ఏకే జ్యోతి, సౌరభ్ భరద్వాజ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న సంచలన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. లాభాదాయక పదవుల వ్యవహారంలో 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి ఈసీ సిఫార్సు చేయడంతో దేశ రాజకీయాల్లో కలకలం రేగింది.
రిటైర్మెంట్‌కు మూడు రోజులు ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆప్ అనుమానాలు వ్యక్తం చేసింది. హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకుని, పదవీకాలం పొడిగించుకునేందుకు ఏకే జ్యోతి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. కాగా, ఏకే జ్యోతి పదవీకాలం సోమవారంతో ముగియనుంది. 23న ఆయన 65 ఏట అడుగుపెట్టనున్నారు.
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని యోచిస్తున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. కోర్టుకు వెళ్లినా వెంటనే ఊరట లభించే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్, కేజ్రీవాల్ ఎన్నికలకు సిద్ధపడటమే మంచిదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment