What level South Korea reached with US aid; What happened to Pakistan? - Sakshi
Sakshi News home page

అమెరికా సాయం పొందిన దక్షిణ కొరియా ఏ స్థాయికి చేరింది?

Published Fri, Jun 30 2023 11:34 AM | Last Updated on Fri, Jun 30 2023 12:22 PM

What level has South Korea reached with US aid and pakistan - Sakshi

పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభం అక్కడ చదువుకున్న యువతను నేడు ఉపాధి కోసం విదేశాలకు వలసపోయేలా చేస్తోంది. మెరుగైన జీవనశైలి, మరింత నాణ్యత గల ఉన్నత విద్య కోసం భారతదేశం నుంచి యువతీ యువకులు అమెరికా, ఐరోపా తదితర పారిశ్రామిక దేశాలకు వెళుతున్నారు గాని స్వదేశంలో అవకాశాలు లేకకాదు. ఉద్యోగాలు లేక కాదు. 1971లో బంగ్లాదేశ్‌ అవతరణకు దారితీసిన భారత-పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో పాకిస్తానీయులు ఏ స్థాయిలో విదేశాలకు తరలిపోయారో ఇప్పుడు అంత కన్నా  ఎక్కువ మంది ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లిపోతున్నారు. 2022లో పాక్‌ నుంచి చదువుకున్న యువత 8,32,339 మంది విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి వెళ్లిపోయారు. 2021తో పోల్చితే పాక్‌ నుంచి చదువుకున్నవారి వలస 189 శాతం పెరిగింది.

2023 మొదటి ఐదు నెలల్లో ఇలా ఇతర దేశాల్లో ఉపాధి కోసం వలసపోయినవారి సంఖ్య 3,15,787కు చేరుకుందని వలసలు, ఇతర దేశాల్లో ఉపాధి బ్యూరో (బీఈఓఈ) వెల్లడించింది. పాక్‌ అంతర్గత సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రతిభాపాటవాలున్న విద్యావంతులైన యువకులు విదేశాలకు వలసపోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో అక్కడ ఉత్పత్తి, సేవల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయి స్థూల దేశీయ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. మరో పక్క పాక్‌ మాదిరిగానే కొన్ని దశాబ్దాలు సైనిక పాలనలో మగ్గిన దక్షిణ కొరియా గత 30 ఏళ్లలో అనూహ్య పారిశ్రామిక ప్రగతి సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ జపాన్‌ పాలనలో మగ్గిన దక్షిణ కొరియా దేశ విభజనతో మరింత కుంగిపోయింది. అయితే, మహాయుద్ధంలో జపాన్‌ ను ఓడించిన అమెరికా దక్షిణ కొరియా ప్రగతి బాధ్యత తీసుకుంది. సైనిక నియంతల పాలనలో ఉన్న ఈ ఆసియా దేశానికి అన్ని విధాలా ఈ అగ్రరాజ్యం సాయపడింది. కోట్లాది డాలర్ల ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందించింది.


 
రెండు దేశాలకూ అమెరికా డాలర్లు అందినా ప్రజాస్వామ్యం, ప్రగతి కనపడని పాక్‌!
ఈ క్రమంలో 1990ల  నాటికి  సైనిక పాలనకు తెరపడి దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకోవడం మొదలైంది. 21 శతాబ్దం ఆరంభ సమయానికి శాంసంగ్, హ్యుందయ్, ఎల్జీ, కియా, పోస్కో వంటి అనేక అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన బ్రాండ్లతో ప్రపంచీకరణలో కీలక పాత్ర పోషించే స్థాయికి దక్షిణ కొరియా చేరుకుంది. పైన వివరించిన పాకిస్తాన్‌ కూడా తన భౌగోళిక స్థితిగతుల కారణంగా మొదటి నుంచీ పాశ్చాత్య దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం పొందింది. ఇంకా పొందుతూనే ఉంది. అప్పట్లో పూర్వపు సోవియెట్‌ యూనియన్‌ ఉనికి కారణంగా దాన్ని తట్టుకోవడానికి పాకిస్తాన్  ను అమెరికా తన సైనిక అవసరాలకు వీలుగా మలుచుకుంది. అత్యధిక కాలం సైనిక పాలనలో కునారిల్లిన పాక్‌ ప్రభుత్వాలకు ఆర్థిక సాయంతోపాటు అత్యంత ఆధునిక ఆయుధాలు కూడా సమకూర్చింది అమెరికా.

అయితే, పాక్‌ పాలకులు అమెరికా సాయాన్ని తమ దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించు కోలేకపోయారు. ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజాస్వామ్య పంథాలో పయనించిన దక్షిణ కొరియా తరహాలో పాకిస్తాన్‌ ను అక్కడి పాలకులు నడిపించలేకపోవడం పాక్‌ ప్రజల దురదృష్టం. పాకిస్తాన్‌ లో మాదిరిగా సైనిక పాలన కొనసాగిన దేశమైనా దక్షిణ కొరియా ఆర్థికరంగంలో వినూత్న విజయాలు సాధించింది. టెక్నాలజీ రంగంలో కొత్తపుంతలు తొక్కింది. ఏభయి సంవత్సరాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయడం ద్వారా దేశంలో పారిశ్రామికీకరణకు మార్గం సుగమం చేసింది దక్షిణ కొరియా.

అమెరికా ఆర్థిక సాయాన్ని ఉన్నత విద్యకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి చక్కగా వాడుకున్నారు దక్షిణ కొరియా పాలకులు. చాలా కాలం సాగిన సైనిక పాలన, ప్రజాస్వామ్యం బలహీనంగా ఉండడం పాకిస్తానీయులకు శాపాలుగా మారాయి. జనాభాలో, వైశాల్యంలో బాగా చిన్నదైన దాయాది దేశం పాకిస్తాన్‌ ఇలా ఎదుగూబొదుగూ లేకుండా విఫలరాజ్యంగా మారడం భారతదేశానికి ఏమాత్రం వాంఛనీయ పరిణామం కాదు. తన సైజుకు మించి అతిపెద్ద సైన్యం ఉన్న పొరుగుదేశంలో సుస్థిరతనే ఇండియా ఎప్పుడూ కోరుకుంటుంది.

విజయసాయిరెడ్డి, వైఎస్సార్  సీపీ, రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement