Qureshi
-
పోలింగ్‌లో అంతటి వ్యత్యాసం.. నిజంగా ఆందోళనకరం: మాజీ సీఈసీ ఖురేషి
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనలను మరింత పెంచే మరో పరిణామం చోటుచేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ చానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే.‘ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55 శాతం మేరకు ఓటింగ్ (ప్రొవిజనల్ ఓటర్ టర్నౌట్–పీవోటీ) న మోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ.. మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్తా ఏకంగా 66.05 శాతానికి పెరిగిపోయింది’ అని రాజ్‌దీప్ పేర్కొనగా.. ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పారు. దీనిపై తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలను ఖురేషీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి, మర్నాటికి ఇంతటి వ్యత్యాసం కచి్చతంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. ‘ఓటింగ్ శాతం ఇలా నమోదవుతుంది’ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషీ వివరించారు. ‘ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరునూ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫారం–17సీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటినీ అందులో నమోదు చేస్తారు. అలా ఫారం–17సీని పూర్తిగా నింపి, దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్‌ను వీడతారు’ అని వివరించారు. ‘ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17సీ నమోదు చేస్తుంది. పైగా ఇది అదే రోజు, రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు)లో నమోదయ్యే డేటా’ అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామమన్నారు. ‘దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే.ఇప్పటికే ఆ పనిచేసి ఉండాల్సింది. ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’ అన్నారు. ‘కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి. జాతీయ మీడియాను పిలిచి పోలింగ్ గణాంకాలకు ³Nర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలి’ అన్నారు. ‘ఈవీఎంల పనితీరు తదితరాలపై ఇప్పటికే దేశమంతటా అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ఈసీ వెంటనే తీర్చకపోతే జనాల మెదళ్లలోకి మరింతగా చొచ్చుకుపోతాయి. అప్పుడు మొత్తం వ్యవస్థల మీదే విశ్వాసం పోతుంది’ అంటూ ఖురేషీ ఆందోళన వెలిబుచ్చారు. ఓటింగ్ శాతంలో అనూహ్య పెరుగుదల అంశం ఐదేళ్ల కింద సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. ఈసీ తుది గణాంకాల మేరకు మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత ఏకంగా 11 శాతం ఓటింగ్ జరిగినట్టు భావించాలని కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ అనుమానాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఖురేషీ చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందన్నా్డరు. ఆయన 2010–12 మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు.ఏపీ పోలింగ్ శాతంలో 12.54 శాతం తేడా!ఆంధ్రప్రదేశ్‌లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించగా.. అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11.45 గంటలకు 76.50 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాలుగు రోజులకు అంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66 అని ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54 శాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతానికి భారీ తేడా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. ఒడిశా (12.48 శాతం) రెండో స్థానంలో నిలిచాయి.పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం లేదా ఈవీఎంలు మార్చేయడం లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి ఏదో ఒకటి అయి ఉండొచ్చని ఏడీఆర్ (అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (వోట్ ఫర్ డెమొక్రసీ) సంస్థల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. పోలింగ్ శాతంలో భారీగా తేడా ఉండటం వల్ల పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ శాతంలో పెరుగుదల వల్ల ఒక్కో లోక్‌సభ స్థానంలో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వీఎఫ్‌డీ సంస్థ వెల్లడించింది.ఎన్నికల సంఘం పోలింగ్ శాతం తొలుత వెల్లడించిన దానికీ, ఆ తర్వాత ప్రకటించిన దానికీ తేడా ఉండకపోయి ఉంటే ఎన్డీఏకు 14, వైఎస్సార్సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కేవని స్పష్టం చేసింది. పోలింగ్ శాతంలో తేడా వల్ల ఒంగోలు, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం లోక్‌సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. -
ప్రశ్నించడమే రాజకీయం
ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలన్నా, దానిని కాపాడుకోవాలన్నా మేధావులు చర్చిస్తేనే సాధ్యం అవుతుందని మంథన్ సంవాద్ వేదికగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘మంథన్ సంవాద్’ 13వ ఎడిషన్ బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికపై జరిగింది. మేధావులను ఒకే వేదికపైకి తీసుకొచి్చ, వారి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంథన్ 2005 నుంచి అక్టోబర్ 2న ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 470 కార్యక్రమాలు జరిగాయి. సింగర్ అనూజ్ గుర్వారా, నటుడు అజీజ్ నజీర్, సబాఖాన్ సహా 1,500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.8 మంది వక్తలు పలు అంశాలపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు. – సాక్షి, హైదరాబాద్ముస్లిం జనాభా పెరుగుతుందనేది ఒక అపోహ: ఖురేషీ దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందనేది ఒక అపోహ మాత్రమేనని కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్ ఖురేషీ చెప్పారు. మంథన్ సంవాద్‌లో భాగంగా ‘దేశంలో ము స్లిం జనాభా పెరుగుదల–అపోహలు’అనే అంశంపై ఆయన మాట్లాడారు. 1951 నుంచి 2011 వరకు జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభా 13.6 కోట్లకు, హిందువుల జనాభా 67.6 కోట్లకు చేరిందని వివరించారు. ఈ గణాంకాలు చూస్తే..దేశ జనాభా పెరిగేందుకు హిందువులు కారణమని చెప్పారు. అదే కాలంలో హిందూ, ముస్లింల మ« ద్య జనాభా గ్యాప్ 26.7 కోట్ల నుంచి 80.8 కోట్లకు పెరిగిందన్నారు. హిందువులను ముస్లిం జనాభా దాటేస్తుందనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఎక్కువ మంది జనాభాను కనాలని ఏ ముస్లిం నాయకుడు కానీ, మేధావి కానీ పిలుపునివ్వలేదని గుర్తు చేశారు. కుటుంబ నియంత్రణను ఖురాన్ ఎక్కడా నిషేధించలేదన్నారు. ఒకే దేశం–ఒకే ఎన్నిక అసంబద్ధం : అరవింద్ దాతార్ ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ప్రతిపాదన అసంబద్ధమైనదని సీనియర్ అడ్వొకేట్ అరవింద్ దాతార్ అన్నారు. దీనివల్ల దేశంలో రాజ్యంగా సంక్షోభం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘75 ఏళ్ల రాజ్యాంగం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ అవసరంపై చర్చ జరగాలన్నారు. గవర్నర్లు ప్రతి బిల్లుకు కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెట్టడం సరికాదని చెప్పారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు గవర్నర్ వ్యవస్థను వాడుకోవడమేంటని ప్రశ్నించారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం: కిరణ్‌రావు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావొద్దంటే.. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు సూచించారు. ‘లింగ దృష్టి కోణం’అనే అంశంపై ఆమె ప్ర సంగించారు. సినిమాల్లో స్త్రీల ను చూపించే విధానంలో మార్పులు రావాలని, అయితే మహిళల సమస్యల గురించి మహిళా డైరెక్టర్లతోపాటు కొందరు పురుషులు కూడా అద్భుతంగా తెరకెక్కించారని కిరణ్‌రావు పేర్కొన్నారు. పురుషులు కూడా చాలా సున్నితమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి గురించి కూడా చర్చించాలన్నారు. తనకు వనపర్తి అంటే చాలా ఇష్టమని, తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్తుంటానని చెప్పారు. హై దరాబాద్‌తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే : శశికాంత్ మెజారిటీ, మైనారిటీ అనే అంశాన్ని రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ పేర్కొన్నారు. మెజారిటీ ప్రజలకు మైనారిటీలంటే లేనిపోని భయాలు కల్పించి ఎన్నికల్లో గెలుపొందడమే వారి లక్ష్యమని చెప్పారు. ‘కౌంటరింగ్ మెజారిటేరియనిజం–తీసుకోవాల్సిన చర్యలు’అనే అంశంపై ఆయన మాట్లాడారు. మెజారిటేరియనిజం అనేదే పెద్ద నకిలీదని, దీని వల్ల మెజారిటీ ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో గుళ్లలోకి కొన్ని కులాలను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయంగా ముందుకు వెళ్లాల్సింది పోయి.. తిరోగమనం చెందడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కుటుంబం నుంచే రాజకీయాలు మాట్లాడకుండా తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నారన్నారు. పార్లమెంటరీవ్యవస్థ నాశనం సంజయ్సింగ్దేశంలో పార్లమెంటరీ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ఆమ్ఆద్మీ ఎంపీ సంజయ్‌సింగ్ విమర్శించారు. ఎంపీలను సస్పెండ్ చేసి, నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ‘పార్లమెంట్ వ్యవస్థ పతనం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. పదేళ్ల యూపీఏ హయాంలో 150 మంది ఎంపీలను మాత్రమే సస్పెండ్ చేశారని, వారిలో 50 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారని చెప్పారు. గత పదేళ్ల మోదీ పాలనలో 250 మందికిపైగా ఎంపీలను సస్పెండ్ చేస్తే వారిలో ఒక్కరంటే ఒక్క బీజేపీ ఎంపీ లేకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారని, బయటకు వచ్చి మాట్లాడితే ఈడీ, సీబీఐతో దాడులు జరిపించి, జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరగానే.. సత్యహరిశ్చంద్రులుగా మారుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రభుత్వం నడవకుండా చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. -
దిగ్గజ భారత చెఫ్ ఖురేషి అస్తమయం
న్యూఢిల్లీ: మొగలుల కాలంనాటి దమ్ పుఖ్త్ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ పాకశాస్త్ర దిగ్గజం ఇంతియాజ్ ఖురేషి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. లక్నో ప్రాంతంలో మాత్రమే వాడే వంట పాత్ర మూత చివర్ల నుంచి గాలి పోకుండా పిండి ముద్దను చుట్టే (ధమ్ ఫుఖ్త్) టెక్నిక్‌ను ప్రాచుర్యంలోకి తెచి్చన ఘనత ఆయనదే. ప్రాచీన అవధ్ వంటకాలనూ ఆయన కొత్త తరహాలో సృష్టించారు. బుఖారా వంటకాలను కనిపెట్టింది కూడా ఖురేషీనే. 1979లో ఐటీసీ హోటల్స్‌లో చేరి ప్రధాన చెఫ్ స్థాయికి ఎదిగారు. ఎందరో దేశ, విదేశీ ప్రముఖులకు తన వంటకాలు రుచు చూపి ఔరా అనిపించారు. ఆహార ప్రియులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అయిన ఖురేషీ వంటలంటే పడిచచ్చే వాళ్ల జాబితా చాలా పెద్దది. ప్రధాని, రాష్ట్రపతి విశిష్ట అతిథుల ప్రత్యేక విందుల్లో ఆయనే స్పెషల్ వంటకాలు వండేవారు. 2016లో పద్మశ్రీ పొందారు. ఈ అవార్డ్ అందుకున్న తొలి పాకశాస్త్ర ప్రవీణుడు ఖురేషీనే. -
మాఫియా డాన్ ఇంట్లోనూ చోరీ..
సాక్షి, సిటీబ్యూరో: సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఖరీదైన కార్లలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ బాంబే సలీం పూణే క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుపడ్డాడు. గతంలో ముంబై మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లోనే చోరీ సంచలనం సృష్టించిన ఈ ఘరానా నేరస్తుడిపై దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. పలు నగరాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఇతడికి హైదరాబాద్‌తో పాటు ముంబైలోనూ ఇల్లు ఉంది. తాజాగా 127 చోరీ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అతడిని పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిని గతంలో 2012 ఫిబ్రవరి 28న రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఇద్దరూ కలిసి దొంగతనాలు... అప్పటి నుంచి ఇద్దరూ కలిసి వివిధ నగరాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఓ ఇంటిని టార్గెట్ చేసుకున్న తర్వాత ప్రత్యేకమైన ఉపకరణాలతో తాళాలు, డోర్లు పగులకొట్టి ఖరేషీ లోపలకు వెళ్తాడు. ఇషావర్ పెప్పర్ స్ప్రే చేత పట్టుకుని బయట కాపుకాసేవాడు, ఎవరైనా ఇంటిలోకి కానీ, తమ సమీపంలోకి కానీ రావడానికి ప్రయత్నిస్తే వారి ముఖంపై స్ప్రే చేయడంతో పాటు ఖురేషీని అప్రమత్తం చేస్తాడు. ఆపై ఎదుటి వారు తేరుకునే లోపు ఇద్దరూ కలిసి పరారయ్యేవారు. పుణేలో మొత్తం 30 పోలీసుస్టేషన్లు ఉండగా... వాటిలోని 27 ఠాణాల పరిధిలో ఖురేషీ ద్వయం పంజా విసిరింది. దీంతో అతడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ ఆధీనంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు నెలల పాటు శ్రమించిన పోలీసులకు గత వారం ఖురేషీ పుణే విమానాశ్రయం వద్ద సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్నిన అధికారులు నల్లరంగు లాన్సర్ కారులో తిరుగుతున్న అతడితో పాటు అతడి సహాయకుడు ఇషావర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. ఈ వివరాలు రాబట్టడానికి కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్ప టి వరకు ఖురేషీ, ఇషావర్లు 127 చోరీలు చేసినట్లు అంగీకరించడంతో పూణే క్రైంబ్రాంచ్ ఆయా నగరాలకు సమాచారం ఇచ్చింది. దీంతో వారంతా పీటీవారెంట్లు వేసుకుని అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పొరపాటున చోటా రాజన్ ఇంట్లో... ముంబైలోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్‌లోని డియోనార్ బుచ్చర్ హౌస్‌కు చెందిన సలీం అలీ హుస్సేన్ ఖాన్ ఆరో తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. ఇతడికి బాంబే సలీం, మున్న ఖురేషీ, మహ్మద్ హమీద్ హబీబ్ ఖురేషీ తదితర మారుపేర్లు ఉన్నాయి. ముంబైలో చిన్న చిన్న చోరీలకు శ్రీకారం చుట్టిన అతను 2000 నుంచి ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2001లో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన బాంబే సలీం గ్యాంగ్ అదే రోజు రాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించి తమ ‘పని’ పూర్తి చేసుకుంది. మరుసటి రోజు పత్రికలు చూసిన సలీం షాక్‌కు గురయ్యాడు. తాను చోరీ చేసింది మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలుసుకుని ఖంగుతిన్నాడు. కొన్నాళ్ల తర్వాత ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడం, వారు తన అనుచరులపై దాడి చేయడంతో భయపడిన సలీం జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే రాజన్ అనుచరులను కలిసి జరిగింది చెప్పి ముంబై వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. అనంతరం అతను తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్‌లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ గ్యాంగ్‌ను విడిచి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరులో విక్రయించేవాడు. ఇతడి కోసం గాలింపు చేపట్టిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో అతడిని అరెస్టు చేశారు. ‘నేను పుణేలో తప్ప బెంగళూరులో ఎలాంటి నేరాలు చేయలేదు. అలాంటప్పుడు మీరు ఎలా పట్టుకుంటారు?’ అంటూ బెంగళూరు పోలీసులను ప్రశ్నించడంతో వారు నివ్వెరపోయారు. అలా బెంగళూరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన సలీం ఆ తర్వాత అక్కడా పంజా విసిరాడు. కొన్నాళ్లకు అతను మరో పెళ్లి చేసుకున్నాడు. సిటీలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్... కేసుల సంఖ్య పెరగడం, నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండటంతో బెంగళూరు, పుణే, ముంబై పోలీసుల కళ్లు కప్పేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చిన సలీం ఇక్కడా చేతులకు పని చెప్పి పోలీసులకు దొరికిపోయాడు. ఈ రకంగా సిటీతో పరిచయం ఏర్పడిన సలీం 2010లో తన ఇద్దరు భార్యలతో హైదారాబాద్‌కు వచ్చి వేర్వేరు ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టాడు. కొన్నాళ్ల పాటు టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించాడు. అందులో నష్టాలు రావడంతో మళ్లీ చోరీల బాటపట్టిన అతను చందానగర్, బాలానగర్, ఉప్పల్, కుషాయిగూడ, అల్వాల్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, సరూర్‌నగర్, శివరామ్‌పల్లి, చైతన్యపురి, శంషాబాద్, రాయదుర్గం, మీర్పేట్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పంజా విసిరాడు. మధ్య మధ్యలో పుణే, ముంబైలకు వెళ్తూ అందినకాడికి దండుకు వచ్చేవాడు. ఈ రకంగా రెండు రాష్ట్రాల్లోనూ 20 వరకు నేరాలు చేశాడు. అతడిపై సుదీర్ఘకాలం నిఘా ఉంచిన రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు 2012లో అతడిని పట్టుకున్నారు. అప్పట్లో ఇతడి నుంచి రూ.56,27,500 విలువైన 1.58 కేజీల బంగారం, ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. కాగా బాంబే సలీంకు ముంబైతో పాటు హైదరాబాద్‌లోని రాఘవకాలనీలోని షాదత్ రెసిడెన్సీలోనూ ఇళ్లు ఉన్నాయి. ఇద్దరు భార్యల్లో ఒకరు ముంబైలో, మరొకరు సిటీలో ఉంటున్నారు. 2018 ఆగస్టు నుంచి ముంబైతో పాటు పుణె, నాసిక్, నాగ్‌పూర్, నవీ ముంబై, థానేల్లో 127 చోరీలు చేశాడు. హైదరాబాద్‌లోనూ కొన్నిచోట్ల పంజా విసిరినట్లు పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో వచ్చే ఖురేషీ ఆయా నగరాల్లో స్టార్ హోటళ్లలో బస చేస్తాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఖరీదైన కారును కొనుగోలు చేసే ఇతను రిజిస్ట్రేషన్‌ను తన పేరుతో మార్చుకోకుండానే అదే కారులో తిరుగుతూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి అనువైన ఇంటికి కన్నం వేస్తాడు. పుణేలోని భారతి విద్యాపీఠ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో ఖురేషీని అక్కడి పోలీసులు 2018 జూలైలో అరెస్టు చేసి యరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన ఖురేషీ జైల్లో తనకు పరిచయమైన యరవాడలోని షామీఅలీ ప్రాంతానికి చెందిన ఇషావర్ అలియాస్ చింత్యా షిండేవాల్ అనే దొంగకు బెయిల్ ఇప్పించాడు. -
కశ్మీర్‌పై జోక్యాన్ని సహించం
జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతి పత్తి రద్దు నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని పేర్కొంది. కశ్మీర్లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ జెనీవాలో మంగళవారం జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం(యూఎన్‌హెచ్చార్సీ) 42వ సమావేశంలో పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో భారత్ ఈ విషయం స్పష్టం చేసింది. ఐరాస మానవ హక్కుల సంఘంలో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేస్తున్నదంతా దుష్ప్రచారమని కొట్టిపారేసింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) విజయ ఠాకూర్ సింగ్ జెనీవాలో మాట్లాడుతూ.. మానవహక్కుల ముసుగులో రాజకీయ దుష్ప్రచారానికి ఐరాసను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో మైనారిటీలకు మానవ హక్కులు లేవంటూ మాట్లాడుతున్న వారు సొంత దేశంలో మైనారిటీలను అణగదొక్కుతున్నారు’ అని అన్నారు. ‘కశ్మీర్‌కు సంబంధించి ఇటీవల చేపట్టిన మార్పులు భారత రాజ్యాంగానికి లోబడి జరిగాయి. భారత పార్లమెంట్ కూలంకషంగా చర్చించి తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా అంతరంగిక విషయం’అని పేర్కొన్నారు. ఇతర దేశాల జోక్యాన్ని భారత్ అంగీకరించబోదన్నారు. ఇదే విషయాన్ని ఆయన మానవహక్కుల సంఘం చీఫ్ మిఛెల్ బాచెలెట్‌కు వివరించారు. సీమాంతర ఉగ్రవాదం బెడద కారణంగానే ఆంక్షలు విధించినట్లు వివరించారు. 130 కోట్ల జనాభా కలిగిన తమ దేశంలో మానవ హక్కులకు అత్యుత్తమ రక్షణ ఉందన్నారు. చైనా–పాక్ ప్రకటనపై భారత్ మండిపాటు పాకిస్తాన్లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో కశ్మీర్ అంశంపై రెండు దేశాల సంయుక్త ప్రకటనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ మాట్లాడుతూ..‘కశ్మీర్‌కు సంబంధించి రెండు దేశాల సంయుక్త ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. జమ్మూకశ్మీర్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగం’అని పేర్కొన్నారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) పేరుతో తీసుకునే చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని 1947 నుంచి చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంది’అని పేర్కొన్నారు. ‘భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రం’ పాక్ విదేశాంగ మంత్రి భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి అన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపైనా పాక్ నేతలు మామూలుగా కశ్మీర్ అంటూ ప్రస్తావిస్తుంటారు. కానీ, ఖురేషి మంగళవారం యూఎన్‌హెచ్చార్సీ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులున్నాయని అంటున్నారు. అలాంటప్పుడు అంతర్జాతీయ సంస్థలను అక్కడికి ఎందుకు అనుమతించడం లేదు? మీడియాపై ఆంక్షలెందుకు? స్వచ్ఛంద, పౌర సంస్థలను కశ్మీర్లోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అనంతరం ఆయన యూఎన్‌హెచ్చార్సీ భేటీలో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని భారత్ రద్దు చేసింది. కశ్మీర్ ప్రజలకు న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాం. యూఎన్‌హెచ్చార్సీ మౌనంగా ఉండటం ఇబ్బందికర పరిణామం’ అని అన్నారు. -
భారత్‌పై కొత్త రాగం అందుకున్న పాక్
ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితిలు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వంతో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై పాక్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలా వద్ద అంశంపై రోజుకో కొత్తపాట పాడుతోంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌పై పాక్ ప్రభుత్వం కత్తులుదూస్తోన్న విషయం తెలిసిందే. ఇకపై ఏ విషయంలోనూ భారత్‌తో చర్చించేది లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘంటాపథంగా తేల్చిచెప్పారు. అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా దిగడానికి వెనుకాడబోమని చెప్పకనే చెప్పారు. ఇదిలావుండగా.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తాజాగా ప్రకటించారు. భారత్‌తో చర్చలను తామెప్పుడూ నిషేధించలేమని, రెండు దేశాల మధ్య సుధీర్ఘ చర్చలు జరగాల్సిన అవసరముందని ఖురేషి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుతం గృహ నిర్భందంలో ఉన్న కశ్మీర్ నేతలను విడుదల చేయాలని, వారు బయటకు వచ్చిన అనంతరం వారితో కూడా చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఇస్లామాబాద్‌లో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయం చాలా సున్నితమైనదని, దీనిపై పాక్, భారత్, కశ్మరీ ప్రజల మధ్య చర్చలు జరగాలన్నారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. -
భారత్ మాపై దాడి చేయొచ్చు: పాక్
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్య నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు భారత్ తమపై దాడిచేసే అవకాశముందని పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దీటుగా తిప్పికొడతామని హెచ్చరించింది. మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదన్న విధానానికి కట్టుబడి ఉన్నామనీ, అయితే భవిష్యత్తు పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఈ మేరకు స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి, ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ శనివారం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ..‘భారత్ ఎలాంటి దాడిచేసినా తిప్పికొట్టేందుకు ఎల్వోసీ వెంట పాక్ బలగాలను సిద్ధంగా ఉంచాం’అని తెలిపారు. ‘కశ్మీర్ సెల్’ ఏర్పాటు అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్‌నాథ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ విమర్శించారు. ‘భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాజ్‌నాథ్ ఈ ప్రకటన చేయడం నిజంగా దురదృష్టకరం. భారత్ యుద్ధోన్మాదంతో ఉందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. పాక్ విదేశాంగ శాఖలో కశ్మీర్ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా, సమాచారాన్ని చేరవేసేందుకు రాయబారుల్ని నియమిస్తాం’అని ఖురేషీ చెప్పారు. -
భ్రమల్లో బతకొద్దు..!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ/జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ ఎట్టకేలకు సత్యం తెలుసుకుంది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఐరాసతోపాటు అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడం అసాధ్యమని తెలుసుకుంది. ఈ విషయం స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ మాటల్లోనే తెలిపోయింది. కశ్మీర్‌పై భ్రమల్లో జీవించడం ఆపేయాలని ఆయన స్వదేశీయులకు హితవు పలికారు. మంగళవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ ఐరాస మద్దతు పొందేందుకు కొత్తగా పోరాటం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ‘మీరు (ప్రజలు) భ్రమల్లో జీవించడం మానేయాలి. మీ కోసం ఐక్యరాజ్యసమితిలో పూలదండలు పట్టుకుని సిద్ధంగా ఎవరూ లేరు. అక్కడ ఎవరూ మీకోసం ఎదురుచూడటం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుంది. కోట్లాది మంది జనాభా ఉన్న దేశం భారత్. చాలా దేశాలు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి. ముస్లిం దేశాలు మన వెనుకే ఉంటాయని మనం తరచూ అనుకుంటుంటాం. కానీ, వారికీ భారత్‌తో అనేక ఆర్థిక స్వయోజనాలున్నాయి. అందుకే, ముస్లిం దేశాలు కశ్మీర్ విషయంలో మనకు మద్దతు ఇవ్వకపోవచ్చు..’ అంటూ ప్రత్యేకంగా ఏ దేశం పేరునూ ప్రస్తావించకుండా ఆయన పేర్కొన్నారు. అత్యంత సన్నిహిత దేశం చైనా కూడా భారత్, పాక్‌లు రెండూ పొరుగుమిత్రులంటూ చర్చల ద్వారానే విభేదాలను పరిష్కరించుకోవాలనడం తెలిసిందే. దీటుగా స్పందిస్తాం: ఆర్మీ చీఫ్ జమ్మూకశ్మీర్‌లో పరిణామాల నేపథ్యంలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాక్ అదనపు బలగాలను మోహరించిందన్న వార్తలపై భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. ‘గత కొద్ది రోజులుగా ఎల్వోసీ వెంట పాక్ బలగాల సంఖ్య పెరిగినా దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపారు. సరిహద్దులో భారత జవాను పహారా దశలవారీగా ఆంక్షల సడలింపు ‘ప్రాణనష్టం నివారించేందుకే ప్రజలకు అసౌకర్యం కలిగించక తప్పడం లేదు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా దశలవారీగా ఆంక్షల సడలింపు చర్యలు చేపట్టే అధికారం స్థానిక యంత్రాంగానికే ఇచ్చాం’అని జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సల్ తెలిపారు. జమ్మూలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ అక్టోబర్ 12 నుంచి శ్రీనగర్‌లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించనున్నట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం ప్రకటించింది. కాల్పులు అబద్ధం: హోం శాఖ ఈ నెల 9న శ్రీనగర్ శివారులోని సౌరాలో ప్రజలపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయంటూ వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. కశ్మీర్లో ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని స్పష్టం చేసింది. ‘9వ తేదీన సౌరాలోని మసీదు నుంచి ప్రార్థనలు చేసి వస్తున్న వారిలో కలిసి పోయిన అల్లరిమూకలు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వి రెచ్చగొట్టేందుకు యత్నించాయి. అయితే, బలగాలు సంయమనం పాటించాయి. ఎటువంటి కాల్పులు జరగలేదు’ అని హోం శాఖ తెలిపింది. అయితే, ప్రభుత్వం చెబుతున్నట్లుగా కశ్మీర్లో అంతా ప్రశాంతంగా లేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భద్రతాదళాలకు చెందిన పెల్లెట్ గన్ గాయాలతో శ్రీనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నపిల్లల ఉదంతాలను చూపుతున్నాయి. ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరు సోమవారం గాయపడగా, మరో బాలిక గత వారం గాయపడినట్లుగా పేర్కొన్నాయి. -
‘ఉక్కుపాదం మోపండి’
వాషింగ్టన్: పాకిస్తాన్ భూభాగం కేంద్రంగా జరుగుతున్న ఉగ్రసంస్థల కార్యకలాపాలను నిలువరిస్తూ అర్థవంతమైన చర్యలు వెంటనే చేపట్టాలని పాక్‌ను అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. సంయమనం పాటించాలని భారత్, పాక్‌లను కోరింది. రెచ్చగొట్టే చర్యలను ఆపాలని అమెరికా విదేశాంగ మంత్రి పొంపియో పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి ఫోన్లో సూచించారు. శాంతిని కొనసాగించేందుకు కలసి రావాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నేరుగా చర్చలు జరపాలని, సైనిక చర్యలకు పాల్పొడద్దని, శాంతిని కొనసాగించేందుకు కలసి రావాలని కోరారు. సుష్మా వస్తే మేం రాం: పాక్ ఇస్లామాబాద్: ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్(ఓఐసీ) సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వస్తే తాము రాబోమని పాక్ స్పష్టంచేసింది. మార్చి 1, 2 తేదీల్లో అబుదాబిలో జరగనున్న ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశానికి సుష్మాను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. దీనిపై పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఓఐసీ సభ్య దేశాలతో మాకు ఇబ్బంది లేదు. కానీ, సుష్మా వస్తే సమావేశాన్ని మేం బహిష్కరిస్తాం. టర్కీ విదేశాంగ మంత్రితో మాట్లాడా. భారత్ ఈ సమావేశానికి హాజరుకావడాన్ని టర్కీ కూడా వ్యతిరేకిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రికి మా అభ్యంతరం తెలిపాం’అని ఖురేషి చెప్పారు. 1969లో ఏర్పాటు చేసిన ఓఐసీలో 57 సభ్యదేశాలున్నాయి. గతంలో ఈ సమావేశాల్లో క శ్మీర్ అంశాన్ని చర్చించడంపై భారత్ పలమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. -
ఖురేషీ దెబ్బకు ముగ్గురు సీబీఐ చీఫ్‌లు ఔట్!
సీబీఐ అధిపతి ఆలోక్ వర్మ ఉద్వాసనతో మాంసం వ్యాపారి మొయిన్ అక్తర్ ఖురేషీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఖురేషీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఆలోక్ వర్మ ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఖురేషీ నుంచి లంచం తీసుకున్నారంటూ సీబీఐలో నంబర్ 1, 2 స్థానాల్లో ఉన్న అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, దాంతో కేంద్రం వర్మను సెలవుపై పంపడం, చివరికి ఆయనకు ఉద్వాసన చెప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖురేషీ కేసు దెబ్బకు గతంలో సీబీఐ చీఫ్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలు కూడా పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. కాన్పూర్‌కు చెందిన ఖురేషీ 1993లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో మాంసం ఎగుమతి వ్యాపారం ప్రారంభించాడు. అధికారంలో ఉన్నవారితో సత్సంబంధాలు నెరపడం ద్వారా అనేక అక్రమాలకు పాల్పడి అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. దుబాయ్, లండన్, ఐరోపాల్లో హవాలా వ్యాపారం చేసేవాడు. పన్ను ఎగవేత నుంచి మనీ లాండరింగ్ వరకు ఆయనపై బోలెడు కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల నుంచి బయటపడటం కోసం సీబీఐ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకునేవాడు. కేసులు లేకుండా చేస్తానని చెప్పి సీబీఐ అధిపతుల పేరుతో పలువురి నుంచి కోట్లు రాబట్టేవాడు. ఖురేషీ కేసుకు సంబంధించి ఆలోక్‌వర్మ రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని మరో అధికారి రాకేశ్ అస్తానా ఆరోపించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చివరికది వర్మ ఉద్వాసనకు దారితీసింది. 2014లో సీబీఐ అధిపతిగా ఉన్న రంజిత్ సిన్హా ఇంటికి ఖురేషీ పదే పదే వెళ్లారని, 15 నెలల్లో 70 సార్లు ఖురేషీ సిన్హాను కలిశారని వార్తలు వచ్చాయి. సీబీఐ కేసులో ఇరుక్కున్న తన స్నేహితుడికి బెయిలు రావడం కోసం తాను రంజిత్ సిన్హా ద్వారా ఖురేషీకి కోటి రూపాయలు ఇచ్చానని హైదరాబాద్‌కు చెందిన సానా సతీశ్‌బాబు ఈడీ విచారణలో వెల్లడించాడు. ఈ ఆరోపణలను సిన్హా ఖండించినప్పటికీ చివరికి పదవి నుంచి వైదొలగక తప్పలేదు. 2010–12 మధ్య సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఏపీ సింగ్, ఖురేషీ చాలాసార్లు సెల్ మెసేజ్‌ల ద్వారా సంభాషించుకున్నారని 2014 చివర్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఖురేషీ, సింగ్‌ల మధ్య సంబంధాలపై దర్యాప్తు జరపడం కోసం సీబీఐ సింగ్‌పై కేసు నమోదు చేసింది. ఫలితంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. -
హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం
హైదరాబాద్: నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్ టాబ్లెట్లు విక్రయిస్తోన్న రాజేష్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీ ఎస్కే ఖురేషి విలేకరులతో మాట్లాడుతూ..కొత్తపేటకు చెందిన రాజేశ్‌ను నిన్న(శుక్రవారం) సాయంత్రం బిగ్‌బజార్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిద్రపోవడానికి ఈ టాబ్లెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. 8 వేల రెండు వందల యాభై మత్తు మందు టాబ్లెట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ర్టంలోని రాయచూర్ నుంచి టాబ్లెట్స్ తెచ్చి రాజేష్ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆటోడ్రైవర్లు, చిన్న చిన్న పనిచేసుకునే కార్మికులు, కొంత మంది వ్యాపార వేత్తలకు టాబ్లెట్లు సరఫరా చేస్తున్నాడని వివరించారు. అందరూ కూడా ఇతనికి తెలిసిన కస్టమర్లేనని పేర్కొన్నారు. ఒక్కో టాబ్లెట్‌ను యాభై నుంచి వంద రూపాయలకు అమ్ముతున్నట్లు విచారణలో రాజేష్ తెలిపాడని చెప్పారు. -
కలకలం రేపుతున్న ఈడీ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మాంసం వ్యాపారి ఖురేషి వ్యవహారంలో ఈడీ చార్జిషీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎంబీఎస్ జ్యువెలర్ సుఖేష్ గుప్తాకు బెయిల్ డీల్ వ్యవహారంలో సీబీఐ మాజీ డైరెక్టర్ ద్వారా ఖురేషీ సాగించిన వ్యవహారం వెలుగులోకి రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఖురేషీ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతల పేర్లు ప్రస్తావించడం రాజకీయంగా కలవరం సృష్టిస్తోంది. సుఖేష్ గుప్తాకు బెయిల్ ఇప్పించే విషయంలో ఖురేషితో ఒప్పందం నడిపించినట్లు ఈడీ విచారణలో కోనేరు ప్రదీప్ బయటపెట్టడం, పలువురు రాజకీయ నేతల ద్వారా సీబీఐ మాజీ డైరెక్టర్‌ను కలసి ఖురేషి చర్చించిన అంశాలను చార్జిషీట్లో ఈడీ పేర్కొనడం సంచలనం రేపుతోంది. -
నన్ను ఇంటికి తీసుకెళ్లండి
ఆస్పత్రిలో ఉండలేన ంటూ స్వైన్‌ఫ్లూ బాధితుడు వినతి నచ్చజెప్పిన వైద్య ఆరోగ్యశాఖ అనంతపురం మెడికల్ : ‘ఈ వార్డులో ఒక్కన్నే బిక్కు బిక్కుమంటు ఉండాలి.. నాతో ఎవరూ మాట్లాడరు... నేనెందుకుండాలి... దీని కంటే చనిపోయేదే మేలేమో...నన్ను ఇంటికి తీసుకెళ్లండి’ అంటూ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ బాధితుడు మహ్మద్యాసిన్ ఖురేషి(64) తన కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది వద్ద మొరపెట్టుకున్నాడు. ఇక్కడ ఉండేది లేదు, నాకు ఆరోగ్యంగా బాగానే ఉందని...నాకేం కాదంటూ బిగ్గరగా అరిచాడు. సిబ్బంది ఎంత చెప్పినా వినలేదు. దీంతో ఆస్పత్రిలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఎక్కడ బయటకు వెళ్లిపోతాడోనన్న భయం సిబ్బందిలో కల్గింది. విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ ఎపిడమిక్ టీం సభ్యులు రామకృష్ణ, ధర్మసింగ్ ఆస్పత్రికి పరుగున వచ్చారు. ఖురేషీకి నచ్చజెప్పారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాస్క్‌లు ధరించి అప్పుడప్పుడు వెళ్లి మాట్లాడించాలని తెలిపారు. మీకు ముందస్తుగా మెడిసన్ ఇచ్చినందు వల్ల మాస్క్‌లు ధరించి దూరం నుంచే మాట్లాడితే సరిపోతుందని వివరించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
పట్టించిన వాట్స్‌యాప్
=మొబైల్ అప్లికేషన్‌తో చిక్కిన ‘మెంటల్ ఖురేషీ’ =మొదటి వారంలో ‘ఎర్రగడ్డ’ నుంచి పరారీ =19 రోజుల్లో పద్దెనిమిది ప్రాంతాల్లో ‘పర్యటన’ =రెండో భార్యతో ఉన్న ఫొటోలు మొదటామెకు షేర్ =బయటి నుంచి నలుగురు సహకరించినట్లు నిర్ధారణ సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లను పట్టుకునేందుకు వెస్ట్‌జోన్ పోలీసులకు టెక్నాలజీ బాగా ఉపకరిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్‌గౌడ్ కిడ్నాప్, హత్య మిస్టరీని ఫేస్బుక్ ఫొటోలు విప్పితే... ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి నుంచి పరారైన ఖైదీ ఖురేషీ జాడను మొబైల్ అప్లికేషన్ ‘వాట్స్‌యాప్’ తెలిపింది. రెండో భార్యతో ములాఖత్ అంగీకరించలేదనే కారణంగా ఈ నెల 3న తెల్లవారుజామున మరికొందరు ఖైదీలతో కలిసి ఖురేషీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఖురేషీ ‘గ్రేట్ ఎస్కేప్’కు బయట నుంచి మరో నలుగురు సహకరించినట్లు ఆధారాలు లభించాయని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖురేషీ అరెస్టును ఆయన ప్రకటించారు. నాంపల్లి చాపెల్ రోడ్లో నివసించే మహ్మద్ అహ్మద్ ఫాహుద్దీన్ ఖురేషీపై అబిడ్స్ ఠాణాలో ఆరు, నాంపల్లి పోలీసుస్టేషన్లో మరో కేసు నమోదై ఉన్నాయి. అబిడ్స్ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్‌గా ఉన్న ఖురేషీని ఆ ఠాణా పోలీసులు మాదకద్రవ్యాల కేసులో అక్టోబర్ 15న అరెస్టు చేసి జైలుకు పంపారు. మానసికస్థితి సరిగ్గా లేదన్న కారణంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తప్పించుకున్నాడు. నిత్యం ‘రోమింగ్’లోనే... ఆస్పత్రి వద్ద నుంచి ఆటోలో తన రెండో భార్య అల్మాస్ వద్దకు వెళ్లిన ఖురేషీ.. ఆమెతో కలిసి టవేరా వాహనంలో ‘టూర్’ ప్రారంభించాడు. మొదటి భార్య ఉన్నప్పటికీ ఖురేషీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అల్మాస్‌ను పెళ్లి చేసుకున్నాడు. గడిచిన 19 రోజుల్లో వాహనాలతో పాటు విమానాలు, రైళ్లలో గుల్బర్గా, బెంగళూరు, మైసూరు, ఊటీ, అజ్మీర్, ఢిల్లీ, ముంబై, మహాబలేశ్వర్, హరిద్వార్, కాశ్మీర్, గోవా, ఆగ్రా, సిమ్లా, కులూమనాలీ, శ్రీనగర్, పటాన్‌కోట్, లడక్, విజయవాడల్లో తిరిగాడు. ఎక్కడా ఒకరోజుకు మించి బస చేయలేదు. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆగ్రాలో రెండో భార్యతో కలిసి దిగిన ఫొటోలను వాట్స్‌యాప్ ద్వారా మొదటి భార్యకు షేర్ చేశాడు. దీంతో అతడి ఆచూకీని సాంకేతికంగా కనిపెట్టిన పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి టోలిచౌకి చేరుకోగా మాటు వేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. సహకరించిన వారిలో చీతాపూర్ కార్పొరేటర్ ఖురేషీ తప్పించుకోవడానికి సహకరించిన వ్యక్తులు నలుగురని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మీరాలం మండీకి చెందిన రెండోభార్య అల్మాస్‌కు ఖురేషీ పరారైన ఖైదీ అని తెలిసీ అతడితో సంచరించింది. ఈమె సోదరుడైన సయ్యద్ ముస్తాఫా అలీఖాన్ రిజ్వీ అలియాస్ ఫజల్ తరచూ ఆస్పత్రిలో ఖురేషీని క లుస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి సహకరించాడు. అల్మాస్ నివసిస్తున్న ఇంటి యజమాని సయ్యద్ అలీ హుస్సేన్ వీరిద్దరూ సిటీ వదిలి పారిపోవడానికి తన టవేరా వాహనాన్ని సమకూర్చాడు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న చీతాపూర్ కార్పొరేటర్ సయ్యద్ జఫార్ సైతం రూ.25 వేల వరకు ఇచ్చి సహకరించాడు. వీరందరిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు.. ఇంకా ఎవరి ప్రమేయం ఉందనేది తేల్చడానికి ఖురేషీని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ కూడా.. ప్రస్తుతం అబిడ్స్ ఠాణాలో రౌడీషీటర్‌గా ఉన్న, ‘మెంటల్’గా ముద్రపడిన ఖురేషీలో మరో ఆసక్తికర కోణమూ ఉంది. అతను ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్. ఫహద్ ఖురేషీ పేరుతో 2006 వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సీనియర్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఎందరో మల్లయోధుల్ని మట్టికరిపించి నాలుగైదు మెడల్స్ కూడా సంపాదించాడు. 2004 ఆగస్టు 22-25 మధ్య ఒడిశాలోని పూరీలో జరిగిన 28వ సీనియర్ నేషనల్ ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో అత్యుత్తమన ప్రతిభ కనబరిచాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి. ఖురేషీ మానసికస్థితి పక్కాగా ఉంది ఎస్కేప్‌కు ప్లాన్ చేయడం నుంచి పట్టుబడే వరకు ఖురేషీ తీరును పరిశీలిస్తే అతడి మానసికస్థితి పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు జైలు నుంచి మెంటల్ ఆస్పత్రికి ఎందుకు వచ్చాడనేది బయటపడాలి. ఖురేషీ సైతం తనను ఆ ఆస్పత్రికి ఎందుకు పంపారో తెలియదని చెబుతున్నాడు. అందుకే గాంధీ ఆస్పత్రి వైద్యుల బృందంతో పరీక్షలు చేయిస్తున్నాం. నివేదికల్ని కోర్టుకు సమర్పించి న్యాయమూర్తి ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఖురేషీ ఆస్పత్రిలో ఉండగా ఫోను వాడాడని తెలుస్తోంది. ఈ విషయంతో పాటు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నాం. ఆ రోజు తప్పించుకున్న వారిలో తిరుమలేష్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఇతని కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. - డీసీపీ సత్యనారాయణ -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి పట్టివేత
హైదరాబాద్; మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతూ తప్పించుకుపోయిన ఖురేషి అనే ఖైదీని వెస్ట్ జోన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.అతను గుల్బర్గాలో పోలీసుల చేతికి చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి . డిసెంబర్ 2 వతేదీన ఖురేషీ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి పరారైయ్యాడు. తరచు ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడు. అతను తప్పించుకున్న ముందురోజు భార్యతో ములాఖత్ కు పోలీసులు నిరాకరించడంతో భయానక వాతావరణం సృష్టంచాడు. -
ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి
-
ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: ప్రమోద్‌కుమార్
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆసుపత్రి నుంచి గత రాత్రి 11 మంది రోగులు పరారైనట్లు ధృవీకరించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఖురేషి భార్య ములాఖత్ కావాలంటూ ఆసుపత్రికి వచ్చిందని, అయితే ఆ సమయంలో ములాఖత్ నిబంధనలకు విరుద్ధమని చెప్పామని ఆయన తెలిపారు. భార్యతో ములాఖత్ నిరాకరించడంతో ఖురేషి ఆసుపత్రిలో భయానక వాతావరణం సృష్టించాడని పేర్కొన్నారు. ఖురేషీ ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడని వివరించారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి వారంత పరారయ్యారని తెలిపారు. పరారైన వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో నలుగురు పరారిలో ఉన్నారన్నారు. రాత్రి సమయంలో వారిని అడ్డుకోవడానికి తమ సిబ్బంది, పోలీసులు విఫలయత్నం చేశామన్నారు. అయితే ఆసుపత్రిలో మిగిలిన 50 మంది పేషెంట్లకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.