న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో నగరంలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు. ఈ ఏడాది వేసవి కాలంలో నగరం విపరీతమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ..మరో రెండేళ్ల తర్వాత నగరవాసులు డీజిల్ జనరేటర్ల శబ్దాన్ని వినే అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఢిల్లీవాసులకు దీన్ని ‘ముంబైకర్ (గోయల్)’ గిఫ్ట్‌గా ఆయన చమత్కరించారు. జాతీయ రాజధానిలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుతం నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలహీనంగా ఉందని ఆరోపించారు. గత దశాబ్దంన్నర కాలంగా ప్రభుత్వాలు పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. దీంతో గ్రిడ్‌లపై విపరీతమైన ఒత్తిడి పెరిగి, వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని గోయల్ విమర్శించారు. దీన్ని పునరుద్ధరించరించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన వివరించారు.
వ్యాపారులను ఇబ్బందిపెట్టిన ఆప్ సర్కార్
తన 49 రోజుల పాలనలో సామాన్య వ్యాపారులను ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం దాడులతో ఇబ్బంది పెట్టిందని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్ ప్రభుత్వం హయాంలో వ్యాపారవర్గాలపై 151 సార్లు దాడులు నిర్వహించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వీటిలో 39 శాతం దాడులు సామాన్య వ్యాపారులపైనా, 25 శాతం వ్యాపారవేత్తలపైనే జరిగాయని తెలిపారు. అలాగే 8 శాతం దాడులు ఐటీ పరిశ్రమలపై, నాలుగు శాతం ప్రింటింగ్, స్టేషనరీ సంస్థలపై జరిగాయని ఆయన వివరించారు. వాస్తవాలు ఇలా ఉండగా, తాము వ్యాపారులతో స్నేహంగా ఉంటామని కేజ్రీవాల్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా, బ్యాటరీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశ్వనీ సెహ్గల్, కోశాధికారి పవన్ కప్పడ్ తదితరులు గురువారం బీజేపీలో చేరారు. అలాగే ఢిల్లీ ట్యాక్సీ, టూరిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ సామ్రాట్, జేసీ సర్దార్ మల్కిట్ సింగ్ కూడా బీజేపీ తీర్థం తీసుకున్నట్లు సతీష్ తెలిపారు.
ఢిల్లీలో రెండేళ్లలో మిగులు
Published Thu, Jan 8 2015 11:05 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement