achal kumar jyoti
-
నూతన సీఈసీగా ఓం ప్రకాశ్ రావత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈసీ అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం రేపటి (సోమవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓం ప్రకాశ్ రావత్‌ను సీఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన ఏకే జ్యోతి గతేడాది జూలై 6న బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అశోక్ లావసను ఎన్నికల కమిషనర్ గా నిమమించారు. ఆయన మంగళవారం రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. 1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వారు రావత్. 64 ఏళ్ల రావత్ పలు రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ పలు హోదాల్లో సేవలు అందించారు. భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 2010లో ఆయన ఉత్తమ సేవలకుగానూ ప్రధాన మంత్రి నుంచి అవార్డ్ అందుకున్నారు. -
‘ఆప్’ అనర్హత వ్యవహారంలో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న సంచలన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. లాభాదాయక పదవుల వ్యవహారంలో 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి ఈసీ సిఫార్సు చేయడంతో దేశ రాజకీయాల్లో కలకలం రేగింది. రిటైర్మెంట్కు మూడు రోజులు ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆప్ అనుమానాలు వ్యక్తం చేసింది. హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకుని, పదవీకాలం పొడిగించుకునేందుకు ఏకే జ్యోతి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. కాగా, ఏకే జ్యోతి పదవీకాలం సోమవారంతో ముగియనుంది. 23న ఆయన 65 ఏట అడుగుపెట్టనున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని యోచిస్తున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. కోర్టుకు వెళ్లినా వెంటనే ఊరట లభించే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్, కేజ్రీవాల్ ఎన్నికలకు సిద్ధపడటమే మంచిదని సూచిస్తున్నారు. -
నూతన సీఈసీగా అచల్ కుమార్ జోతి
న్యూఢిల్లీ: నూతన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ కుమార్ జోతి నియమితులయ్యారు. ఆయన వచ్చే నెల (జూలై) 6న సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అచల్ కుమార్ జోతి గతంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచల్ కుమార్ ప్రభుత్వ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్లో సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ ఎండీగా, కంద్లా పోర్ట్ ట్రస్టుకు చైర్మన్‌గా, తదితర పదవులు నిర్వహించిన అచల్‌కుమార్ సర్వీసు నుంచి 2013లో రిటైర్ అయ్యారు.