తల్లి ఎవరో తెలియదు.. నాన్న ఎలా ఉంటాడో చెప్పలేరు. ఈ 81 మంది చిన్నారులూ ఎక్కడ ఎప్పుడు పుట్టారో కూడా తెలియదు. కాని వారంతా ఒకే ఆశ్రమంలో పెరుగుతున్నారు. అంతేకాదు, ఆ చిన్నారులంతా తమ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ విడ్డూరమేమిటో చూడాలంటే జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్ మండలం రేగడి తండావద్ద ‘మా ఇల్లు ప్రజాదరణ’ వేదికకు వెళ్లాల్సిందే. అనాథలను అల్లారు ముద్దుగా చూసుకోవడంతోపాటు వారికి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న గాదె ఇన్నయ్య, పుష్పరాణి తమ కుమార్తె పెళ్లిని కూడా అదే వేదికపై నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రులు లేకపోవడం, ఎక్కడ, ఎప్పుడు పుట్టారో తెలియక పోవడంతో అనాథలకు పుట్టిన రోజులు జరపడం కష్టమే. దీంతో పుట్టినరోజు లేని వారి కోసం భగత్‌సింగ్, మదర్ థెరిస్సా, మహాత్మాగాంధీ జయంతులు, ప్రముఖుల పుట్టిన రోజులతోపాటు ప్రతి దసరా పండుగ సెలవుల్లో సామూహికంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం ‘మా ఇల్లు ప్రజాదరణ వేదిక’లో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి–పుష్పరాణి దంపతుల ఏకైక కుమార్తె డాక్టర్ బాలస్నేహ వివాహం వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన డాక్టర్ ఊర ఓంకార్‌రెడ్డితో ఆశ్రమంలో ఆదర్శ వివాహం జరిపిస్తున్నారు. అదేరోజు సామూహిక జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టారు. 81మంది పిల్లలకు కొత్తదుస్తులను కట్టించి ఒక్కొక్కరికి ఒక కేక్ చొప్పున కట్ చేసి వేడుకలను నిర్వహించనున్నారు.
వేడుకలకు హాజరుకానున్న ప్రముఖులు..
అనాథపిల్లల సామూహిక జన్మదిన వేడుకలకు రాష్ట్ర ప్రముఖులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్, ఎంపీలు దయాకర్, వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు ఎరబ్రెల్లి దయాకర్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు పలువురు పాల్గొననున్నారు.
పుష్కరం క్రితం ప్రారంభం...
ఒకప్పుడు పీపుల్స్‌వార్ నక్సలైట్‌గా ఉండి అజ్ఞాత జీవితం గడిపిన గాదె ఇన్నారెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం. జఫర్‌గఢ్ మండలం రేగడితండాకు చెందిన గాదె ఇన్నారెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న సమయంలో 2005లో అరెస్టయ్యారు. చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న సమయంలో ఇన్నారెడ్డి చాలా పుస్తకాలను చదివారు. ప్రపంచంలో ప్రముఖులుగా ఉన్న వ్యక్తులు అనాథలుగా ఉన్నట్లు గుర్తించారు. దీనితో అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వడం కోసం 2006, మే 28న రేగడి తండాలో మా ఇల్లు ప్రజాదరణ సోషల్ వెల్ఫెర్ సొసైటీని స్థాపించారు. 32మందితో ప్రారంభమైన ఆ ఆశ్రమం ఇప్పుడు వందలాదిమందికి ఆశ్రయం కల్పిస్తోంది. రేగడి తండాతోపాటు బోడుప్పల్, జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆశ్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడు ఆశ్రమాల్లో 220 మంది పిల్లలు ఉన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతోపాటు నేపాల్‌కు చెందిన పిల్లలూ ఉన్నారు. ఇప్పటివరకు 832మంది అనాథలను చేరదీసి వారికి కొత్త జీవితాలను అందించారు ఇన్నారెడ్డి దంపతులు. 8మంది అమ్మాయిలకు ఆశ్రమంలోనే వివాహాలు జరిపించారు. చదువులు పూర్తి చేసుకున్న కొందరు వివిధ స్థాయిలలో ఉద్యోగాలు చేస్తుండగా కొంతమంది నర్సింగ్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్, వివిధ వృత్తి విద్య కోర్సులను చదువుతున్నారు.
అనాథలు లేని భారతదేశం నాధ్యేయం
అనాథ పిల్లలు లేని భారతదేశం నా ప్రధాన ధ్యేయమని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి అన్నారు. అనాథల్లో అంతర్గతమైన శక్తి ఉంటుంది. వారు ఏదైనా సాధిస్తారు. సమాజం, ప్రభుత్వాలు అనాథలను అక్కున చేర్చుకోవాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వద్ద చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న అనాథలను చేరదీస్తున్నాం. ప్రపంచంలోని అనేకమంది మేధావులు, శాస్త్రవేత్తలు అనాథలే. ఒబామా, మధర్ థెరిస్సా, ఐ స్టీన్, న్యూట వంటి అనాథలే. మా ఆశ్రమంలోని అనాథలకు మేమే తల్లిదండ్రులం. అనాథల సామూహిక జన్మదిన వేడుకలకు మనసున్న మహారాజులు తరలి రావాలని కోరుతున్నాం.
– గాదె ఇన్నారెడ్డి, ఆశ్రమ నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment