస్.సెల్వ కుమార్ కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. లోడ్ సమతౌల్యతపై తీవ్ర ప్రభావం... దక్షిణాది రీజియన్‌లో చాలా వరకు డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) జారీ చేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు బ్యాలెన్స్ నిర్వహించ డం సాధ్యం కాదని సెల్వ కుమార్ లేఖలో స్పస్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఎల్సీ జారీ చేయలేదని కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు, ప్రైవేటు ప్లాంట్ల నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే విద్యుత్ సరఫరా లోడ్ సమతౌల్యతను పర్యవేక్షించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలతో పవర్ ఎక్సే్చంజీలు, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నుంచి అత్యవసర విద్యుత్ కొనుగోళ్లకు మార్గాలు సైతం మూసుకుపోతాయన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేస్తే ప్రధానంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదన్నారు. బొగ్గు రవాణా జరిపినందుకు రైల్వేలు, బొగ్గు కంపెనీలకు సకాలంలో బిల్లులు అందేలా తీసుకొచ్చిన ఈ నిబంధనలు మంచివేనని, కానీ వాటికి ముందే డిస్కంలకు బిల్లులు అందేలా నిబంధనలు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. డిస్కంలకు బిల్లులు అందితేనే అవి విద్యుత్ కంపెనీలకు బిల్లులు చెల్లించగలుగుతాయని గుర్తుచేశారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు... దక్షిణాదిన తీవ్ర వర్షాభావం నెలకొందని, గతేడాది ఇదే సమయానికి దక్షిణాది ప్రాంత రిజర్వాయర్లలో 6,629 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తికి సరిపడా నీటి నిల్వలుండగా ప్రస్తుతం 3,137 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి సరిపడా మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని కేంద్రం దృష్టికి సెల్వ కుమార్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భారీగా థర్మల్ విద్యుత్ కొనుగోళ్లు చేయక తప్పదని, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కొనుగోళ్లు సాధ్యం కావన్నారు. కేంద్రం ఇలాంటి నిబంధనలను తీసుకురావడానికి ముందే భాగస్వాములైన రాష్ట్రాల డిస్కంలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల అభిమతమని పేర్కొన్నారు. ఎల్సీ అంటే? డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్రాల డిస్కంలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లు చేసిన 60 రోజుల్లోగా వాటికి సంబంధించిన బిల్లులను విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లిస్తున్నాయి. అయితే ఆర్థిక సమస్యల వల్ల డిస్కంలు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోవడంతో అన్ని రాష్ట్రాల్లో బకాయిలు రూ. వేల కోట్లకు పెరిగిపోతున్నాయి. దీంతో బొగ్గు గనుల కంపెనీలు, రైల్వేకు విద్యుదుత్పత్తి కంపెనీలు సైతం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్నాయి. డిస్కంల నుంచి ఎప్పటికప్పుడు విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లులు అందేలా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్లను జారీ చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. విద్యుత్ కొనుగోళ్లకు ముందుగానే ఆ మేర డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసి ఎల్సీని విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డిస్కంలకు విద్యుత్ సరఫరా కానుంది. అయితే కొనుగోలు చేసిన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసి, నెలా రెండు నెలల తర్వాత వాటికి సంబంధవించిన బిల్లులను వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటేనే డిస్కంలకు ఆదాయం వస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
విద్యుత్ సంస్థలో అవినీతి చీకట్లు!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) అవినీతి పుట్టగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొంత మంది ఇంజినీర్లు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సైతం వీరిబాటలోనే నడుస్తున్నారు. దీంతో విసిగిపోయిన వినియోగదారులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఇద్దరు ఏఈలు, ఒక లైన్మెన్ ఏసీబీకి పట్టుబడ్డారు. అక్రమ మీటర్ల వ్యవహారంలో మరో ముగ్గురి(ఒక ఏఈ సహా లైన్మెన్, ఆర్టిజన్)పై వేటు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంస్థలో పెరిగిపోయిన అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఈ శాఖ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. ఆశించిన దానికంటే అధిక మొత్తంలో వేతనాలు పెంచినా అక్రమ వసూళ్ల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం గచ్చిబౌలికి చెందిన లైన్మెన్ ఎ.రాజేందర్ ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఆ తర్వాత ఏడీఈ, ఏఈలను కూడా ఏసీబీ విచారించింది. నిబంధనల ప్రకారం మీటర్లు, ప్యానల్ బోర్డు కోసం నిర్దేశించిన చార్జీలను వినియోగదారులు డిస్కంకు చెల్లించినప్పటికీ నెల రోజులుగా మీటర్లు జారీ చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఇందులో పెద్ద తలకాయల ప్రమేయం కూడాఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పెట్టిన ఖర్చులు సంపాదించుకునేందుకే.. ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా డిస్కంలో పనిచేసే ప్రదేశాలను యాజమాన్యమే ‘ఫోకల్.. నాన్ ఫోకల్’ కేటగిరీలుగా విభజించింది. ఆదాయం తక్కువగా ఉన్న ప్రాంతాలను నాన్‌ఫోకల్‌గా, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఫోకల్‌గా పేర్కొంటున్నారు. బదిలీ సమయంలో ఫోకల్(కొత్త నిర్మాణాలు, కొత్త వెంచర్లు అధికంగా ఉండే ప్రదేశాలు) పోస్టు కోసం ఏఈలు, ఏడీఈలు, డీఈలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. రాజకీయ పెద్దలకు, ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో చెల్లించి పోస్టింగ్‌లు పొందడం డిస్కంలో అందరికీ తెలిసిన తతంగమే. ముఖ్యంగా శివారు ప్రాంతలైన గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, సరూర్‌నగర్, చంపాపేట్, శంషాబాద్, హబ్సిగూడ, బోయిన్పల్లి, కూకట్‌పల్లితో పాటు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ఇంజినీర్లు పోటీ పడుతుంటారు. పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఇలా పెట్టిన ఖర్చులను తిరిగి సంపాధించుకునేందుకు ఆ తర్వాత అడ్డదారులు తొక్కతున్నారు. కొత్త మీటర్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ షిష్టింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లలో కొత్త లైన్ల ఏర్పాటు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్తాయి కార్మికులను ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ఎవరైనా పట్టుబడినప్పుడు తమకేమీ సంబంధం లేదని పెద్దలు తప్పించుకుంటే కిందిస్థాయి సిబ్బందిపై వేటు పడుతోంది. పెద్దల పనికి చిరుద్యోగులు బలి ఓల్డ్ బోయిన్పల్లి సెక్షన్ పరిధిలో రోలింగ్ స్టాక్‌లోని 130 మీటర్లును మాయం చేసి, గుట్టుచప్పుడు కాకుండా వినియోగదారుల నివాసాలకు అమర్చిన ఘటనలో లైన్మెన్ రమేషాచారి సహా ఏఈ వినోద్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఈ విషయంలో ఏడీఈ, డీఈలకు సంబంధం లేదన్నట్లు వదిలేశారు. అదే విధంగా సరూర్‌నగర్ డివిజన్ హయత్‌నగర్ సెక్షన్ పరిధిలో హెచ్‌టీ మీటర్ల జారీలోనూ అక్రమాలు జరిగాయి. ఒకే సర్వీసు నెంబర్‌తో ఉన్న మీటర్‌ను అధిక మొత్తంలో రీడింగ్ నమోదైన ప్రతిసారి సాంకేతిక అంశాలను కారణాలుగా చూపి ఎనిమిదిసార్లు మార్చారు. అంతేగాక డిస్కంను ఏమార్చిన వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లులను సొంత ఖాతాలో జమ చేసుకున్నారు. ఈ ఘటనపై ఓ ఆర్టిజన్ కార్మికుపై డిస్కం వేటు వేసి విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ అంశంలో సంబంధత డివిజన్ ఉన్నతాధికారులకు ప్రమోయం ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం వెనకాడుతుండుతోంది. యాజమాన్యమే అక్రమార్కులకు కొమ్ముకాస్తోందని సంస్థలోని ఉద్యోగులే విమర్శిస్తున్నారంటే ‘డిస్కం’ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి డీఈ, ఏడీఈ, ఏఈలకు తెలియకుండా కొత్త మీటర్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు సాధ్యం కాదు. ఒకవేళ మంజూరు చేసినా వెంటనే తెలిసిపోతుంది. నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఛార్జీలను వినియోగదారుడు సంస్థకు చెల్లించిన తర్వాత గడువులోగా వాటిని మంజూరు చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే కారణాలు అన్వేశించాల్సిన బాధ్యత సదరు ఉన్నతాధికారులదే. ఉన్నతాధికారులే ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తుండడంతో వినియోగదారులు తమ బాధతలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. -
కరెంటోళ్ల కక్కుర్తి
సాక్షి, సిటీబ్యూరో: నెలకు లక్షన్నరకుపైగా వేతనం పొందే ఇంజనీర్లు సొంతంగా ఓ కారు కొనుక్కోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే అధికారి సొంతకారులో ఆఫీసుకు వస్తూ ఏజెన్సీ నుంచి అద్దెకు తీసుకున్న టాక్సీప్లేట్‌లో వచ్చినట్లు తప్పుడు బిల్లులు చూపించి డిస్కం ఖజానాకు గండికొడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత హోదాలో ఉన్న అధికారులకు సీఎండీ, సహా డైరెక్టర్లకు ఇన్నోవా వాహనాలు సమకూర్చింది. చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం), సూపరింటిండెంట్ ఇంజనీర్(ఎస్ఈ), డివిజనల్ ఇంజనీర్(డీఈ), ఇతర అధికారులకు ఏజెన్సీల ద్వారా అద్దె వాహనాలను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు నిబంధనలు రూపొందించింది. ఏడాదికి ఒక్కో వాహనానికి రూ.3.80లక్షలు చెల్లిస్తుంది. అయితే కొంతమంది ఇంజనీర్లు ఇక్కడే కక్కుర్తిని ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉపయోగపడాల్సిన వాహనాలు ఇంజనీర్ల వారంతపు విహారయాత్రలకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు సంబంధిత అధికారులే స్వయంగా వా హనాలు నడుపుతుండటం వల్ల డ్రైవర్లకు ఉపాధి లభించకుండా పోతోంది. నిరుద్యోగుల పొట్టకొడుతున్నడిస్కం ఇంజనీర్లు: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న కొంత మంది సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు సొంత వాహనాలను అద్దె వాహనాల జాబితాలో చేర్చి డిస్కం నుంచి బిల్లులు తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సమయంలో అందరికీ ఉపయోగపడాల్సిన ఈ వాహనాలు ఉన్నతాధికారుల ఇళ్లకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఈల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. అత్యవసర సమయంలో వారే స్వయంగా ఆటోలను అద్దెకు తీసుకుని ఘటనా స్థలాలకు చేరుకోవాల్సి వస్తుం ది. ఉన్నతాధికారి సొంతవాహనం కావడంతో క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో వినియోగానికి కిందిస్థాయి అధికారులు వెనుకాడుతున్నారు. అదే లీజుకు తీసుకున్నదైతే అందరికీ అందుబాటులో ఉండేది. కార్మికుల పొట్టకొడుతున్నారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఏజెన్సీ నుంచి తీసుకున్న అద్దెకార్లు కాకుండా సొంత వాహనాలను టాక్సీ ప్లేట్‌గా చూపించి డిస్కం నుంచి నెలనెలా అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. పరోక్షంగా నిరుద్యోగుల పొట్టగొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంజనీర్లు తాము వాడుతున్న వాహనాలకు టాక్సీప్లేట్ పెట్టకపోవడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రవాణా పన్నులు కూడా ఎగవేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటి ఫిర్యాదు కూడా చేశాం. –నాగరాజు, అధ్యక్షుడు,తెలంగాణ కాంట్రాక్ట్‌విద్యుత్ కార్మికుల సంఘం జేఏసీ -
‘రూఫ్ టాప్ సోలార్’ జగడం!
సాక్షి, హైదరాబాద్: కార్యాలయాల పై కప్పులపై (రూఫ్ టాప్) సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవహారం రెండు ప్రభుత్వ సంస్థల మధ్య వివాదం రేపుతోంది. ఈ విధానాన్ని ప్రోత్సహించాలని సంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదన విభాగం(నెడ్‌క్యాప్) కసరత్తు చేస్తుంటే, భద్రతపరంగా దీన్ని స్వాగతించలేమని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్) అంటున్నాయి. రాష్ట్రంలో రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానళ్లు ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలను నెడ్‌క్యాప్ గుర్తించింది. నెట్ మీటరింగ్ ఏర్పాటు కోసం డిస్కమ్‌లకు ప్రతిపాదనలు పంపింది. భద్రతపరమైన అంశాలను పరిశీలించే విభాగం సమగ్ర నివేదిక ఇవ్వకుండా దీన్ని అంగీకరించలేమని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి. టార్గెట్లు పూర్తి చేయాలని నెడ్‌క్యాప్ తొందపడుతుండగా, ప్రాణభయం ఉందంటూ అడ్డుకోవడానికి డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. డిస్కమ్‌ల లైన్లకే సోలార్ విద్యుత్ వెళ్తుంది. ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను డిస్కమ్‌లే కొనుగోలు చేయాలి. కాబట్టి వాటి నుంచి అనుమతి తప్పనిసరి. కానీ, డిస్కమ్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పంచాయితీ కేంద్ర ఇంధన శాఖకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. డిస్కమ్‌ల అభ్యంతరాలను కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాసేందుకు నెడ్‌క్యాప్ సన్నాహాలు చేస్తోంది. -
డిస్కంకు నోటీసులు పంపండి
న్యూఢిల్లీ: తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ డిస్కంకు నోటీసులు జారీ చేయాలంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) మేయర్ యోగేందర్ చందోలియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంస్థ ఈ ఏడాది జనవరి నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లింపులో జాప్యం జరిగినందువల్ల జరిమానా విధిస్తామంటూ సదరు నోటీసుద్వారా టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్)ను హెచ్చరించాలని ఆదేశించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) కింద బకాయిపడిన సంస్థకు 20 శాతం వరకూ జరిమానా విధించవచ్చన్నారు. ఇదే విషయమై ఎన్డీఎంసీ చైర్మన్ భరద్వాజ్ మాట్లాడుతూ డిస్కం సంస్థ రాబడి వచ్చిన 40 రోజుల్లోగా పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే టీపీడీడీఎల్ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి టీపీడీడీఎల్ తమకు పన్ను చెల్లించలేదన్నారు. డిస్కం సంస్థ నిబంధనల ప్రకారం పనిచేయడం లేదన్నారు. -
పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులపై మళ్లీ భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించింది. యూనిట్‌కు 50 పైసలు నుంచి రూపాయి వరకు వివిధ కేటగిరీల్లో ఛార్జీలు పెంచనున్నారు. వినియోగదారులపై 9,339 కోట్ల రూపాయలు భారం పడనుంది. 0 - 150 యూనిట్ల వరకు 50 పైసలు పెంచనున్నారు. చిన్న చిన్న పరిశ్రమలకు, ఎల్టీ, కమర్షియల్ కేటగిరికి యూనిట్‌కు రూపాయి పెంచుతారు. కస్టమర్ ఛార్జీలు 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచుతారు. భారీ పరిశ్రమలకు యూనిట్‌కు 50 పైసలు పెరగనుంది. ఇప్పటికే కిరణ్ ప్రభుత్వంలో ప్రజలపై 24,204 కోట్ల రూపాయల భారం పడింది. ఛార్జీల పెంపు ద్వారా 12,500 కోట్లు రూపాయలు, సబ్ ఛార్జీల ద్వారా 11,704 కోట్ల రూపాయలు భారం పడింది.