byelection
-
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసింది. -
బీజేపీ నేతలు ప్రజానుబంధం ఏనాడో తెంచుకున్నారు
వయనాడ్: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శలను పెంచారు. ఆదివారం నైకెట్టి, సుల్తాన్ బతేరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారర్యాలీల్లో గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ ఇక్కడున్న పెద్దవాళ్లలో చాలా మందికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాగా తెలిసే ఉంటుంది. గిరిజనులతో ఆమెకు ఎంతో అనుబంధం ఉండేది. ఇక్కడి భూమి, అడవులు, నేల, నీరుతో గిరిజనులు అవినాభావ సంబంధం ఉంది. పేదల అభ్యున్నతి కోసమే అటవీ చట్టం, గ్రామీణ ఉపాధ హామీ పథకం, విద్యాహక్కుచట్టం తెచ్చాం. అదే బీజేపీ నేతలు సొంతవాళ్లనే పట్టించుకుంటూ గిరిజనులను, జనాలను గాలికొదిలేసింది. అసలు బీజేపీ నేతలు ప్రజలతో బంధాన్ని ఏనాడో తెంచుకున్నారు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. -
వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ: ప్రియాంక గాంధీ
వయనాడ్: వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ అని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇదే సమయంలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం కాకుండా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ కామెంట్స్ చేశారు.వయనాడ్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ..‘వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ. వయనాడ్ ప్రజలు అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవించే భూమి వయనాడ్. పజాస్సి రాజా, తలక్కల్ చంతు, ఎడచెన కుంకన్ వంటి నాయకుల స్ఫూర్తి కలిగిన బలమైన చరిత్ర మీకు ఉంది. మీరు ఎల్లప్పుడూ సరైన దాని కోసం పోరాడారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా ప్రియాంక.. తన వ్యాపార మిత్రుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో నిరుద్యోగుల గురించి మోదీ సర్కార్ ఏనాడు ఆలోచించదు. మెరుగైన ఆరోగ్యం, విద్య కోసం కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే బీజేపీకి ఉండదు. ఏం చేసైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. ప్రజలను విడగొట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకోవడంతో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. కానీ, వయానాడ్ ప్రజలకు రాహుల్‌కు ఎప్పుడూ అండగానే ఉన్నారని ప్రశంసించారు.ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో నవంబర్ 13వ తేదీన పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉండగా.. బీజేపీ తరఫున నవ్య హరిదాస్ పోటీలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. #WATCH | Wayanad, Kerala: Congress leader and party's candidate for Wayanad Lok Sabha by-election, Priyanka Gandhi Vadra says, "Modi ji's government works only for his big businessman friends. His objective is not to give you a better life. It is not to find new jobs. It is not… pic.twitter.com/l5fkrO7pGX— ANI (@ANI) November 3, 2024 -
మదర్ థెరిసా మా ఇంటికి వచ్చారు: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు. .. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్రూమ్లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.చదవండి: రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ -
యూపీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ దూరం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న తొమ్మది స్థానాలను ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్‌వాదీ పారీ్టకే వదిలేయడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థులకే మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ నిర్ణయం చేసిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే గురువారం తెలిపారు. నిజానికి çపాండే ప్రకటనకు ముందే ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉప ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు ’సైకిల్’పై పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఐక్యంగా ఉన్నాయని, భారీ విజయం కోసం భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఈ ఎన్నికల విజయంతో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అఖిలేశ్ ప్రకటన అనంతరం కాంగ్రెస్ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న 9 స్థానాలకు గానూ కాంగ్రెస్ 5 స్థానాలను ఆశించింది. దీనిపై చర్చలు కొనసాగుతుండగానే 6 స్థానాల్లో ఎస్పీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాల్లో ఘాజియాబాద్, ఖైర్ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు సుముఖత తెలిపింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ గెలుపు అవకాశాలు లేకపోవడం, బీజేపీకి మెరుగైన అవకాశాలు ఉండటంతో ఈ స్థానాల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ‘ఇండియా కూటమి 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాకు గుర్తు ముఖ్యం కాదు..బీజేపీ దుష్పరిపాలన అంతం ముఖ్యం. శాంతి భద్రతలు ముఖ్యం‘అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గా బదులిచ్చిన బీజేపీ, ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’నినాదాన్ని ఎస్పీ నిజం చేస్తోందని ఎద్దేవా చేసింది. -
వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. వయనాడ్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా యంగ్ డైనమిక్ లీడర్, కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను ఖరారు చేసింది. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.ఇక, బీజేపీ నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడంతో ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. నవ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. బీటెక్ చదవి ఉద్యోగం చేసిన నవ్య.. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో తన ముద్ర వేసి తక్కువ కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా వయనాడ్ బరిలోకి టికెట్ పొంది బంపరాఫర్ దక్కించుకున్నారు.నవ్య హరిదాస్ రాజకీయ నేపథ్యం..👉నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు.👉బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు.👉నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.👉బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.👉2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి.👉అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.👉నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది.Navya Haridas to take on PriyankaGandhi from the Wayanad Lok Sabha seat on a BJP ticket👍👍 pic.twitter.com/joo5dXrEhT— tsr. (@srikanth690935) October 19, 2024 -
వయనాడ్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది. నవ్య హరిదాస్ ఇక్కడి నుంచి తమ పార్టీ తరపున బరిలో ఉంటారని వెల్లడించింది. నవ్య కేరళ బీజేపీ మహిళామోర్చాకు ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌ను వదులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. నవంబర్ 13న వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. ఇదీ చదవండి: జార్ఖండ్‌లో కాంగ్రెస్,జేఎంఎం మధ్య కుదిరిన పొత్తు -
వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి ఖుష్బూ!
సాక్షి, న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున సినీనటి ఖుష్బూ సుందర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. పార్టీ తరఫున పోటీలో నిలిపే అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌లో ఖుష్బూ పేరును సైతం చేర్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీకి ఖుష్బూ అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరనే భావన వ్యక్తమవుతోంది. వయనాడ్‌లో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. పార్టీ సీనియర్లయిన ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను బీజేపీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ కసరత్తు కొలిక్కి వస్తున్న వేళ ఖుష్బూ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరి, అనంతరం 2014లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌ను వీడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు యూనిట్లో భాగంగా ఉన్నారు. తమిళనాడు నేపథ్యం ఉన్న ఆమెను వయనాడ్‌లో పోటీకి నిలిపే విషయమై బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్ర శాఖ తెలిపే అభిప్రాయం మేరకు అభ్యర్థిత్వంపై పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. -
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. -
కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేశ్
ఇటావా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకుగాను ఆరింటికి ఏకపక్షంగా టికెట్లు ఖరారు చేసిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ పరిణామంపై గురువారం స్పందించారు. కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఇండియా కూటమి ఉంటుంది. కాంగ్రెస్‌తో మా మైత్రి కూడా కొనసాగుతుంది అని మాత్రం చెప్పదలుచుకున్నా’అని తెలిపారు. రాజకీయాలపై చర్చించేందుకు సమయం కాదంటూ సీట్ల ప్రకటన వ్యవహారాన్ని దాటవేశారు. హరియాణా, కశ్‌మ్రీŠ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల విషయం ప్రస్తావించగా మరోసారి మాట్లాడతానన్నారు. యూపీలో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకు గాను కాంగ్రెస్ ఐదింటిని డిమాండ్ చేస్తోంది. ఈ పది చోట్ల ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో గెలవడంతో ఖాళీ అయ్యాయి. -
కడియం శ్రీహరికి బుద్ధి చెప్తాం: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రానున్న ఉప ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం(సెప్టెంబర్2) కేటీఆర్‌తో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గం పార్టీలో మరింత ఉత్సాహం నింపేలా సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవలే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లో ఈ విషయంలో చర్యలు మొదలు పెట్టాలని విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటట్రావు, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఇదీ చదవండి.. రెండు నాలుకల కాంగ్రెస్.. ఇది ముమ్మాటికి మోసమే: కేటీఆర్ -
ఏపీలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతో పాటు కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక్కో స్థానానికి మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో మూడు స్థానాలకు ఎమ్మెల్సీల రాజీనామా కారణంగా, రెండు స్థానాలకు అనర్హత వేటు కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఏపీలో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడగా, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. -
వయనాడ్ నుంచి ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల్లో ఎంపీగా విజయం సాధించిన రాహుల్ గాంధీ ఇకపై రాయ్‌బరేలీ నుంచే కొనసాగుతారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. రెండింటా గెలిస్తే చట్టం ప్రకారం ఒక స్థానంలోనే కొనసాగాలి కాబట్టి రాయ్‌బరేలీ నుంచే రాహుల్ గాంధీ కొనసాగుతారని స్పష్టంచేశారు. ఎంతో అంతర్మథనం, చర్చల తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించిన రాహుల్‌కు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. రాయ్‌బరేలీ స్థానంతో రాహుల్ కుటుంబానికి తరతరాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా రాయ్‌బరేలీ నుంచే రాహుల్ కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వయనాడ్ ప్రజల ప్రేమాభినాలు రాహుల్‌కు లభించాయన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రియాంకా గాంధీ ఎంతో సహకరించారని ఖర్గే అభినందించారు. రాహుల్ ఏ స్థానం వదులుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్, ప్రియాంకా గాం«దీ, కె.సి.వేణుగోపాల్ తదితరులు సోమవారం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం ఖర్గే, రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాయ్‌బరేలీతోపాటు వయనాడ్‌తో తనకు భావోద్వేగపూరిత అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్‌ను వదులుకోవడం చాలా కఠిన నిర్ణయమేనని వెల్లడించారు. గత ఐదేళ్లపాటు వయనాడ్ ఎంపీగా కొనసాగడం అద్భుతమైన అనుభవం అని చెప్పారు. వయనాడ్ ప్రజలు తనకు అండగా నిలిచారని, సంక్షోభ సమయాల్లో తనకు కొత్త శక్తిని ఇచ్చారని కొనియాడారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. ఇకపై కూడా వయనాడ్‌ను సందర్శిస్తూనే ఉంటానని, అక్కడి ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ఐదేళ్లపాటు ఎంతో ప్రేమాభిమానాలు పంచిన వయనాడ్ ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలియజేశారు. వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంక పోటీ చేస్తుందని తెలిపారు. తమకు ఇద్దరు ఎంపీలు ఉన్నట్లుగా భావించాలని వయనాడ్ ప్రజలకు రాహుల్ సూచించారు. సంతోషంగా ఉంది: ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి తాను పోటీ చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రియాంకా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా రాయ్‌బరేలీ, అమేథీలో పనిచేశానని, ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోదని అన్నారు. ఆ బంధాన్ని కొనసాగించేందుకు తాను, రాహుల్ ఉన్నామని చెప్పారు. రాయ్‌బరేలీ, వాయనాడ్‌లో తనతోపాటు రాహుల్ ఉంటూ ఇద్దరం కలిసి పనిచేస్తామని తెలిపారు. రాహుల్ అందుబాటులో లేరన్న అభిప్రాయం వయనాడ్ ప్రజల్లో కలగకుండా చూస్తానని ప్రియాంక గాంధీ చెప్పారు. తొలిసారిగా పోటీ చేస్తున్న ప్రియాంక ప్రియాంకా గాంధీ 2019లో క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. అతిత్వరలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ లేదా ఆమేథీ లేదా వారణాసిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, పోటీకి దూరంగానే ఉన్నారు. ప్రచారంలో పాల్గొన్నారు. రాయ్‌బరేలీ, ఆమేథీలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. రాహుల్ ఖాళీ చేస్తున్న వయ నాడ్ రాడ్ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరుగనుంది. 52 ఏళ్ల ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్‌రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్‌రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్ ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేశ్‌రెడ్డి లకు రాలేదు. ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపునకు అవసరమైన టార్గెట్ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్ రీచ్ అయ్యే వరకు వేచి ఉండాలా అని, ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు. -
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
-
ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%.. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియాల్సి ఉన్నా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగింది. మొత్తంగా 72..37 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్ 5న జరగనుంది. ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పేపర్‌కూడా భారీగానే ఉంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.గతంలో కంటే తగ్గిన పోలింగ్మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాల్లో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అందులో 3,85,996 మంది (76.35 శాతం) ఓటువేశారు. ఈసారి 4,63,839 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. ఈసారి పోలింగ్ 68.65 శాతం నమోదైంది. నల్లగొండ సమీపంలోని దుప్పపల్లి వేర్ హౌజింగ్ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్లగొండకు తరలించే ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగింది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి ధర్నాపోలింగ్ సందర్భంగా నార్కట్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నామని చెబుతున్న డోకూరి ఫంక్షన్ హాల్ వద్దకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌గౌడ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అశోక్ అనుచరులు వీడియో తీస్తుండగా తోపులాట జరిగింది. దీంతో తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ ముందు« ధర్నాకు దిగారు. కాగా, నకిరేకల్‌లోని జడ్పీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓ వికలాంగురాలు తనకు ఓటు వేసేందుకు వీల్ చైర్ అందుబాటులో పెట్టలేదని నిరసన తెలిపారు.ప్రశాంతంగా పోలింగ్ : రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారన్నారు. ప్రత్యేకించి మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. -
పట్టభద్రుల పట్టమెవరికి ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.సోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పారీ్టల అధినేతలతోపాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు. మిగతా గుర్తింపు పొందిన పారీ్టలతోపాటు స్వతంత్రులు పోటీలో ఉన్నా, ప్రధాన పారీ్టలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచి్చనా, నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యోగులది అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తమ పార్టీ అభ్యరి్థని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ మోసం చేసిందంటున్న బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని, తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను తాము భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతూ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది.ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఎన్నికలో పట్టుభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అభ్యరి్థని గెలిపిస్తే పెద్దలసభలో ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల కల్పనకు జాబ్‌క్యాలెండర్ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని, పోరాడే పారీ్టకి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది.రెండూ మోసకారి పార్టీలే అంటున్న బీజేపీకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసకారి పారీ్టలేనని, వాటి వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని విస్మరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధికంగా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తోందని బీజేపీ అంటోంది.నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల నియామకంలో బీఆర్ఎస్ విఫలం కాగా, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలతో ప్రజలు, పట్టభద్రులను మోసం చేస్తోందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిచింది. ఇలాంటి పారీ్టలకు బుద్ధిచెప్పి బీజేపీకి మద్దతు ఇస్తే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని పట్టభద్రులకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి త్రిముఖ పోటీలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లలో పట్టు సాధించేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక వ్యూహాన్ని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉన్న జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం చేసిన కేటీఆర్ బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఈ నెల 25న ముగియనుండటంతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆయన ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక నాగర్‌కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరపున లోక్‌సభ అభ్యరి్థగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరునూ కలిసి.. శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ స్థానం నుంచి బీఆర్ఎస్ వరుసగా నాలుగు పర్యాయాలు గెలవడంతో ప్రస్తుత ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచార గడువు, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయానికి బీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది.మండలాల వారీగా పట్టభద్రులు నియోజకవర్గం ఓటరు జాబితాను సమన్వయకర్తలకు అందజేసి, క్షేత్ర స్థాయిలో ప్రతీ ఓటరును పార్టీ కేడర్ కలిసేవిధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీలో వైఫల్యం, పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విద్యార్హతలు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి తదితరాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతీ ఓటును ఒడిసి పట్టేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరును ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అసంతృప్త నేతలకు బుజ్జగింపు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అభ్యరి్థత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విభేదాలు వీడి కలిసి పనిచేయాలని కోరుతున్నారు. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యరి్థత్వం ఆశించిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మంగళవారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఇదే కేటీఆర్ ఈ నెల 22న ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. హరీశ్‌రావు ఈ నెల 23న భూపాలపల్లి, వర్దన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, 24న సత్తుపల్లి, వైరా, మధుర, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. -
‘గ్రాడ్యుయేట్స్’పై బీజేపీ గురి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 27న జరగనున్న నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొంది సత్తా చాటాలనే సంకల్పంతో రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇప్పటికే మూడుజిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ 3,4 రోజు లుగా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. జహీరా బాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ త్వరలోనే ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించను న్నట్టు సమాచారం. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపొందిన అనుభవంతో పాటు విస్తృత పరిచ యాలు, ఎమ్మెల్సీ క్యాంపెయిన్‌కు సంబంధించి అవగాహన ఉన్న ఎన్.రామచందర్‌రావు ఈ ఎన్ని కకు పార్టీ తరఫున ఇన్చార్జ్గా వ్యవహరిస్తు న్నారు. ప్రచారం ముమ్మరం చేశామని, ఈసారి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని ‘సాక్షి’కి ఆయన వెల్ల డించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్ని కల్లో పార్టీ పట్ల ఉన్న సానుకూలత తప్పకుండా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఉపయోగపడుతుందన్నారు. మంచి ఫలితం వస్తుంది: గుజ్జులరాష్ట్రపార్టీ నాయకత్వం, ముఖ్యనేతలు, వేలాది మంది కార్యకర్తల తోడ్పాటుతో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ›ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్ వారీగా మూడు, 4 బృందాలను ఏర్పాటు చేసి పార్టీనాయకులు, కార్య కర్తలు ఇంటింటికి వెళ్లి పట్టభద్ర ఓటర్లను కలుస్తు న్నారన్నారు. కోర్టులు, వాకర్స్‌ను కలుసుకో వడం, చిన్న చిన్నసమావేశాల నిర్వహణ ద్వారా ఓటర్స్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో ‘మోదీవేవ్’ స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందుతాననే నమ్మకం తనకు ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటుపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. -
ఇక ‘పట్టభద్రుల’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల కోటా ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి కైవసం చేసుకోవడాన్ని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ పోలింగ్ ముగిసిన వెంటనే రంగంలోకి దిగింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం కీలక భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశంఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 ఏప్రిల్ వరకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 27న ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్‌కు కేవలం 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ముమ్మర ప్రచారం నిర్వహించేలా కేటీఆర్ బుధవారం జరిగే భేటీలో దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార, సమన్వయ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ప్రచారాన్ని సమన్వయం చేస్తారు. మూడు జిల్లాల్లో సుమారు 4.61 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగించాల్సిన ప్రచారంపై బీఆర్ఎస్ వ్యూహాన్ని ఖరారు చేస్తోంది. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు గ్రామాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితాను అందజేసి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.లోక్‌సభ పోలింగ్ సరళిపై సమీక్షరెండురోజుల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం కూడా సమీక్షించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు కలిశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సరళిపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపారనే కోణంలో చర్చ జరిగింది. కాగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేసినట్లు నేతలు వెల్లడించారు. -
ఆ రెండూ ప్రతిష్టాత్మకమే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉపఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ తర్వాత ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో వాటిని తిరిగి గెలుచుకోవడంపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక రాగా, ఈ నెల 13న జరిగే లోక్‌సభ పోలింగ్తోపాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరగనుంది. మరోవైపు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా పల్లా పదవీకాలం 2027 ఏప్రిల్‌లో ముగియనుంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది.లాస్య నందిత సోదరి కోసం.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తమ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించగా, పార్టీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక డివిజన్ వారీగా ప్రచార బాధ్యతలు పంచుకొని పనిచేస్తున్నారు.అయితే ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ఆశావహులు గజ్జెల నాగేశ్ కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగా, ఎర్రోⶠ్ల శ్రీనివాస్ సంగారెడ్డి ప్రచార సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. నివేదిత తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రచారంపై ఆ ప్రభావం పడకుండా చూడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్‌షోల్లో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు.నేడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్శాసనమండలి ఆరంభం నుంచి బీ ఆర్ఎస్ అభ్యర్థులే ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రస్తుతం ఈ స్థానానికి జరుగు తున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం ఖరారు చేశారు. రాకేశ్ రెడ్డి మంగళ వారం నల్ల గొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. బీఆర్ ఎస్ టికెట్ పార్టీ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సుందర్ రాజు తదితరులు ఆశించారు. అయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ రెడ్డికి టికెట్ దక్కింది. ఇక్కడ గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ న్వయంతో పనిచేయడం ద్వారా ప్రచారంలో పైచేయి సాధించాలని భావి స్తోంది. దీంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ అధి నేత కేసీఆర్ ఈ నెల 12న లేదా 14న మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో తెలంగాణభవన్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ టికెట్ మళ్లీ ఆ ఫ్యామిలీకే ?
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదివారం(ఏప్రిల్ 7) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశమై కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్‌రావు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ మళ్లీ దక్కడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల సాయన్న కూతురు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో ఈ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిని అధికారికంగా మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ నేతలు పలువురు ఈ ఉప ఎన్నికలోనూ టికెట్ కోసం పార్టీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీరందరి అభ్యర్థిత్వంపై చర్చించిన తర్వాత టికెట్ సాయన్న కుటుంబానికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గణేష్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా పార్టీ ఆయనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్ -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పక్షంలో దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై చూపే అవకాశం ఉండటంతో కౌంటింగ్ చేపట్టొద్దని ఎన్నికల కమి షన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ రెండో తేదీన ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల రెండో తేదీన అంటే మంగళవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ చేప ట్టాల్సి ఉంది. జిల్లాకేంద్రంలోని బాలుర జూని య ర్ కళా శాలలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ఉప ఎన్నిక రావడం.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలతో క్యాంప్ రాజకీ యాలకు తెరలేపడం.. సీఎం రేవంత్ సొంత ఇలా కాలో జరుగుతున్న పోరు కావటంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఉమ్మడి మహబూనగర్ జిల్లాపైనే పడింది. ఫలితాల కోసం పార్టీలు ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో కౌంటింగ్ వాయిదా పడడంతో నాయకుల్లో నిరుత్సాహం అలుముకుంది. -
జీవితాంతం కొడంగల్‌కు రుణపడి ఉంటా
కోస్గి/కొడంగల్: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. తాను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంతం బిడ్డనేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని.. వారు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో చెప్పారు. తన కోసం ఎంతో చేసిన ఈ ప్రాంతాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి గురువారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి కొడంగల్‌కు వచ్చారు. ఎక్స్ అఫీషియో హోదాలో కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఓటు వేశారు. అనంతరం లాహోటీ కాలనీలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లా డుతూ... త్వరలో కొడంగల్‌కు సిమెంట్ పరిశ్రమలు రానున్నాయన్నారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపురాయి గనులు ఉన్నాయని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పారు. ‘కొడంగల్‌కు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేయడం సులభతరం అవుతుంది. భూములు కోల్పోతున్న వారికి న్యాయమైన ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. పట్టా భూములకు ఇచ్చే ధరను అసైన్మెంట్ భూములకూ ఇస్తాం’ అని రేవంత్ పేర్కొన్నారు. ఏప్రిల్ 8న కొడంగల్‌కు మళ్లీ వస్తానన్నారు. కోస్గిలో పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కొడంగల్ మండలం అప్పాయిపల్లికి ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో 50 వేలకు పైగా మెజారిటీ రావాలన్నారు. బూత్, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో సమర శంఖారావం సభకు నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వంశీచంద్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కు ఉండగా.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, కర్ణాటక, గోవా, కొడైకెనాల్, ఊటీలోని క్యాంపుల నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిల ర్లు ప్రత్యేక వాహనాల్లో వచ్చి ఆయా కేంద్రాల్లో ఓటు వేశారు. వీరితోపాటు ఎక్స్అఫీషియో హోదా లో ఉమ్మడి పాలమూరులోని 14 మంది ఎమ్మెల్యే లు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటు వేశారు. ఏప్రిల్ 2న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. 99.86 శాతం పోలింగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ పోటీ చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 99.86 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. 1,437 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. కాగా, గద్వాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సీఐ భీం కుమార్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఏఎస్పీ గుణశేఖర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా.. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. క్యాంపుల్లో భాగంగా ఆయా పార్టీలు పోటాపోటీగా ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున తాయిలాలు ముట్టజెప్పినట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వంద వరకు ఉన్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మొత్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించనుండడంతో ఆయా పార్టీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. క్రాస్‌ఓటింగ్ తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.