వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ: ప్రియాంక గాంధీ | Priyanka Gandhi Vadra Addressed Election Rally At Wayanad | Sakshi
Sakshi News home page

వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ: ప్రియాంక గాంధీ

Published Sun, Nov 3 2024 4:11 PM | Last Updated on Sun, Nov 3 2024 4:19 PM

Priyanka Gandhi Vadra Addressed Election Rally At Wayanad

వయనాడ్‌: వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ అని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇదే సమయంలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం కాకుండా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ కామెంట్స్‌ చేశారు.

వయనాడ్‌ ఉప ఎన్నికల సందర్బంగా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ..‘వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ. వయనాడ్ ప్రజలు అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవించే భూమి వయనాడ్. పజాస్సి రాజా, తలక్కల్ చంతు, ఎడచెన కుంకన్ వంటి నాయకుల స్ఫూర్తి కలిగిన బలమైన చరిత్ర మీకు ఉంది. మీరు ఎల్లప్పుడూ సరైన దాని కోసం పోరాడారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.

ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా ప్రియాంక.. తన వ్యాపార మిత్రుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో నిరుద్యోగుల గురించి మోదీ సర్కార్‌ ఏనాడు ఆలోచించదు. మెరుగైన ఆరోగ్యం, విద్య కోసం కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే బీజేపీకి ఉండదు. ఏం చేసైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. ప్రజలను విడగొట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకోవడంతో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. కానీ, వయానాడ్‌ ప్రజలకు రాహుల్‌కు ఎప్పుడూ అండగానే ఉన్నారని ప్రశంసించారు.

ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో నవంబర్‌ 13వ తేదీన పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉండగా.. బీజేపీ తరఫున నవ్య హరిదాస్‌ పోటీలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement