
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ(మాజీ) సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు.
సుమంత్ వ్యవహారం, కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళి గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు. సెక్రటేరియట్‌లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.
నా బిడ్డకు(సుస్మితను ఉద్దేశించి..) మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు.
అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను.
.. నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాజీ ఓస్డీని అర్ధరాత్రి తన కారులో మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొండా మురళి పరోక్షంగా స్పందించారు. కొండా సురేఖ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. ఈరోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్‌తో ప్రోగ్రామ్ ఉందని, దానికి ఆమె హాజరవుతారని అన్నారాయన.
ఇదీ చదవండి: మా అమ్మ అరెస్టుకు కుట్ర జరుగుతోంది: కొండా సుస్మిత