నిస్సహాయులకు ఆపన్నహస్తం అందించేందుకు 71 ఏళ్ళ క్రితం ఏర్పాటైన సంస్థ అది. కష్టాల్లో ఉన్న దీనులకు కేయూతనివ్వడానికి అమృతమూర్తి మదర్ థెరెసా ఆరంభించిన కరుణాలయం అది. అలాంటి ఇంటర్నేషనల్ ట్రస్ట్ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (ఎంఓసీ) ఇప్పుడు వివాదాస్పద వార్తల్లో నిలవడం విషాదం. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు వీలుగా విరాళాలను స్వీకరించడానికి ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ఆ సుప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ)కున్న లైసెన్స్‌ను పొడిగించడానికి కేంద్ర హోమ్‌శాఖ నిరాకరించింది.
అదీ సరిగ్గా క్రిస్మస్ నాడు ఆ నిర్ణయం రావడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కోల్‌కతా కేంద్రంగా నడిచే ఈ సేవాసంస్థకు సంబంధించి ‘కొంత ప్రతికూల సమాచారం’ గుర్తించినందు వల్లే లైసెన్స్‌ను పొడిగించబోమన్నామని ప్రభుత్వ అధికారులు సోమవారమిచ్చిన వివరణ. కానీ, తమకొచ్చిన సదరు ‘ప్రతికూల సమాచారం’ ఏమిటన్నది ప్రభుత్వం పెదవి విప్పకపోవడమే విచిత్రం. పారదర్శకత లేని ఈ సర్కారీ చర్యతో నేరుగా ఆ సంస్థల్లోని 22 వేల మంది రోగులకూ, ఉద్యోగులకూ ఆహారం, ఔషధాలు కరవయ్యాయి. అందుకే, తృణమూల్ కాంగ్రెస్ మొదలు కాంగ్రెస్ సహా రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. కొన్నేళ్ళుగా ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాలను కఠినతరం చేస్తూ, ఎన్జీఓలపైన ప్రభుత్వానికి బోలెడంత పెత్తనం కట్టుబెడుతూ పాలకులు చేపడుతున్న చర్యలతో పలువురికి అనేక అనుమానాలూ వస్తున్నాయి.
భారతదేశాన్ని స్వగృహంగా మార్చుకున్న జన్మతః అల్బేనియన్ క్రైస్తవ సన్న్యాసిని మదర్ థెరెసా 1950లో కలకత్తా వీధుల్లో స్థాపించిన సేవాసంస్థ – ఎంఓసీ. సేవాతత్త్వంతో నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రేమజ్యోతిగా వెలిగిన ఆ ‘భారతరత్న’ం పెట్టిన ఈ సంస్థ మానవతా దృష్టితో సుదీర్ఘకాలంగా ఎందరికో సేవలందిస్తూ, అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎన్నో ఏళ్ళుగా ఆ సంస్థకు విదేశీ విరాళాలు అందుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏటా నివేదికలు సమర్పిస్తూనే ఉంది. ఒకవేళ ఆ సంస్థ గనక నిబంధనల్ని ఉల్లంఘిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు లేదు. కానీ, ముందుగా చేసిన ఆ తప్పులేమిటో, వాటి స్వభావమేమిటో కూడా ప్రభుత్వమే ప్రకటించాలి కదా! ఇప్పుడు అలా జరగకపోవడం ప్రధానంగా విమర్శకు కారణమైంది.
అనాథలు, అభాగ్యులు, అంధులు, అంగవికలురు, అసహాయులైన వృద్ధులు, వరదలు – కరవు కాటకాలు – మహమ్మారి రోగాల బారిన పడ్డ వారిని కంటికి రెప్పలా కాపాడుకొనే పనిలో దాదాపు 139 దేశాల్లో ఎంఓసీ విస్తరించింది. అలాంటి సేవాసంస్థకు అశేష అభిమానులతో పాటు, బలవంతపు మత మార్పిడికీ, బాలికల అక్రమ రవాణాకూ పాల్పడుతోందని నిరాధార ఆరోపణలు చేసే సంప్రదాయవాద సంస్థల ఏజెంట్లూ అనేకులున్నారు. గుజరాత్‌లోని వడోదరాలో బాలికా కేంద్రంపై ఈ నెలలో కొందరిచ్చిన ఫిర్యాదు ఫలితమే తాజా చర్య అని లోపాయకారీగా అధికారుల మాట. ఆడిట్‌లో అవకతవకలని మరో మాట. అయితే, వాటిల్లో నిజం లేదని ఎంఓసీ ఖండిస్తోంది.
2016–17, 2018–19 మధ్య ఏటా రూ. 58 వేల కోట్లకు పైగా విదేశీ విరాళాలొచ్చాయని హోమ్ శాఖ డేటా. నిజానికి, గత ఏడేళ్ళలో మోదీ సర్కారు విదేశీ విరాళాల మూలాలను గుప్పెట బిగించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ, కొన్ని వందల ఎన్జీఓల ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సులను రద్దు చేసింది. ఎఫ్‌సీఆర్‌ఏలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం మరిన్ని మార్పులు చేసింది. ఎన్జీఓలకొచ్చే విదేశీ విరాళాలపై కత్తెర వేసేలా ప్రభుత్వానికి అదనపు అధికారాలూ వచ్చిపడ్డాయి. ఆ అధికారాన్ని అనేక మానవ హక్కుల బృందాలపై హోమ్ శాఖ ప్రయోగించడం, ఆ ఆదేశాల్లో కొన్నింటిని కోర్టులు కొట్టేయడం జరిగిన కథ. ఈ చట్టం కింద దేశంలో 22 వేలకు పైగా ఎన్జీఓలు నమోదు కాగా, వాటిలో కనీసం 10 – 15 శాతానికి మోదీ పాలనలో లైసెన్సు పొడిగింపులు దక్కబోవని నిపుణుల మాట.
‘దేశ భద్రతకూ, ప్రజా ప్రయోజనాలకూ భంగకరమైన చర్యల’కు చెక్ పెట్టడం ఈ ఎఫ్‌సీఆర్‌ఏ ఉద్దేశం. మదర్ థెరెసా పెట్టిన సంస్థ అలాంటి పనేం చేసింది? ముందుగా షోకాజ్ నోటీసులివ్వాల్సి ఉన్నా, ఈ తాజా ఘటనలోనూ అలాంటివేవీ పాటించలేదు. అందుకే, అనేక ఎన్జీఓలకు ప్రభుత్వ చర్యలకు కారణాలేమిటో కూడా తెలియని పరిస్థితి. పైపెచ్చు, ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్న పౌర స్వేచ్ఛ, మానవ హక్కుల సంస్థలపై ఇలా వేటు ఎక్కువగా పడుతోందన్నది ఓ విశ్లేషణ. ఇటీవల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లాయర్స్ కలెక్టివ్, గ్రీన్‌పీస్ ఇండియా, ది ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి ఎన్జీఓల విదేశీ విరాళాల లైసెన్సులు సస్పెండవడమో, రద్దు కావడమో అందుకు ఉదాహరణ.
ఒకపక్క దేశంలోని పలు రాష్ట్రాల్లో చర్చిలపైన దాడులు, మరోపక్క కర్ణాటకలో కొత్తగా పెట్టిన మతమార్పిడి వ్యతిరేక బిల్లు మైనారిటీల్లో ఆందోళన రేపుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఇలా ప్రసిద్ధ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’పై తీసుకున్న చర్య ఎలాంటి సంకేతమిస్తుంది? ఆహారం, విద్యే కాదు... ఆక్సిజన్ నుంచి ప్లాస్మా దాకా అనేకం ప్రభుత్వమే అందరికీ అందించలేని చోట ఇలాంటి సంస్థల సేవ నిరుపమానం. చట్టం సర్వోన్నతమైనదే. కానీ, దాన్ని సాకుగా తీసుకొని, నిరూపణ కాని సమాచారంతో మానవతావాద కృషికి గండికొట్టకూడదు. అలా చేస్తే అంతకన్నా నేరం, ఘోరం మరొకటి ఉండదు. ఇప్పుడిక ప్రజల్లోని అనుమానాల్ని పాలకులే పోగొట్టాలి. పౌర సమాజ సంస్థలను ఇరుకునపెట్టడానికి ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని వాటంగా వాడుకుంటోందనే భావనను తొలగించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిదీ, ప్రభువులదే!
Comments
Please login to add a commentAdd a comment