ఆర్ధిక ఇబ్బందుల ఊబిలో ఆమ్ ఆద్మీ పార్టీ!
ఆర్ధిక ఇబ్బందుల ఊబిలో ఆమ్ ఆద్మీ పార్టీ!
Published Mon, Apr 7 2014 7:22 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
అవినీతిపై పోరాటం అంటూ రాజకీయాల్లోకి వచ్చిరావడమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటున్న ఆప్ కు కనీస అవసరాలకు కూడా చిల్లిగవ్వ కూడా లేదని పార్టీ నేతలు ధృవీకరిస్తున్నారు. సోమవారం ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 444 మంది అభ్యర్థులను బరిలోకి దించుతున్న ఆప్ వద్ద నిధులు నిండుకోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.
నవంబర్ 2012లో ప్రారంభమైన ఆమ్ ఆద్మీ పార్టీ గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసి, 28 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆప్ ప్రభుత్వ మనగడ 49 రోజులకే పరిమితమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత అనుభవాన్ని గడించిన ఆప్ కు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు విభిన్నమైనవని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. నిధులు లేక పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం చాలా కష్టంగా మారిందని ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎన్నికల్లో అభ్యర్థులు 70 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ విధించిన నిబంధన విధించిన సంగతి తెలిసిందే. అయితే 70 లక్షల్లో సగం కూడా ఖర్చు చేయలేని గడ్డు పరిస్థితి ఆప్ అభ్యర్థులకు దాపురించింది. న్యూఢిల్లీ ఆప్ అభ్యర్థి ఆశీష్ ఖేతన్ ఇప్పటి వరకు 15 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక ఇదే నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. ఎన్నికల కోసం విదేశాల్లో, స్వదేశంలో అన్ని కలిపితే 22 కోట్ల డొనేషన్లు సేకరించారు.
నిధుల కొరత ఉండటంతో ఆప్ అభ్యర్ధులు కేవలం అరవింద్ కేజ్రివాల్ పాపులారిటి, క్రేజ్ నే సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. నిధుల కొరత ఉన్నా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, మద్దతుతోనే గెలుపు దిశగా ప్రయాణిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలంటే మామూలు విషయం కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పడిప్పుడే భోధపడుతోంది.
Advertisement