ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్‌.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు | BJP MP Nishikant Dubey Targets Ex Poll Body Chief SY Quraishi, Says You Were Muslim Commissioner | Sakshi
Sakshi News home page

ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్‌.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Mon, Apr 21 2025 7:09 AM | Last Updated on Mon, Apr 21 2025 12:00 PM

BJP MP Nishikant Dubey Ex Poll Body Chief SY Quraishi

ఢిల్లీ: ఇటీవలి కాలంలో బీజేపీ ఎంపీలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో, ఎంపీల వ్యాఖ్యల దుమారం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఇంతకుముందు, సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యల వేడి తగ్గకముందే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ‌పై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దూబే మాట్లాడుతూ..‘ఖురేషీ సీఈసీగా ఉన్నప్పుడు జార్ఖండ్‌లోని సంతాల్‌ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్‌ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆయన ఎన్నికల కమిషనర్‌ కాదు.. ముస్లిం కమిషనర్‌. చరిత్ర ప్రకారం క్రీ.శ 712 సంవత్సరంలో దేశంలోకి ఇస్లాం ప్రవేశించిందని, అప్పటిదాకా ఈ భూభాగం అంతా హిందువులు, గిరిజనులు, జైనులు, బౌద్ధులదే. అంతేకాదు, దేశాన్ని ఐక్యంగా ఉంచండి. చరిత్రను చదవండి. అప్పట్లో దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను సృష్టించారు. ఇకపై విభజన ఉండదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే,ర నిశికాంత్‌ దూబే జార్ఖండ్‌లోని గోడ్డా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టును టార్గెట్‌ చేసిన దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అన్నారు. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement