
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం చెస్‌ను నిషేధించింది. జూదం వంటి ఈ ఆట.. ఇస్లామిక్ చట్టం షరియా ప్రకారం చట్ట విరుద్ధమని తాలిబన్ క్రీడా డైరెక్టరేట్ తెలిపింది. మతపరమైన ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఆందోళనలు పరిష్కారమయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకకు అఫ్గానిస్తాన్‌లో చెస్ నిషేధంలో ఉంటుందని తేల్చి చెప్పింది.
ఇప్పటికే తాలిబన్లు దేశంలో అనేక క్రీడలకు పరిమితులు విధించారు. హింసాత్మకమైనది, ఇస్లా ప్రకారం సమస్యాతమైనదంటూ మార్షల్ ఆర్ట్స్‌ను నిషేధించారు. ఇక మహిళలకు మొత్తం క్రీడల నుంచే దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో చెస్‌పై నిషేధం చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో కాబూల్‌లోని అజీజుల్లా గుల్జాదా కేఫ్ చెస్ పోటీలు నిర్వహించింది.
ఇతర ముస్లిం మెజారిటీ దేశాల్లోనూ చెస్ ఆడతారని, అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ నిషేధం తన వ్యాపారంతోపాటు ఆటను ఆస్వాదించేవారిని దెబ్బతీస్తుందని.. అయినా తాను నిషేధాన్ని గౌరవిస్తానని వెల్లడించారు. యువతకు పెద్దగా కార్యకలాపాలు లేవని, దీంతో కొందరు యువకులు వచ్చి ఓ కప్పుటీ తాగి, స్నేహితులతో చెస్ ఆడతారని వెల్లడించారు.