Indian poultry products
-
కోడిగుడ్లతో ఏటా 7,500 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ చక్రధర రావు పొట్లూరి చెప్పారు. గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానం మనదే అయినా... సరైన ప్రోత్సాహం లేక కోళ్ల ఫామ్స్‌ని మూసేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నెల 27–29 తేదీల్లో హెచ్ఐసీసీలో 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం.. దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ వార్షిక పరిమాణం ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్లు. వృద్ధి రేటు 7 శాతం. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం వరకూ ఉన్నట్లు వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజీ ఆనంద్ చెప్పారు. దేశంలో రోజుకు 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయితే... దాన్లో 4 కోట్లు తెలంగాణలో, 4.5 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలో 2 వేల మంది గుడ్ల ఉత్పత్తిదారులు, లక్ష మంది బ్రాయిలర్ రైతులు ఉన్నారని, రోజుకు 2 కోట్ల బ్రాయిలర్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశారు. అమెరికన్ కాళ్లను దించొద్దు.. అమెరికాలో అమ్ముడుపోని, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న చికెన్ లెగ్స్‌ను భారత్‌కు పంపేందుకు యూఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని చక్రధర రావు చెప్పారు. దీన్ని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘గతంలో అమెరికా.. పక్కనే ఉన్న హైతీ దేశంలోకి చికెన్ లెగ్స్‌ను ఎగుమతి చేసింది. దీంతో హైతీ పౌల్ట్రీ పరిశ్రమ 70 శాతం వరకు కనుమరుగైపోయింది. భారీగా చికెన్ లెగ్స్‌ను తక్కువ ధరకు పంపితే స్థానిక కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ పరిస్థితి మనకూ వస్తుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
మన కోడిగుడ్లు, కోడి పిల్లలపై నిషేధం!
న్యూడిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ ఉధృతంపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. తమ దేశంలోకి భారత్ కు చెందిన కోడి పిల్లలు, గుడ్ల దిగుమతిపై తాత్కాలికంగా బ్యాన్ విధించి పౌల్ట్రీ పరిశ్రమకు షాకిచ్చింది. అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా బాగా ప్రబలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ జనవరి 2 భారత పౌల్ట్రీ ఎగుమతిదారులకు సమాచారం అందించింది. సౌదీ అరేబియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, నీరు, వ్యవసాయ శాఖ లైవ్ బర్డ్స్ ఎగుమతులపై తాత్కాలిక నిషేధానికి నిర్ణయించినట్టు తెలిపింది. భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతుల్లో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న సౌదీ నిర్ణయంతో పౌల్ట్రీ పరిశ్రమలో ఆందోళన మొదలైంది. మిగతా దేశాలు సౌదీని అనుసరిస్తే ఎలా అనే భయం పట్టుకుంది. అయితే 1 శాతంగా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై దీని ప్రభావం పెద్దగా ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. అత్యంత హానికరమైన వైరస్ ఇండియాలో ఉందని ప్రకటిస్తే తమ ఎగుమతులను నిలిపివేస్తామని గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ యాదవ్ చెప్పారు. మన దేశంలో తక్కువ వ్యాధికారక ఇన్ఫ్లుఎంజా మాత్రమే ఉందని, ఇది కొన్నిసార్లు ఉధృతమవుతుందని వివరించారు. మరోవైపు సౌదీకి బ్రెజిల్ అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే మన పౌల్ట్రీ ఉత్పత్తులు ఖరీదు ఎక్కువ. అలాగే మొక్కజొన్న, ఇతర పక్షి ఫీడ్ లాంటి ముడిసరుకు లు బ్రెజిల్ ,అమెరికాలతో పోలిస్తే చౌక ధరల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో తాత్కాలిక నిషేధం భారతదేశం పౌల్ట్రీ రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు,రమేష్ ఖత్రి తెలిపారు. అందుకే దేశంలో బర్డ్ ఫ్లూ ఫ్రీ జోన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫలితంగా సురక్షితమైన పౌల్ట్రీ ఉత్పత్తులు రవాణాను రక్షించాలని ఆయన కోరారు.