గుడ్డుపై నిషేధమా! | ban on egg | Sakshi
Sakshi News home page

గుడ్డుపై నిషేధమా!

Published Wed, Jun 3 2015 12:15 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ban on egg

ఆహారపుటలవాట్లను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రాంతం, వాతావరణం, లభ్యత...మన దేశంలో అయితే కులం వగైరాలు తినే తిండిని నిర్దేశిస్తాయి. శాకాహారం గొప్పదా...మాంసాహారం గొప్పదా అనే చర్చ ఎప్పటినుంచో ఉంది. రెండింటిలోనూ మంచిని వెతికేవారూ ఉన్నారు. లోపాలను ఏకరువు పెట్టేవారున్నారు. జనం మనోభావాలతో ముడిపెట్టకుండా దీన్ని చర్చిస్తే ఏ సమస్యా ఉండదు. అలా ముడిపెట్టినప్పుడే ఇబ్బందులొస్తాయి.  తాను ఇకపై పూర్తి స్థాయి శాకాహారిగా మారిపోతున్నానని...మాంసాహారంతోపాటు గుడ్లు, పాలు, పాలతోచేసే ఇతర పదార్థాలూ కూడా వదిలేస్తున్నానని రెండు నెలలక్రితం బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ ప్రకటించారు. శాకాహారాన్ని ఉద్యమస్థాయిలో ప్రచారం చేసే గ్రూపులు పాశ్చాత్యదేశాల్లో కూడా కనబడతాయి. కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాకాహారి గనుక అంగన్‌వాడీల్లో కోడిగుడ్లు పంపిణీ చేయరాదనే నియమం పెట్టుకోవడం వింతగొలుపుతుంది. ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈమధ్య కాలంలో వివాదాలకెక్కిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ తాజా నిర్ణయానికి మూలకారకుడు. ఆ రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉండే మూడు జిల్లాల్లోని అంగన్‌వాడీల్లో ప్రయోగాత్మకంగా కోడిగుడ్లు పంపిణీచేయాలన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనను చౌహాన్ తోసిపుచ్చారు.

దానికి బదులుగా పాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించమని ఆయన సూచించారు. అయిదేళ్ల క్రితం ఒకసారి మధ్యాహ్న భోజనంలో బడి పిల్లలకు కోడిగుడ్లు అందించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా చౌహాన్ దాన్ని అంగీకరించలేదు. అంతేకాదు...‘నేను సీఎంగా ఉన్నంతకాలమూ ఈ రాష్ట్రంలో మాంసాహారంతో సమానమైన గుడ్ల పంపిణీకి అంగీకరించబోన’ని ప్రతిజ్ఞ చేశారు. అది గుర్తులేకనో, ఏమో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తాజా ప్రతిపాదనను ఆయన ముందుంచినట్టు కనబడుతున్నది. వ్యక్తిగా చౌహాన్‌కు మాంసాహారంపై కొన్ని అభిప్రాయాలుండొచ్చు. శాకాహారమే శ్రేష్టమైనదన్న విశ్వాసం ఉండొచ్చు. అందుకు ఆయన్ను తప్పుబట్టాల్సింది లేదు. కానీ...తనకు ఇష్టంలేదు కనుక ఖజానానుంచి అందు నిమిత్తం ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టడానికి వీల్లేదనడం అన్యాయమవుతుంది.   
 సరైన పోషకాహారం అందక ఏటా మన దేశంలో 13 లక్షలమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం తేల్చింది. ఈ మరణాల్లో 90 శాతం  డయేరియా, న్యూమోనియా, మలేరియా వంటి వ్యాధులవల్లే కలుగుతున్నాయని...మంచి పోషకాలు లభ్యమయ్యే ఆహారాన్ని అందిస్తే వీరిని కాపాడవచ్చునని తెలిపింది. ఈ పిల్లలంతా అయిదేళ్లలోపువారే. పిల్లల్లో పోషకాహారలేమి ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌దే అగ్రస్థానం. అక్కడ ఆరేళ్లలోపు పిల్లల్లో సగంమంది తక్కువ బరువుతో ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారు తినే తిండిలో విటమిన్లు, మాంసకృత్తులు, ఖనిజలవణాలు లేకపోవడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అటు బాలింతలకు సరైన పోషకాహారం లభ్యంకాకపోవడంవల్ల గర్భస్త శిశుమరణాలు, నవజాత శిశుమరణాలు సంభవిస్తున్నాయి. అమ్మలవుతున్న అనేకమంది ప్రాణాంతక వ్యాధులబారిన పడుతున్నారు. మంచి ఆహారం అందించగలిగితే వీరిలో 90 శాతంమందిని రక్షించడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నా మన ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కూడా ఇలాంటి సమస్యను అరికట్టడానికే గుడ్ల పంపిణీ ప్రతిపాదన తెచ్చింది.

ఇష్టంలేని దేన్నయినా నిషేధించాలనే తత్వం ప్రమాదకరమైనది. అది పసిపిల్లల ఆహారం విషయంలో పాటించడం మరింతగా ఇబ్బంది కలిగించేది. ఎంపికచేసిన మూడు జిల్లాల్లోనూ ఆదివాసీలు, ఆ తర్వాత దళితులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో సహజంగానే పోషకాహారలేమి ఎక్కువ స్థాయిలో ఉంది. పర్యవసానంగా పిల్లల్లో మరణాల రేటు, ప్రమాదకర వ్యాధుల రేటు ఎక్కువగా ఉంది. కోడిగుడ్లకు పాలు ప్రత్యామ్నాయం కాదని ఆహార హక్కు ఉద్యమకారుల వాదన. కోడిగుడ్డులో సి విటమిన్ మినహా మిగిలిన అన్ని విటమిన్లు ఉంటాయని...మాంసకృత్తులు, ఖనిజలవణాలు సమృద్ధిగా లభ్యమవుతాయని వారు చెబుతున్నారు. పైగా పాలల్లో నీళ్లు కలిపినట్టు గుడ్లను కల్తీ చేయడం కుదరదుగనుక పిల్లలకూ, బాలింతలకూ మంచి పోషకవిలువలుండే ఆహారం అందుబాటులోకొస్తుందంటున్నారు. కర్ణాటకలో పోషకాహార లోపాన్ని గుర్తించాక అంగన్‌వాడీలద్వారా కోడిగుడ్లు అందించడం మొదలుపెట్టారు. దాని ఫలితాలు కూడా బాగున్నాయి. పరిస్థితులు దారికొస్తున్న సంకేతాలు కనబడుతున్నాయి.
 మన దేశంలో ఒక చిత్రమైన పరిస్థితి కనబడుతుంది.

నిరుపేదల్లో ఆకలినీ, పౌష్టికాహారలోపాన్నీ సరిదిద్దటానికి ఉద్దేశించిన ఆహార భద్రతా చట్టం ఎన్నడో 2013 సెప్టెంబర్‌లో ఆమోదం పొందినా దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావడంలేదు. మొన్న ఏప్రిల్‌నాటికి కేవలం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఆ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. మిగిలిన 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గడువు తీరగానే కొత్త గడువు అడగటం మినహా అడుగు ముందుకేయడం లేదు. కేంద్రం కూడా చాలా ఉదారంగా వ్యవహరిస్తూ వారు కోరగానే గడువును పొడిగించుకుంటూ పోతోంది. దారిద్య్రరేఖకు దిగువునున్నవారికి సరైన పోషకాహారం అందటం లేదన్న కారణంతో తీసుకొచ్చిన ఈ చట్టం అమలును వాయిదా వేయడంద్వారా నిరుపేద వర్గాలకు ఆకలినీ, పౌష్టికాహారాలోపాన్నీ శాశ్వతం చేస్తున్నామన్న స్పృహ పాలకులకు కలగడం లేదు.  ఇలా చేయకపోగా సెంటిమెంటు పేరుతో పేద వర్గాల పిల్లలకూ, బాలింతలకూ పోషక విలువలుండే కోడిగుడ్డును అందకుండా అడ్డుకుంటున్నారు. ఇది ఒక్క మధ్యప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు.

రాజస్థాన్, పంజాబ్, హర్యానా,యూపీ వంటి రాష్ట్రాల్లో కూడా అంగన్ వాడీల్లోగానీ, బడిపిల్లల మధ్యాహ్న భోజనంలోగానీ గుడ్లు అందించడంలేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీయరాదన్న భావనతోనే ఇలా చేస్తున్నామన్నది ఆయా రాష్ట్రాలు చెబుతున్న జవాబు. మెజారిటీ ప్రజలు తినే ఆహారాన్ని పంచడంవల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అర్ధంకాని విషయం. ఈ విషయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పునరాలోచించుకుంటే లక్షలాదిమంది పిల్లలకు ప్రాణం పోసినవారవుతారు. ఎందరో తల్లులకు గర్భశోకం తప్పించినవారవుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement