mother theresa
-
మదర్ థెరిసా మా ఇంటికి వచ్చారు: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు. .. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్రూమ్లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.చదవండి: రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ -
మిషనరీస్ ఆఫ్ చారిటీకి లైసెన్స్ పునరుద్ధరణ
న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ(ఎంఓసీ)’ ఎన్జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను కేంద్ర హోం శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఎంఓసీ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తాలను వినియోగించుకునే అవకాశం చిక్కింది. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్ గ్రహీత మదర్ థెరిస్సా 1950లో కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. ‘నాటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకమీదటా కొనసాగుతాయి. లైసెన్స్ పునరుద్ధరించారనే వార్త మా సంస్థకు నిజంగా పెద్ద ఊరట. లైసెన్స్ రాని ఈ రెండు వారాలూ దేశీయ విరాళాలతో మాకు పూర్తి సహాయసహకారాలు అందించిన దాతల దాతృత్వం అమూల్యం’ అని ఎంఓసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలతోపాటు భిన్న వర్గాల నుంచి మోదీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లూ ముస్లింలను వేధించిన బీజేపీ సర్కార్ తాజాగా క్రిస్టియన్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ను పునరుద్ధరించడం గమనార్హం. భారత్‌లోని ఏదైనా ఎన్జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి. తప్పుగా కనబడింది.. 15 రోజుల్లో ఒప్పయిందా?: తృణమూల్ ఎంపీ డిరెక్ విరాళాల్లో అసంబద్ధ సమాచారం ఉందంటూ దరఖాస్తును తిరస్కరించిన 15 రోజుల్లోనే మళ్లీ లైసెన్స్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని మోదీ సర్కార్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డిరెక్ ఓబ్రియన్ సూటిగా ప్రశ్నించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను రాబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందన్నారు. క్రైస్తవుల ప్రేమకు మోదీ తలొగ్గారన్నారు. ‘పవర్ ఆఫ్ లవ్ గ్రేటర్ దన్ ది పవర్ ఆఫ్ 56 ఇంచెస్’ అని ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీనుద్ధేశిస్తూ 56 అంగుళాల ఛాతి అని గతంలో వ్యాఖ్యానించడం తెల్సిందే. -
కరుణాలయంపై కాఠిన్యమా!
నిస్సహాయులకు ఆపన్నహస్తం అందించేందుకు 71 ఏళ్ళ క్రితం ఏర్పాటైన సంస్థ అది. కష్టాల్లో ఉన్న దీనులకు కేయూతనివ్వడానికి అమృతమూర్తి మదర్ థెరెసా ఆరంభించిన కరుణాలయం అది. అలాంటి ఇంటర్నేషనల్ ట్రస్ట్ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (ఎంఓసీ) ఇప్పుడు వివాదాస్పద వార్తల్లో నిలవడం విషాదం. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు వీలుగా విరాళాలను స్వీకరించడానికి ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద ఆ సుప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ)కున్న లైసెన్స్‌ను పొడిగించడానికి కేంద్ర హోమ్‌శాఖ నిరాకరించింది. అదీ సరిగ్గా క్రిస్మస్ నాడు ఆ నిర్ణయం రావడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కోల్‌కతా కేంద్రంగా నడిచే ఈ సేవాసంస్థకు సంబంధించి ‘కొంత ప్రతికూల సమాచారం’ గుర్తించినందు వల్లే లైసెన్స్‌ను పొడిగించబోమన్నామని ప్రభుత్వ అధికారులు సోమవారమిచ్చిన వివరణ. కానీ, తమకొచ్చిన సదరు ‘ప్రతికూల సమాచారం’ ఏమిటన్నది ప్రభుత్వం పెదవి విప్పకపోవడమే విచిత్రం. పారదర్శకత లేని ఈ సర్కారీ చర్యతో నేరుగా ఆ సంస్థల్లోని 22 వేల మంది రోగులకూ, ఉద్యోగులకూ ఆహారం, ఔషధాలు కరవయ్యాయి. అందుకే, తృణమూల్ కాంగ్రెస్ మొదలు కాంగ్రెస్ సహా రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. కొన్నేళ్ళుగా ఎఫ్సీఆర్ఏ చట్టాలను కఠినతరం చేస్తూ, ఎన్జీఓలపైన ప్రభుత్వానికి బోలెడంత పెత్తనం కట్టుబెడుతూ పాలకులు చేపడుతున్న చర్యలతో పలువురికి అనేక అనుమానాలూ వస్తున్నాయి. భారతదేశాన్ని స్వగృహంగా మార్చుకున్న జన్మతః అల్బేనియన్ క్రైస్తవ సన్న్యాసిని మదర్ థెరెసా 1950లో కలకత్తా వీధుల్లో స్థాపించిన సేవాసంస్థ – ఎంఓసీ. సేవాతత్త్వంతో నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రేమజ్యోతిగా వెలిగిన ఆ ‘భారతరత్న’ం పెట్టిన ఈ సంస్థ మానవతా దృష్టితో సుదీర్ఘకాలంగా ఎందరికో సేవలందిస్తూ, అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎన్నో ఏళ్ళుగా ఆ సంస్థకు విదేశీ విరాళాలు అందుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏటా నివేదికలు సమర్పిస్తూనే ఉంది. ఒకవేళ ఆ సంస్థ గనక నిబంధనల్ని ఉల్లంఘిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు లేదు. కానీ, ముందుగా చేసిన ఆ తప్పులేమిటో, వాటి స్వభావమేమిటో కూడా ప్రభుత్వమే ప్రకటించాలి కదా! ఇప్పుడు అలా జరగకపోవడం ప్రధానంగా విమర్శకు కారణమైంది. అనాథలు, అభాగ్యులు, అంధులు, అంగవికలురు, అసహాయులైన వృద్ధులు, వరదలు – కరవు కాటకాలు – మహమ్మారి రోగాల బారిన పడ్డ వారిని కంటికి రెప్పలా కాపాడుకొనే పనిలో దాదాపు 139 దేశాల్లో ఎంఓసీ విస్తరించింది. అలాంటి సేవాసంస్థకు అశేష అభిమానులతో పాటు, బలవంతపు మత మార్పిడికీ, బాలికల అక్రమ రవాణాకూ పాల్పడుతోందని నిరాధార ఆరోపణలు చేసే సంప్రదాయవాద సంస్థల ఏజెంట్లూ అనేకులున్నారు. గుజరాత్‌లోని వడోదరాలో బాలికా కేంద్రంపై ఈ నెలలో కొందరిచ్చిన ఫిర్యాదు ఫలితమే తాజా చర్య అని లోపాయకారీగా అధికారుల మాట. ఆడిట్లో అవకతవకలని మరో మాట. అయితే, వాటిల్లో నిజం లేదని ఎంఓసీ ఖండిస్తోంది. 2016–17, 2018–19 మధ్య ఏటా రూ. 58 వేల కోట్లకు పైగా విదేశీ విరాళాలొచ్చాయని హోమ్ శాఖ డేటా. నిజానికి, గత ఏడేళ్ళలో మోదీ సర్కారు విదేశీ విరాళాల మూలాలను గుప్పెట బిగించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ, కొన్ని వందల ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది. ఎఫ్సీఆర్ఏలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం మరిన్ని మార్పులు చేసింది. ఎన్జీఓలకొచ్చే విదేశీ విరాళాలపై కత్తెర వేసేలా ప్రభుత్వానికి అదనపు అధికారాలూ వచ్చిపడ్డాయి. ఆ అధికారాన్ని అనేక మానవ హక్కుల బృందాలపై హోమ్ శాఖ ప్రయోగించడం, ఆ ఆదేశాల్లో కొన్నింటిని కోర్టులు కొట్టేయడం జరిగిన కథ. ఈ చట్టం కింద దేశంలో 22 వేలకు పైగా ఎన్జీఓలు నమోదు కాగా, వాటిలో కనీసం 10 – 15 శాతానికి మోదీ పాలనలో లైసెన్సు పొడిగింపులు దక్కబోవని నిపుణుల మాట. ‘దేశ భద్రతకూ, ప్రజా ప్రయోజనాలకూ భంగకరమైన చర్యల’కు చెక్ పెట్టడం ఈ ఎఫ్సీఆర్ఏ ఉద్దేశం. మదర్ థెరెసా పెట్టిన సంస్థ అలాంటి పనేం చేసింది? ముందుగా షోకాజ్ నోటీసులివ్వాల్సి ఉన్నా, ఈ తాజా ఘటనలోనూ అలాంటివేవీ పాటించలేదు. అందుకే, అనేక ఎన్జీఓలకు ప్రభుత్వ చర్యలకు కారణాలేమిటో కూడా తెలియని పరిస్థితి. పైపెచ్చు, ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్న పౌర స్వేచ్ఛ, మానవ హక్కుల సంస్థలపై ఇలా వేటు ఎక్కువగా పడుతోందన్నది ఓ విశ్లేషణ. ఇటీవల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లాయర్స్ కలెక్టివ్, గ్రీన్‌పీస్ ఇండియా, ది ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి ఎన్జీఓల విదేశీ విరాళాల లైసెన్సులు సస్పెండవడమో, రద్దు కావడమో అందుకు ఉదాహరణ. ఒకపక్క దేశంలోని పలు రాష్ట్రాల్లో చర్చిలపైన దాడులు, మరోపక్క కర్ణాటకలో కొత్తగా పెట్టిన మతమార్పిడి వ్యతిరేక బిల్లు మైనారిటీల్లో ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలా ప్రసిద్ధ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’పై తీసుకున్న చర్య ఎలాంటి సంకేతమిస్తుంది? ఆహారం, విద్యే కాదు... ఆక్సిజన్ నుంచి ప్లాస్మా దాకా అనేకం ప్రభుత్వమే అందరికీ అందించలేని చోట ఇలాంటి సంస్థల సేవ నిరుపమానం. చట్టం సర్వోన్నతమైనదే. కానీ, దాన్ని సాకుగా తీసుకొని, నిరూపణ కాని సమాచారంతో మానవతావాద కృషికి గండికొట్టకూడదు. అలా చేస్తే అంతకన్నా నేరం, ఘోరం మరొకటి ఉండదు. ఇప్పుడిక ప్రజల్లోని అనుమానాల్ని పాలకులే పోగొట్టాలి. పౌర సమాజ సంస్థలను ఇరుకునపెట్టడానికి ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని వాటంగా వాడుకుంటోందనే భావనను తొలగించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిదీ, ప్రభువులదే! -
మీ దీవెనలు అందించ రారండి...
తల్లి ఎవరో తెలియదు.. నాన్న ఎలా ఉంటాడో చెప్పలేరు. ఈ 81 మంది చిన్నారులూ ఎక్కడ ఎప్పుడు పుట్టారో కూడా తెలియదు. కాని వారంతా ఒకే ఆశ్రమంలో పెరుగుతున్నారు. అంతేకాదు, ఆ చిన్నారులంతా తమ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ విడ్డూరమేమిటో చూడాలంటే జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్ మండలం రేగడి తండావద్ద ‘మా ఇల్లు ప్రజాదరణ’ వేదికకు వెళ్లాల్సిందే. అనాథలను అల్లారు ముద్దుగా చూసుకోవడంతోపాటు వారికి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న గాదె ఇన్నయ్య, పుష్పరాణి తమ కుమార్తె పెళ్లిని కూడా అదే వేదికపై నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రులు లేకపోవడం, ఎక్కడ, ఎప్పుడు పుట్టారో తెలియక పోవడంతో అనాథలకు పుట్టిన రోజులు జరపడం కష్టమే. దీంతో పుట్టినరోజు లేని వారి కోసం భగత్‌సింగ్, మదర్ థెరిస్సా, మహాత్మాగాంధీ జయంతులు, ప్రముఖుల పుట్టిన రోజులతోపాటు ప్రతి దసరా పండుగ సెలవుల్లో సామూహికంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం ‘మా ఇల్లు ప్రజాదరణ వేదిక’లో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి–పుష్పరాణి దంపతుల ఏకైక కుమార్తె డాక్టర్ బాలస్నేహ వివాహం వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన డాక్టర్ ఊర ఓంకార్‌రెడ్డితో ఆశ్రమంలో ఆదర్శ వివాహం జరిపిస్తున్నారు. అదేరోజు సామూహిక జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టారు. 81మంది పిల్లలకు కొత్తదుస్తులను కట్టించి ఒక్కొక్కరికి ఒక కేక్ చొప్పున కట్ చేసి వేడుకలను నిర్వహించనున్నారు. వేడుకలకు హాజరుకానున్న ప్రముఖులు.. అనాథపిల్లల సామూహిక జన్మదిన వేడుకలకు రాష్ట్ర ప్రముఖులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్, ఎంపీలు దయాకర్, వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు ఎరబ్రెల్లి దయాకర్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు పలువురు పాల్గొననున్నారు. పుష్కరం క్రితం ప్రారంభం... ఒకప్పుడు పీపుల్స్‌వార్ నక్సలైట్‌గా ఉండి అజ్ఞాత జీవితం గడిపిన గాదె ఇన్నారెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం. జఫర్‌గఢ్ మండలం రేగడితండాకు చెందిన గాదె ఇన్నారెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న సమయంలో 2005లో అరెస్టయ్యారు. చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న సమయంలో ఇన్నారెడ్డి చాలా పుస్తకాలను చదివారు. ప్రపంచంలో ప్రముఖులుగా ఉన్న వ్యక్తులు అనాథలుగా ఉన్నట్లు గుర్తించారు. దీనితో అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వడం కోసం 2006, మే 28న రేగడి తండాలో మా ఇల్లు ప్రజాదరణ సోషల్ వెల్ఫెర్ సొసైటీని స్థాపించారు. 32మందితో ప్రారంభమైన ఆ ఆశ్రమం ఇప్పుడు వందలాదిమందికి ఆశ్రయం కల్పిస్తోంది. రేగడి తండాతోపాటు బోడుప్పల్, జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆశ్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడు ఆశ్రమాల్లో 220 మంది పిల్లలు ఉన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతోపాటు నేపాల్‌కు చెందిన పిల్లలూ ఉన్నారు. ఇప్పటివరకు 832మంది అనాథలను చేరదీసి వారికి కొత్త జీవితాలను అందించారు ఇన్నారెడ్డి దంపతులు. 8మంది అమ్మాయిలకు ఆశ్రమంలోనే వివాహాలు జరిపించారు. చదువులు పూర్తి చేసుకున్న కొందరు వివిధ స్థాయిలలో ఉద్యోగాలు చేస్తుండగా కొంతమంది నర్సింగ్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్, వివిధ వృత్తి విద్య కోర్సులను చదువుతున్నారు. అనాథలు లేని భారతదేశం నాధ్యేయం అనాథ పిల్లలు లేని భారతదేశం నా ప్రధాన ధ్యేయమని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి అన్నారు. అనాథల్లో అంతర్గతమైన శక్తి ఉంటుంది. వారు ఏదైనా సాధిస్తారు. సమాజం, ప్రభుత్వాలు అనాథలను అక్కున చేర్చుకోవాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వద్ద చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న అనాథలను చేరదీస్తున్నాం. ప్రపంచంలోని అనేకమంది మేధావులు, శాస్త్రవేత్తలు అనాథలే. ఒబామా, మధర్ థెరిస్సా, ఐ స్టీన్, న్యూట వంటి అనాథలే. మా ఆశ్రమంలోని అనాథలకు మేమే తల్లిదండ్రులం. అనాథల సామూహిక జన్మదిన వేడుకలకు మనసున్న మహారాజులు తరలి రావాలని కోరుతున్నాం. – గాదె ఇన్నారెడ్డి, ఆశ్రమ నిర్వాహకుడు -
మదర్ థెరిస్సా బాటలో నడుద్దాం
అనంతపురం కల్చరల్: సేవా కార్యక్రమాలతో ప్రపంచానికి మదర్‌థెరిస్సా సరికొత్త వెలుగులను అందించారని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. అమ్మ సంస్థ తరఫున చేపడుతున్న సామాజిక సేవలు అభినందనీయమని కొనియాడారు. మదర్‌థెరిస్సా జయంతి సందర్భంగా అమ్మ సంస్థ తరిమెల రమణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ఎస్పీ, సీనియర్ న్యాయవాది శైలజ, ఆచార్య హేమచంద్రారెడ్డి, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత కొడుకులు, బంధువులే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలించుకుంటుంటే.. తరిమెల రమణారెడ్డి వంటి వారు అనాథల పట్ల చూపుతున్న కరుణ వెలకట్టలేనిదన్నారు. తమ పరిధిలో అనాథలకు సేవలందిస్తున్న వారికి అండగా నిలుస్తామన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పలు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లోని 300 మందికి నూతన వస్త్రాలు, రైస్ కుక్కర్లతో పాటు నిత్యావసర వస్తువులను ఎస్పీ చేతుల మీదుగా అందించారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో కాపు జాక్ నాయకులు భవానీ రవికుమార్, హర్ష, ఆదరణ శైలజ, కృష్ణారెడ్డి, ప్రమీళమ్మ తదితరులు పాల్గొన్నారు.