
భారీగా దిగుమతి చేసుకునే యత్నం
తుర్కియే, దక్షిణ కొరియాతో చర్చలు
వాషింగ్టన్: గుడ్ల కొరతతో గుడ్లు తేలేస్తున్న అమెరికా సమస్య నుంచి గట్టెక్కేందుకు వాటిని భారీగా దిగుమతి చేసుకునే పనిలో పడింది. ఇందుకోసం తుర్కియే, దక్షిణ కొరియాలను సంప్రదిస్తోంది. తక్షణం కోట్లాది గుడ్లను పంపేలా వాటితో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్టు వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ శుక్రవారం వెల్లడించారు. పలు ఇతర దేశాలతోనూ మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. అమెరికా తమను కూడా సంప్రదించినట్టు పోలండ్, లిథువేనియా వంటి దేశాలు ధ్రువీకరించాయి. బర్డ్‌ఫ్లూ తదితరాలతో కోళ్ల సంఖ్య బాగా తగ్గడం అమెరికాలో గుడ్ల కొరతకు దారి తీసింది. దాంతో వాటి ధరలు కొద్ది నెలలుగా చుక్కలనంటడం తెలిసిందే.
డజను గుడ్లకు 5 డాలర్లు, అంతకుమించి వెచ్చించాల్సి వస్తోంది. షికాగో వంటి ప్రధాన నగరాల్లో 9 నుంచి 10 డాలర్ల దాకా ధరలు ఎగబాకాయి. అంతంత పెట్టి కొనలేక చాలామంది ఏకంగా కోళ్లనే పెంచుకుంటున్నారు. దాంతో గుడ్ల ధరలను నేలకు దించే మార్గాలపై ట్రంప్ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకోసం 100 కోట్ల డాలర్లతో నిధి ఏర్పాటు వంటి పలు చర్యలు తీసుకున్నా పెద్దగా పలితం కన్పించడం లేదు.
రెండు నెలల్లో దేశీయంగా కోళ్ల సంఖ్య పెరిగి సమస్య చక్కబడుతుందని రోలిన్స్ ఆశాభావం వెలిబుచ్చారు. బర్డ్‌ఫ్లూ దెబ్బకు గత రెండున్నరేళ్లలో అమెరికాలో కనీసం 20 కోట్ల కోళ్లను వధించారు. దాంతో చుక్కలనంటిన గుడ్ల ధరలు ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో కూడా ట్రంప్‌కు అస్త్రంగా కూడా మారాయి. తాను పగ్గాలు చేపట్టగానే వాటికి ముకుతాడు వేస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment