Gujarat AAP Chief Gopal Italia Arrested Over Controversial Comments On PM Modi - Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌కు షాక్.. గుజరాత్ పార్టీ చీఫ్ అరెస్టు

Published Thu, Oct 13 2022 3:37 PM | Last Updated on Thu, Oct 13 2022 6:15 PM

Gujarat Aap Chief Gopal Italia Arrested For Remarks Against Modi - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను సరిత విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2019 నాటి ఓ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జాతీయ మహిళా కమిషన్‌ గోపాల్‌కు సమన్లు పంపింది. అయితే తనను అరెస్టు చేసిన అనంతరం గోపాల్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖ శర్మ తనను జైల్లో పెడతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం పటేల్ సామాజికి వర్గాన్ని జైలుకు పంపడం తప్ప ఇంకేం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీకి పాటీదార్లంటే ద్వేషమని ఆరోపించారు. తాను సర్దార్ పటేల్ వంశానికే చెందిన వాడినని, జైలు అంటే భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

గోపాల్‌కు సమన్లు పంపిన అనంతరం తన కార్యాలయం ఎదుట ఆప్ గూండాలు రచ్చ చేస్తున్నారని ఎన్‌సీడబ్ల్యూ ఛైర్మన్ రేఖ శర్మ్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను కూడా షేర్ చేశారు.

గోపాల్ ఇటాలియా అరెస్టును ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. మొత్తం బీజేపీ ఆయన వెనకాలే ఎందుకు పడుతోందని ధ్వజమెత్తారు. గోపాల్‌ను లక్ష‍్యంగా చేసుకునేందుకు పాత  వీడియోను తీసుకుని ఆయనను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. 

నవంబర్‌ లేదా డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో  దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైన సత్తా చాటాలని ఆప్ భావిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆప్‌కు లభిస్తున్నఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీ గోపాల్‌ను అరెస్టు చేసిందని ఆ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే గోపాల్‌ను నిర్బంధించిన మూడు గంటల తర్వాత పోలీసులు విడుదల చేశారు.
చదవండి: రాణా అయ్యుబ్‌కు ఈడీ షాక్.. మనీలాండరింగ్‌పై ఛార్జ్‌షీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement