న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆయన చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
కాగా ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలను వెల్లడించాలని 2016లో తొలిసారి కేజ్రీవాల్ డిమాండ్ చేయడంతో.. ఈ వివాదం ప్రారంభమైంది. అయితే కేజ్రీవాల్ డిమాండ్‌కు ప్రతి స్పందనగా సమాచార హక్కు చట్టం కింద అందించాలంటూ ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఆదేశించింది. అయితే గుజరాత్ హైకోర్టు సీఐసీ ఉత్తర్వును కొట్టివేసింది. సమాచారాన్ని విడుదల చేయకుండా అడ్డుకుంది.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ బహిరంగంగా, విలేకరుల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుజరాత్ యూనివర్సిటీ కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేసింది. మోదీ విద్యా ప్రమాణాలు, ముఖ్యంగా గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందడంపై ప్రశ్నిస్తూ.. చేసిన వ్యాఖ్యలను గుజరాత్ యూనివర్సిటీ అవమానకరమైనవిగా, తమ పరువు ప్రతిష్టకు భంగం కలించేవిగా భావించింది.
ఈ నేపథ్యంలో యూనివర్సిటీ రిజిష్ట్రర్ పీయూష్ పటేల్ కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేత సంజయ్ సింగ్‌పై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్, ఆప్‌కి చెందిన సంజయ్ సింగ్‌లకు గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను కొట్టి వేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment