ఓటు హక్కు వినియోగించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హోరాహోరీగా మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 99.86 శాతం నమోదు
క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరిన ప్రజాప్రతినిధులు
క్రాస్ ఓటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్ కు ఉండగా.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏపీ, కర్ణాటక, గోవా, కొడైకెనాల్, ఊటీలోని క్యాంపుల నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిల ర్లు ప్రత్యేక వాహనాల్లో వచ్చి ఆయా కేంద్రాల్లో ఓటు వేశారు. వీరితోపాటు ఎక్స్‌అఫీషియో హోదా లో ఉమ్మడి పాలమూరులోని 14 మంది ఎమ్మెల్యే లు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటు వేశారు. ఏప్రిల్ 2న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
99.86 శాతం పోలింగ్
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ పోటీ చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 99.86 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. 1,437 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. కాగా, గద్వాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సీఐ భీం కుమార్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఏఎస్పీ గుణశేఖర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా..
లోక్‌సభ ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. క్యాంపుల్లో భాగంగా ఆయా పార్టీలు పోటాపోటీగా ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున తాయిలాలు ముట్టజెప్పినట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వంద వరకు ఉన్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మొత్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించనుండడంతో ఆయా పార్టీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. క్రాస్‌ఓటింగ్ తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment