ఆప్, బీజేపీ పరస్పరం ఆరోపణలు
న్యూఢిల్లీ: అద్దాల మేడ(శీష్ మహల్)లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివసించారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ రాజ మహల్‌లో విలాస జీవితం గడుపుతున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. ఈ బంగ్లాల వ్యవహారంలో బుధవారం ఢిల్లీలో హైడ్రామా నెలకొంది.
ప్రజల సొమ్ముతో అద్దాల మేడలో కేజ్రీవాల్ ఖరీదైన ఏర్పాట్లు చేసుకున్నారని బీజేపీ విమర్శిస్తున్న నేపథ్యంలో నిజానిజాలను ప్రజలకు తెలియజేయడానికి ఆప్ అగ్రనేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తమ అనుచరులతో కలిసి మీడియాను వెంటబెట్టుకొని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని ఈ బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలిపారు.
బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని చెప్పారు. శీష్ మహల్ లోపల ఏముందో చూసేందుకు బీజేపీ నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఎక్కడున్నాయో చూపించాలని నిలదీశారు. ప్రధాని మోదీ అధికార నివాసం ఒక రాజమహల్ అని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీని కోసం రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ రాజ మహల్‌లోకి మీడియాను అనుమతించే దమ్ముందా? అని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు.
సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ప్రధాని నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్ సమీపంలో బైఠాయించారు. మరోవైపు బీజేపీ నాయకులు ఢిల్లీ సీఎం ఆతిశీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఏబీ 17 మథుర రోడ్‌లోని బంగ్లాను మీడియాకు చూపించారు. ఇప్పటికే అధికారిక బంగ్లాను కేటాయించగా, మరో బంగ్లా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. బంగ్లాల సందర్శన పేరిట ఆప్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment