డమ్మీ ఈవీఎంతో ఎమ్మెల్యే హడావుడి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చేసినదంతా చివరకు ఓ ప్రహసనంలా మారింది. తాను ఒక మాజీ కంప్యూటర్ ఇంజనీర్‌నని, పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో పనిచేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. తాను ఇప్పుడు ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో చూపిస్తానని వెల్లడించారు. ఇందుకోసం ఒక డమ్మీ ఈవీఎంను ఆయన తయారుచేయించి తీసుకొచ్చారు. ఎన్నికలలో పోలింగ్ ప్రారంభం అయినప్పుడు అంతా మామూలుగానే ఉంటుందని, రెండు మూడు గంటల తర్వాత నుంచి దానికి ఒక సీక్రెట్ కోడ్ యాక్టివేట్ చేస్తారని ఆయన అన్నారు. ఆ కోడ్ యాక్టివేట్ అయిన తర్వాత ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినా అన్నీ ఒక పార్టీకే వెళ్తాయని చెప్పారు. ఇందుకోసం ఒక బొమ్మలాంటి ఈవీఎంను తీసుకొచ్చి, అందులో ఓట్లు వేసి, వాస్తవంగా పోలైన ఓట్లు, తుది ఫలితాలు ఇవంటూ ఆయన చూపించారు. అయితే ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న ఈవీఎంలు కాకుండా.. తాను సొంతంగా తయారు చేయించుకుని వచ్చినవి కావడంతో వాటిని ఎంతవరకు నమ్మొచ్చని వచ్చిన ప్రశ్నలకు అటు భరద్వాజ్ గానీ, ఇటు అరవింద్ కేజ్రీవాల్ గానీ సమాధానం ఇవ్వలేకపోయారు. అలాగే, సీక్రెట్ కోడ్‌ను ఈవీఎంలో ఎలా యాక్టివేట్ చేస్తారన్న ప్రశ్నలకు కూడా జవాబులు రాలేదు.
వేళ్లలోనే తప్పుందని అంటారు
ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బహిష్కృత ఆప్ నేత కపిల్ మిశ్రా కూడా పాల్గొన్నారు. సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత అటు నుంచి నేరుగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రేపు వీళ్లు ఓటర్లనే తప్పుపడతారని, వాళ్ల వేళ్లలోనే తప్పుందని చెప్పినా చెబుతారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల కమిషన్ సవాలు
మీరు సొంతంగా తీసుకొచ్చిన ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కాదని, ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న అసలు ఈవీఎంలను ఎవరైనా తాము త్వరలో నిర్వహించే హాకథాన్‌లో ట్యాంపర్ చేసి చూపించాలని ఎన్నికల కమిషన్ సవాలు చేసింది. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా రావొచ్చని, అక్కడ చేసి చూపించాలని అన్నారు.