విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చక్రధర్. చిత్రంలో అసోసియేషన్ సభ్యులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ చక్రధర రావు పొట్లూరి చెప్పారు. గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానం మనదే అయినా... సరైన ప్రోత్సాహం లేక కోళ్ల ఫామ్స్‌ని మూసేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నెల 27–29 తేదీల్లో హెచ్‌ఐసీసీలో 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో జరగనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం..
దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ వార్షిక పరిమాణం ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్లు. వృద్ధి రేటు 7 శాతం. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం వరకూ ఉన్నట్లు వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజీ ఆనంద్ చెప్పారు. దేశంలో రోజుకు 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయితే... దాన్లో 4 కోట్లు తెలంగాణలో, 4.5 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలో 2 వేల మంది గుడ్ల ఉత్పత్తిదారులు, లక్ష మంది బ్రాయిలర్ రైతులు ఉన్నారని, రోజుకు 2 కోట్ల బ్రాయిలర్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశారు.
అమెరికన్ కాళ్లను దించొద్దు..
అమెరికాలో అమ్ముడుపోని, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న చికెన్ లెగ్స్‌ను భారత్‌కు పంపేందుకు యూఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని చక్రధర రావు చెప్పారు. దీన్ని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘గతంలో అమెరికా.. పక్కనే ఉన్న హైతీ దేశంలోకి చికెన్ లెగ్స్‌ను ఎగుమతి చేసింది. దీంతో హైతీ పౌల్ట్రీ పరిశ్రమ 70 శాతం వరకు కనుమరుగైపోయింది. భారీగా చికెన్ లెగ్స్‌ను తక్కువ ధరకు పంపితే స్థానిక కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ పరిస్థితి మనకూ వస్తుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment