
వారికి పార్టీ పూర్తి బాధ్యతలు కట్టబెట్టే యోచనలో ఏఐసీసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వరుస భేటీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో పార్టీకి మూలస్తంభాలైన డీసీసీ అధ్యక్షులు పార్టీ కార్యలాపాలపై పూర్తి దృష్టి పెట్టేందుకు వీలుగా నియమితులైన మొదటి మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ నియమించిన ముకుల్ వాస్నిక్ కమిటీ చేసిన మూడేళ్ల నిషేధం ప్రతిపాదనను పార్టీ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్నిక్ కమిటీ సిఫార్సుల ప్రకారం డీసీసీ అధ్యక్షులు తమ ఐదేళ్ల పదవీ కాలంలో తొలి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీకి అనుమతించరు.
వీరంతా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలను నిర్ధారించడం, ఎన్నికల ప్రచారాన్ని నిశితంగా పరిశీలించడం, సామాజిక ఇంజనీరింగ్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కోవడం, పార్టీ అనుకూల కథనాలను రూపొందించడం, జిల్లాల్లో ని అన్ని స్థాయిలలో మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం వంటి పనులకు నాయకత్వం వహిస్తారు.
అభ్యర్థుల ఎంపికలో, వివిధ పదవులకు నామినీల పరిశీలనలో వీరే క్రియాశీలంగా ఉంటారు. ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత వహిస్తారు. ఈ మూడేళ్ల తర్వాత పదవుల ఎంపికలో డీసీసీలకు ప్రాధాన్యమిస్తారు. మూడేళ్ల ప్రతిపాదనపై వచ్చే నెలలో గుజరాత్‌లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.