ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆమె చేత ప్రమాణం చేయించారు. కాగా ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన అతిపిన్క వియస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.
అతిషీ పాటు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ దళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతిశీ తల్లిదండ్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
మంత్రుల వివరాలు
గోపాల్ రాయ్..
ఆయన ఢిల్లీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ హయాంలో పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి సాధారణ పరిపాలన శాఖను నిర్వర్తించారు. ఆలాగే ఆప్ ఢిల్లీ రాష్ట్ర విభాగానికి కన్వీనర్‌గా కూడా ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలోని బాబాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కైలాష్ గహ్లోత్.. 2015లో నజఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు తొలిసారి ఎన్నికలయ్యారు. కేజ్రీవాల్ పదవీకాలంలో పరిపాలనా సంస్కరణలు, రవాణా, రెవెన్యూ, చట్టం, న్యాయం, శాసనసభ వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.
సౌరభ్ భరద్వాజ్.. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటక-కళా సంస్కృతి భాషలు, పరిశ్రమలు, నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇమ్రాన్ హుస్సేన్.. ఢిల్లీ క్యాబినెట్‌లో ఆహార, పౌర సరఫరాలు, ఎన్నికల మంత్రిగా పనిచేస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో బల్లిమారన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఐదుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు.
ముకేశ్ అహ్లావత్.. ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ మజ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ముకేశ్ మంత్రివర్గంలో చేరారు. కాగా గత ఏప్రిల్‌లో ఆనంద్ కుమార్ ఆప్‌కు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. సుల్తాన్‌పూర్ మజ్రా నుంచి 2020లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్లావత్.. 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment