మన కోడిగుడ్లు, కోడి పిల్లలపై నిషేధం!
న్యూడిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ ఉధృతంపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. తమ దేశంలోకి భారత్ కు చెందిన కోడి పిల్లలు, గుడ్ల దిగుమతిపై తాత్కాలికంగా బ్యాన్ విధించి పౌల్ట్రీ పరిశ్రమకు షాకిచ్చింది. అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా బాగా ప్రబలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ జనవరి 2 భారత పౌల్ట్రీ ఎగుమతిదారులకు సమాచారం అందించింది. సౌదీ అరేబియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, నీరు, వ్యవసాయ శాఖ లైవ్ బర్డ్స్ ఎగుమతులపై తాత్కాలిక నిషేధానికి నిర్ణయించినట్టు తెలిపింది.
భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతుల్లో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న సౌదీ నిర్ణయంతో పౌల్ట్రీ పరిశ్రమలో ఆందోళన మొదలైంది. మిగతా దేశాలు సౌదీని అనుసరిస్తే ఎలా అనే భయం పట్టుకుంది. అయితే 1 శాతంగా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై దీని ప్రభావం పెద్దగా ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. అత్యంత హానికరమైన వైరస్ ఇండియాలో ఉందని ప్రకటిస్తే తమ ఎగుమతులను నిలిపివేస్తామని గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ యాదవ్ చెప్పారు. మన దేశంలో తక్కువ వ్యాధికారక ఇన్ఫ్లుఎంజా మాత్రమే ఉందని, ఇది కొన్నిసార్లు ఉధృతమవుతుందని వివరించారు.
మరోవైపు సౌదీకి బ్రెజిల్ అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే మన పౌల్ట్రీ ఉత్పత్తులు ఖరీదు ఎక్కువ. అలాగే మొక్కజొన్న, ఇతర పక్షి ఫీడ్ లాంటి ముడిసరుకు లు బ్రెజిల్ ,అమెరికాలతో పోలిస్తే చౌక ధరల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో తాత్కాలిక నిషేధం భారతదేశం పౌల్ట్రీ రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు,రమేష్ ఖత్రి తెలిపారు. అందుకే దేశంలో బర్డ్ ఫ్లూ ఫ్రీ జోన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫలితంగా సురక్షితమైన పౌల్ట్రీ ఉత్పత్తులు రవాణాను రక్షించాలని ఆయన కోరారు.