తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ.. లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా.. వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కెనిచిరాలో సోమవారంప్రచారం చేశారు.
‘‘ప్రజలకు తీరని బాధ కలిగించిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది. దేశం, ప్రజల ప్రయోజనాలు, దేశ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన ప్రదేశంలో నిలబడి ఉన్నాం. కొండచరియలు విరిగిన జిల్లాలోని కుటుంబాలకు తగినంత సహాయం పంపిణీ చేయడంలో కేంద్రం విఫలమైంది. ఈ సమస్యపై పోరాడుతా. పార్లమెంటులో వయనాడ్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తే.. నేను మీ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడి చూపిస్తా.
..నేను మీ సమస్యలను ప్రతిచోటా వినిపిస్తాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా. మీ అవసరాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గని పోరాటయోధురాలుగా మీ పక్కనే ఉంటా. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా.. ద్వేషం, కోపం, విభజన, విధ్వంసాలను బీజేపీ ఉపయోగిస్తుంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలను పరిష్కరించటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ రాజకీయాలు ఇక్కడి సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించటమే లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఏకైక లక్ష్యం.. ఎంత ఖర్చు అయినా సరే అధికారంలో ఉండటం’’ అని అన్నారు.
జూలైలో వయనాడ్‌లో చోటు చేసుకున్న కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వంద ఇళ్లు బురదలో కొట్టుకుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment