Chicken eggs
-
అక్కడ కోడిగుడ్లు..ఇక్కడ టమాటాలు
వాంకిడి/తాండూరు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 363వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఒకచోట టమాటాల లోడున్న వాహనం, మరోచోట కోడుగుడ్ల వ్యాన్ పల్టీ కొట్టాయి. రూ.11 లక్షల విలువైన టమాటాలు రోడ్డు పొడవునా చిందరవందరగా పడిపోయాయి. మరోచోట రూ.2 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయి కిందపడటంతో రోడ్డంతా పచ్చసొన పరచుకుని వరదలా పారింది. పెద్దపల్లి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు ఓ వ్యాన్ కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి సమీపంలో రెండు బైక్‌లు ఒక్కసారిగా ఎదురు రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేక్రమంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో రూ. 2 లక్షల విలువైన గుడ్లన్నీ పగిలిపోగా, అందులోని సొన మొత్తం రోడ్డుపై పచ్చని వరదలా పారింది. అయితే వ్యాన్ డ్రైవర్ ఎండీ ఆసిఫ్ స్వల్పంగా గాయపడ్డాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పలువురు వాహనచోదకులు జారిపడ్డారు. కర్ణాటక నుంచి రూ.11 లక్షల విలువైన 430 పెట్టెల టమాటాలతో ఓ వాహనం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామేలా గ్రామసమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తిమ్మప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాల పెట్టెలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పొడవునా పడిపోయిన టమాటాలను ఏరేందుకు స్థానిక యువకులు సహాయపడ్డారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. -
కోడిగుడ్ల ఆహారోత్పత్తులకు పురస్కారాలు!
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) తాజాగా విజన్ 365 ఎగ్ ఇన్నోవేషన్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కోడిగుడ్లతో చేసిన వినూత్న ఆహారోత్పత్తులకు గాను ఈ అవార్డును అందించనున్నట్లు విజన్ 365 చైర్మన్ సురేష్ చిట్టూరి తెలిపారు. ఈ కొత్త అంతర్జాతీయ పురస్కారానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. నూతన ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునేందుకు, వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకు సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆగస్టు 11లోగా కంపెనీలు తమ ఉత్పత్తుల వివరాలను షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24–28 మధ్య జరిగే ఐఈసీ గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో అవార్డును ప్రదానం చేస్తారు. -
కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మండపేట(కోనసీమ జిల్లా): గుప్పెడంత ఉండే గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు కలిగిన సూపర్ ఫుడ్‌గా గుడ్డును పేర్కొంటారు నిపుణులు. భారత పౌష్టికాహార సంస్థ గుర్తించిన 650 ఆహార పదార్థాల్లో గుడ్డు మొదటిది కావడం గమనార్హం. శరీరానికి ఆరోగ్యాన్ని అందించే గుడ్డు లక్షలాది మందికి ఉపాధి చూపుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన రంగాల్లో ఒకటిగా నిలిచింది. చదవండి: రైతు ట్రెండీ ఐడియా.. పంట పొల్లాల్లో హీరోయిన్ల ఫొటోలు పెట్టి..! రెండున్నర దశాబ్దాల క్రితం లండన్ కేంద్రంగా అంతర్జాతీయ గుడ్లు సమాఖ్య (ఐఈసీ) ఆవిర్భవించింది. ఆరోగ్య పరిక్షణలో గుడ్డు ప్రాధాన్యతను వివరించడమే లక్ష్యంగా ఏటా అక్టోబర్ రెండో శుక్రవారం ఐఈసీ ప్రపంచ గుడ్డు దినోత్సవం నిర్వహిస్తోంది. జాతీయ గుడ్లు సమ్వయ కమిటి (ఎన్ఈసీసీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వరల్డ్ ఎగ్ డే వేడుకలు నిర్వహిస్తుంటారు. పోషకాలివీ.. ♦50 గ్రాముల గుడ్డులో ఎనర్జీ 72 కేలరీలు ఉంటే, 6.3 గ్రాముల ప్రొటీన్లు, 4.8 గ్రాముల కొవ్వు, 28 గ్రాముల కాల్షియం, 0.9 గ్రాముల ఐరెన్, విటమిన్ ఏ 270 ఐయూ, విటమిన్ డి 41ఐయూ ఉంటాయి. శరీరానికి కావాల్సిన మరెన్నో పోషకాలు గుడ్డులో లభిస్తాయి ♦గుడ్డులో ఉండే విటమిన్ ఏ ఆరోగ్యకరమైన కణాల వృద్ధికి, చర్మం, కళ్లు వాటి కణజాలకు ఎంతో అవసరం ♦గుడ్డులో ఉండే విటమిన్ బి–12 ఎర్ర రక్తకణాల తయారీకి, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ♦కొలిన్ శరీరంలోని నాడీ, కండరాల వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ♦ఫోలిక్ ఆసిడ్ ఎర్ర రక్తకణాల తయారీకి, గర్భవతుల్లో పిండం పెరుగుదలకు, ఐరెన్ శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడుతుంది. కండరాల నిర్మాణం, అవయవాలు, చర్మం, ఇతర కణజాలాల నిర్మాణానికి, హార్మోనులు, ఎంజైములు, యాంటీబాడీల తయారీకి గుడ్డు ఎంతో మేలు చేస్తుంది ♦గుడ్డులోని సెలీనియం ఆరోగ్యకరమైన రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది ♦ఆరోగ్యకరమైన ఎముకలు, పళ్ల నిర్మాణానికి అవసరమైన కాల్షియాన్ని అందిస్తుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వైరస్‌ను తట్టుకునేందుకు, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రధాన పౌష్టికాహారంగా కోడిగుడ్డుకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. వేల మందికి ఉపాధి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, అనపర్తి, ద్వారపూడి, బలభద్రపురం, పెద్దాపురం, రావులపాలెం, రంగంపేట, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో పరిశ్రమ విస్తరించింది. 200 పౌల్ట్రీలు ఉండగా గుడ్లు పెట్టేవి, పిల్లలు తదితర దశల్లో దాదాపు 2.20 కోట్ల కోళ్లు ఉన్నాయి. గుడ్లు పెట్టే కోళ్లు దాదాపు 1.3 కోట్లు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక గుడ్ల ఉత్పత్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరుగుతుండటం గమనార్హం. ఇక్కడి ఉత్పత్తిలో 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సొం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. కోళ్లకు మేత వేయడం, నీళ్లు పెట్టడం, మందులు అందజేయడం, గుడ్ల రవాణా, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు కోడిగుడ్డులో పోషకాలు పుష్కలం శరీరానికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడంలో గుడ్డు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండడం వల్ల ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు, కండర నిర్మాణానికి మేలు చేస్తుంది. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
నాటు కోడి గుడ్లు దొరక్క ఇబ్బందులు.. రంగంలోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్.. లక్షల్లో సంపాదన
సాక్షి, అమరావతి బ్యూరో: చదివింది ఎంసీఏ. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగళూరులో ఉద్యోగం. లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యంతో సొంత ఊరికి వచ్చాడు. ఇక్కడ తన పిల్లలకు నాటు కోడి గుడ్లు పెట్టాలనుకున్నాడు. మార్కెట్లో ఎంత వెతికినా దొరకలేదు. పైగా, నాటు కోడి పేరుతో జరుగతున్న మోసాలను గమనించాడు. అసలైన జాతి కోళ్లను పెంచితే మంచి గిరాకీ ఉంటుందని గ్రహించాడు. తీరిక వేళల్లో కోళ్లు పెంచాలన్న ఆలోచన తట్టింది. కానీ, కోళ్ల పెంపకంపై అవగాహన లేదు. దీంతో పందెం కోళ్ల పెంపకంపై తెలిసిన వారి నుంచి కొంత, ఆన్లైన్లో మరికొంత సమాచారాన్ని సేకరించాడు. రూ.15 వేల పెట్టుబడితో కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో లభించే మేలు జాతి దేశీయ రకం కోళ్లతో పాటు విదేశీ జాతులను సేకరించి వాటి సంకరంతో కొత్త జాతి కోళ్లను వృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పందెం రాయుళ్లు కోళ్ల కోసం ఇప్పుడు వడ్లమూడికి వస్తున్నారు. ఇలా సాఫ్ట్‌వేర్‌తో పాటు కోళ్ల పెంపకంలోనూ రాణిస్తున్నాడు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి యువకుడు ఘట్టమనేని శ్రావణ్‌కుమార్. పుంజుల వీర్యాన్ని సేకరించి కోళ్ల పందెంలో దూకుడుగా బరిలో దిగటానికి కొంతమంది విదేశీ మేలు జాతి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. శ్రావణ్ మాత్రం దేశీయ రకం కోళ్ల జాతితో శాస్త్రీయ పద్ధతుల్లో మరింత మెరుగైన కోళ్ల ఉత్పత్తి చేస్తున్నాడు. ఎంపిక చేసుకున్న మేలు రకం పుంజుల వీర్యాన్ని సేకరించి నిల్వ చేస్తాడు. దాన్ని కొబ్బరినీళ్లు, సెలైన్ వాటర్‌లో కలిపి దేశీయ జాతి పెట్టలకు అందజేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పెట్టలు త్వరగా అలసిపోవు. అధిక, నాణ్యమైన గుడ్లను పెట్టే శక్తి వస్తుంది. ఆశించినట్లే మేలు రకం దేశీయ కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రెండేళ్లుగా కష్టపడి దేశీయ జాతిలో మంచి కోళ్లను సృష్టించానని, మరింత అభివృద్ధి చేసిన తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెడతానని శ్రావణ్ చెబుతున్నాడు. ఆన్లైన్లో అమ్మకాలు నాణ్యమైన ఉత్పత్తితో పాటు మెరుగైన మార్కెటింగ్ ఉంటేనే అమ్మకాలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని శ్రావణ్ సోషల్ మీడియాలో ఘట్టమనేని ఫామ్స్ పేరిట ప్రత్యేక పేజీను తయారు చేసుకున్నాడు. తన వద్ద ఉన్న కోళ్ల ఫొటోలను అందులో పోస్ట్ చేస్తున్నాడు. వాటిని చూసి ఆర్డర్లు వస్తుండగా, మరికొంత మంది నేరుగా ఫామ్‌కి వచ్చి కొంటున్నారు. మోసానికి తావులేకుండా, కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టు అమ్మకాలు చేస్తుండటంతో మార్కెట్లో మంచి పేరు వచ్చిందని శ్రావణ్ చెబుతున్నాడు. సంక్రాంతి టార్గెట్‌గా శ్రావణ్ దగ్గర కోడిగుడ్డు, అప్పుడే పుట్టిన పిల్ల మొదలు రెండేళ్ల వయసు గల కోళ్లు ఉంటాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా వాటిని పెంచుతున్నాడు. తోక పుట్టుక, కోడి కాళ్లు, శరీరాకృతి ఆధారంగా రేటు వస్తుంది. వచ్చే సంక్రాంతి పండుగ టార్గెట్‌గా ఇప్పటి నుంచే కోళ్ల పెంపకం మొదలుపెట్టాడు. వడ్లమూడి, ఒంగోలు, బాపట్ల, వేటపాలెంలలో షెడ్లను ఏర్పాటు చేశాడు. తూర్పు జాతి, మెట్టవాటం, పచ్చకాకి, కాకిడేగ, సేతువు, నెమలి వంటి పలు రకాల కోళ్లు పెంచుతున్నాడు. ఒక్కొక్క గుడ్డు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నాడు. 15 రోజుల కోడి పిల్ల రూ.1,500, మూడు నెలల పిల్లలు రూ.3 వేలు, ఆరు నెలల పిల్లలు రూ.10 వేలు దాకా అమ్ముతున్నాడు. జాతిని బట్టి ఒక్కో కోడి రూ.3 లక్షల దాకా ఉంటాయని శ్రావణ్ చెబుతున్నాడు. అవసరంతో మొదలుపెట్టి... అదనపు ఆదాయంగా మార్కెట్లో అసలైన నాటు కోడి మాంసం, గుడ్లు లభించడంలేదు. దీంతో నేనే కోళ్ల పెంపకం మొదలుపెట్టాలన్న ఆలోచన మొదలైంది. తర్వాత ఇది అదనపు ఆదాయంగా మారింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 2 రెండు గంటల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తా. ఖాళీ సమయంలో కోళ్లను చూసుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నా భార్య, అమ్మ, నాన్న నాకు సహాయంగా ఉంటున్నారు. పందెం కోళ్లకు అడ్రస్ ఘట్టమనేని ఫామ్స్ అని చెప్పుకొనేలా చేయడమే నా లక్ష్యం. – ఘట్టమనేని శ్రావణ్‌కుమార్ -
కోళ్లు మరణిస్తే సమాచారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల మరణాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. కోళ్లలో మరణాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బర్డ్ ఫ్లూ వ్యాధి పక్షి నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. పుకార్లను నమ్మొద్దని, కోడి గుడ్లు, కోడి మాంసంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని తెలిపారు. -
కోడిగుడ్లతో ఏటా 7,500 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ చక్రధర రావు పొట్లూరి చెప్పారు. గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానం మనదే అయినా... సరైన ప్రోత్సాహం లేక కోళ్ల ఫామ్స్‌ని మూసేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నెల 27–29 తేదీల్లో హెచ్ఐసీసీలో 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం.. దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ వార్షిక పరిమాణం ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్లు. వృద్ధి రేటు 7 శాతం. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం వరకూ ఉన్నట్లు వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజీ ఆనంద్ చెప్పారు. దేశంలో రోజుకు 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయితే... దాన్లో 4 కోట్లు తెలంగాణలో, 4.5 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలో 2 వేల మంది గుడ్ల ఉత్పత్తిదారులు, లక్ష మంది బ్రాయిలర్ రైతులు ఉన్నారని, రోజుకు 2 కోట్ల బ్రాయిలర్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశారు. అమెరికన్ కాళ్లను దించొద్దు.. అమెరికాలో అమ్ముడుపోని, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న చికెన్ లెగ్స్‌ను భారత్‌కు పంపేందుకు యూఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని చక్రధర రావు చెప్పారు. దీన్ని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘గతంలో అమెరికా.. పక్కనే ఉన్న హైతీ దేశంలోకి చికెన్ లెగ్స్‌ను ఎగుమతి చేసింది. దీంతో హైతీ పౌల్ట్రీ పరిశ్రమ 70 శాతం వరకు కనుమరుగైపోయింది. భారీగా చికెన్ లెగ్స్‌ను తక్కువ ధరకు పంపితే స్థానిక కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ పరిస్థితి మనకూ వస్తుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
కోడి పెట్టిన గుడ్డేనా?
