తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.
‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు.
.. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్‌రూమ్‌లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.
ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment