saurabh bharadwaj
-
మీది శీష్ మహల్.. మీది రాజమహల్
న్యూఢిల్లీ: అద్దాల మేడ(శీష్ మహల్)లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివసించారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ రాజ మహల్లో విలాస జీవితం గడుపుతున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. ఈ బంగ్లాల వ్యవహారంలో బుధవారం ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. ప్రజల సొమ్ముతో అద్దాల మేడలో కేజ్రీవాల్ ఖరీదైన ఏర్పాట్లు చేసుకున్నారని బీజేపీ విమర్శిస్తున్న నేపథ్యంలో నిజానిజాలను ప్రజలకు తెలియజేయడానికి ఆప్ అగ్రనేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తమ అనుచరులతో కలిసి మీడియాను వెంటబెట్టుకొని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని ఈ బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలిపారు. బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని చెప్పారు. శీష్ మహల్ లోపల ఏముందో చూసేందుకు బీజేపీ నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఎక్కడున్నాయో చూపించాలని నిలదీశారు. ప్రధాని మోదీ అధికార నివాసం ఒక రాజమహల్ అని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీని కోసం రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ రాజ మహల్లోకి మీడియాను అనుమతించే దమ్ముందా? అని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ప్రధాని నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్ సమీపంలో బైఠాయించారు. మరోవైపు బీజేపీ నాయకులు ఢిల్లీ సీఎం ఆతిశీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఏబీ 17 మథుర రోడ్‌లోని బంగ్లాను మీడియాకు చూపించారు. ఇప్పటికే అధికారిక బంగ్లాను కేటాయించగా, మరో బంగ్లా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. బంగ్లాల సందర్శన పేరిట ఆప్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. -
సీఎం అతిషీతో పాటు ప్రమాణం.. ఐదుగురు మంత్రుల వివరాలివే..
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆమె చేత ప్రమాణం చేయించారు. కాగా ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన అతిపిన్క వియస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.అతిషీ పాటు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ దళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతిశీ తల్లిదండ్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.మంత్రుల వివరాలుగోపాల్ రాయ్..ఆయన ఢిల్లీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ హయాంలో పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి సాధారణ పరిపాలన శాఖను నిర్వర్తించారు. ఆలాగే ఆప్ ఢిల్లీ రాష్ట్ర విభాగానికి కన్వీనర్‌గా కూడా ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలోని బాబాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కైలాష్ గహ్లోత్.. 2015లో నజఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు తొలిసారి ఎన్నికలయ్యారు. కేజ్రీవాల్ పదవీకాలంలో పరిపాలనా సంస్కరణలు, రవాణా, రెవెన్యూ, చట్టం, న్యాయం, శాసనసభ వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.సౌరభ్ భరద్వాజ్.. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటక-కళా సంస్కృతి భాషలు, పరిశ్రమలు, నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇమ్రాన్ హుస్సేన్.. ఢిల్లీ క్యాబినెట్లో ఆహార, పౌర సరఫరాలు, ఎన్నికల మంత్రిగా పనిచేస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో బల్లిమారన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఐదుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు.ముకేశ్ అహ్లావత్.. ఢిల్లీలోని సుల్తాన్పూర్ మజ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ముకేశ్ మంత్రివర్గంలో చేరారు. కాగా గత ఏప్రిల్‌లో ఆనంద్ కుమార్ ఆప్‌కు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. సుల్తాన్పూర్ మజ్రా నుంచి 2020లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్లావత్.. 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
వారంలోపు ఢిల్లీకి కొత్త సీఎం: సౌరభ్ భరద్వాజ్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరం ఢిల్లీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ సీఎం పీఠంలో ఎవరు కూర్చోబోతున్నారనే చర్చ మొదలైంది. మరోవైపు.. మంత్రి అతిశీ, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్ వంటివారు తదుపరి సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేత, రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పిస్తారు. రాజీనామా ఆమోదించిన వెంటనే శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటాం. ఎన్నికైన నాయకుడి పేరును లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా మా వెంటే ఉన్నారు. మాకు స్పష్టమైన సంఖ్యా బలం ఉంది. మేము ఎంపిక చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రి ఎంపిక మొత్తం ప్రక్రియను వారంలోపు పూర్తి చేస్తాం’’ అని అన్నారు.#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj says, "Tomorrow, Chief Minister (Arvind Kejriwal) will submit his resignation and as soon as the resignation is accepted, there will be a meeting of the legislative party, the legislative party will elect a leader. The… pic.twitter.com/xmPu3X9gY7— ANI (@ANI) September 16, 2024చదవండి: కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే! -
ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేస్తోంది: బీజేపీపై ఢిల్లీ మంత్రి ఫైర్
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు 'అరవిందర్ సింగ్ లవ్లీ' శనివారం బీజేపీలో చేరారు. ఈ సంఘటనపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు.సౌరభ్ భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇండియా కూటమితో ఆప్ భాగస్వామి అయినప్పుడు, పొత్తుకు నిరసనగా ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ రాజీనామా చేశారు. ఆ సమయంలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని మేము ఊహించామని ఆయన అన్నారు.ఇదంతా బీజేపీ రాజకీయం. భారతీయ జనతా పార్టీ.. ప్రతిపక్ష పార్టీలను విచ్చిన్నం చేస్తోంది. ఏది ఏమైనా ఇండియా కూటమి ఢిల్లీలో మొత్తం 7 సీట్లను గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ బీజేపీలో చేరిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా తర్వాత మద్దతుదారులను, అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలను కలిసినప్పుడు, ఇంట్లో కూర్చోవద్దని, ఢిల్లీ ప్రజల కోసం పోరాడటానికి బలమైన పార్టీలో చేరాలని తనను కోరినట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు. -
ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఎన్నికల ప్రచారానికి గైర్హాజరు కావడంపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. రాఘవ్ చద్దా కంటి శస్త్ర చికిత్స కోసం యూకేలో ఉన్నారని తెలిపారు. రాఘవ్ కళ్లకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స పొందేందుకు యూకే వెళ్లారు. సమస్య తీవ్రమైనదని, సకాలంలో చికిత్స అందించకపోతే అంధత్వం వచ్చే అవకాశం ఉందని రాఘవ్ చద్దా తన చెప్పారంటూ భరద్వాజ్ వెల్లడించారు.రాఘవ్ చద్దా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కోలుకున్న వెంటనే ఆయన ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. చికిత్స కోసం భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నాటి నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్ధులకు మద్దతుగా సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయడంతో పాటు ఇతర పరిణామాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందిస్తూ వస్తున్నారు. -
కేజ్రీవాల్ సతీమణిపై ‘ఆప్’ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఒక గ్లూ(జిగురు) అని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీలకుండా కలిపి ఉంచుతున్నారని కొనియాడారు. ‘సునీతా కేజ్రీవాల్ పార్టీలో బాధ్యతలు తీసుకుంటే పార్టీని ఆమె జిగురులాగా కలిపి ఉంచుతారు. ఆప్‌ను ఇక ఎవరూ ఏం చేయలేరు. ఆమె కుటుంబ సభ్యురాలు కావడం వల్ల సీఎం కేజ్రీవాల్‌ను ఆమె జైలులో రోజు కలిసే చాన్స్ ఉంది. దీంతో ఢిల్లీ సమస్యలను ఆమె కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళుతున్నారు. కేజ్రీవాల్ ఆదేశాలను పార్టీ సభ్యులకు తెలియజేస్తున్నారు. ఆప్ కార్యకర్తలకు అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్న బంధం వల్ల వారంతా సునీతా కేజ్రీవాల్ పట్ల సానుభూతితో పనిచేస్తున్నారు’అని భరద్వాజ్ అన్నారు. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో మార్చ్22న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇండియా కూటమి ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు. ఎన్నోసార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 దాకా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇదీ చదవండి.. ఎన్ఏఐ బృందంపై దాడిని సమర్థించిన ‘దీదీ’ -
‘ఆప్’ అనర్హత వ్యవహారంలో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న సంచలన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. లాభాదాయక పదవుల వ్యవహారంలో 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి ఈసీ సిఫార్సు చేయడంతో దేశ రాజకీయాల్లో కలకలం రేగింది. రిటైర్మెంట్కు మూడు రోజులు ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆప్ అనుమానాలు వ్యక్తం చేసింది. హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకుని, పదవీకాలం పొడిగించుకునేందుకు ఏకే జ్యోతి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. కాగా, ఏకే జ్యోతి పదవీకాలం సోమవారంతో ముగియనుంది. 23న ఆయన 65 ఏట అడుగుపెట్టనున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని యోచిస్తున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. కోర్టుకు వెళ్లినా వెంటనే ఊరట లభించే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్, కేజ్రీవాల్ ఎన్నికలకు సిద్ధపడటమే మంచిదని సూచిస్తున్నారు. -
డమ్మీ ఈవీఎంతో ఎమ్మెల్యే హడావుడి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చేసినదంతా చివరకు ఓ ప్రహసనంలా మారింది. తాను ఒక మాజీ కంప్యూటర్ ఇంజనీర్‌నని, పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో పనిచేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. తాను ఇప్పుడు ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో చూపిస్తానని వెల్లడించారు. ఇందుకోసం ఒక డమ్మీ ఈవీఎంను ఆయన తయారుచేయించి తీసుకొచ్చారు. ఎన్నికలలో పోలింగ్ ప్రారంభం అయినప్పుడు అంతా మామూలుగానే ఉంటుందని, రెండు మూడు గంటల తర్వాత నుంచి దానికి ఒక సీక్రెట్ కోడ్ యాక్టివేట్ చేస్తారని ఆయన అన్నారు. ఆ కోడ్ యాక్టివేట్ అయిన తర్వాత ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినా అన్నీ ఒక పార్టీకే వెళ్తాయని చెప్పారు. ఇందుకోసం ఒక బొమ్మలాంటి ఈవీఎంను తీసుకొచ్చి, అందులో ఓట్లు వేసి, వాస్తవంగా పోలైన ఓట్లు, తుది ఫలితాలు ఇవంటూ ఆయన చూపించారు. అయితే ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న ఈవీఎంలు కాకుండా.. తాను సొంతంగా తయారు చేయించుకుని వచ్చినవి కావడంతో వాటిని ఎంతవరకు నమ్మొచ్చని వచ్చిన ప్రశ్నలకు అటు భరద్వాజ్ గానీ, ఇటు అరవింద్ కేజ్రీవాల్ గానీ సమాధానం ఇవ్వలేకపోయారు. అలాగే, సీక్రెట్ కోడ్‌ను ఈవీఎంలో ఎలా యాక్టివేట్ చేస్తారన్న ప్రశ్నలకు కూడా జవాబులు రాలేదు. వేళ్లలోనే తప్పుందని అంటారు ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బహిష్కృత ఆప్ నేత కపిల్ మిశ్రా కూడా పాల్గొన్నారు. సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత అటు నుంచి నేరుగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రేపు వీళ్లు ఓటర్లనే తప్పుపడతారని, వాళ్ల వేళ్లలోనే తప్పుందని చెప్పినా చెబుతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్ సవాలు మీరు సొంతంగా తీసుకొచ్చిన ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కాదని, ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న అసలు ఈవీఎంలను ఎవరైనా తాము త్వరలో నిర్వహించే హాకథాన్‌లో ట్యాంపర్ చేసి చూపించాలని ఎన్నికల కమిషన్ సవాలు చేసింది. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా రావొచ్చని, అక్కడ చేసి చూపించాలని అన్నారు. -
ఆర్ధిక ఇబ్బందుల ఊబిలో ఆమ్ ఆద్మీ పార్టీ!
అవినీతిపై పోరాటం అంటూ రాజకీయాల్లోకి వచ్చిరావడమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటున్న ఆప్ కు కనీస అవసరాలకు కూడా చిల్లిగవ్వ కూడా లేదని పార్టీ నేతలు ధృవీకరిస్తున్నారు. సోమవారం ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 444 మంది అభ్యర్థులను బరిలోకి దించుతున్న ఆప్ వద్ద నిధులు నిండుకోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. నవంబర్ 2012లో ప్రారంభమైన ఆమ్ ఆద్మీ పార్టీ గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసి, 28 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆప్ ప్రభుత్వ మనగడ 49 రోజులకే పరిమితమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత అనుభవాన్ని గడించిన ఆప్ కు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు విభిన్నమైనవని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. నిధులు లేక పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం చాలా కష్టంగా మారిందని ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థులు 70 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ విధించిన నిబంధన విధించిన సంగతి తెలిసిందే. అయితే 70 లక్షల్లో సగం కూడా ఖర్చు చేయలేని గడ్డు పరిస్థితి ఆప్ అభ్యర్థులకు దాపురించింది. న్యూఢిల్లీ ఆప్ అభ్యర్థి ఆశీష్ ఖేతన్ ఇప్పటి వరకు 15 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక ఇదే నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. ఎన్నికల కోసం విదేశాల్లో, స్వదేశంలో అన్ని కలిపితే 22 కోట్ల డొనేషన్లు సేకరించారు. నిధుల కొరత ఉండటంతో ఆప్ అభ్యర్ధులు కేవలం అరవింద్ కేజ్రివాల్ పాపులారిటి, క్రేజ్ నే సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. నిధుల కొరత ఉన్నా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, మద్దతుతోనే గెలుపు దిశగా ప్రయాణిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలంటే మామూలు విషయం కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పడిప్పుడే భోధపడుతోంది.