
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్‌లోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలపై తాజాగా అక్కడ జరుగుతున్న సహాయకచర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలు ఆలస్యం కావడానికి గల కారణాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇదే సమయంలో సహాయక చర్యల కోసం రూ.5కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం ఫిబ్రవరి 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది. మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహంగా నిర్ధారించారు. మిగతా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారు. దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు, బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్‌ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment