తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.
అనంతరం బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. గత 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు.
‘నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాను. వయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి నా సోదరుడు చెప్పాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వాయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిపించండి ’ ఆమె హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్ అని అన్నారు. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్‌లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్‌డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు.
కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.
#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections.
Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024
Comments
Please login to add a commentAdd a comment