
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తుది గణాంకాలను.. పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల తరువాత.. ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు విడుదల చేసింది. మొత్తంగా, 62.59 శాతం పోలింగ్ నమోదైందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రణ్‌బీర్ సింగ్ వెల్లడించారు. 2015 ఎన్నికల కన్నా ఇది దాదాపు 5% తక్కువ. ఆ ఎన్నికల్లో 67.47% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో బల్లీమారాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6%, ఢిల్లీ కంటోన్మెంట్ స్థానంలో అత్యల్పంగా 45.4% పోలింగ్ నమోదైందని సింగ్ తెలిపారు. తుది గణాంకాలను విడుదల చేయడంపై జరిగిన ఆలస్యంపై ఆయన వివరణ ఇచ్చారు.
కచ్చితమైన గణాంకాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో రాత్రంతా రిటర్నింగ్ అధికారులు సమాచారాన్ని విశ్లేషించారని, అందువల్లనే పోలింగ్‌కు సంబంధించిన తుది శాతాన్ని వెల్లడి చేయడంలో జాప్యం ఏర్పడిందని ఆయన వివరించారు. అయితే, ఇది అసాధారణ ఆలస్యమేమీ కాదన్నారు. తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించడంలో ఆలస్యం నెలకొనడాన్ని ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘ఈసీ ఏం చేస్తోంది? పోలింగ్ వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదు?’ అని ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ట్వీట్ చేశారు. ‘బీజేపీ నేతలు ఇచ్చే పోలింగ్ గణాంకాల కోసం ఈసీ ఎదురు చూస్తోంది. అందుకే, పోలింగ్ ముగిసి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ తుది లెక్కలు ఈసీ వెల్లడించలేకపోయింది’ అని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీడియాతో అన్నారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment