![Delhi Elections 2025: Narendra Modi Sarkar Master Stroke To Arvind Kejriwal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Modi_Kejriwal.jpg.webp?itok=myt4Ctu8)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు నిశ్చయించుకున్న బీజేపీ వ్యూహాలు పని చేశాయి. దేశరాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తన ‘బాణాన్ని’ ప్రచారం చివరి దశలో గురి చేసి వదిలారు. ఆ దెబ్బకే కేజ్రీవాల్ సర్కారు ఓటమి దాదాపు ఖరారై పోయింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా గత వారమే విశ్లేషకులు అభివర్ణించారు.
గత వారం.. సరిగ్గా శనివారం నాడే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టించింది. . ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనా నేడు(శనివారం) అక్షరాలా నిజమైంది.
మాస్టర్ స్ట్రోక్!
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ(BJP) మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది.
దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమైంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది.
ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది.
ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసింది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడ్డాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది బీజేపీకి బాగా అనుకూలంగా మారిందని, అందుచేతే ఆప్‌కు గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.
ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవ్వడం ఆ పార్టీ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి కేజ్రీవాల్ ఓటమి చెందారు.ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. ఇది కేజ్రీవాల్‌కు మైనస్‌గా మారింది.
అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టించాయి. . వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరిచారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు కేజ్రీవాల్.
నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసిరారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొట్టగా, ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్‌కు వరంలా మారింది.
Comments
Please login to add a commentAdd a comment