సాగుతున్న పెంకు.. కాలిస్తే ప్లాస్టిక్ వాసన కరీమాబాద్(వరంగల్ తూర్పు): వరంగల్‌లోని కరీమాబాద్‌లో అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కోడి గుడ్లు కృత్రిమమైనవిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఏడాది వయస్సున్న తన కొడుకు రుత్వేజ్ కోసం స్థానికు రాలు బండి స్వరూప కాశికుంటలోని అంగన్వాడీ కేం ద్రం నుంచి కోడిగుడ్లు తీసుకొచ్చింది. బుధవారం కోడిగుడ్లను ఉడకబెట్టి పెంకు తీస్తుండగా కింది పొర ప్లాస్టిక్‌లా సాగడం, పసుపు రంగు ఓ రకమైన వాసన వచ్చిందని చెప్పారు. కోడిగుడ్డుపై తెల్లని పొరను కాల్చగా ప్లాస్టిక్‌లా ముడుచుకుపోయిందన్నారు. దీనిపై అంగన్ వాడీ సూపర్ వైజర్ని అడగ్గా ఈ విషయమై పరిశీలిస్తానని చెప్పారు. గాంధారిలో: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం తండాలోని అంగన్వాడీ కేంద్రానికి సరఫరా చేసిన గుడ్లు ప్లాస్టిక్‌లా ఉన్నాయని స్థానికులు ఆరోపిం చారు. గుడ్లను ఉడికిస్తే ప్లాస్టిక్‌లా ముద్దగా అవుతున్నా యని చెప్పారు. స్థానికుల ఫిర్యాదుతో ఐసీడీఎస్ అధికా రులు బుధవారం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. -
బ్లాక్ మార్కెట్‌కు అంగన్వాడీ కోడిగుడ్లు
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్తులు - ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణ - కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్న పగిడా్యల్ వాసులు గండేడ్ : అంగన్వాడీల్లో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా.. గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని పగడ్యాల్ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి..గ్రామంలోని రెండో అంగన్వాడీ కార్యకర్త బాలమణి అంగన్వాడీ సెంటర్ నుంచి మూడు రోజులుగా రాత్రి వేళలో కోడిగుడ్లను ఓ ప్రైవేటు వాహనంలో తరలిస్తున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో సుమారు 300 కోడిగుడ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని గ్రామపంచాయతీ వద్దకు తరలించి అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు బుధ, గురువారాల్లో కూడా వచ్చి కూడా పరిశీలించారు. అయితే బాధ్యులపై ఎటువంటి చర్యా తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ అర్హులకు అందాల్సిన పౌష్టికాహారం బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈవిషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు విలేకరులకు వివరించారు. -
అతిపొడవైన వంకాయ
అన్నానగర్: ఆర్గాన్ వ్యవసాయ శాస్త్రవేత్త కన్యాకుమారి గీతా ఇంటి పెరటిలో 15 అంగుళాల పొడవున్న వంకాయ కాచి స్థానికులను సంభ్రమకులను చేసింది. అదే వంగ చెట్టుకు 11 అంగుళాలున్న మరో వంకాయ కాసిందని గీత తెలిపారు. సేంద్రీయ ఎరువులు వాడడంతో కాయల పరిమాణం, బరువు, పోషకాల్లో గణనీయమైన వృద్ధి వుంటుందన్నారు. ఇందుకు తన పెరటిలో కాచిన వంకాయే నిదర్శనం అని ఆమె చెప్పారు. కోడిగుడ్ల పెంకులు, వాడి పారేసిన టీ, కాఫీ పొడుల ముద్దలు, ఉల్లిపాయ తొక్కలు, తరిగి తీసిన తొక్కలు(కూరగాయలవి), వాడి పోయిన పూలు, పేడ వంటి వాటినే తాను ఎక్కువగా పెరటిలోని మొక్కలకు ఎరువుగా వాడుతుంటానన్నారు. పెరడులో రాలిపోయిన పండుటాకులను అక్కడే ఒక చిన్న గొయ్యితీసి పాతిపెడితే అదే కొద్ది రోజుల తర్వాత ఆర్గానిక్ ఎరువులా పని చేస్తుందన్నారు. దీనిని ప్రత్యేకంగా తీసి మొక్కల పొదల్లో వేయాల్సిన పని లేదన్నారు. భూమి ద్వారానే ఈ చెత్త ద్వారా ఆర్గానిక్ మిశ్రమాలు మొక్కలను వాటంతట అవే అందుతాయన్నారు.