తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో.. వయనాడ్ వదులుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన వయనాడ్ ప్రజలకు భావోద్వేగాలతో కూడిన ఓ లేఖ రాశారు. అయితే ఆయన రాసిన లేఖకూ కేరళ బీజేపీ అధ్యక్షుడు కే. సుందరేశన్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు రాసిన లేఖ కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్కులో భాగమని విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ‘’ఇప్పటికే రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు ద్రోహం చేశారు. ప్రతిసారి వయనాడ్ తనకు రెండో నివాసం,కుటుంబమని చెబుతారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. ఆయన తన సోదరిని ఇక్కడ పోటీ చేయిస్తున్నారు. ఇదంతా తన కుటుంబం కోసం చేస్తున్నారు. ఇది కేవలం ఒక జిమ్మిక్కు. వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీని నమ్మరు. ఎందుకంటే ఆయన చేప్పిన మాటలకు ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకొలేదు’’ అని సుందరేశన్ అన్నారు.
ప్రియాంకా గాంధీ పార్టీలో, యూపీలో పెద్ద పేరు ఉన్నప్పుడు ఆమె ఎక్కడ ఎందుకు పోటీ చేయటం లేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, అమెథీ స్థానాల్లో ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. ఇదీ వారికి అనుకూలమైన స్థానమని కాంగ్రెస్ భావిస్తోందని మండిపడ్డారు. కానీ, ఈసారి తాము ప్రియాంకా గాంధీకి గట్టిపోటీ ఇస్తామన్నారు. ఇక్కడ ఎన్డీయే, యూపీఏ మధ్యే అసలు పోటీ నెలకొనుందని అన్నారు.
రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు రాసిన లేఖలో.. ‘‘ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని మొదటిసారి కలిశా. నేను మీకు పరిచయం లేదు. కానీ మీరు నమ్మి నాకు ఆశ్రయం ఇచ్చారు. నా ఇల్లు, నా కుటుంబం మీరే అయ్యారు. నాకు ప్రేమను, ఆప్యాయత పంచారు.
జూన్ 17న వయనాడ్‌ను వదులుకుంటున్నట్టు మీడియా ముందు నిలబడి ప్రకటిస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకోవడం మీరు చూసి ఉంటారు. బరువెక్కిన గుండెతో మీకు వీడ్కోలు పలుకుతున్నా. ఇక్కడ మీకు ప్రాతినిధ్యం వహించేందుకు నా సోదరి ప్రియాంక సిద్ధంగా ఉన్నారు. నన్ను ఆదరించినట్టు నా సోదరిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment