అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించిన బీజేపీ, ఆప్
11 మందితో అప్పుడే ఆప్ తొలిజాబితా
సన్నాహాల్లో వెనుబడినట్లు కనిపిస్తున్న కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతో క్రమంగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే తమ ఎన్నికల కసరత్తును బీజేపీ, ఆప్ పార్టిలు ముమ్మరం చేసి దాడి, ఎదురుదాడులను మొదలు పెట్టాయి.
ఆప్ నేత కైలాశ్ గహ్లోత్ బీజేపీలో చేరిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో ఢిల్లీ ప్రజలతో సంప్రదింపులు జరుపుతుండగా, మరోవైపు బీజేపీ తమ ఢిల్లీ నేతలను క్రియాశీలం చేసింది. గురువారం 11 మందితో ఆప్ తొలిజాబితాను సైతం విడుదల చేసింది.
పోటీపోటీగా ఆప్, బీజేపీ..
వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక, వ్యూహాల అమలులో ఆప్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతో పాటు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్‌లపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బీజేపీ, అనంతరం సైతం ఏమాత్రం తగ్గకుండా అంతకంతకూ పెరుగుతున్న యమునా నది కాలుష్యం, పెరిగిన వాయు కాలుష్యం, తాగునీటి ఎద్దడి, ముంపు ప్రాంతాల్లో బాధితులకు అందని సహకారం వంటి అంశాలపై గడిచిన నాలుగు నెలలుగా తన పోరాటాన్ని ఉధృతం చేసింది.
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై గడిచిన వారం రోజులుగా పోస్టర్ వార్‌తో పాటు వీధి పోరాటాలు చేస్తోంది. ఇక ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని ఆప్ ఎదురుదాడి చేస్తోంది. ప్రజా ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వకుండా.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అసాధారాణ అధికారాలు కట్టబెట్టి, సమస్యలను జటిలం చేస్తోందని ఆప్ సైతం తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. ఈ పరిణామాలు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ఆప్ కీలక నేత, మాజీ మంత్రి కైలాశ గహ్లోత్ బీజేపీలో చేరారు. దీనికి బదులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝాని తన పార్టీలో చేర్చుకుంది ఆప్.
ఈడీ కేసుల భయంతోనే గహ్లోత్ పార్టీ మారారని ఆప్ ఆరోపిస్తే, కేజ్రీవాల్‌కు రాజకీయ ఆశయాలు పెరగడం వల్లే ఆయన పార్టీ మారారని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ఇక మరోపక్క ఎన్నికల అభ్యర్థులను త్వరగా ఖరారు చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ సచ్‌దేవా ఇప్పటికే పార్టీ స్టీరింగ్ కమిటీ, మెనిఫెస్టోకమిటీతో భేటీలు జరుపగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ వీధి సభలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 70 స్థానాలకు గానూ 2015లో 67, 2020లో 62 స్థానాలు గెలిచిన ఆప్ తిరిగి 60కి పైగా స్థానాలను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
పొత్తు లేదు.. కాంగ్రెస్‌తో పోరే
ఇక ఢిల్లీ ఎన్నికల సన్నాహాల్లో పూర్తిగా వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసినా రెండు పార్టిలు ఏడింటిలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయాయి. ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీచేసి అన్నిచోట్ల పరాజయం పాలయ్యాయి.
అనంతరం జరిగిన హరియాణా ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉంటుందని భావించినా, సీట్ల సర్దుబాటు కుదరక రెండు పార్టిలు ఒంటరిగానే పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లోనూ రెండు పార్టిలు విడివిడిగానే కొట్లాడుతాయని ఇప్పటికే సంకేతాలు వెళ్లడంతో కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్‌లు న్యాయ్ యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆప్ తొలి జాబితా విడుదల
ఆరుగురు ఇతర పార్టిల నుంచి వచ్చిన వారే
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే సిద్ధమైంది. 2025, ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 11మంది అభ్యర్థులతో తొలి జాబితాను జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ గురువారం విడుదల చేశారు.
ఛత్తర్‌పూర్ అభ్యర్థిగా బ్రహ్మసింగ్ తన్వర్, బదార్‌పూర్ అభ్యర్థిగా రామ్‌సింగ్ నేతాజీ, లక్ష్మీనగర్ అభ్యర్థిగా బీబీ త్యాగీ, సీలంపూర్ అభ్యర్థిగా చౌదరి జుబిర్ అహ్మద్, సీమాపురి అభ్యర్థిగా వీర్‌సింగ్ ధింగాన్, రోహ్తాస్ నగర్ అభ్యర్థిగా సరితాసింగ్, ఘోండా అభ్యర్థిగా గౌరవ్ శర్మ, విశ్వాస్‌నగర్ అభ్యర్థిగా దీపక్ సింగ్లా, కర్వాల్‌నగర్ అభ్యర్థిగా మనోజ్ త్యాగి, కిరారీ అభ్యర్థిగా అనిల్‌ఝా, మటియాలా అభ్యర్థిగా సోమేశ్ షోకీన్‌ల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. 11మంది అభ్యర్థుల జాబితాలో ఆరుగురు ఇతర పార్టిల నుంచి వచ్చినవారే ఉన్నారు.
వీరిలో ముగ్గురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చివారు కావడం గమనార్హం. ఛత్తర్‌పూర్, కిరాడీ అభ్యర్థులుగా ఖరారైన బ్రహ్మ సింగ్ తన్వర్, అనిల్ ఝాలు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు. వీరు ఈ ఏడాది ఆ పార్టీకి రాజీనామా చేసి ఆప్‌లో చేశారు. వీరు ఇరువురూ రెండుసార్లు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా కూడా గెలిచారు. ఇక, దీపక్ సింఘ్లా కిందటి ఎన్నికల్లో బీజేపీ నేత ఓమ్ ప్రకాశ్ శర్మ చేతిలో ఓటమిపాలయ్యారు. సరితా సింగ్ ఆప్ విద్యార్ధి విభాగం ఛత్ర యువ సంఘర్షణ సమితి అధ్యక్షురాలు. రోహతాస్ నగర్ నుంచి గతంలో గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment