power surplus
-
ఏపీలో భళా.. దేశంలో డీలా!
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ బకాయిలను రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన బకాయిలను కఠిన నిబంధనల ద్వారానైనా వసూలయ్యేలా చూడాలని కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ కొనుగోళ్ల కోసం 2019–21 మధ్య విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దేశవ్యాప్తంగా రూ.95,104.9 కోట్లు దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు డిస్కంల మొత్తం బకాయిలు ఇప్పటివరకు రూ.95,104.9 కోట్లుగా ఉన్నాయి. డిస్కంలు ఆలస్యంగా చెల్లించడం వల్ల ఉత్పత్తి సంస్థలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి సంస్థలు బొగ్గు కోసం ముందస్తు చెల్లింపులు చేస్తాయి. నిర్వహణ కోసం ఉంచిన నిధులను బొగ్గు కొనుగోలుకు ఉపయోగించేయడం వల్ల క్రెడిట్ రేటింగ్ పడిపోతోంది. తర్వాత అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం (ఏపీపీ) ఆవేదన వ్యక్తం చేస్తోంది. బకాయిలు ఉన్నవారికి ప్లాంట్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పుడు వారు ఇతర వనరుల నుంచి విద్యుత్‌ను సేకరించుకుంటున్నారు. ఇది కష్టతరమయ్యేలా కఠిన నిబంధనలను విధించాలని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు (ఐపీపీ) కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పరిస్థితి వేరు ఏపీ డిస్కంలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం, సబ్సిడీలు సకాలంలో అందడం వల్లే ఇది సాధ్యమైంది. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.33,639.11 కోట్ల ఆర్థిక సాయం అందించి డిస్కంలను ఆదుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం వడ్డీలతో కలిపి సుమారు రూ.15 వేల కోట్లు ఏపీ జెన్కోకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.6,283.88 కోట్లు తెలంగాణ డిస్కంల నుంచే రావాల్సి ఉందని ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు!
క్రిప్టోకరెన్సీకి భారీ మార్కెట్ అవుతుందేమోనని భావించిన చైనా.. దానిని పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదంటూ బ్యాన్‌తో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూర్ఖంగా ముందుకు పోతోందంటూ విమర్శలు సైతం వినిపించాయి. అయితే ఆ నిర్ణయం సరైందేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు కొన్ని దేశాలు. ఈ ఏడాది మే నెలలో చైనా స్టేట్ కౌన్సిల్ ఏకంగా బిట్‌కాయిన్ మైనింగ్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు వెలువడుతాయని ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని, పైగా ఎనర్జీ విపరీతంగా ఖర్చై కరెంట్ కొరతలు ఏర్పడతాయని ప్రకటించుకుంది చైనా. ఆపై ఏకంగా క్రిప్టోకరెన్సీలను మొత్తంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రిప్టోకరెన్సీ తయారీ కోసం ఇంతకాలం చైనాలో థర్మల్ కేంద్రాలపై ఆధారపడ్డ క్రిప్టోకరెన్సీ కంపెనీలు.. నిషేధం దెబ్బకు వేరే దేశాలకు క్యూ కట్టాయి. ఇదే ఇప్పుడు కొత్త సమస్యకు కారణమైంది. చైనాకు పొరుగున ఉన్న దేశాలతో ఖర్చు ఎంతైనా పర్వాలేదనుకుని ఒప్పందాలు చేసుకుంటున్నాయి క్రిప్టో కంపెనీలు. అయితే ఒప్పందాలు చేసుకున్న దేశాలు ఇప్పుడు నాలిక కర్చుకుంటున్నాయి. సాధారణంగా క్రిప్టోకరెన్సీ ఉత్పత్తికి భారీ స్థాయిలో ఎనర్జీ అవసరం పడుతుంది. ఇది ఊహించని కజకిస్తాన్ లాంటి దేశాలు కరెంట్ కోతలను అనుభవిస్తున్నాయి. కంప్యూటర్ ఫామ్‌లకు నెలవైన కజకిస్తాన్‌లో ఇప్పుడు పట్టుమని నాలుగైదు గంటల సేపు కూడా పవర్ ఉండడం లేదు. దీనికితోడు ఏర్పడిన కోతలను అధిగమించేందుకు రష్యా నుంచి అధిక ధరలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది కజకిస్తాన్. ఊహించని పరిణామాల నడుమ నష్టనివారణ చర్యలు చేపట్టింది కజకిస్తాన్ ప్రభుత్వం. 2022 జనవరి నుంచి క్రిప్టోమైనింగ్‌కు అవసరమైన విద్యుత్ సప్లయ్‌కి కఠిన నిబంధనలను విధించబోతోంది. రేషన్ విధానంలో క్రిప్టో మైనర్లకు విద్యుత్ అందిస్తామని కజకిస్తాన్ గ్రిడ్ ఆపరేటర్ స్పష్టం చేసింది.ఒక్క కజకిస్తాన్ మాత్రమే కాదు.. ముప్ఫైకి పైగా దేశాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. క్లిక్ చేయండి: తెలివైన అడుగు.. అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ల తయారీ -
ఢిల్లీలో రెండేళ్లలో మిగులు
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో నగరంలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు. ఈ ఏడాది వేసవి కాలంలో నగరం విపరీతమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ..మరో రెండేళ్ల తర్వాత నగరవాసులు డీజిల్ జనరేటర్ల శబ్దాన్ని వినే అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఢిల్లీవాసులకు దీన్ని ‘ముంబైకర్ (గోయల్)’ గిఫ్ట్‌గా ఆయన చమత్కరించారు. జాతీయ రాజధానిలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుతం నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలహీనంగా ఉందని ఆరోపించారు. గత దశాబ్దంన్నర కాలంగా ప్రభుత్వాలు పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. దీంతో గ్రిడ్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగి, వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని గోయల్ విమర్శించారు. దీన్ని పునరుద్ధరించరించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన వివరించారు. వ్యాపారులను ఇబ్బందిపెట్టిన ఆప్ సర్కార్ తన 49 రోజుల పాలనలో సామాన్య వ్యాపారులను ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం దాడులతో ఇబ్బంది పెట్టిందని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్ ప్రభుత్వం హయాంలో వ్యాపారవర్గాలపై 151 సార్లు దాడులు నిర్వహించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వీటిలో 39 శాతం దాడులు సామాన్య వ్యాపారులపైనా, 25 శాతం వ్యాపారవేత్తలపైనే జరిగాయని తెలిపారు. అలాగే 8 శాతం దాడులు ఐటీ పరిశ్రమలపై, నాలుగు శాతం ప్రింటింగ్, స్టేషనరీ సంస్థలపై జరిగాయని ఆయన వివరించారు. వాస్తవాలు ఇలా ఉండగా, తాము వ్యాపారులతో స్నేహంగా ఉంటామని కేజ్రీవాల్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా, బ్యాటరీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశ్వనీ సెహ్గల్, కోశాధికారి పవన్ కప్పడ్ తదితరులు గురువారం బీజేపీలో చేరారు. అలాగే ఢిల్లీ ట్యాక్సీ, టూరిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ సామ్రాట్, జేసీ సర్దార్ మల్కిట్ సింగ్ కూడా బీజేపీ తీర్థం తీసుకున్నట్లు సతీష్ తెలిపారు.