
సొరంగం చివరి భాగంలో కార్మికుల జాడ కోసం గాలిస్తున్న రెస్క్యూ బృందం సభ్యులు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో నేటి నుంచి తవ్వకాలు
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ఒకటో సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మీకుల అన్వేషణలో భాగంగా గురువారం నుంచి సొరంగం లోపల తవ్వకాలను ప్రారంభించనున్నారు. గత ఆరు రోజుల్లో ఏడు రెస్క్యూ బృందాలు సొరంగం లోపలికి వెళ్లి పరిస్థితులను అంచనా వేసి బయటకు తిరిగి వచ్చాయి. అయినా కార్మికుల జాడ తెలుసుకోవడంలో పెద్దగా పురోగతి సాధ్యం కాలేదు.
ఈ పరిస్థితుల్లో తవ్వకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి తేలికపాటి పరికరాలతో రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిపించాలని నిర్ణయించింది.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) మాజీ డీజీ/ఆర్మీ మాజీ ఈఎన్‌సీ జనరల్ హర్పాల్ సింగ్, సొరంగాలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ నిపుణుడు క్రిస్ కూపర్, బీఆర్‌ఓ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, మరో ప్రముఖ సొరంగాల నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రతో కూడిన నిపుణుల బృందం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు, ర్యాట్ హోల్ మైనర్లతో కలిసి సొరంగం లోపలికి వెళ్లింది. సాయంత్రం 4.10 గంటలకు బయటకు వచ్చింది. అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశమై విస్తృతంగా చర్చించింది. నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం వ్యూహాన్ని ఖరారు చేసింది..
చివరి వరకు నెమ్మదిగా తవ్వకాలు
గల్లంతైన కార్మీకుల ఆచూకీ తెలుసుకోవడంలో భాగంగా సొరంగం కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, రాళ్లు, శిథిలాలు, తుక్కును తేలికపాటి పరికరాలతో తవ్వకాలు జరిపి తొలగించవచ్చని నిపుణుల బృందం సూచించింది. సొరంగం కూలిన సమయంలో అక్కడున్న కార్మీకులు బయటకు వచ్చేందుకు పరుగెత్తి ఉంటారని, వారు శిథిలాల కింద ఈ వైపే ఉండి ఉంటారనే తమ అంచనాను వివరించింది.
ఈ నేపథ్యంలో రెసూ్క్క బృందాలు తవ్వకాలు ప్రారంభిస్తే ఒకటీ రెండురోజుల్లోనే కార్మీకుల ఆచూకీ లభ్యం కావచ్చని భావిస్తున్నారు. తవ్వకాలు, శిథిలాల తొలగింపు చర్యలు ఈ వైపు నుంచి ప్రారంభించి సొరంగం చివరి భాగం వరకు నెమ్మదిగా కొనసాగించాలని నిపుణులు సూచించారు.
తవ్వకాలు కొద్దిగా పురోగమించిన వెంటనే సొరంగం పైకప్పు మళ్లీ కూలకుండా రక్షణగా రీఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జనరల్ హర్పాల్ సింగ్‌లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)కి చెందిన ఒకే బ్యాచ్ అధికారులు కావడం గమనార్హం. ఉత్తమ్‌కుమార్ రెడ్డి గతంలో భారత వాయుసేనలో కెపె్టన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
రాత్రికి రాత్రే పరికరాల తరలింపు..
సొరంగం లోపల తవ్వకాలు, శిథిలాల తొలగింపు పనులకు కార్మీకులు ముందుకు రావడం లేదు. సొరంగం మళ్లీ కూలుతుందేమోనని భయపడుతున్నారు. దీంతో సింగరేణి రెస్క్యూ బృందాలను అత్యవసరంగా రప్పిస్తున్నారు. గురువారంలోగా వారు ప్రమాద స్థలానికి చేరుకోనున్నారు. ఇక సొరంగంలోని మట్టి, శిథిలాల్లో కూరుకుపోయిన టన్నుల కొద్దీ బరువు ఉన్న తుక్కును కట్ చేయడానికి రైల్వే శాఖ నుంచి యుద్ధ ప్రాతిపదికన హెవీ స్టీల్ గ్యాస్ కట్టర్లను రప్పిస్తున్నారు. బుధవారం రాత్రికే ఈ పరికరాలన్నీ సొరంగంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
ఇక టీబీఎం ముక్కలు ముక్కలే..
సొరంగం కూలడంతో శిథిలాల కింద కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)ను హెవీ స్టీల్ గ్యాస్ కట్టర్ సహాయంతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి సొరంగం నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీనిని తొలగిస్తేనే గల్లంతైన కార్మీకుల ఆచూకీని కనుక్కోవడానికి వీలుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ రెస్క్యూ ‘మార్కోస్’ ప్రత్యేకత
గురువారం నుంచి జరిగే సహాయక కార్యక్రమాల్లో ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ (మార్కోస్) కూడా పాల్గొననుంది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ రెస్క్యూ నిర్వహించే ఈ దళం బీఆర్‌ఓ, ఆర్మీ, నేవీ నిపుణులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, ర్యాట్ హోల్ మైనర్స్‌తె కలిసి పని చేయనుంది. కాగా అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీని వినియోగిస్తూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెస్క్యూ సిబ్బందికి అవసరమైన ఆక్సిజన్, లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment