డ్రిల్లింగ్‌ & బ్లాస్టింగ్‌ | CM Revanth Reddy key decisions in review of SLBC tunnel | Sakshi
Sakshi News home page

డ్రిల్లింగ్‌ & బ్లాస్టింగ్‌

Published Tue, Mar 25 2025 4:21 AM | Last Updated on Tue, Mar 25 2025 5:51 AM

CM Revanth Reddy key decisions in review of SLBC tunnel

కార్మికుల వెలికితీత సహాయక చర్యలపై సోమవారం అసెంబ్లీ కమిటీహాల్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, జూపల్లి

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకాలు, కార్మికుల వెలికితీత ఈ విధానంలోనే..

టీఎంబీ పద్ధతికి స్వస్తి.. సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకంతోపాటు, అందులో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి సత్వర అనుమతులకు ప్రయత్నించాలని నీటిపారుదల శాఖను ఆదే శించింది. ఏఎంఆర్‌ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని 43.93 కి.మీల సొరంగ మార్గంలో తరలించి లింక్‌ కాల్వ ద్వారా డిండి జలాశయంలోకి పోయాల్సి ఉంది. 

సొరంగాన్ని రెండు టన్నెల్‌ బోర్‌ మెషీన్ల (టీబీఎం) సహాయంతో రెండు వైపులా (ఇన్‌లెట్, అవుట్‌లెట్‌) నుంచి తవ్వుకుంటూ పోతున్నారు. శ్రీశైలం జలాశయ ఇన్‌లెట్‌ నుంచి 13.93 కి.మీల పనులు పూర్తి కాగా,అవతలి వైపు నుంచి మరో 20.43 కి.మీల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. మధ్యలో 9.55 కి.మీల మేర సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ఇకపై టీబీఎంతో రెండు వైపులా తవ్వకాలను విరమించుకొని ప్రత్యామ్నాయంగా డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానాన్ని అనుసరించనున్నారు. రెండు వైపుల నుంచి సొరంగాన్ని నేరుగా అనుసంధానం చేసేందుకు ఇప్పటి వరకు తవ్వకాలు జరిగాయి. 

ఇకపై నేరుగా తవ్వకాలను కొనసాగించరు. రెండు వైపులా తవ్వకాలు ఆగిపోయిన చివర పక్కభాగం నుంచి డ్రిలింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో తవ్వకాలు జరుపుకుంటూపోయి రెండు చివరలను అనుసంధానం చేస్తారు దీంతో కిలోమీటర్‌ వరకు సొరంగం పొడవు పెరిగే అవకాశముంది. రెండు టీబీఎంలను సొరంగంలో ఇప్పుడున్న ప్రాంతంలోనే సమాధి చేస్తారు. 

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 

సహాయక చర్యలు కొనసాగించండి 
కార్మికులను వెలికితీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలను ఏప్రిల్‌ 10లోగా ముగించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్‌ను ఆదేశించారు. నెలరోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా ముఖ్యమంత్రికి వివరించారు. 

రెస్క్యూ ఆపరేషన్‌ కళ్లకు కట్టేలా ప్రమాదం జరిగిన రోజు నుంచి, ఇప్పుడున్న పరిస్థితులపై ఫొటోలతో సహా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్‌ ఉన్నట్టు గుర్తించామన్నారు. జీఎస్‌ఐ, ఎన్జీఆర్‌ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం..అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. 

అవసరమైన అనుమతులు తీసుకోవాలి 
ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వీరిలో గుర్‌ప్రీత్‌సింగ్‌ మృతదేహాన్ని మార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్‌ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ అజయ్‌ మిశ్రా, ఇరిగేషన్‌ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

అవసరమైన అనుమతులు తీసుకోవాలి 
కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్ప కూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వారిలో గుర్‌ప్రీత్‌సింగ్‌ మృతదేహాన్నిమార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్‌ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సీఎం చెప్పారు. తెలంగాణ,ఆంధ్రా సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ అజయ్‌ మిశ్రా, ఇరిగేషన్‌ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement