సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ బకాయిలను రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన బకాయిలను కఠిన నిబంధనల ద్వారానైనా వసూలయ్యేలా చూడాలని కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ కొనుగోళ్ల కోసం 2019–21 మధ్య విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి.
దేశవ్యాప్తంగా రూ.95,104.9 కోట్లు
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు డిస్కంల మొత్తం బకాయిలు ఇప్పటివరకు రూ.95,104.9 కోట్లుగా ఉన్నాయి. డిస్కంలు ఆలస్యంగా చెల్లించడం వల్ల ఉత్పత్తి సంస్థలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి సంస్థలు బొగ్గు కోసం ముందస్తు చెల్లింపులు చేస్తాయి. నిర్వహణ కోసం ఉంచిన నిధులను బొగ్గు కొనుగోలుకు ఉపయోగించేయడం వల్ల క్రెడిట్ రేటింగ్ పడిపోతోంది.
తర్వాత అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం (ఏపీపీ) ఆవేదన వ్యక్తం చేస్తోంది. బకాయిలు ఉన్నవారికి ప్లాంట్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పుడు వారు ఇతర వనరుల నుంచి విద్యుత్‌ను సేకరించుకుంటున్నారు. ఇది కష్టతరమయ్యేలా కఠిన నిబంధనలను విధించాలని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు (ఐపీపీ) కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో పరిస్థితి వేరు
ఏపీ డిస్కంలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం, సబ్సిడీలు సకాలంలో అందడం వల్లే ఇది సాధ్యమైంది. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇచ్చేసింది.
ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.33,639.11 కోట్ల ఆర్థిక సాయం అందించి డిస్కంలను ఆదుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం వడ్డీలతో కలిపి సుమారు రూ.15 వేల కోట్లు ఏపీ జెన్‌కోకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.6,283.88 కోట్లు తెలంగాణ డిస్కంల నుంచే రావాల్సి ఉందని ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్ ‘సాక్షి’కి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment