
న్యూఢిల్లీ:భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అమెరికా నిధులిచ్చిందనే విషయాన్ని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా ఇచ్చే 21 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేసిందన్న వార్తలపై ఖురేషి ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.
‘భారత్‌లో ఓటర్ టర్నౌట్ విషయంలో సాయం కోసం తాను సీఈసీగా ఉండగా ఎన్నికల కమిషన్ అమెరికాతో ఒప్పందం కుదర్చుకుందనడంలో కొంచెం కూడా నిజం లేదు.నేను 2012లో సీఈసీగా ఉన్నపుడు ఐఎఫ్‌ఈస్‌తో మాత్రమే సిబ్బంది శిక్షణ కోసం ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందంలో ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రస్తావన లేనే లేదు.ఆర్థిక,న్యాయపరమైన బాధ్యతలేవీ ఉండవని ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నాం’అని ఖురేషి తెలిపారు. భారత్‌లో ఓటర్ టర్నౌట్ కోసం ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల సాయాన్ని మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’ ఇప్పటికే ప్రకటించింది.ఈ ప్రకటనపై ప్రధాని మోదీ సలహాదారు సంజీవ్ సన్యాల్ మండిపడ్డారు. ప్రపంచ దేశాలకు అమెరికా సాయం అనేది అతి పెద్ద స్కామ్ అని ఫైర్ అయ్యారు.