కరోనా భయంతో ప్రపంచం క్వారంటైన్ అవుతున్న రోజుల్లో, అఫ్గానిస్తాన్ మహిళలు అంతకన్నా భయానకమైన వేరొక కారణంతో ఏకాంతవాస శిక్ష అనుభవిస్తున్నారు. వారు అన్ని హక్కులూ కోల్పోయి జీవితాన్నీ, భవిష్యత్తునూ తాలిబన్ ముష్కర పాలకుల దయాదాక్షిణ్యాలకే వదిలేసు కోవాల్సి వచ్చింది. గత నెలలో పార్కులు, జిమ్‌లు, ఈతకొలనుల తర్వాత ఇప్పుడు అఫ్గాన్ విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశాన్ని తాలిబన్ ఏలికలు నిరవధికంగా నిషేధించారు.
అలా విద్యార్థినుల్ని చదువుకు దూరం చేస్తూ మంగళవారం హుకుం జారీ చేశారు. అదేమంటే ‘జాతీయ ప్రయోజనం, మహిళల గౌరవం’ కోసం ఈ పని చేశామంటున్నారు. జనాభాలో సగాన్ని పిడికిట బంధించి, విద్యావంతులు కాకుండా చేస్తే ఏ జాతీయ ప్రయోజనం సిద్ధిస్తుందో దేవుడికి తెలియాలి. తాలిబన్ల ధోరణి తెలుసు గనక ఈ దుర్నిర్ణయం ఆశ్చర్యమేమీ కాకున్నా, అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆడిన మాట తప్పిన అనాగరిక పాలనను కళ్ళకు కట్టింది.
అఫ్గాన్‌లో మానవ హక్కులను పరిరక్షించాలంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చిన మర్నాడే తాలిబన్ల తాజా నిర్ణయం వెలువడింది. తాలిబన్ల నిర్ణయంపై స్థానిక ఉద్యమకారుల మొదలు అమెరికా నేతల దాకా అంతా నిరసన గళం విప్పారు. 2021 ఆగస్ట్‌లో అమెరికా సారథ్యం లోని పాశ్చాత్య సేనల అర్ధంతర ఉపసంహరణతో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్ మూకల అకృత్యాలకు ఇదే మొదలు కాదు. తాలిబన్లు గద్దెనెక్కిన నాటి నుంచి అత్యధికంగా అణచివేతకు గురైంది మహిళలే.
స్త్రీలను ప్రభుత్వ, ప్రజావిధాన పాత్రల నుంచి పక్కకు తప్పించి ఇంట్లో పరదాల చాటుకు పరిమితం చేశారు. ఈ మార్చిలోనే ఆడపిల్లల చదువుపై నిషేధాల కథ మొదలైంది. ఆరో తరగతి దాటాక ఆడపిల్లలకు బడి చదువు తోసిపుచ్చారు. ఉన్నత విద్యకు ఇప్పుడు తెర దించేశారు. ఒక్కముక్కలో ఈడొచ్చిన పిల్లలెవరూ వీధుల్లోకి ఒంటరిగా రావడానికి వీల్లేదు. చదువు, ఉద్యోగాలే కాదు, చివరికి పక్కనున్న పార్కుకు వెళ్ళే స్వతంత్రం కూడా స్త్రీలకు లేకుండా చేయడం అమానుషం. ఈ ఛాందసత్వమే అస్థిరతకూ, దారిద్య్రానికీ, అదుపు లేని జనాభా పెరుగుదలకూ దారి తీస్తుంది.
1990లలోని నిరుటి తాలిబన్ పాలన తర్వాత 2001 నుంచి దాదాపు ఇరవై ఏళ్ళ కాలంలో అఫ్గాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. స్త్రీ విద్య సహా పలు అంశాల్లో సామాజికంగా ఎంతోకొంత పురోగతీ సాధించింది. వాటన్నిటినీ ఇప్పుడు తుంగలో తొక్కుతోంది తాజా తాలిబన్ మధ్యంతర సర్కార్. అందరినీ కలుపుకొనిపోతామంటూ దోహా చర్చల్లో గొప్పగా చెప్పిన ఈ తాలిబన్ 2.0 సర్కార్ ఆచరణలో ఆది నుంచి అందుకు విరుద్ధంగానే వ్యవహరిస్తోంది. ఏడాది దాటినా, ఇప్పటికీ వారికి చట్టబద్ధమైన పాలకులుగా అంతర్జాతీయంగా అధికారిక గుర్తింపు రాలేదు.
స్త్రీల పట్ల తిరోగమన విధానాలే అందుకు ప్రధాన కారణం. తాలిబన్లు అనుసరిస్తున్నామని చెబుతున్న ఇస్లామిక్ షరియా చట్టం సైతం ఈ విధానాలను సమర్థించదు. ఆ మాటకొస్తే, గతంలోనూ ఇలాంటి విధానాలు, వ్యవహారాల వల్లే అఫ్గాన్‌లో అంతర్జాతీయ జోక్యం మొదలైంది. తాలిబన్లకు సన్నిహితమైన పాక్ సైతం స్త్రీ విద్యానిరోధాన్ని నిరసించడం విశేషం. ఆ మాటకొస్తే, 1990లలో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించిన సౌదీ అరేబియా, యూఏఈ, పాక్ సైతం ఏడాది క్రితం వచ్చిన కొత్త తాలిబన్ సర్కార్‌ను ఇంకా గుర్తించనే లేదు.
మరోపక్క మత ఛాందసవాద ఇస్లామిస్ట్ సర్కార్ పుణ్యమా అని కాబూల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాదిగా అంతర్జాతీయ వాణిజ్యం, సహాయం దాదాపు ఆగిపోయాయి. ఏటా 400 కోట్ల అమెరికన్ డాలర్ల మేర విదేశీ సాయం అందుకొనే దేశానికి ఇది పెద్దదెబ్బ. అయినా సరే ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తలమునకలైన పాశ్చాత్య ప్రపంచం సహా వర్తమాన అంతర్జాతీయ అనిశ్చితిని వాటంగా చేసుకొని, తాలిబన్లు యథేచ్ఛగా వర్తిస్తున్నారు.
కొద్దివారాల క్రితమే బహిరంగ కొరడా దెబ్బలు, ఉరి విధానాల్ని పునరుద్ధ రించారు. ఆంక్షల నుంచి బయటపడేందుకూ, అంతర్జాతీయ చట్టబద్ధతకూ ఇవేవీ కాబూల్‌కు తోడ్పడవు. అయినా మొండిగా ముందుకుపోతుండడం విడ్డూరం. స్త్రీ విద్యను ప్రోత్సహిస్తే స్థానికం గానూ, అంతర్జాతీయంగానూ సంబంధాలు మెరుగవుతాయని గ్రహించకపోవడం విచిత్రం.
తాలిబన్ల తొలి ఏలుబడిలోనూ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆనాటి అఫ్గాన్ మహిళలు ధైర్యం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి, రహస్యంగా చదువులు చెప్పడం వల్లే నేటి తరం మహిళ తయారైంది. ఇప్పుడిక ఈ తరం తమ గౌరవం కోసం, న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. అయితే, వారి ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, గౌరవించి, అండగా నిలవాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిది! వివిధ వేదికలపై ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా స్పందించాలి.
అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలి. అఫ్గాన్‌తో సంబంధాలపై ఆంక్షల అస్త్రం సహా సామదాన దండోపాయాలను ప్రయోగించాలి. ఐరాస భద్రతామండలి లాంటివి చేయగలిగిందేంటో చూడాలి. దోహా చర్చల సాక్షిగా చేసిన బాసలు తప్పి, లింగ దుర్విచక్షణతో అమానవీయంగా వ్యవ హరిస్తున్న తాలిబన్ సర్కారుకు ముకుతాడు వేయాలి.
ఆచరణాత్మక ప్రయోజనాల రీత్యా కాబూల్‌కు స్నేహహస్తం చాస్తున్న భారత్ సైతం ఆటవిక పాలకుల్ని తగు దూరంలో పెడితే మంచిది. చరిత్రను పునర్లిఖిస్తున్న మహిళల్ని ప్రజాజీవితానికి దూరంగా వంటింటి కుందేళ్ళుగా మారుస్తామంటే ఆధునిక సమాజానికి అంగీకారయోగ్యం కాదని తాలిబన్లకు తెలివిడి కలిగించడం ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment