
న్యూఢిల్లీ: నూకల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది. ప్రభుత్వ గోడౌన్లలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు రిటైల్ ధరలూ అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిల్వలు భారీగా పెరగడంతో ఎగుమతులకు ఆమోదం ఇవ్వాలంటూ ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని గతంలో కోరారు.
కాగా 2022 సెప్టెంబర్‌లో నూకల ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. గత ఏడాది బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతుల కోసం నిర్దేశించిన టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) ప్రభుత్వం తొలగించింది. అలాగే ఈ రకం ఎగుమతులపై ఉన్న పూర్తి నిషేధాన్ని ఉపసంహరించుకుంది. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో గాంబియా, బెనిన్, సెనెగల్, ఇండోనేషియా తదితర దేశాలకు 194 మిలియన్ డాలర్ల విలువైన నూకలు ఎగుమతి చేసింది. 2022–23లో 983 మిలియన్ డాలర్లు, 2021–22లో 1.13 బిలియన్ డాలర్ల విలువ చేసే నూకలు భారత్ నుంచి విదేశాలకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment